పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్!

నా దృష్టి లో రానారె మాటల పిసినారె. అందుకు తొలి నిదర్శనం వారి గూగులమ్మ పదాలే. మీ పదాలు మీ ఇష్టం గాని, మాకో మంచి సమస్య ఇవ్వండి బాబూ అంటే, ఆయనిచ్చినది మూడే పదాలు:
“తాటక తనయుడు కర్ణుడు.”
నా వల్ల అయ్యే పని కాదులే అని వదిలి వేరే విషయాల వైపు మళ్ళితే బ్లాగేశ్వరుడు తన పురాణసంపత్తి తో మంచి పూరణ ఇచ్చారు, నాకు కాస్త ధైర్యాన్ని కూడా.
వారు దురితులతో స్నేహం చేయటం మృత్యువును చేరదీయటమే అన్న అర్ధం లో పూరిస్తే, నేను కుంతి తో సూర్యుని సంభాషణకి కిట్టించటానికి ప్రయత్నించాను.
ఇది పద్యాల ఋతువుట, కాబట్టి రానారె గారు, గురువు గారు, మా శ్రీరాముడు పాస్మార్కులు ( దీనికి తెలుగేమిటబ్బా!) వేస్తారనే అనుకుంటున్నా.

అనుమానింపగ ధర్మమె
ఘనమౌ తపమాచరింప కల్గెడి శక్తిన్?
మునిమంత్రములుత్తాటక?
తనయుడు కర్ణుడు
కలుగుట తధ్యము కుంతీ!

రానారె గారి సమస్యను చూసి బ్లాగేశ్వరులు ‘తాటక’ యా ‘తాటకి’ యా అన్నారు, తాటకి ఐతే పూరణ పరిశీలించండి:

మునివరమునుశంకింతువె
పనిగట్టుకొనిటులకుంతి? బలివైతివిగా
క్షణమున విధివింతాటకి!
తనయుడు కర్ణుడు
కలడన ధరకన్నియకున్!

11 responses to “పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్!

 1. ఒక్క ప్రశ్నకు రెండు సమాధానాలు రాసి పాస్మార్కులడుగుతారా? రెండింటికీ రెండు వీరతాళ్లు వేస్తున్నాం. ముని మంత్రములు ఉత్త ఆటకా!, విధివింతాటకి … భలే ఇమిడ్చారు. పిసినిగొట్టుతనం ఎక్కడినుండీ వచ్చిందంటే – తెవికీలో కందానికి ఉదాహరణగా ‘భూతల నాథుడు రాముడు’ పద్యం ఉంది. అదే వరసలో ‘తాటక తనయుడు కర్ణుడు’ అని నోటికొచ్చింది. మీరూ కాస్త అవకాశం ఇచ్చారు, నాదేం పోయిందని అడిగేశాను. భలే పూరణలు వస్తున్నాయి. బ్లాగేశుని పూరణకూడా చాలా బాగుంది. సీతారాములకు పెండ్లిజేసి మన శ్రీరాముడు వానప్రస్థం పోయినట్లున్నాడు!?

 2. ఊదం గారు,

  బాగున్నాయి పూరణలు, కానీ ఒక చిన్న సందేహము.

  మునిమంత్రములుత్తాటక?

  చివర “క” హ్రస్వముగా ప్రశ్నార్ధకములో వాడవచ్చునా?

 3. అవును, ఒక్క సమస్యకు రెండు పూరణలా! పూరణల్లోని చమత్కారమంతా తాటక ను ఉత్త ఆటక?, వింతాటకి అని విరచడంలో ఉంది. దంచారండీ!

  అయితే, ఈ విద్యార్థిదో సందేహం.. రెండో పద్యంలోని – పనిగట్టు “కొనిటు” లకుంతి – పర్లేదా? సంధి కుదిరిందా, కుదిర్చారా?

 4. పింగుబ్యాకు: ఇదిగో నా మొదటి పద్యం…. « వికటకవి

 5. చాలా బావుంది (ద్వి)పూరణ. “పనిగట్టుకొనిటుల” గురించి చదువరి వారి అనుమానమే నాదీను..నాకు మొదటిది కన్నా రెండవ ప్రయోగం “వింతాటకి” ఎక్కువ నచ్చింది.

 6. ఈసారి మీ రోల్ రివర్సైనందుకు చక్కని పద్యాలు వచ్చినందుకూ నాకు కొంత పగ తీరిన ఆనందం 🙂
  పద్యాలు రెండూ బాగున్నాయి. తాటకిని పదాలలో ఇమిడ్చిన తీరు అమోఘం.

  కానీ లఘువులెక్కువైతే “ఎమితిని సెపితివి కపితము” అంటారని గురువుల ఉవాచ.

 7. ఊద గారూ, ఈ రెండు పూరణలూ బహుబాగున్నాయండీ. ఒత్తులూ, దీర్ఘాలూ సంగతి పకన పెట్టండి .. సమస్య వాక్యాన్ని పద్యంలో పొదిగిన తీరూ, మిగతా పద్యంలో కూడా అదే “గొంతు” పలికించిన పద్ధతీ మంచి చమత్కారంగా ఉన్నై. అభినందనలు. శ్రీరాముడు చెప్పింది నిజం .. మామూలు వాడుకలో దీర్ఘాలు ఉండాల్సిన చోట గణాలకోసం కుదించి పెడితే “ఎమితిని సెపితివి” లాగానే ఉంటుంది. మీ పద్యాల్లో ఆ దోషం లేదులెండి. తాటకి వెర్సస్ తాటక – అవధానంలో కూడా సమస్య వాక్యాన్ని అవసరానికి కొద్దిగా అటూ ఇటూ వంచుకోవచ్చు. సమస్యలోనూ దత్తపదిలోనూ అవధానులు ఈ పని తరచుగానే చేస్తుంటారు. మరిన్ని వివరాలకి ఈమాటలో కేవీయస్ రామారావుగారు రాసిన “ఆరు నెలల్లో అవధాని కావటం” వ్యాసాలు చూడండి (కొంచెం వెతుక్కోవాలి).

 8. కొత్త పాళీ గారు,
  అవధానం మీద రామారావు గారి వ్యాసాల గురించి చెప్పినందుకు నెనరులు. ఒక్క సిటింగ్ లో జీర్ణమవనన్ని విషయాలు ఉన్నాయి వాటిల్లో. మళ్ళి మళ్ళీ చదవాల్సినవి, చదవాలనిపించేవి.

  వెతుక్కొవడానికి నేను అంత కష్టపడలేదు, “అవధానం” పదం కోసం వెతగగానే దొరికాయి.

  గిరి

 9. రానారె గారు, గురువు గారు, శ్రీరాం గారు,
  నెనరులు.మొదటి ప్రయత్నం లో గట్టెక్కిన సందర్భాలు చాలా తక్కువ కాబట్టి – ఈ టపా నాకు ప్రత్యేకమైంది గా నిలుస్తుంది.
  చదువరి గారు,
  నెనరులు. రెండు పూరణలు మీకూ అలవాటేగా :).
  పనిగట్టుకొనిటుల :: పనిగట్టుక,నిటుల, అని వ్రాశాను, తెలుగు ని ఇంగ్లీష్ లొ టైపు చేశేటప్పుడు పనిగట్టుకొనిటుల అయింది, తప్పో కాదో పెద్దలే చెప్పాలి.
  గిరి గారు,
  నెనరులు. మీరు మత్తకోకిలను కూడా కూయిస్తున్నారు అభినందనలు.
  శ్రీరాం గారు,
  ఇన్నాళ్లూ స్థానమూ స్థలమూ సరిచూసుకోవలసినది సంభోగించటానికే అనుకున్నాకానీ సంబోధించటానికి కూడా అని ఈ పద్యం నేర్పింది ( పన్నును మన్నించండి, pardon the pun.) సూర్యుడి చేత “కుంతీ” అని మొదటి గణం లో అనిపిద్దామంటే, ప్రాస తంతోంది,రెండో గణం లో మొదటి మాటకి రెండో మాటకి లంకె తంతోది. మూడో గణం లో చంధస్సు. నాలుగులో యతి .. ఏమి చెప్పమంటారు నా బాధలు.
  వికటకవి గారు,
  పద్యలేఖిని పట్టినందుకు అభినందనలు. హ్రస్వం సంగతి శ్రీరాం గారు చెప్పారు చూడండి.

 10. అయ్యా,

  మరో మారు నా పద్యంపై కన్ను వేసి తీర్పివ్వండి. ఇంకా లోపమైతే ఎత్తి చూపండి. నెనర్లు.

 11. పింగుబ్యాకు: నానాటికితీసికట్టు నాగంభొట్లూ! « ఊక దంపుడు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s