ఊక దంపుడు

నే రాయని రెండు టపాలు-౧

డిసెంబరు 28, 2007 · అభిప్రాయములు

బాపు ౭౫వ పుట్టినరోజు

డిసెంబరు ౧౫న బాపు తన ౭౫వ పుట్టిన రోజు జరుపుకున్నారు. నాకు ఆ రోజు రాత్రి భక్తి టి.వి వారు ప్రసారం చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమం వల్ల తెలిసింది. ఆ రోజూ, మర్రోజూ ప్రయాణం లో ఉండటం వల్ల బ్లాగులో ప్రకటించలేకపోయాను.తోటి బ్లాగరులెవరైనా ఈ విషయం ప్రస్తావించారేమో తెలియదు. ఈ నిత్యయవ్వనుడు, ౬౦లు సమీపిస్తున్నపుడనుకుంటాను, కాస్త వయసుకనిపించాలనో,ఏమో పైపు పట్టారుట. ఆయన చేతితో ఆయన వేసుకున్న ఆయన పైపు పట్టిన బొమ్మ ఈనాడు ఆదివారంపై వచ్చింది, ౬౦వ జన్మదినం సందర్భంగా శ్రీ.ము||వెం||రమణ ఓ ప్రత్యేక వ్యాసం రాశారు. ౭౦వ పుట్టిన రోజుకి, మళ్ళీ ఆయన వేసుకున్న బొమ్మే, ఈ సారి రాములవారు సీతమ్మ పాదాలకి పారాణి దిద్దుతుంటే, పారాణీ అందిస్తున్నట్టు. ఇంతలో ఇప్పుడు ౭౫వ పుట్టిన రోజు. ఆ రోజు దినపత్రికలు బాపు పుట్టినరోజు ఎలాజరుపుకున్నాయో తెలీదు. ఈ భక్తి టివీవారి ప్రత్యేక కార్యక్రమానికి మటుకు యాంకరమ్మ సుమ. ఆరుద్ర వారి “కొంటె బొమ్మల బాపు” తప్పు జెప్పి, ఓ చప్పనైన స్క్రిప్టు పట్టుకొచ్చి ఫెయిలు మార్కులు సంపాదించింది.
కార్యక్రమాన్ని రెండు భాగాలుగా విడగొట్టారు. చిత్రకారుడు బాపు,చలనచిత్రకారుడు బాపు.
నాకు చిత్రకారుడి భాగం నచ్చింది, రామాయణ, భారత భాగవతాలపై బాపు వేసిన బొమ్మలు లిప్తకాలం పాటైనా, చూసి అహా అనుకున్నాను. ఆ చిత్రం తెరమీద కనబడిబడగానే పక్కనున్న మిత్రులు ఆ ఘట్టం చెబుతుంటె, ముందు మిత్రుడి గొప్పతనమనుకున్నాను కాని, ఆనక తెలిసింది ఆ గొప్పతనం బాపూదని.శ్రీయుతులు ముళ్లపూడి వేంకట రమణ,శ్రీ రమణ, తనికెళ్ళ భరణి, బాపు గురించి మాట్లాడారు.
చలచిత్రపు భాగం, రాబోయే బాపూసినిమా వ్యాపార ప్రకటనగా మారినట్టు అనిపించింది.

ఈ రామభక్తుడికి ఆ స్వామి, దీర్ఘాయురారోగ్యైశ్వర్యాలనివ్వాలని, బాపు గారు కలకాలం అంధ్రనాట హాస్య,భక్తి రసాలని పంచాలని కాంక్షిస్తున్నాను.
సరే మీరు ఇది చూసి ఆనందించండి.

వర్గాలు ఊ(సు పో)క

2 స్పందనలు so far ↓

వ్యాఖ్యానించండి