అఙాన శాకుంతలం

అఙాన శాకుంతలం
(లేక ఫాన్సీ నంబరు తో ప్రమాదాలు)

శుక్రవారం మధ్యాన్నం మూడింటప్పుడు, ఆ రోజుకి మూడో సారి కాఫీ తాగే వేళయ్యిందని, కఫె కివెళ్లి, కాఫీ తీసుకొని, దానిలో చెక్కెర ఎక్కువైందని కలిపినవాడిని తిట్టలేక, కాఫీనే తిట్టుకుంటూ, ఏదో ౨౪ గంటల ఛానల్లో ‘breaking news’ పేరిట వేస్తున్న చద్దివార్తను చుస్తూ కూర్చోగానే -సెల్ ఫోన్ మోగింది..

౩:౦౩:౦౦
హల్లో వేణు
‘రాంగ్ నంబర్’ అని చెప్పి ఫోన్ పెట్టేశాను.

౩:౦౩:౧౦
మళ్లా ఫోన్ మోగింది..
హలో
హలో
హలో
హలో
యాయ్ వేణు..

నేను వేణూ కాదండి.. అని చెప్పి ఫోన్ పెట్టేశాను.

౩:౦౫
మళ్లా ఫొన్ మోగింది .. ఎత్తాను..
ఏంటి ఊరికూరికే ఫొన్ పెట్టేస్తావ్
మీకు ఎవరు కావాలి..
ఇదిగో వేణు..
నేను వేణూ కాదండి ..
నేను నీ గొంతు గుర్తుపట్టాను..
నేను వేణూ కాదండి ‘రాంగ్ నంబర్’
ఇదిగో నీ ‘sweet voice’ నాకు తెలీదనుకున్నావా.. నువ్వు అబద్ధాలు చెప్పక.
[‘sweet voice’ అని వినగనే, నాకు ఒక కంట కల్తీ లేని కన్నీరు ఒక కంట ఆనందభాష్పాలు కారాయి. పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న తెలుగు వార్తాఛానళ్లకు పంపించినవాడికి పంపకుండా ఆడియో కాసెట్లు, ‘భయో’డేటాలు పంపిస్తుంటే, ఒక్కడూ ఆడిషన్ కి కూడా పిలవటం లేదు.. ఇక్కడ ఈవిడేమో .. అడక్కుండానే సర్టిఫికెట్లు ఇచ్చేస్తోంది…]
తాగుతున్న కాఫీ లో కొంచం చక్కర ఎక్కువైంది, అందుకే మీకు అలా అనిపిస్తొంది కాని, నేను వేణు ని కాను.
[నేను నా కాఫీ లో చక్కర సంగతి అనవసరం గా తెచ్చాను అని తర్వాత తెలిసింది… నాదొక నిస్సహాయ స్థితి, ఒక పక్క ఆస్వాదిద్దామనుకున్నా కాఫీ రుచిగాలేదు, మరో పక్క రెండు నిముషాలలో ఐదుసార్లు అనవసరవు ఫోన్లు మాట్లాడవలసిరావటం, ఏమన్నాఅందామంటే అటు పక్క అబల, ఈ నిస్సహాయ స్థితి లో కొంచం వ్యంగంగా మాట్లాడితే ఆవిడ వేణు జోకేశాడు అనుకుంది]..
నీ సోది ఆపు, ఎప్పుడొస్తావో చెప్పూ..
నేను వేణూ కాదండి అని చెప్పి ఫొన్ పెట్టేశాను.
తరువాత ౩,౪ సార్లు పోన్ మోగినా ఎత్తలేదు. ౩:౩౦ మీటింగ్ ఉండటం తో ఫొన్ ఆపి వేశాను. మీటింగ్ ఐన తర్వాత మర్చిపోవటం వల్ల నేమి.. ఈ పిల్ల వల్లనేమి .. తిరిగి ౫ గంటల వరకు ఆన్ చేయలేదు..

౫:౧౦:౦౦
మళ్ళ ఫోన్ మోగింది..
హలో
హలో
వేణూ నే కద..
నేను వేణూ కాదండి.. ‘రాంగ్ నంబర్’
నేను గుర్తు బట్టాను..
[ఆవిడ గుర్తు పట్ట లేదు కానీయండి, ఆవిడని నేను గుర్తు బట్టాను, ఆవిడ ౨౧ వ శతాబ్దపు శకుంతల. దుష్యంతుడు యధాప్రకారం మళ్లా వస్తాను అని చెప్పి సర్దుకున్నాడు. అప్పటి శకుంతలలాగానే ఈవిడ కూడా దుష్యంతుడిని వెతుక్కుంటున్నది. నాకు ఈ స్పృహ రాగానే , ఆమె మీద కాస్త జాలి కలిగింది.]
౧౦ అంకెల నంబర్ కదా, ఎదో ఒక నంబర్ తప్పు నొక్కుతూ ఉండి ఉంటారు .. సరి చూసుకోండి..
సరిగ్గానే చేస్తున్నాను.
టాటా నో , బియస్సెన్నలో , వోడాఫోనో సరి చూసుకోండి..
[నిజానికి ఇది వ్యర్ధప్రేలాపన, కాని ఏమి మాట్లాడాలోతెలియక ఈ మాట అన్నాను]
సరి చూసుకున్నాను.
ఐతే ఈ సారి కలిసినప్పుడు.. సరైన నంబర్ తీసుకోండి.. ఈ నంబర్ మటుకు వేణుది కాదు..

మళ్లా ఓ అరగంటా దాక ఫొన్ మోగలేదు..హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంటే, ౫:౪౫ అప్పుడు మళ్లా మోగింది..
ఈ సారి శకుంతలని తిట్టలేదు, కాని దుష్యంతుడిని తిట్టుకొన్నాను, ఆంధ్రదేశంలో దాదాపు కోటీ అరవై లక్షల మంది ఉన్నారు సెల్ ఫోన్ వాడేవాళ్లు, వీడు అన్ని నంబర్లో నుంచి ఏరికోరి నా నంబరే ఇవ్వాలా? ఇంతమటుకు ఎప్పుడు లాటరీ తగలలేదు, చందన కుందన వాళ్ళు పెట్టే లక్కిడిప్పుల్లో ఎప్పుడు మనపేరు రాలేదు.. ఆ టీవీ ఈ టీవీ వాళ్లు పెట్టేవి కాదు కదా, ఓ ఇరవై మందికి కలిపి మా ఆఫీస్ లో పెట్టిన తంబొలా లో జాక్పాట్ కాదు కాదు సింగిల్ రో కూడా తగలలేదు.. కాని దుష్యంతుడికి మటుకు కోటీ అరవై లక్షల మందిలో నా నంబరే దొరికింది.

హలో
హలో
మీ పేరేంటి..
చెప్పాను .. ఊకదంపుడు అని చెప్పలేదు కానియండి (వేణూ జోకులేస్తున్నాడనుకుంటుందని).. ఇంచుమించు అలాటి పేరే చెప్పాను..
మీ
ఊరేంటి..
హైదరాబాదు..
ఉహు.. అది గాదు.. ప్రాపరు..
[నా ప్రాపరు హైదరాబాదు కాదని ఆవిడకి ఎవరు చెప్పారో..]
“నరసరావు పేట’..
ఓకే.. అని ఫొన్ పెట్టేసింది..

౬:౦౨:౦౦
హలో
హలో
మీరు నిజం గా వేణు కాదా..
కాదండి..
మీరు ఈ నంబర్ కొత్తగా తీసుకున్నారా..
లేదు చాలా ఏళ్ల నుంచి ఇదే నంబరు.
మీ అమ్మగారి పేరు..
[ఆవిడ గొంతు కాస్త దైన్యంగా వినిపించింది కానీయండి, నా గొంతు దుఃఖంతో పూడుకుపోయింది..కూడదీసుకొని అన్నాను..]
మీరెవరో నాకు తెలియదు.. ఇప్పటికి ఇన్ని సార్లు చేశానా మీపేరేమిటో కూడా అడగలేదు.. మీరు మా అమ్మగారి పేరు అడుగుతున్నారు.. రాంగ్ నంబర్ అని చెబుతున్నా వినిపించుకోకుండా.. మీరేమి మాట్లాడుతున్నారో మీకు అర్ధమౌతోందా?

ఫొన్ పెట్టేసింది

౬:౧౪
హలో
హలో
నిజం గా చెప్పండి మీరు వేణూ కాదా
కాదండి..
మీది ఏం జాబ్?
చెప్పాను

౬:౩౦ నిముషాల నుంచి ఇంకో మీటింగ్ ఉండటంతో, ఇది చాలా పెద్ద మీటింగ్ అవ్వటంతొ, ఫోన్ ‘ Switch Off’చేయకుండా ‘Silent Mode’ లో ఉంచాను..రెండు గంటల తర్వాత మీటింగ్ నుంచి బయటకు వచ్చేసరికి ౪౭ ‘missed calls’ఉన్నాయి. అవి చూడటం మొదలు పెడితే, అన్నీ ఈ శకుంతలను నుంచే. ( అనే అనుకున్నాను)

౯:౦౨:౦౦
హలో
హలో
మీ అమ్మగారి పేరు
[ఆవిడకి మా అమ్మగారి పేరుతో పని లేదు.. అది దుష్యంతుడి అమ్మగారి పేరో కాదో కావాలి అంతే..అసలు దుష్యంతుడి అమ్మగారి పేరు ఈవిడకి తెలుసో లేదో నాకు అనుమానమే, ఈవిడకి ఇప్పుడు వస్తున్న సందేహాలన్నీ, ముందే వచ్చి ఉంటే, విషయం ఇంత దూరం వచ్చేదే కాదు.దుష్యంతులకన్నా షైలాభానులు చాల మెరుగు, వాళ్లు మిమ్మల్ని ఒడ్డు దగ్గరే ఒదిలి పెడతారు, మీరు చక్కగా తిరిగి వచ్చి ఇంకో ప్రమాద హెచ్చరిక కోసం ఎదురుచూడవచ్చు. వీడు అట్టాగాదు. నేనే దిక్కు అంటాడు. ఇదే ముహూర్తం అంటాడు కలిసి ప్రయాణిద్దాం అంటాడు, తీరా ‘సంసార’సాగరం లో మునగ్గానే నట్టనడిమ తప్పుకుంటాడు, అప్పుడు ఇక కడుపు చించుకోవటానికి ఉండదు, తీయించుకోవటానికి ఉండదు]
మా అమ్మగారి పేరు మీకెందుకండి

ప్లీజ్ చెప్పండి
చెప్పాను..
[ఒక నిముషం నిశ్శబ్దం
ఒక్క క్షణం నమ్మిన, మళ్లా అపనమ్మకం, మాట్లాడేది దుష్యంతుడేనేమో అని..]
మీ ఇంటి పేరు..
చెప్పాను..
ఓకే అని ఫొన్ పెట్టేసింది..
దాదాపు పది నిముషాలతక్కువ పదికి ఇల్లు చేరుకున్నాను..

ఏంటండి ఇంత లేటు
కాస్త చికాకుగా ఉన్నాను.. కొంచం ప్రశాంతంగా వదిలేయ్.. త్వరగా భోజనం పెట్టు పడుకుంటాను .. అని చెప్పి స్నానానికి వెళ్ళాను..

భోజనం మధ్య లో – నాలుగు సార్లు పోన్ చేస్తే ఎత్తలేదేంటి అంది
మీటింగ్ అని అన్నాను, అప్పుడు అర్ధమైంది, ఇందాక ౪౭ ‘missed calls’ లో అవసరమైనవి కూడా కొన్ని ఉన్నాయని.

శని వారం పొద్దున కూడా శ్రీమతి ముభావంగానే కనిపించింది – ఎందుకో అర్ధంకాలేదు కాని – అర్ధమవ్వకపోతుందా అని నేనూ ‘కాం’ గానే ఉన్నాను..
ఆదివారం ఉదయాన్ని టివీ కార్యక్రమాలు హరిస్తే, భోజనం చేసి ఒక ‘కునుకు’ తీసేటప్పటికి సందెవేళ అయ్యింది..

బయటకు వెళ్లి వస్తాను అని చెప్పీ, అడుసుదిన్నె శ్రీకాంత్ రమ్మన్న చోటికి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి రాత్రిపొద్దుపోయింది..

ఒక రోజును ఇలా ఎలా వృధాచేశానా అని అలోచిస్తూ స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చోగానే,
” ఎదె తుంబి హాడువెను” చూస్తారా అన్నం పెట్టనా అంది..
ఎప్పూడూ కన్నడ ఛానల్ వైపు వెళితేనే మండిపడేఆవిడ, కోరి చూస్తారా అంటే, రాజీ ప్రయత్నమే అని అర్ధమైంది.
చూడనులే, భోజనం పెట్టు.

భోజనం మధ్యలో అంది ..
” మా నాన్న పెదకళ్ళేపల్లి వెళ్లి వచ్చారు”
ఊ అన్నాను.
కారణాలు అడక్కండి కాని, నేను సామాన్యంగా భోజనం చేశేటప్పుడు మాట్లాడను.

భోజనం ముగించి లేచి, తాంబూలం వేసుకుంటూ, టివీ లో పనికివచ్చే కార్యక్రమం ఎమైనా ఉందేమో అని వెతుకుతోంటే,వంట గది సర్దుకుంటూ శ్రీమతి అన్నది:
” మా నాన్న పెదకళ్ళేపల్లి వెళ్లి వచ్చారు”

అలానా, చుట్టాలు ఎవరైనా ఉన్నారా…

“ఉన్నారేమో అని భయపడి వెళ్లేరు, లేరని తెలిసి ఊపిరిపీలుచుకున్నాం”.
“ఊపిరిపీలుచుకున్నాం” అని వత్తి పలకటం వల్ల, ఎదో జరిగిందని అర్ధమైంది.
ఏమి అర్ధంకానట్టు “ఏమైంది” అన్నాను..
“మొన్న శుక్రవారం, మీరు బాత్రూం లో ఉన్నపుడు మీ ఫోన్ మోగింది, నేను హలో అనగానే, అటు పక్కావిడ ఫోన్ పెట్టేసింది. చూస్తే, అదే నంబర్ నుంచి మీకు బోల్డు కాల్స్ వచ్చాయి, ఎవరైయుంటారా అని అలోచిస్తుండగానే, మా అమ్మ పోన్ చేసింది, ఈ సంగతి చెప్పాను, ఆవిడ ఉండబట్టలేక మా నాన్నకి చెప్పింది, ఆయన కంగారు పడి, ఆ నంబర్ పట్టుకొని, పండగ రష్షని కూడా చూడాకుండా సిటీబస్సులో విజయవాడ వెళ్ళి, అక్కడ నుంచి ఆ ఊరు వెళ్ళి, ఇందాకే తిరిగివచ్చారు.”మధ్యలో నేనాపుతాననుకుందేమో ఊపిరికూడాపీల్చుకోకుండాచెప్పేసింది.

“ఏమన్నా తెలిసిందా” అన్నాను, ఇంకేమనాలో తెలియకానూ, అమ్మాయి గురించే నేను అనుకున్నవి ఎంతమటుకు నిజమో తెలుకోవలనిన్నూ.

“”ఆ తెలిసింది, ఆ ఊళ్లో మీ చుట్టాలెవరూలేరని”

“ఆ సంగతి నాకెప్పూడో తెలుసు”

“”పోనీలేండి, మంచి విషయాలు కొంచెం ఆలస్యంగా తెలిసినా నష్టం లేదు.”

నాది పైచేయి అయిందని కదా అని, ఇంకా సంబాషణ పొడిగిద్దామనుకుంటుంటే ఫోన్ మోగింది.

నా గుండె గుభిల్లు మంది.
సెల్ ఫోన్ మీద బ్లింకౌతున్న “శకుంతల” అన్న అక్షరాలని చూసి.

10 responses to “అఙాన శాకుంతలం

 1. ఇంతకీ ఎవరా శకుంతల…?????????? ఐనా ఇలాంటి సంధర్భాలు వస్తే మగాళ్ళు గంతులేసుకుంటు వాళ్లతో స్నేహం పెంచుకోవాలని చూస్తారని విన్నాను. మీరేంటీ ఇలా భయపడుతున్నారు. నమ్మాలంటారా?? నిజమే చెప్తున్నారని.

 2. చివరికి ఆ అజ్ఞాత “కాలరి” ఎవరో తెలుస్తుందని గబగబా చదివాను..ఇంతకీ ఆవిడ ఎవరో తేలిందా పాపం?

 3. మీ అనుభవం నాకు దీన్ని గుర్తు తెచ్చింది.

 4. “”ఆ తెలిసింది, ఆ ఊళ్లో మీ చుట్టాలెవరూలేరని”
  “ఆ సంగతి నాకెప్పూడో తెలుసు”
  “”పోనీలేండి, మంచి విషయాలు కొంచెం ఆలస్యంగా తెలిసినా నష్టం లేదు.”
  ఇక్కడనుండి తరువాత ఏంజరిగిందో నాకు అర్థంకాలేదు.
  కానీ మీ ఫోను అనుభవం మాత్రం అచ్చం సినిమాలలో జరిగినట్టుంది. మీ వియ్యాలవారికి అనుమానం రావడం మరీను. నాకైతే నవ్వాగలేదు.

  మాలాంటి బ్రహ్మచారులైతే, అలాంటి అనామిక కాలరిలకు, ఇవ్వాల్సినంత ‘ప్రాముఖ్యత’ ఇచ్చేవారం.
  కానీ షుగరున్నావాడికి సేమ్యా అన్నట్టు ఆ కాల్ మీకే వచ్చింది. ఈ సారి నా నెంబరు ఇవ్వండి. వేణు ఇతడేనని. 😀

 5. మీకు కలిగిన అనుభవం చాలా గమ్మత్తుగ అనిపించింది 🙂

  పద్మ గారు ఇచ్చిన లింకైతే, హిలేరియస్, నవ్వాపుకోవడం కష్టమైపోయింది, పంచుకొన్నందుకు ధన్యవాదాలు 🙂

  నమస్కారాలతొ,
  సూర్యుడు

 6. పద్మ గారూ, ఒక్కడు సినిమాలో అచ్చు అదే జోకు ఉంది. ఏది ముందో మరి!?

 7. చదువరి గారు,
  ఆ జోకు ధర్మవరపు గారిదే. ఒక్కడు చిత్రం లో – దాని కంత ప్రాముఖ్యం లేదు గాని, సెల్ఫోన్లు రాకముందు , జనాలు పి.పి పోన్ల మీద ఆధారపడ్డ రోజులలో , ఈ జోకు పెద్ద హిట్టు. నేనుఆనందోబ్రహ్మ లో మొదట చూశాను.

  రాకేశ్వరగారు,
  .. ఆ తరువాత నేజెప్పుకున్న గోడు బ్రహ్మచారికి అర్ధం కాకపోవటం సముచితమే.

  గిరిగారు,జ్యోతిగారు,
  ఆ శకుంతల గురించి తెలుసుకోవాలంటే మీరు పెద్దకళ్ళేపల్లి వెళ్లి రావు గారి అల్లుడిని అల్లరిపెట్టిన అమ్మాయెవరు అని అడగాలి. (అప్పుడు నమ్మచ్చో లేదో మీకే అర్ధమౌతుంది.)

 8. అంటే ఆ కుంతల సరదాగా అల్లరి పెట్టిందా?శకుంతల కానందుకు ఆనందం గా వుంది.

 9. రాధిక గారు, కొన్ని వందల మైళ్ళ దూరంలో నేను, కొన్ని వేల మైళ్ళ దూరంలో మీరు కూర్చొని ఈ అరాళ కుంతల శకుంతల కాదు కాదు కాదు కాదు అని గట్టిగా మూడుసార్లు అనుకొని హృదయభాను ను తొక్కిపెట్టటం మినహా చేసేదేమీలేదు.

  ఇవాళ తిరిగి ఫొన్ చేసింది, స్వభావానికి విరుద్ధంగా సంభాషణ పొడిగించటానికి ప్రయత్నించాను.. అవకాశం ఇచ్చాను కదా అని – మళ్ళి పై ప్రశ్నలన్నీ ఒకే సారి అడిగేసింది, మధ్య లో గాడ్ ప్రామిస్ లు బాబా ప్రమాణాలు. “మీకు అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంటీ” అంటే – ” మా వేణు అంతే, ఏడిపించటానికి చేస్తాడు”..అంది..” మా చుట్టాలబ్బాయి అంటుంది, ” ఎంట్రన్స్ పరీక్ష గురించి వివరాలు అడగాలంటుంది. పరీక్ష గురించి మీ మేష్టారు బాగా చెప్పగలరు అంటే “ఆహా నాకు తెలియదులే” అంది.. నిజంగా చుట్టాలబ్బాయే ఐతె కరక్టు నంబర్ కనుక్కోవటం కష్టమూ కాదు, నిజంగా పరీక్షకోసమే ఐతే, వేణు కాకపొతే సహాయం చేసే రాకేశ్వర బోటి వాళ్లు చాలా మందే ఉంటారు.. జీవితంలో ప్రాధ్యాన్యతలు సరిగా తెలియని .. లేట్ టీన్స్ లో ఇట్టాంటి వాళ్లు ఎందరో…

 10. Except the village name Pedakallepalli, nothing is there. i like Pedakallepalli as i hailed from the same village

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s