క్షణకాలం క్రితం కరచాలనం చేసినప్పుడు-
స్పర్శలోని వేడిమి
సహోద్యోగపు పరిచయం తాలూకూ అనుకున్నాను.
కానీ,
నా చేతికంటిన నెత్తుటి మరక నిజం చెప్పింది-
నీవిప్పటికే హంతవని, ఈక్షణం నావంతు యని.
క్షణకాలం క్రితం కరచాలనం చేసినప్పుడు-
స్పర్శలోని వేడిమి
సహోద్యోగపు పరిచయం తాలూకూ అనుకున్నాను.
కానీ,
నా చేతికంటిన నెత్తుటి మరక నిజం చెప్పింది-
నీవిప్పటికే హంతవని, ఈక్షణం నావంతు యని.
→ Leave a Commentవర్గాలు ఊ(సు పో)క
Tagged: lay-off
అబ్బాయి: ఏంటి నాన్న నేను పది రోజులు ఇంట్లో లేకపోతే నీకు బోర్ కొట్టిందా
నాన్న: అవును
అబ్బాయి: మామయ్య తిరిగి అమెరికా వెళ్లిపోయాడు, నే వచ్చేశాన్లే.
నాన్న: ఊ, ఏమిటి విశేషాలు?
అబ్బాయి : ఏమీ లేవు, నువ్వు చెప్పు.
నాన్న: మీ మామయ్య పెళ్లి చేసుకుంటానంటున్నాడా?
అబ్బాయి : అంత సీను లేదు నాన్నా, ఇంకో మాటజెప్పు.
నాన్న: ???
*******
అమ్మ: మీరు రాలేదని మా తమ్ముడు చెల్లెలు చాలా సార్లు అనుకున్నారండి.
నాన్న: అవునా
అబ్బాయి: నీకు అంత సీను లేదు నాన్నా, ఇంకో మాటజెప్పు
అమ్మ:నువ్వూరుకోరా
నాన్న: వాడ్నంటావెందుకు,బడి మానిపించి మామయ్యతో తిప్పితే ఇవి కాక ఇంకేంనేర్చుకుంటాడు?
*******
నాన్న: ఓరెయ్ ఇంకా పడుకో, రేపటి నుంచి బడికెళ్లాలి
అబ్బాయి: సరే
నాన్న: లాలనుచునూచేరు లలనలిరుగడలా..
అబ్బాయి: హబ్బా, నాకు లాలి అక్కర్లేదు నాన్నా, నేను పెద్దవాడినయ్యాను.
అమ్మ: చూశారా, మామయ్య దగ్గర ఉండి ఎంత డిప్లమసీ నేర్చుకున్నాడో, మీరు పాడితే వచ్చే నిద్ర కూడా పారిపోతుందని అనిచెప్పకుండా, నేను పెద్దవాణ్ణయ్యా, లాలి అక్కరలేదు అని చెప్పాడు.
నాన్న: ???
→ 6 Commentsవర్గాలు పెంపకం
గతం లో జరిగిన ఐ.పి.యల్ చూడలేదు. ఈ సారి అన్యమనస్కంగా నే చూడటం మొదలుపెట్టాను. మెల్ల మెల్లగా నాకు తెలీకుండానే చూడటానికి అలవాటు పడ్డాను. ఐతే పేరుకు క్రికెట్ చూస్తున్నా ధ్యాసంతా ఓవరు ఎప్పుడు ఐపోతుందా లేకపోతే వికెట్టు ఎప్పుడు పడుతుందా అనే.
ఓవరు ఐపోవటనికో, వికెట్టు పడటానికో చూడటం ఎందుకో మీరు తేలికగానే ఊహించగలరు.
అవును, మీరు ఊహించినట్టే, ఆ కేరింతగత్తెల అర్ధనగ్న నృత్యాలకోసం కాదు.
ఓ రెండు వ్యాపార ప్రకటనలకోసం.
పి.వి నరసింహారావు గారి శకం మొదలినప్పటి నుండి, వ్యాపార విధానాలలోనూ, వ్యాపార స్పర్ధలోనూ గణనీయమైన మార్పు వచ్చి, అవి వ్యాపార ప్రకటనలను కూడ ” కన్నా-మిన్నా”. “ఉండగ-దండగ” స్థాయి నుంచి గణనీయంగా పెంచినప్పటికీ , నాకు నచ్చే ప్రకటనలకన్నా , నచ్చనిప్రకటనలే ఎక్కువ.
కొన్నేళ్ల క్రితం ఓ చిన్న కుక్కపిల్లా, ఓ చిన్న అబ్బాయి తో హచ్ వారు మంచి ప్రకటనలు చిత్రీకరిస్తే అబ్బురపడ్డాను.
ఐతే ఈ సారి నాకు ఆనందాన్నిచ్చింది ఎయిర్టెల్ వారి ఈ ప్రకటన. ఐతే, ఎందుకనో కొన్ని రోజుల క్రితం నుండి ఈ ప్రకటన కన్నా ఎయిర్టెల్ వారి సినిమావాళ్ల గుడారపు ప్రకటన ఎక్కువగా చూపిస్తున్నారు.
ఇంతగాను ప్రభావితం చేసిందీ, ఆడదాని మనసే కాదురా, చిన్నపిల్లవాడిని మనసును అర్ధం చేసుకోవటం కూడ అంతే కష్టం అని చెప్పిన, నన్ను కుదిపేసిన రెండవ ప్రకటన Havells Cables and Wires వారి తల్లీకొడుకుల ప్రకటన.
జాగ్రత్తగా చూడండి, ఓ పక్క ఉయ్యాల ఊపుతూ మరో పక్క వంట చేయటం, ఆ పిల్లాడు రొట్టె నోట్లో పెట్టుకొని వేళ్లతో లోపలికి కొంచంగా నెట్టుకోవటం, చివరిలో తల్లి ముఖకవళికలు … ఒక లిప్తలో ఎన్ని భావాలు, ఎన్ని ప్రభావాలు.
ఓవర్ల మధ్యలో ఈ ప్రకటన ఎందుకొచ్చిందిరా బాబు అనుకున్న ప్రకటనలు కూడ ఉన్నాయి.
ఎయిర్టెల్ వారి “Best of Kids’ entertainment” అనే డిష్ టివీ ప్రకటన ఒకటి,యల్జీ వారి ఎయిర్కండిషన్ ప్రకటన మరొకటి.
అన్నట్టు, క్రికెట్ ఆటగాళ్లకు, తెర వెనుక సూత్రధారులకు మూఢనమ్మకాలు ఎక్కువట, సెమీఫైనల్ మ్యాచ్ లో బెంగలూరు కోచిగారు, ఓ బంతి ని ఆ చేతిలోంచి ఈ చేతిలోకి, ఈ చేతిలోంచి ఆ చేతిలోకీ విసిరేసుకుంటూ చూసారు.
ఓ ఆట లో ఔట్ ఐన తర్వాత కూడా, సచిన్, ఆట అయ్యేంతవరకూ శిరస్త్రాణం తీయలేదు.
నాకు ఇలాంటి వాటి మీద పెద్దగా నమ్మకం లేదు. ఐనా ఎందుకైనా మంచిదని, దక్కనువారు సెమీఫైనల్ గెలిచిన రోజు ఏ దుస్తులువేసుకున్నానో అవే వేసుకొని, సెమీఫైనల్ గెలిచిన రోజు ఏ కుర్చీ లో, ఏ ముద్రలో కూర్చున్నానో , అదే కుర్చీ లో అదే ముద్రలో కూర్చొని ఫైనల్ చూశాను.
సరే ఎలానూ ప్రకటనలు అన్నాను కాబట్టి, ఈ బ్లాగు సంబంధమైన ప్రకటనలు కూడా ఓ రెండుచేయనివ్వండి:
1. ఎంత ఈ బ్లాగు నాదైనప్పటీకీ, నావి మాత్రమే కానివి చాలా ఉన్నాయి. అక్కడక్కడా ఉటంకించే ఇతరుల రచనలు, అప్పుడప్పుడు కుదిర్చాను అనుకునే ఛందస్సూ, తెలుగు పదాలూ, అక్షరాలూ,జగమెరిగిన సత్యాలూ, ఇత్యాదులు.
తెలియకచేసే తప్పులని అటుంచితే, ఆంగ్లంలో టైపు చేయటం వల్ల దొర్లే అచ్చుతప్పులూ కాసీనీ కూసినీ కాదు. అలా అని ఆ తప్పులను పడిఉండనీయటం లో అర్ధమూ లేదు. పైగా ఓ ఇరవై ఏండ్లతరువాతో,పాతికేండ్ల తరువాతో (జాల ప్రపంచం కదా అన్నేళ్లు అలానే పడి ఉంటుందని నా అనుకోలు) రాకేశుడి లాంటి మంచి మాతృభాషాభిమాని ఎవరైనా పట్టుబట్టి తెలుగు నేర్చుకుంటూ “దోశము” అని చదివి, అది “దోషము” లో అచ్చుతప్పని తెలియక ఆరోజుల్లో దోశె ని దోశము అనేవాళ్లు కాబోలు, అదే సరైనది కాబోలు అనుకొని దగ్గరలో దర్శనికి వెళ్ళినపుడు “ఒక పెసర దోశము, ఒక ఉల్లిదోశము ఇవ్వుడీ” అనకూడదుకదా, అందువల్ల నా బ్లాగులో మీకు కనిపించిన అక్షర/వ్యాకరణ దోషాలన్నీ నిరభ్యంతరంగా చెప్పండి. నేను ప్రస్తుతం నా పాత టపాలు చదివి తప్పులు దిద్దే ప్రయత్నంలో ఉన్నాను.
2. ఈ టపా లో ప్రకటన అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో చెప్పిన వారికి ప్రత్యేకంగా బహుమతులేవీ ఇవ్వబడవు.
→ 3 Commentsవర్గాలు ఊ(సు పో)క
మంత్రాంగం మొత్తం
మినరల్ వాటర్
మాత్రమె తాగుతారు
మంది కోసం పంపుల్లో
కాలకూటం పంచుతారు
నీటి కోసం డబ్బుకడితె
నీళ్లతోటె చంపుతారు
లక్షా, రెండూ ఐదంటూ
ప్రాణానికో రేటు కడతారు
ఐనా ఆయుర్దాయం లేకుంటే
అయ్యవారు ఏంచేస్తాడు
ఐనవాళ్లకు లాగానే
ఆత్మశాంతికి ప్రార్ధిస్తాడు
దేవుడి పాలనలో
రోజూనీళ్లొదులుతారు
నీతికి
న్యాయానికి మల్లే
ప్రజల ప్రాణాలకీ
కాసిని నువ్వులు కలిపి
నీళ్లొదులుతారు
→ 2 Commentsవర్గాలు ఊ(సు పో)క
“Umbrella” లు అడ్డుచెబుతుంటే
“Perfection” లు పంటి కింద రాళ్లైతే,
తెలుగు సాహిత్యం లో తెలుగు వెతుక్కుంటున్నాను
కలగాపులగపు రేడియో ఛానళ్లలో
తారలు దుస్తులొదిలినంత తేలిగ్గా
వ్యాఖ్యాతలు వత్తులువదిలేస్తుంటే
అక్కడక్కడా తగిలే సరళ పదాల్లో
తెలుగు వెతుక్కుంటున్నాను
కన్నడపు “సుద్దుల” టీవీ ఛానల్ పెట్టి
కలిసే పదాలలో తెలుగు వెతుక్కుంటున్నాను
అవును, ఆంధ్రప్రదేశ్ రాజధానిలో
అచ్చతెలుగు కోసం వెతుక్కుంటున్నాను
జాలపు కూడలికి రోజూవచ్చి
కొత్తగా చేరిన వ్రాతల్లో
పాత తెలుగును వెతుక్కుంటున్నాను
నింపాదిగా కూచుంటే నిఘంటువు తెరిచి
పసిడి పడికట్టు మాటలు
అక్కడైనా భద్రంగా ఉన్నాయో
లేవో యని వెతుక్కుంటున్నాను
→ 5 Commentsవర్గాలు ఊ(సు పో)క
హెచ్చరిక : ఈ టపాలో మీకు జుగుప్సాకరమూ, అభ్యంతరకరమూ ఐన అంశాలు ఉండవచ్చు. మీ విచక్షణను అనుసరించి చదవండి.
మాతా శత్రుః పితా వైరీ
యేన బాలో నపాఠితః
న శోభతే సభా మధ్యే
హంస మధ్యే బకో యధా
అని చెప్పుకోవలసిన రోజులు కావివి…
అంతెందుకు …
మాతృ దేవో భవ
పితృ దేవో భవ
ఆచార్య దేవో భవ…
అని అనవలసిన అవసరమేమైనా ఉన్నదా అని బడిపిల్లలు అలోచించుకోవల్సిన రోజులివి.
ఇంకా చెప్పాలాంటే…పిల్లలందరూ కాన్వెంటు చేరుకోగానే…
మాతా శత్రుః పితా వైరీ
యేన బాలో పాఠితః
గురుర్ రిపుః పురా మధ్యే;
వ్యాఘ్ర మధ్యే మృగో యధా
అని గొంతెత్తి పాడతారు… వాళ్లకి కాస్త స్వేచ్ఛ ఇస్తే ,
కొట్టే/దండించే గురువు/తండ్రి/తల్లి వెనక నుంచొని లేరని తెలిస్తే.
ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలియకపోతే మీరు అదృష్ట వంతులు…
తెలుసుకోవాలనుకుంటే…::
డిల్లీ లో ఓ విధార్ధిని నిండు ప్రాణం పోయింది… తన గురువు వల్ల
మూడు నెలలక్రితం ఓ విద్యార్ధికి చావుతప్పి కన్ను పోయింది… తన గురువు వల్ల

వీళ్లని చూసి .. “ఆచార్య దేవో భవ” అని అనమని ఎవరు చెబుతారు?…
ఎడ్మిషన్ కోసం వెళ్లండి … తీయతీయని మాటలు చెబుతారు…
కన్నది మీరా , వాళ్లా అని మీకే సందేహం వచ్చే రీతి లో ముద్దు చేస్తారు…
ఒక్కసారి ఆ బడి లో చేర్పించండి .. అప్పుడు అసలు రంగు బయట పడుతుంది…
ఈ సామాజిక ద్రోహం లో చాలా భాగం పాఠశాల యాజమాన్యాలదే ఐనా… తల్లిదండ్రులకు భాగం లేదా అని ప్రశ్నించుకోవాలి..
పై ఇద్దరు విద్యార్ధుల గురించి, వారి కుటుంబాల గురించి నేను మాట్లాడటం లేదు..
కాని… సమాజం లో గత రెండు, రెండున్నర దశాబ్దాలలో… తల్లిదండ్రుల ప్రవర్తనలలోనూ,పిల్లల పెంపకం లోను వచ్చిన మార్పులు…
బేరీజు వేసుకోవలసిన సమయం ఇది.
మా అబ్బాయే స్కూల్ ఫష్ట్ రావాలి…మా అబ్బాయికి స్టేట్ రాంక్ రావాలి…(నేను మటుకు హోమ్వర్క్ చేశావా అని కూడా అడగను.. అన్నం తిన్నావా అని అడగను.. నా సమస్యలూ నా చికాకులు నావి….)
అన్న ఆశ ఒకవైపు… Flase Prestige అనే దిగజారుడుతనం మరో వైపు.. తల్లిదండ్రులని అల్లకల్లోలం చేసి…
హాస్టళ్లు.. స్టడీ అవర్స్.. ఇంటెన్సివ్ కోచింగ్, స్పెషల్ కేర్.. గాడిదగుడ్డు… అనే విష సంస్కృతిని
విద్యాసం సంస్థలపేరిట .. పాతుకుపోనిచ్చాయి…
తల్లి, తండ్రులని అంటున్నాని మీరు కోప్పడవచ్చు…
కానీ … వాళ్ల తీరుని మీరు ఓ సారి ప్రశ్నించుకోండి…
“నాకు ఆఫీస్ పని హెవీ గా ఉంటుందండీ..”
“ఫలానీ స్కూల్ లో ఐతే వాల్లే “శ్రద్ధ” తో చదివిస్తారండి.. ఇక మనం పట్టించుకోనవసరం లేదు”…
“ఆ స్కూల్లో admission వచ్చిందంటే… ఇక పిల్లాడికి తిరుగులేదను కోండి.. వాళ్లే రుబ్బుచ్చి రాటు దేలుస్తారు”
తండ్రి(తల్లి) – ఎడ్మిషన్ సంపాయించటం, ఎడ్మిషన్ కోసం డబ్బులు సంపాయించటమే తమ పని అనుకుంటే
తల్లి ( తండ్రి) – పొద్దున్నే కాంప్లాను, బాక్సులో రొట్టెలు, సాయంత్రం బూస్టూ, రాత్రి తిండీ, పండే తమ పని అను కుంటేను…
గురువులు తమపని తమరు చేసుకొరూ?
ఇక పిల్లల సంగతి ఏమిటి?
తల్లి తండ్రికి – స్టేటుకు తగ్గకుండా, వీలైతే దేశలెవల్లోనూ ర్యాంకు మీ పిల్లవాడికి సంపాదిస్తామని .. మాటిచ్చి డబ్బు తీసుకున్నావారు..
వాడు చదవకపొతేనో, తల నొప్పిగా ఉండి ఓ పూటా క్లాసు వినకపోతే నో ఊరుకుంటారా? చంపేయరూ?…
ఉత్తీర్ణత, విజయమూ, ర్యాంకూ, మా విద్యాసంస్థకు ఇన్ని ర్యాంకులూ అనే దోరణి ఒక కారణమైతే…
ఇంక పెద్ద కారణం .. సమాజపు, ప్రభుత్వపు వైఫల్యం…
పెరిగిన జనాభాకి అనుగుణం గా బడులు పెరగ లేదు…
అన్ని బడులు పెట్టి నిర్వహించే స్థోమత ప్రభుత్వానికి లేదు…
తగిన చదువు, అంతకు మించి తగిన మూర్తిమత్వమూ కలిగిన ఉపాధ్యాయులనూ, డబ్బు వెచ్చించి నియమించుకోవలసిన అవసరం ప్రైవేటు విద్యా సంస్థలకు అసలు లేదు..
పర్యవసానం…
మూత బడుతున్న సర్కారీ బడులు
ప్రత్యేకమైన వృత్తి పరమైన శిక్షణ లేకుండా…
పదవ తరగతి పాసైతే .. “A” “B” “C” “D” లు చెప్పగలిగితే… LKG కి “Miss”..
ఇంటరు పాసై.. రైమ్స్ చెబితే .. UKG కి “Miss”…
మీరు తల్లి/తండ్రి/మిస్/ఉపాద్యాయిని/ఉపాద్యాయుడు ఐతే దయచేసి … సహనం కొల్పోకండి…
కొన్ని నిజాలూ పరిశీలించండి…
ఈ నాగరిక ప్రపంచంలో, హైదరాబాదు నగరంలో …
మీరు పిలవ దలుచు కూంటే .. టీచరుగా పిలుచుకోగలిగిన వృత్తిలో ఉన్న ఓ స్త్రీ…
ఓ చిన్న పిల్ల క్లాసు లో మూత్ర విసర్జన చేసిందనీ, క్లాసు లో అందరి ముందూ ఆ విద్యార్ధిని చేత మూత్రం తాగించింది…
ఇది యాభై ఏళ్ల క్రితం జరుగలేదు, అప్పుడు భారతదేశం అంత ఎదగలేదు. ఇది ౦8-౦9 విద్యాసంవత్సరం లొ జరిగింది.
హైదరాబాడు లోనే, ఓ బడి లో పిల్లవాడిని కొడితే, ఆ పిల్ల వాడికి చెయ్యి స్పర్శ పోయి.. ఆసుపత్రి పాలయ్యాడు…
ఈ పైశాచిక గురు ప్రవృత్తిని ఏ వంక చెప్పి సమర్ధిస్తారు?
ప్రవేశాలప్పుడు అడగండి…
‘అబ్బే మా స్కుల్లో అసలు కొట్టమండీ ” అంటారు…
మొదటి త్రైమాసికం అవ్వగానే అడగండి…
“మీ పిల్ల అసలు గొడవ చేయదండీ, కొట్టే సమస్య రాదు అంటారు”…
ఇంకో ఆర్నెల్లు ఆగి అడగండి, అబ్బే ఎదో స్కేల్తో ఇట్టా అంటాం అంతే అంటారు.
గత సంవత్సరం ఓ స్కూల్లో నా కుమారుడి సీటుకోసమై వెల్తే…
ఆ ప్రినిసిపాలుడూ..
“సార్ ఇక్కడ ఉన్న ౪౦౦ మంది పిల్లలనీ నేను నా సొంత పిల్లల్లా చుసుకుంటానండీ” అంటు మొదలు పెట్టాడు…
ఓ పది నిముషాలు ఊకదంచాడో లేడొ..
“UKG లొ ఓ పిల్లాడు ఉన్నాడండీ, టీచరు బోర్డ్ వైపుకు తిరిగి మళ్ల వెనక్కి తిరిగే లోపు టీచర్నే మాయం చేయగలడు” అన్నాడు…
ఆయన విఙ్ఞత ని అంచనా వేశే పెద్దపని మీకే వదిలి పెడుతున్నాను…
ఈ సమస్యకు గురుద్రోహం ( అనగా గురువులు చేశే ద్రోహం) ఎంత కారణమో – తల్లిదండ్రుల ఉదాసీనతా అంతే కారణం..
( ప్రభుత్వం సంగతి చెప్పనవసరం లేదనుకుంటా)..
దయచేసి.. మా బడి/ మా పిల్లలు చదివే బడి/ ఆ కాన్వెంటు / ఈ ఇన్స్టిట్యూట్ ఇట్టాంటివి కాదు అని చెప్పకండి..
మీరు చెప్పేది నిజమే ఐతే సంతోషమే కానీ, నేను నమ్మటానికి సిద్ధం గాలేను…
కాదు నమ్మే పరిస్థితి లో లేను…
మెరుగైన సమాజం కోసం, చిన్నపిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకోవటం కోసం, హాయిగా బ్రతకటం కోసం, కనీసం బ్రతకటం కోసం ..
మీ వంతు చేయగలిగినది ఏమైనా ఉంటే చేయండి, దయతో.
నేను అందరు తల్లులూ, తండ్రులూ, ఉపాధ్యాయులూ ఇలానే ఉన్నారంటంలేదు….
మీ చుట్టూ ఉన్న సమాజాన్ని చూడండీ ఎందరు ఇలా ఉన్నారో మీకే తెలుస్తుంది.
ఐతే,
ఇలాంటి స్వభావం ఉన్న గురువు ఒక్కరున్నా గర్హించాల్సిందే,ఆ బాధ్యత నుంచీ శాశ్వతంగా తొలగించాల్సిందే
పిల్లల్నీ దండించే, శారీరకంగా మానసికంగా హింసించే కాన్వెంట్ ఒక్కటున్నా గమనించాల్సిందే, శాశ్వతంగా మూయించాల్సిందే.
———————————————-
పై వార్త ఈనాడు దినపత్రిక నుండి సంగ్రహించబడినది.
→ 7 Commentsవర్గాలు ఊ(సు పో)క