ప్రతి సంక్రాంతి రైతుకి ఆశలు తెస్తుంది. సంక్రాంతి పురుషుడు కూడా రాజకీయ నాయకుడి లాంటి వాడె, సరిగ్గా పంట చేతికొచ్చే టైంకి వస్తాడు, పంట చేతికి రాకపోతే, నేనిప్పుడె వచ్చాను, తప్పంతా పాత పురుషుడిదే అంటాడు. పంట చేతికి వస్తే నేను దయామయుడిని కాబట్టి మీకు పంట చేతికొచ్చిందని పోజిస్తాడు. అహా ఇక నుంచి దమ్మప్రభువుల పాలన అని రైతు మళ్ళా మోసపోవటనికి పునరంకితమౌతాడు. చెబితే రైతు జీవితం కూడా ‘అరయంగా కర్ణుడీల్గె ఆర్గురిచేతన్’అన్నట్టే ఉంటుంది. సంక్రాంతి పురస్కరించుకొని , రైతులోకానికి మేలు జరగాలని కోరుకుంటూ::
నాభూమినిప్రభుత నామమాత్రమ్మిచ్చి
లాగికొందు ననెడి రాపు లేక
పెద్దలు బలవంత బెట్టగా పొలమును
చౌక గానమ్మెడి చావు లేక
రాత్రికి రాత్రియే రాజకీయముతోడ
రింగు రోడ్డు జనెడు బెంగ లేక
చీదరించి విదుల్చు చిల్లర డబ్బుకై
కోరి సంతు కడను క్షోభ పడక
రమ్మన రాకయే, రావలదనవచ్చు
వాన గాలి జతల వ్యధలు లేక
నాయక,బ్రోకర,నకిలీల వ్యాపార
గణ సర్ప కోటికి కంట పడక
వ్యయసాయమనకయు వ్యధ సాయమనకయు
వ్యవసాయమనియె వ్యవహరింప
ఆత్మ తృప్తి కోరి, ఆత్మవి శ్వాసము
తోడ, రైతు బ్రతుక దుక్కి దున్ని
సాధు భావ రార! సంక్రాంతి పురుషుడా
తేజ రిల్ల నవని తెలుగు రైతు!!!.
మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.