నామవాలము – వాలనామము

రాని సంస్కృతము వదిలి, తెలుగులో చెబితే, పేరుకి తోక, ఆ తోకకి పేరు.

భాగ్యనగరం లో పడక పడక వాన పడింది మొన్న సాయంత్రం పూట. బయట వానపడుతున్నపుడు వేడివేడి మిరపకాయ బజ్జీలు తినాలి అనిపించటం సహజం, అలాఅనిపించంగానే తినగలిగే అవకాశం కొద్దిమందికే ఉంటుంది, అలా తినగలిగే అవకాశం ఉన్నా కూడా తినకుండా ఉండే నిగ్రహం చాల కొద్దిమందికే ఉంటుంది, అట్టాంటి నిగ్రహం ఉన్నవాడు ఇంచుమించు మునివర్యుడే అని నా అభిప్రాయం. నాకు ఆ నిగ్రహం ఉంది కానీయండి, పక్క ఉన్న మిత్రుడికి లేకపోవటం తో ( ఇదే సమయానికి ఆ మిత్రుడు ఇవే మాటలు తన బ్లాగ్ లో చెబితే అది నా తప్పు కాదు) ఆఫీస్ ఎదురుగా ఉన్న మిర్చిబండి దగ్గరకి వెళ్లాం. ప్రపంచంలో ఆఫీస్ ఎదురుగా మిర్చిబండి ఉండేవాళ్లు చాలా కొద్దిమంది, ఉన్నాసాయంత్రం వేడి వేడి బజ్జీలు తినటానికి వెళ్లేవాళ్లు చాలా చాలా కొద్దిమంది. అలా వెళ్ళినా, బజ్జీలు పెట్టి ఇచ్చిన పేపరు ముక్క చదివేవాళ్లు చాలా చాలా చాలా కొద్ది మంది. ఆ పేపర్ ముక్క చదివి దాని గురించి బ్లాగే వాడు మాత్రం ఒకే ఒక్కడు.

ఈ మధ్య సినిమాపేర్లు చూసుంటే మీరు గమనించే ఉంటారు, పేరు తో పాటు ఓ తోక కూడా ఉంటోందని. ఈ తోకకి ఆ పేర్లకి సంబంధం ఉండదు.ఎప్పుడో తప్ప ఎందుకు పెడతారో కూడా తెలియదు మనకీ వాళ్లకి కూడా. ఐతే,ఈ తోకకు కుడా ఓ పేరుందిట, Tag line అని. ఈ టపా అంతా ఆ Tag line గొడవే. ఆంగ్లంలో దాని పేరు ఏదైతే నాకెందుకులేగానీయండి, ఆ Tag line కి తెలుగు(సంస్కృతం) పేరు కనిపించింది ఆ పేపరు ముక్క లో, “ఉప శీర్షిక” అని. ఈ లెక్కన, second heroine ని ఉప నాయిక అని, trailor ని ‘ఉప సినిమా’ అని, ‘side villion’ ని ‘ఉప విలన్’అని కోరస్ పాడేవాళ్లని ‘ఉప గాయకులు’ అని అనవచ్చేమో ఆ ముక్కలో కన్పించిన వార్తరాసిన వారే చెప్పాలి. ‘ఉప’ అనేపదాన్ని కూడా మనవాళ్లు వంటల్లో ఉప్పు వాడినట్టు గా వాడేస్తుంటారు అని నా గట్టి నమ్మకం. వీరశబ్దం లాగానే ఉపశబ్దం గురించి కూడా వంశీ గారు లెక్కలు నిజాలు నిగ్గులు తేలుస్తారని ఆశిస్తున్నాను. ఇలా అనగానే నాకు రెండు ‘ఉప’ మాటలు గుర్తొచ్చాయి, కాని అవి ఇక్కడ చెప్పను,వంశీ గారి టపాలో చెబుతా. ఇది “ఉప” మీద, ఉపపురాణమవ్వకముందే, ఉపన్యాసం ఆపి మనోపదేశాన్ని పాటించి, అసలు విషయం లోకి వెళ్తాను. ఆగండాగండి, ‘out of date’ అయ్యే లోపు ఉప మీద ఇంకో ముచ్చట చెప్పనివ్వండి, తెలుగు ప్రతికలు చదివేటప్పుడు, “యు పి ఏ ప్రధాని” అనో “u.p.a ప్రధాని” అనో చదవినప్పుడల్లా నాకనిపిస్తుంది, ఉపప్రధాని అంటే -పెద్దాయనికి ఇంకా సరిగ్గా అతుకుతుంది కదా అని.సరే ప్రధాని విషయాన్ని దశజనపధానికి వదిలేసి, మనం తోకలసంగతి చూద్దాం.

ప్రేమాభిషేకం అని సినిమా తీస్తున్నారుట, ఉప శీర్షిక ‘ వీడికి కాన్సర్ లేదు’ట.
చానాళ్ల క్రితం, పాడాలని ఉంది లో, S.P బాలసుబ్రహ్మణ్యం గారు, మా పాత తెలుగు పాటలని మాకు వొదిలివేయండి బాబు, మీ రిమిక్స్లు మీ కొత్తపాటల మీద చేసుకోండి అని ప్రాధేయపడ్డారు, ఇప్పుడు సినిమాపేర్ల గురించికూడా అలా ప్రాధేయపడాల్సిన అవసరం వచ్చిందన్నమాట.. ఒక వేళ అలాప్రాధేయపడకపోతే, త్వరలో మనం ఈ సినిమాలు చూడాల్సి రావచ్చు:
                                                   మిస్సమ్మ
                                                       ఈవిడకి పుట్టుమచ్చలేదు
                                                  గుండమ్మ కధ
                                                       ఈవిడ మొగుడు బతికే ఉన్నాడు
                                                  అర్ధాంగి
                                                       ఇతడికి పిచ్చి లేదు

ఈ కొత్త సినిమాల తాకిడికి తట్టుకో లేక, పాత సినిమాలు తిరిగి విడుదల చేశే వాళ్లు .. ఈ తోక వుంటే కాని ఆడవేమో అని, వాల్పోష్టర్లలో tagline అతికించవచ్చు .. ఉదాహరణకి:
                                                    మాయాబజార్
                                                          పెళ్లి నాకు పిడిగుద్దులు మీకు
                                                    దేవదాసు
                                                         ఓ రిఛ్చోడి ప్రేమకధ
                                                    స్వాతి ముత్యం
                                                        ఓ పిచ్చోడి పెళ్ళికధ
                                                    రుద్రవీణ
                                                         సంఘం కోసం సంగీతం
                                                    సాగర సంగమం
                                                         కరగనీకుమా నీ కుంకం

ఈ నామవాలాల్ని ఇంకా పెంచి, వ్యక్తుల పేర్లకి కూడా తగిలిస్తే ఎట్టాఉంటుందో చూడండి:
                                                    వైయస్సార్
                                                         Gods’ own Governor
                                                    సురేష్ రెడ్డి
                                                         Headmaster in the Assembly
                                                    చంద్ర బాబు
                                                         Vision Half Fulfilled

నేనెందుకు ఊరికే ఉండాలని నేను కూడా నా బ్లాగ్‍కి ఓ నామవాలాన్ని తగిలించాను ‘ఊరక ఉండకుండా, పనికొచ్చేదేమీ చెయ్యకుండా, ఇక్కడ ఇలా ..” అని. ఆ తరువాత అటు ఇటు చూస్తే, తెలుగు బ్లాగుల్లో ‘ నామ వాలం’ కల బ్లాగులు చాలనే కన్పించాయి. పైగా అవి సినిమా వాళ్ల ‘ఉప శీర్షిక’ కన్నా చక్కగా అతికి నట్టునూ , అర్ధవంతంగా ఉన్నట్టూనూ అనిపించాయి. మరి మీకేమైనా కనిపించాయా?

9 responses to “నామవాలము – వాలనామము

 1. మీ బ్లాగు వాలం బావుంది. వై.ఎస్ వాలనామమూ నాకు నచ్చింది. మరోటి..
  కేశవరావు – బిడ్డచాటు తండ్రి

 2. ౧) ఉపశీర్షిక అంటే subtitle అని అర్థమొస్తుందేమే?
  Subtitle కి Caption(Tag line) కీ చాలా తేడా వుందిగా!

  ౨) మీరు ఉపశీర్షికని ఇలా ఆడుకునే సరికి, నా బ్లాగుకున్న ఉపశీర్షిక (నామవాలం?) గుర్తుకొచ్చి, అది చాలా ‘చీకీ’ యేమే అనిపిస్తుంది 🙂

 3. ఊ.ద గారు,
  మీ బ్లాగు, వాలం బాగున్నయి.
  మన్మోహన్ సింగ్- సోనియా చాటు కృష్ణుడు
  -నేనుసైతం

 4. నాకు మీ టపా టైటిలు మాత్రం టపాకాయలా పేలిందనిపిస్తోంది..

 5. టపా అంతా ఒకదాని వాలము పట్టుకొని మరో తోకగా నడిచింది. బాగు బాగు బహు బాగుగా ఉన్నది

 6. చాలా బాగుందండి మీ బ్లాగు! ప్రత్యేకించి “ఉప ప్రధాని” అన్న మీ చమత్కారం .

 7. బాగున్నాయి మీ సరదా సరదా నామములు మరియు వాలములు.

 8. అయ్యా ఊక దంపుడు గారు! ఆటవెలది లొ యతి నియమం ఎలా పాటించాలో తెలుపుతారా? ప్రతి పాదం లొ నాల్గవ పాదములొ యతి పాటించాలా?? అజ్విశిష్టాక్షరము గురించి వివరము ఇంకా తెలువలేదు

 9. గిరి గారు,
  నేనూ సినిమావాళ్ళ ఫార్ములానే ఫాలో అయ్యాను. టైటిల్ చూసి లోపటికిరావటమే లెక్క, మొత్తం జూస్తే మనకేంటి, సగం జూసి వెళ్లిపోతే మనకేంటీ? డబ్బులు వాపస్ అడగరుకదా.
  చదువరి గారు,
  మరి ఢిల్లీతల్లీకో?
  రాకేశ్వర గారు,
  ఈ టపా రాశేటప్పుడు కొన్ని బ్లాగు ఉపశీర్షికలు ‘కోట్’ చేద్దామని చూశాను. మీ బ్లాగు ఉపశీర్షిక ఎంతసేపటికీ కొరుకుడు పడలేదు. ఇక లాభంలేదని, టపా ప్రశ్నతో ముగించాను.
  బ్లాగేశ్వరుడు గారు,
  ‘ఆటవెలది’కి ‘యతి’ కి ముడిపెట్టాలని చూస్తున్నారన్నమాట :).
  అవును, ప్రతి పాదం లోనూ మొదటి అక్షరానికి నాల్గోగణం మొదటి అక్షరానికి యతి చెల్లాలి. ప్రాసయతి చాలు. “అచ్చు మైత్రి” చెల్లకపోయినా పర్లేదు.

  వికటకవి గారు ,Chandu గారు,నేనుసైతం గారు,
  నెనరులు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s