పేర్లూ పిలుపులూ…

క్రియేటివిటి పుంతలు తొక్కి జనులు వాళ్ల పిల్లలకి పెడుతున్న కొత్తపేర్లని గూర్చి మాట్లాడను గానీయండి..మనకు చాలా పరిచయమైన పేర్లు, వాటిని మనం ఓ పిలుపుతో మార్చివేశే విధానం చెబుతాను..

అత్యంత వక్రతకు గురి అయ్యేపేరుగా మధుసూదన (రావు/రెడ్డి/శర్మ మొ||) చెప్పుకోవాలి..
మధుసూదనుడు అంటే మధు అనే రాక్షసుడిని చంపినవాడు. అనగా ఎవడు.. ఎవడైతే మనకేమిటిలెండి.. మనమేంచేస్తాం.. మధూ అని కాస్త బద్దకంగా కాస్త ముద్దుగా పిలుస్తాం.. అంటే దేవుడిని రాక్షసుడిని చేశేశాం గా ఒక పిలుపులో..
అసలు దేవుడి పేరు పెట్టుకొనేదే, పిలిచినప్పుడన్నా దైవనామస్మరణ చేసుకోవచ్చు లే అని..పూర్వకాలం లో .. జనులు దేవుల పేర్లు లేదా గౌరవ సూచకం గా తల్లి తండ్రుల పేర్లు పేట్టుకునేవాళ్లు..కొంత కాలానికి .. అగౌరవసూచకంగా పెట్టుకోవటం మొదలు పెట్టారు. ఇంకొంత కాలానికి, అసలు పిల్లాడు ఎప్పుడు పుడతాడా, ఎప్పుడు నాన్నపేరు పెట్టి, వాడి వంకతో నాన్నని తిడదామా అన్నట్టు తయారయ్యారు..
ఇంకొంత కాలాని ఆంధ్రనాట కొడుకులు కోడళ్లు ఈ డొంకతిరిగుడేమిటని అమ్మానాన్నలనీ, అత్తామామాలని నేరుగానే తిట్టటం మొదలు పెట్టారు.. అప్పటినుంచి, తెలుగు నేల మీద భాషావ్యాకరణ శృంఖలాలను తెంచుకొని “సురేష్” “సతీష్” “ప్రకాష్” లు పుట్టటం మొదలు పెట్టారు.

సరే, ఈ మధుసూదనాఖ్యుల తరువాత, పిలుపుల బాధితులుగా చెప్పుకోవాల్సింది పార్ధ సారధుల గురించి, పార్ధ సారధి అంటే, పార్ధుడి ( రధము)ని నడిపినవాడు, కృష్ణుడు.. మనమేంచేస్తాం, బావమరిది తో పోయే దానికి, ఆ బావగారెందుకని “పార్ధా” అంటాం.. ప్రపంచాన్కి దారిచూపించేవాడిని పట్టుకొని, సోదరులు,బంధువులు కనపడగానే బిక్కమొహం వేసేవాడిని చేశేశాం గదా ఒక పిలుపులో.
ఇక మధుసూదనులు, పార్ధసారధుల తరువాతి బాధితులు చంద్రశేఖరులు, చంద్రశేఖరుడంటే శివుడుట, మనకేమో చంద్రా అంటానికి కుడా నోరురాదాయే, చందూ అని అంటాం.. అంటే చంద్రుడు అని అనుకోమని.. నిర్వికారుడిని పట్టుకొని ఓ పక్షం ఉబ్బిపోయేవాడ్ని , ఓ పక్షం చిక్కిపోయేవాడ్ని చేశేశాం గదా ఒక పిలుపులో.

మళ్లీ శివుడి విషయం లొనే, గౌరీనాధులను, ఉమాకంతులని “గౌరీ”, “ఉమా”అని పిలుస్తాం.. అర్ధనారీశ్వరుడి లో మనకు కావాల్సిన అర్ధాన్ని తీసుకొని…

ఇక్కడ ఆలుమొగల భేదాన్ని మర్చిపోతే – తండ్రీ కొడుకుల వ్యత్యాసాన్ని మర్చిపోయేది, అందరు “కుమార్”ల విషయం లోను.. “కుమార్”, కేవలం అలంకారప్రాయెమే అని .. రవి కుమార్‍ లని రవి అని, శశి కుమార్‍ లని శశి అని, కిరణ్ కుమార్‍ లని కిరణ్ అని పిలుస్తాం.

మన బద్దకానికి పరాకాష్ట బాలసుబ్రహ్మణ్యాలని శ్రీనివాసులని ఇరుకున పెట్టటం, వాళ్ల ఇష్టాయిష్టాలతో పని లేకుండా ‘బాలూ’అంటాం, సీనూ అంటాం, లేదా వాసూ అంటాం .. అంటే ఏమిటీ అని అడక్కండేం.
ఇప్పటి వరకు ‘చిన్నబుచ్చిన’ పిలుపులనే చూశాం కదా.. అలానే పెద్దరికం ఆపాదించే పిలుపులు కూడా కొన్నున్నాయి . రవి కిరణ్, శశి కిరణ్ లని రవి శశి అని పిలవటం ఒకటి. అలాగే భగవాన్ దాసులని రామదాసులని , భగవాన్, రామూ, అనిపిలవడం ఇంకోటి.

ఇలా చెప్పుకూంటూంటే ఇది ఎడతెగదు.
నేను బ్లాగులో పెట్టుకున్నట్టు అభావప్పేర్లు పెట్టుకుంటె పర్లేదు కాని, లేదంటే మనం కచ్చితం గా శివుణ్ణి పాము లాగా చూస్తున్నామనే (ఫణి భూషణ్ )నా అభిప్రాయం..

ఇది వ్యక్తిగతము కాదూ సాంఘికమనిన్నూ, ఎవరినీ నొప్పించటానికో, కించ పరచటానికో రాసింది కాదని సవినయంగా మనవి చేసుకుంటూ, ఇలా ఓ పిలుపుతో మీరెంతమందిని ఎన్నెన్ని రకాలుగా మార్చేస్తున్నారో గమనించమని అభ్యరిస్తూ..

శెలవు తీసుకుంటున్నాను.

9 responses to “పేర్లూ పిలుపులూ…

 1. నా స్నేహితుడి పేరు మధుబాబు. అందరూ మధూ అని పిలుస్తారు. అంటే ఒక రాక్షసుడే అంటారా?

 2. చాలా బాగా వ్రాశారు. నేనెప్పుడు ఈ పేర్లు గురించి అంత పెద్దగా ఆలోచించలేదు. మాకూ ఉన్నారు, “మధు”లు “కిరణ్”లు, “పార్థుడు”లు, ఇంకా “రామదాసు”లు.

  నమస్కారాలతో,
  సూర్యుడు 🙂

 3. పేర్లని కుదించడం ఒక రకం.. వాటిని పొడిగించడమనే ఒక కళ ఉంది చూసారూ.. బాలయ్య బాబు, వెంకటేష్ బాబు,.. వగైరాలు – ఇదో రకం!:)

 4. బాగా సెలవిచ్చారు. కాకపోతే అన్ని ఎగ్గొట్టటాలు, దిగ్గొట్టటాలు పిలిచేవారి సౌలభ్యం కోసం మాత్రమే కాదనుకుంటా.

  ఉదా: శ్రీనివాసుని కత్తిరించి .. శ్రీనుని చేసి …. ఇంకా తృప్తి తీరక శీనుని చేసి ఆపై సీనుని చేయటములో వివిధ ప్రాంతాల భాష, మాండలీకాల ప్రభావం ఉంది అని నా అభిప్రాయం.

  ఎటొచ్చి అందరూ బద్దకస్తులయిపోయి, సరయిన పేరు తెలిసినా సంకరానికలవాటు పడిపోయారు(ము).

 5. ఒమోషిరోయి నే..! (జపనీసు)
  (ఒమోషిరోయి= ఆసక్తి కరమైన
  నే= కదా)
  ఆసక్తికరంగా ఉంది కదా..! (తెలుగు)
  Quiet Interesting…! (English)

 6. అయినా మధు అంటే రాక్షసుడు అని ఎందుకు అనుకోవాలి? తేనె అనుకోవచ్చుగా???

 7. చాలా బాగావ్రాసారు. మా అబ్బాయి పేరు శ్రీరాం అయితే ఎప్పుడూ శ్రీ అని పిలుస్తుంటాను ఇంక పూర్తి పేరు తో పిలుస్తాను

 8. బాలూ గారు,
  ధన్యోస్మి. తెనాలికి “రాముడు” కి అవినాభావ సంబంధం, అందువల్ల మీరు పూర్తి పేరుతోనే పిలవాలి అని నా విన్నపం.
  RSG గారు,
  అలా అనుకోవటమే ‘ఉచితం’.

  చదువరి గారు,
  సినిమా రొంపిలోకి నిదానంగా ఎప్పుడన్నా దిగుతాను.

  రాము గారు, సూర్యుడు గారు, రాజ మల్లేశ్వర్ కొల్లి గారు,
  స్వాగతము.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s