నేనూ – నా టీవియస్-౫౦

చాలా ఏళ్ల క్రితం ఓ ఆదివారం ఉదయం మూసీనది ని పూడ్చి కట్టిన ఓ కాలనీ లోంచి నడిచివస్తుంటే, ముందు ఓ యువకుడు తన పల్సర్ బండిని దిల్‍సుఖ్‍నగర్ వేళ్లే ఎత్తురోడ్డుమీద అతి కష్టం మీద తోసుకుంటూ వెళ్తున్నాడు.

దీనిని బట్టి నీకేమర్ధమైంది అడిగాడు పక్కనున్న మిత్రుడు..

“పేకాటాడేటప్పుడు, పాడు పుస్తకాలు చదవకూడదని” అని చెప్పాను, రాత్రి మొదలెట్టి పదినిముషాల క్రితం కామా పెట్టిన పేకాటలో నా వరస ఫుల్‍కౌంట్ల గురించే అడుగుతున్నాడనుకొని.

అది కాదురా నేను అడిగేది .. ఆ బండి తోసుకొని వెల్తున్నవాడి గురించి అన్నాడు..

దాని గురించి అనేదేముంది .. ఒక పది నిముషాలక్రితం వరకు .. ఆ బండి వల్ల సుఖపడే ఉంటాడు..ఇంకో పది నిముషాలలో పంచర్ వేయించి మాళ్ళా హాయిగా నడుపుకూంటాడు.. మధ్యలో ఈ కాసేపేగా కష్టపడుతున్నాడు, పడనీ..అన్నాను

అదిగాదురా..
కష్టసుఖాలు పక్కపక్కనే ఉంటాయి అని పెద్దలు ఎప్పూడొ చెప్పారురా..

సుఖం పక్కన లేదు బాబు .. ఓ పది అడుగుల వెనక ఉంది చూడు..

అప్పుడు చూశాను ఆ బండి కి కాస్త వెనక మెల్ల మెల్లగా హొయలొలికించుకుంటూ నడుస్తున్న ఓ సుందరిని.

అంటే ఏమిటి, ఆ పిల్ల అతని తాలూకా అంటావా..
అవును..
ఎలా చెప్పగలవ్ .. అని అడిగానో లేదో .. ఆ బండి తోస్తున్నవాడు వెనక్కి తిరిగి ఈ అమ్మాయిని ఏదో అడిగాడు..

నా మిత్రుడు చూశావా అన్నట్టు నా వంక చూసి .. రెట్టించాడు -ఇప్పుడేమంటావ్ అని..

అంటానికి ఏముంది అన్నాను..
ఓ పది నిముషాల క్రితం వరకు .. వాడి వెనకాల సుఖం గా ప్రయాణం చేసిందిగా, మరి కష్టం ఇప్పుడు వాడొక్కడే పడుతున్నాడే? అన్నాడు


పొగలు కక్కుకుంటూ
పల్సర్‍పై నే పోతుంటే
పొట్టక్కర్చుకొని నీవు

చెమటలు కక్కుకుంటూ
చెడినది నే తోస్తుంటే
చేతులుకట్టుకొని నీవే”

అన్నాను, రాత్రి చదివిన పుస్తకం ప్రభావం తో

నీ పేరడిలతో నువ్వు నిన్నూ, పనిలో పని మమ్మల్నీ హింసించటం మానవు కాని .. నే చెప్పదలుచుకున్నది అది కాదు అన్నాడు..
మరి ఏమిటి అన్నాను – మొహం ప్రశ్నార్ధకం గా పెట్టి

బండి కొనుక్కుంటే, నీ రెండు చేతులతో నీవు నెట్టుకోగలిగింది కొనుక్కో, అంతే కానీ ఓ రెండు టన్నులబండి కొనుక్కొని ఎవడొచ్చి నెడతాడా అని మాటిమాటికి వెనక్కి తిరిగిచూసుకోవాల్సి వచ్చేది కాదు .. “Matter Of Fact” లాగా చెప్పాడు.

వాడిది అధివాస్తవికత, నాది అలౌకికత, మా ఇద్దరిని ఈ రెంటితో సంబంధంలేని ఇంకో ముగ్గిరితో కలిపి ఒకే ఇంట్లోనే అద్దెకి ఉంచేది, ఆర్ధిక అశక్తత.

వాడి మాట విని, కొన్నాళ్ళకి, చాలా తర్జనభర్జన తరువాత, ఓ TVS50 కొన్నాను, అప్పు నెలసరి వాయిదాలలో తీర్చే పద్దతి మీద.ఆ బండి మాకు కావాల్సిన సేవలన్ని చేసిపెడుతూ, అందరి మన్ననలూ పొందుతున్న వేళ, రూం లో ముగ్గురు మెయిన్‍ఫ్రేంకో శిక్షణకై అప్పటి మద్రాసు వెళ్ళారు.సలహా ఇచ్చిన మిత్రుడు కూడ ఉద్యోగం మారి, భాగ్యనగరం ఇంకో కొన వైపు మారాడు, నేను, పెట్రోలు, ఇంటద్దె కలిసిసొస్తుందని ఓ చిన్న రూం‍లోకి మారాను.

ఆనందంగా బండి నడుపుకుంటూ, పంచరు పడ్డపుడు, వెన్నక్కి తిరిగి చూసుకోకుండా నెట్టుకూంటున్నందుకు, నన్ను నేను అభినందించుకుంటూ, ఆ సలహా ఇచ్చిన మిత్రుడిని మనసులోనే మెచ్చుకుంటూ, గడిపేస్తున్నరోజులలో

ఓఉదయం పదకొండిటప్పుడు, ప్యూన్ వచ్చి మేనేజర్ గారు రమ్మంటున్నారండి అన్నాడు,
నలుగు కోటిలింగేశ్వరరావు ఆంధ్రదీప్తి లో రాసిన దినఫలాలలో ‘పై అధికారుల మందలింపు’ అని చదివినట్టు గుర్తొచ్చి, అయినా తప్పదుకదా అని అయన గదిలోకి వెళ్ళాను.

వెళ్ళేసరికి, ఒక సహొద్యోగిని , వస్త్రాపహరణం అయ్యీఅయిపోంగానే ద్రౌపదికి మల్లే, పైట నిండా కప్పుకొని వెక్కి వెక్కి వేడుస్తోంది, ఛీ, ఏడుస్తోంది.
బాసు, ప్రతినబూనటానికి సిద్ధంగా ఉన్న భీముడి లా ఎగసి ఎగసి రొప్పుతున్నాడు..

నా పాత్ర ఐపోయింది అన్నట్టు దుశ్శాసనుడిలా ఓ మూల నుంచున్నాడు, తోటి ఉద్యోగి, నా తరువాత చేరిన మానేజరు దూరపు చుట్టం.

బాసురుడు (పరుశురాం అని పేరు పెట్టాల్సింది, గణాలుకుదరకపోవటం వల్లో ఎమో, మా బాస్ కి పట్టాభిరాం అని పెట్టాడు వాళ్ల నాన్న) “ఏమిటీ పని”,అన్నాడు..

ఏమి అర్ధం గాక , ఏ పని సార్ అన్నాను, మళ్ల ఎప్పటి లా ఒకళ్ళకి పంపాల్సిన కొటేషన్ ఇంకొకళ్లకో, ఒక కష్టమర్కి పంప్వాల్సిన స్టాకు వేరొకరికో పంపిఉంటాను అనుకొని..

“నీ బండి మీద మేడం పేరు రాశావుటా” అన్నాడు…

నాకు రాళ్ల మీదా, ఇసక మీదా, చెట్ల మీద పుట్ల మీద పనికిరాని రాతలు రాసే వాళ్ళంటే చెడ్డచిరాకు ( అప్పుడు బ్లాగులు లేకపోవటం వల్ల జనాలు అలాచేశేవారనుకోండి, అది వేరే విషయం)

ముక్కుసూటి గా చెప్పటానికి నేను రానారేని కాదు కాబట్టి, నేనేమీ రాయలేదు సార్ అని నసిగాను.

“బండి చూస్తే తెలిసిపోతుంది సార్” అని గొణిగి టక్కున నొరుమూశేశాడు దుశ్శాసనుడు.

అందరం కిందకివెళ్ళాం బండి చూడటానికి,

నేను ఒక్కడిని ఉండటం మొదలు పెట్టిన తరువాత, వెనక ఎవడూ ఎక్కని కారణంగా, వెనకసీట్ మీద ఇంచుమించు అట్ట కట్టి నట్టు గా ఉన్న భాగ్యనగరపు రోడ్ల మట్టిలో ముత్యాల్లాగా రెండు తెలుగక్షరాలు, పక్కపక్క నిలబడతే, ఓ తెలుగుఅమ్మాయికి పేరౌతాయని కూడతెలియని అమాయకపు అక్షరాలు కనిపించాయి.ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఆవిడకి సంబంధించి ఆ టివియస్-౫౦ మీద పట్టే వస్తువేమైనా ఉండి అంటే అది ఆవిడ పేరే, వేరేవి ఏవి, ఒక్క వెనకసీటు కాదుకదా, డ్రైవరుసీటు తో పాటు కలిపిఇచ్చినా ఆ బండి మీద పట్టవు, ఆవిడ తెచ్చుకొనే, హాండ్బ్యాగు,లంచ్బాక్సు తో సహా.

ఇప్పుడేమంటావ్ అన్నాడు పరుశురాం.

విసవిసా పైకెళ్తున్న ద్రౌపదిని, ముసిముసి గా నవ్వుతున్న దుశ్శాసనుడిని, రుసరుసా చూస్తున్నా పరశురాముడి చూసి, లంచ్-అవర్ లో మీతో మాట్లాడతాను అన్నాను.

కాదు ఇప్పుడె ఆ అమ్మాయికి సారీ చెప్పు అంటే, లంచ్-అవర్ లోచెబుతాను అని బయట టీ బడ్డీ వైపు నడిచాను.

నా బండి మీద రాయటానికి ఇంకా ఎవరిపేరూ దొరకలేదా అని దుశ్శాసనుడిని, అ పేరు ఉన్నవాళ్లు, టివియస్-౫౦ వెనక సీట్ మీద పట్టేవాళ్లు వేరెవరూ గుర్తుకురానందుకు నన్నూ, ఈ బండి అమ్మినవాడిని, అప్పుఇచ్చినవాడిని, కొనమని సలహా ఇచ్చినవాడిని కాసేపు తిట్టుకొని, లంచ్-అవర్ లో ఓ కాయితం పట్టుకొని బాసురిడి రూంలోకి వెళ్ళాను.

ఓ! అపాలజీ రాసి తీసుకొచ్చావా అని ఒక నవ్వు నవ్వితే, కాదు రాజీనామా అని చెప్పి సమర్పించి బయటకు వచ్చాను..

నేరుగా ఓ మెకానిక్ దగ్గరకి వెళ్ళి, ఆ బండి జీవితం లో మొదటి సారిగా దాన్ని శుభ్రంగా కడిగించి రూం‍కి వెళ్ళాను.

ఓ రెండు మూడు గంటలు తీవ్రంగా అలోచించి, లేచి, కొత్త బండి లా కనిపిస్తున్న నా బండిని చూసి నేనే ఆశ్చర్యపోయి, దగ్గరలో గుడికి తీసుకువెళ్ళి పూజ చేయించి (కొన్నపుడు కూడా చేయించలేదు) అటు నుంచి చందానగర్ వెళ్ళాను, బండి కొనమని సలహా ఇచ్చిన మిత్రుడి దగ్గరికి.
అక్కడ మిత్రుడికి, జరిగిందంతా చెప్పి, బాధపడుతూ, ద్రౌపదిని, దుశ్శాసనుడుని, పరుశురాముడ్నీ నేనూ తిడుతూ, వద్దాన్నా ఆ ఉద్యోగం ఇన్నినాళ్లు వెలెగపెట్టినందుకూ వాడు నన్ను తిడుతూ .. ఓ రెండు గంటలు గడిపి.. ఈ బాధ అతిత్వరగా మర్చిపోవాలని తీర్మానించాం.

బాధ త్వరాగా మర్చిపోవటానికి కావలిసిన సరంజామా కొనుక్కోవటానికి, ఐపోయిన వాడి సిగెరెట్లె దిండు ( వాడు కవి అని వాడికొక గుడ్డి నమ్మకం ఉండటంచేతా, గ్రూప్స్‍కి ప్రీపేరవటమ్ అనే వంక చేత, వాడు సిగిరెట్లు పేకెట్లా లా కాకుండా, దిళ్ళాగా కొనే వాడు), డబ్బులు మిగిలితే ఓ ఫుల్మీల్స్ పార్శిల్ తెచ్చుకుందామనీ బయటికి వస్తే-

బయటపెట్టిన నా టివియస్-౫౦ కనిపించలేదు.

ఆటే అలోచించకుండా, ఇది కూడా మంచిదే, ఇప్పుడు ఆ ఉద్యోగం సంగతి ఇంకా తొందరగా మర్చిపోయి, మిగతా వాళ్ళలాగా మెయిన్‍ఫ్రేంకో నాలా గ్రూప్స్‍కో ప్రిపేరవ్వచ్చు అన్నాడు – నా మిత్రుడి లోని అధివాస్తవికుడు.

5 responses to “నేనూ – నా టీవియస్-౫౦

 1. బాగుందండీ మీ టీవీయెస్ కథాకమామిషు, మీ పేరడీ, మీ చమత్కారం. అన్నట్టు (నాకు తెలియకడుగుతాను), అధివాస్తవికత అంటే యేమిటండి?

 2. అధివాస్తవికత: టేబులు మీద నుండి కారిపోయే గడియారం!? 🙂

 3. ‘నిప్పులు చిమ్ముకుంటూ’ ఎగసిన టపా ‘నెత్తురు కక్కుకుంటూ నేలకు’ రాలినట్లనిపించింది. అంటే చెత్త ముగింపు అని అర్థం కాదు. ప్రారంభం అదిరింది. దాంతో పోల్చినపుడు ముగింపు కాస్త మందగించినట్లు అనిపించిది. 8.5/10.

 4. రానారె గారు,
  అవునండీ. మీరు చెప్పింది నిజం. ఇదే తప్పు అఙాన శాకుంతలంలో కూడా చేశాను.

  చదువరి గారు,
  మీ శ్లేష ఈ అర్భకుడికి అర్ధం కాలేదు.

 5. నేనేదో తెలిసీ తెలియకుండా రాసానులెండి.. అధివాస్తవికత అనగానే సాల్వడార్ డాలి, డాలి అనగానే ఆయనేసిన గడియారపు బొమ్మలు గుర్తొస్తాయి.. అదే రాసేసాను. అంతకు మించి అందులో శ్లేషా లేదు, అంతకు మించి అధివాస్తవికత గురించి నాకు తెలీనూ తెలీదు 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s