రెండు హాంగోవర్ల మధ్య మద్య పిపాసి ఆలోచించుకోగలిగితే::
కనుమా ఎందరొ వీధివీధికిని, ఆకల్లుంగొనంగూలిరో,
వినుమా, నీదు శరీరమున్ తొలచి నిర్వీర్యుండజేయుంగదా,
అనుమా , మద్యము జోలికెళ్ళనని యే, యాప్తుల్ ముదంబొందగా,
మనమా ఒద్దిక నాదు మాట వినుమా, మర్యాద కాపాడుమా
9 స్పందనలు so far ↓
వికటకవి // ఏప్రియల్ 27, 2008 వద్ద 2:27 పూర్వాహ్నం |
బాగుంది, అది సరే గానీ ఇక మీ తూఊఊఊఊఊఊఊఊఊఊగులయ్యనొదలరా?
vookadampudu // ఏప్రియల్ 29, 2008 వద్ద 9:41 అపరాహ్నం |
వికటకవి గారు, ఆ వ్యసనాన్ని వదిలి ఇంకో ఆధునిక వ్యసనాన్ని బట్టుకున్నాను చూడండి.
కనుమా, లేదట ఆటగాండ్రకును ఏ కాస్తైన మిత్రత్వమే
కనుమా, హద్దులు మీరుచుండెడు ‘కళాకాంతా’సమూహమ్ములన్
వినుమా, వద్దిక ఆక్రికెట్టును తమిన్ వీక్షించు వ్యామోహమే
మనమా! ఒద్దిక నాదు మాట వినుమా, మర్యాద కాపాడుమా!
అనుమానంబొకొ?తేటతెల్ల మయె, అత్యాశా యుగమ్మౌ నిదే,
వనితా దేహమె ఒప్పు నాభిగను, హా! వాణిజ్యమే సర్వమున్
కినుకన్ మానుమ, ఆటజచ్చెనట, ఆ కేరింత గత్తెల్ బడన్,
మనమా! ఒద్దిక నాదు మాట వినుమా, మర్యాద కాపాడుమా!
వికటకవి // ఏప్రియల్ 30, 2008 వద్ద 1:19 పూర్వాహ్నం |
బాగున్నాయి. మొదటిది మరింత నచ్చింది.
చదువరి // ఏప్రియల్ 30, 2008 వద్ద 7:33 అపరాహ్నం |
రెండేసి, మూడేసి పూరణలు రాయడం మీకూ గిరిగారికే చెల్లు!!
నాకు మూడోది నచ్చింది. కేరింత కత్తెలనమాట వాళ్ళు- భలే! నేనూ ఇదే విషయంపై పూరించాను, రానారె బ్లాగులో.
రానారె // ఏప్రియల్ 30, 2008 వద్ద 8:55 అపరాహ్నం |
చదువరిగారన్నట్టు రెండేసి, మూడేసి పూరణలు రాయడం మీకూ గిరిగారికే చెల్లు. మీ మొదటిపద్యం నాకు నచ్చింది. చాలా బాగుంది. మూడోపాదంలో ‘యే’ నాకు నచ్చలేదు.
బ్లాగేశ్వరుడు // ఏప్రియల్ 30, 2008 వద్ద 9:07 అపరాహ్నం |
బాబోయ్ .. చాలా జరుగుతోంది …. నేనే చాలా వెనకబడి పోతున్నాను.
ఈ పరీక్షలు కాదు జీవితము అంతా ఈ పరీక్షలు రాయలేక చస్తున్నాను
బ్లాగేశ్వరుడు // ఏప్రియల్ 30, 2008 వద్ద 9:09 అపరాహ్నం |
మొదటి పద్యము అదిరింది సారూ
Giri // మే 1, 2008 వద్ద 8:06 అపరాహ్నం |
కల్లు మీద పద్యం బావుందండీ
vookadampudu // మే 2, 2008 వద్ద 8:33 అపరాహ్నం |
రానారే గారూ, మూడో పాదం మార్చాను చూడండి, మందు మానటం వల్ల ఎంతమందికి ఆనందం కలిగినా బ్రహ్మానందం మటుకు భార్యకే, అందువల్ల:
కనుమా ఎందరొ వీధివీధికిని, ఆకల్లుంగొనంగూలిరో,
వినుమా, నీదు శరీరమున్ తొలచి నిర్వీర్యుండజేయుంగదా,
అనుమా మద్యము జోలికెళ్ళనని బ్రహ్మానందమౌనాలికిన్,
మనమా ఒద్దిక నాదు మాట వినుమా, మర్యాద కాపాడుమా.