కోకాంజలి వారి పీకితే పట్టుచీర

మొన్న శనివారం పన్నెండింటికి, బయటకు వెళ్లబోతుంటే భార్యామణి ఆపింది, సెలవరోజన్నా కాశేపు ఇంట్లో ఉండవచ్చు గదా అని…

ఈ వింతపోకడ కి కాస్త ‘హా’చర్యపడి, మెల్లగా తేరుకొని, కాదు బయటకు వెళ్లాలి బాంక్ పని ఉంది అన్నాను.
తర్వాత ఆన్ లైన్ బాంకింగ్ చేసుకుందురులే ఉందురూ అంది..
కాదు వెళ్లాలి..
ఉంటే మీకు పాయసం పెడతాను..
వద్దులే పెళ్లైనకొత్తల్లో మొదటి పండగ అని పిలిచి మీ అమ్మచేసిపెట్టిన పాయసం రుచే ఇంకా మరిచి పోలేదు,మళ్లా ఇప్పుడు నువ్వు పాయసం చేస్తే …
అదే మరి .. పాయసం పెడతానన్నాను కాని , నేను వండి పెడతానన్నానా?,
హమ్మయ్య పాయసం వండటం రాదని ఒప్పుకున్నావ్, సంతోషం.
అంటరానితనం నేరం గాని, వంటరానితనం నేరం గాదు.
(అంటరానితనం అంటే సాంఘికమా, సాంసారికమా అని అనుమానం వచ్చింది కానీ, ఎక్కడినుంచో “నేలతో నింగి అన్నదీ” అన్నపాట వినబడటంతో అర్ధమైపోయింది)
ఇంతకీ పాయసం పక్కింటావిడ సౌజన్యమా?
పక్కింటావిడ ఇవ్వటానికి ఇదేమీ ఐతవోలు అగ్రహారం కాదు, ఆవిడ మీ పిన్నికూతురూ కాదు
మరి, ఇప్పుడు పాయసమెక్కడిది, మెక్కడానికి?
నిన్న ఆర్డర్ చేసాను వసతిగృహా స్వీట్ షాపులో, రెండు లీటర్ల పాలతో పాయసం చేయమని, ఇంకాసేపట్లో వచ్చేస్తుంది, వేడి వేడి గా…
రెండు లీటర్లు అని వినంగానే, నా ప్రయత్నం లేకుండానే, దభ్ మని కుర్చీ కూలబడ్డాను,
రెండు లీటర్లా…
ఊఁ అవును..
రెండు లీటర్లా…
అవును, ఎందుకంత ఇదైపోతారు..
ఇంట్లో ఉన్న రెండు శాల్తీలకి .. రెండు లీటర్లా?
మధ్యాన్నం మా తమ్ముడొస్తున్నాడు…
ఓహో.. అదా, ముందు చెప్పావు గాదు…
ఐతే, మీ తమ్ముడు వచ్చాక,తిన్నాక మిగిలితే అప్పుడు తింటాలే,,,
అలాకాదండి…ఇప్పుడు వేడి వేడి గా ఓ చెంచానో కొంచమో రుచి చూడండి, మళ్ళా వాడు మొత్తం తినేసిన తరువాత వాడినంటారు..
ఈ లోపు ఫోన్ మోగింది…
ఫోనెత్తి హలో అని, రిసీవర్ మీద చెయ్యెట్టి, పాయసం వాడే, ఇంటి అడ్రస్ అడుగుతున్నాడు, వచ్చేస్తాడు, కూచోండంది.

బయటకు వెళ్లటానికి బాంక్ కాక వేరే వంక దొరకనందుకు నన్ను నేను తిట్టుకుంటూ కుర్చీ లో సెటిలయ్యాను.

వేడి వేడి పాయసంబు, అని పాడుతూ టీ.వీ లో ఎదో చానల్ పెట్టి, రిమోట్ టీవి మీద పెట్టి వంటింట్లోకి వెళ్లింది…

చేశేది లేక టివి వైపు మొహం తిప్పితే, “నిమ్మ”టీవి వస్తోంది..
ఇదేమి టీవీ అడిగాను ..

కొత్తగా వచ్చింది లెండి..
ఐటే మటుకు ఇదేమి పేరంట..
అనంతపురం నాయుడు గారు పెట్టారు లెండి, ఆయన నిమ్మతోటల మీద పైకి వచ్చాదు, పైగా వ్యాపారాలన్ని .. కర్నాటకలోనే .. అందుకని .. ఆ పేరు పెట్టారు.. ఐనా ఏ పేరైతే ఏంటి, మీరు కామ్॑గా చూడండి.. ప్రోగ్రాం మొదలౌతొంది అంతూ వచ్చి సోఫాలో కూర్చుంది.
ఇయస్పీయన్ లో..
అది రీపీట్ టెలికాష్ట్ చూడచ్చులే.. ఇది చూడండి..
తల టివి వైపు తిప్పగానే . శోకాంజలి సగర్వం గా సమర్పించు పీకితే పట్టుచీర కు స్వాగతం, వెల్కం వాంగో అని గట్టిగా అరుస్తూ మెలికలు తిరిగి పోతూ పుష్ప ప్రత్యక్షమైంది.

థీ చానల్ మార్చు – శనివారం పొద్దున్నే ఈ శోకాంజలి ఏంటి..
శోకాంజలి కాదండి .. మీకెప్పుడైనా ఓ మంచి మాట ఐనా వినపడితే కదా .. కోకాంజలి .. కోకాంజలి …
కోకాంజలా?
అవును.. కొత్త చీరెల షాపు,కోక అంటె చీరె అదిగూడా తెలియదా?
కోకల అంజలి – కోకాంజలి…
ఒహో ఏమి క్రియేటివిటీ అండి.. అదిరింది పో…..
ఐతే రాత్రి మేము గోపాల్కిచ్చిన వీడ్కోలు పార్టీనీ. షోడాంజలి అనచ్చన్నమాట
షోడాల అంజలి – షోడాంజలి
మీరుఅక్కడ కేవలం సొడానే తాగిన భ్రాంతి ఇప్పుడుఎవరికీ కలిగించక్కరలేదు.. టి.వి చూడండి.
ఇప్పుడు మీ తమ్ముడికి మననిచ్చేది పాయసాంజలి
అదేదో ఆంగ్లచిత్రంలో శునకరాజానికైనట్లు, మా ఆవిడ రెమోట్ నావైపు తిప్పి మ్యూటు బటనొత్తంగానే నా మాటలు వినపడటం మానేశాయి.

సరిగ్గా అప్పుడే పుష్పగొంతు ఉన్నట్టుండి పెద్దదైంది…
హాయ్, హల్లో, నమస్తే, నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, వెల్‍కం, వాంగో…
కోకాంజలి వారి పీకితే పట్టుచీర కార్యక్రమానికి మీ అందరికీ మరొక్కసారి స్వాగతం, నాకు తెలుసు మీరందరూ వైట్చేస్తుంటారని.. అందుకే తొందర తొందరగా వచ్చేశాను…ఇప్పటికే చాలా మాట్లాడేసినట్టున్నాను, ఇంక మొదలెట్టేద్దాం…
ఇవాళ మన మొదటి అదృష్టవంతురాలు అనగా మొదటి లకీ పార్టిసిపెంట్ , అనగా మొదటి కాలర్ అనగా ఎవరో చుద్దాం అనగా
అంటూ .. ఓ నంబర్ పెద్దగా పైకిచెబుతూ నొక్కసాగింది…

హలో
హలో..
ఎవరండీ మాట్లాడేదీ..
సుగుణావతిని
సుగుణావతి గారా
ఆయ్
నన్ను గుర్తు పట్టారా
ఆయ్..మిమ్మల్నీ…
గుర్తు పట్టారా…
ఆయ్.. బుజ్జీ గారి కోడలివా..
సుగుణావతి గారూ, అయ్యో గుర్తు పట్టలేదా, నేనండీ, నిమ్మ టివీ నుంచి పుష్ప ని…
ఆయ్ ఆయ్.. పుష్పా.. నీవనుకోలేదనుకో…


ఇంకో ఐదు నిముషాలు వాళ్లిద్దరు వదినా మరదళ్లు లా మాట్లాడేసుకుంటుంటే, మా అవిడ వాళ్లని తదేకంగా చూస్తూ మధ్య మధ్య లో పుస్తకం మీద ఎవీవో రాసుకుంటూ మురిసిపోతుంటే, హిందీనే మాట్లాడే మూడోఫ్రంట్‍నేతల మధ్య చంద్రబాబులా బిత్తరచూపులేసుకొని కూర్చొన్నాను.
ఆయ్ .. ఇహ పీకితే పట్టుచీర మొదలెడదామా
ఆయ్ .. ఎట్టేయండి….
మీకు రూల్స్ తెలుసా అండీ చెప్పమంటారా..
ఆయ్ .. తెలుసండీ..
సరే ఐతే..
ఈ చీరా కనిపిస్తుందా అండి, .. ఈ చక్కగా ముద్దుస్తున్న వంకాయరంగు చీర తిమ్మనా బ్రదర్స్ వాళ్లదండీ, మీకు తెలిసే ఉంటుందీ, ఐనా చెబుతాను ..తిమ్మనా బ్రదర్స్ అమలాపురం లో సైకిలు మీద వీధి విధి తిరిగి పాతచీరెలకు స్టీలు గిన్నె లమ్మేవాళ్లు.. అక్కడినుంచి అమ్చెలంచెలుగా ఎదిగి ..
కీచ్ కీచ్ కీచ్
బర్ బర్ బర్ ( పేపర్ మీద పెన్సిల్)

కీచ్ కీచ్ కీచ్
బర్ బర్ బర్ ( పేపర్ మీద పెన్సిల్)
కీచ్ కీచ్ కీచ్
బర్ బర్ బర్ ( పేపర్ మీద పెన్సిల్)…

అలాంటి తిమ్మనా బ్రదర్స్ వారి ఈ వంకాయ రంగు, పసుపు బోర్డర్, బోర్డర్లో జరీ ఉన్నా చీర మీ సొంత చేసుకోవచ్చు…
సుగుణ మణి గారు..
ఆయ్ ..
ఉన్నారా…
సుగణమని కాదు సుగుణావతండీ..
అదే ఆదే .. సుగుణావతి గారు.. అర్ధమైంది గా
ఆయ్
ఈ చీర మీ సొంతం చేసుకోవటానికి దీని రేటెంతొ చెప్పాలీ
ఆయ్
నేను మీకు ఒక నంబర్ ఇస్తున్నాను.. అందులోచి ఒక అంకె పీకేసి మీరు దీని కరక్ట్ రేట్ చెప్పాలి .. అలా కరక్టుగా పీకితే కనక ఈ పట్టుచీర మీదవుతుంది అదే ఈ కోకాంజలి వారి పీకితే పట్టుచీర …
ఆయ్…
రెడినా..
ఆయ్…
సుగునమణి గారు, అదే సుగుణావతి గారు..
ఆయ్..
నేను నంబర్ చెప్పేముందు చిట్కా చెప్పండి…
ఆయ్.. చిట్కానా..
ఆయ్.. మీరు మొదటి కాలర్ కాబట్టి చిట్కా చెప్పాల్సిందే …
చిట్కా అంటే అండీ .. మీకు చారు చేసేటప్పుడు..
ఆఆ చారు చేసే టప్పుడు.. నాకు చారంటే భలే ఇష్టం చెప్పండి..
చారు చేశే టప్పుడు.. టమాటాలు కోయటానికి బద్దకం గా ఉంటే, టమాటాకి ఒక చిల్లుబెట్టి ఆపర్ని చారులో ఏశేయచ్చండి…
ఓహో.. చారు చేశేటప్పుడు . టమాటాకోయకుండ చిల్లిబెట్టు ఆపర్ని వేశేయచ్చు భలే చిట్కా చెప్పారండి
ఆయ్
ఇక ఆడదామా
ఆయ్…
మీ నంబర్ .. ౪౨౬౭౫…
ఇంకోసారి చెబుతున్నానండి.. ౪౨౬౭౫..
ఏది పీకమంటారు…
ఏడండి…
ఏడూ.. సెవెన్..
సుగుణవతి గారు .. ఇదేనా మీ ఫైనలాన్సర్…
ఆయ్…
అయ్యో సుగునవతి గారు ౭ తప్పండి.. ఇటీజ్ సో క్లోజ్ బట్ తప్పండీ…
సరే మీరు మొదటికాలర్ కాబట్టి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను…ఏ నంబర్ పీకాలో ఈ సారి భాగా ఆలోచించి చెప్పండి.
౪…
సుగునావతి గారు ౪…
ఆయ్ ౪…
అయ్యో సుగునా వతి గారు .. మల్లా తప్పుజెప్పారు.. సరే మీరు మంచి చిట్కా చెప్పారు కాబట్టి ఇంకో చాన్స్ ఇస్తున్నా చెప్పండి…
ఆయ్ .. చాలా తాంక్సండీ…
చెప్పండి ఏమీ పీకమంటారు…
౨…
సుగునావతి గారు .. కంగ్రాట్యులేషన్స్, కరక్ట్ గా చెప్పారు.. ఈ చీరె మీదే…
ఆయ్.. ఎప్పుడిస్తారండీ…
ఆయ్, ఆ విషయం చెప్పేముందు సుగుణవతి గారు ఒక్క విషయం ..మీరు ముందు ౭ అన్నారు, తరువాత నాలుగన్నారు, తరువాత టూ చెప్పారండి మొత్తం సెవెన్ ప్లస్ ఫోర్ ప్లస్ టు పదమూడూ ఎవరినైనా అంటే , మీ వారిని గాని, మీ అత్తగారిని గాని మీ కోడలిని గాని…
ఆయన లేడండి..
సుగునావతి గారూ .. లేడంటే…
షాపుకెల్లాడండీ,..
ఒకే ఒకే .. సుగుణ వతి గారు.. పీకకపోయినా నష్టం లేదు.. తర్వాత ఎటూ పీకుతారు కాబట్టి, కాని ఇప్పుడు మీరు మీ వారిని పీకితే .. మా మొగుళ్ళూ పెళ్ళాలూ పోగ్రామ్లోనూ , మీ కోడలిని గానీ అత్తని గానీ పీకితే అత్తల్స్ -కోడల్స్ పోగ్రాం లో నూ డైరక్ట్ సెకండ్ రౌండు లోకి వెళ్లచ్చండీ…
ఆయ్.. తెలుసండీ.. చెప్పాను.. ఈటయానికి వత్తానన్నాడు .. రాలా…
బాడ్లక్ సుగుణావతి గారు.. అఎనీవే కంగ్రాట్యులేషన్స్ ఫొర్ పట్టుచీరా.. బై….
..
మన తర్వాతి కాలరెవరో చూద్దాం…

ట్రింగ్ ట్రింగ్
ట్రింగ్ ట్రింగ్
అలొ
హలో..
అలొ
నేను నిమ్మ టివీ నుంచి పుష్పని మాట్లాడుతున్నానండి…
హహహ… హుహ..అ చెప్పండీ…
అయ్యో ఏమిటి అలా ఇదై పోతున్నారు…..
హహహ.. అంటే.. మీరు ఫోన్చేస్తారని చాలారోజులుగా చూస్తన్నమండి.. ఇవాళజేసరికి.. హహహిహిహిహహుహైహిహ… .మీరన్నా మీయాంకరింగన్నా హహ్హిహుహహిహు మా ఇంటో అందరికీ ఛానా ఇష్టమండీ, ఒరిసా అమ్మాయైనా హహుహ తెలుగు చక్కగా మాట్టాడిద్ది హిహిహి అనుకుంటాం…హహహహ
చాలా తాంస్కండీ.. మీ పేరేంటండీ…
నా పేరు సరోజండీ…
(మా అవిడ నోటు పుస్తకం మీద మళ్ళీ రాయటం మొదలు పెట్టింది)
సరోజ గారు…
మా ప్రోగ్రామ్ చూస్తుంటారా…

అయ్యో.. రోజూ చూస్తానండీ..
ఇవాల చుస్తున్నారా…
ఆ చూస్తున్నానండి…
ఐతే ఇంతకుముందు కాలరెవరో చెప్పమ్డీ…
సుగుణవతి గారండి…
సుగణవతి గారు..ఊ ఏ ఊరినుంచి…
..అనకాపల్లి నుంచి అండీ, ఆవిడకి ఒక మొగుడు, ఇద్దరు పిల్లలండీ, ఇద్దరు పిల్లలూ ఇశాపట్నం ఇకాస్లో ఇంటర్ చదుతున్నారంటండి.. ఇంకా సుగుణ వతి గారు చెప్పినా చిట్కా అండి…
సరోజ గారు.. సరే.. మీ ప్రోగ్రామ్ చుస్తున్నారని అర్ధమైంది …
మీ దేవూరండీ….
….
కీచ్ కీచ్ కీచ్
బర్ బర్ బర్ ( పేపర్ మీద పెన్సిల్)

కీచ్ కీచ్ కీచ్
బర్ బర్ బర్ ( పేపర్ మీద పెన్సిల్)
కీచ్ కీచ్ కీచ్
బర్ బర్ బర్ ( పేపర్ మీద పెన్సిల్)

సరోజ గారు .. మొదలు పెడదామా ..
తొందరగా అడగండండీ, మా కోడలు కూడా పక్కనే ఉంది…
సరే సరోజ గారు..
మీ కోసం తందనాబ్రదర్స్ వారి ఈ గచ్చకాయ రంగు పట్టుచీర రెడిగ ఉండండీ..మీకు తెలిసే ఉంటుంది తందనా బ్రదర్స్ వాళ్లు ముందు ఆత్రేయపురం లో పూతరేకులమ్ముకునేవాళ్లు.. ఒక సారి సరదాగ చూసొద్దామని బొంబాయి వెళ్లి కీచ్ కీచ్ కీచ్..
కీచ్ కీచ్ కీచ్
బర్ బర్ బర్ ( పేపర్ మీద పెన్సిల్)

కీచ్ కీచ్ కీచ్
బర్ బర్ బర్ ( పేపర్ మీద పెన్సిల్)
కీచ్ కీచ్ కీచ్
బర్ బర్ బర్ ( పేపర్ మీద పెన్సిల్)
దీని వెలె చెబుతున్నాను…
౧౩౯౫౦..
సరోజ గారు,
ఏది పీకమంటారండీ..

సరోజ గారు,కంగ్రాట్యులాషన్స్ .. అంత కరక్టుగా ఎట్టాచెప్పారండీ..
౧ నాకు లక్కీ అండీ,
ఓహో సరోజ గారూ…అలా చెప్పారా..
మరి ఇప్పుడు.. మీ కోడలు పక్కనే ఉందన్నారు కదా..
ఆ పీకుతున్నానండీ…
టఫ్…
ఇప్పుడు కోకాంజలి వారి పీకితే పట్టుచీర కార్యక్రమంలో ఓ చిన్నబ్రేక్..
హమ్మయ్య అనుకొని, చానల్ మారుద్దామని రిమోటందుకోబోతుంటే..
నేనివ్వను, మళ్లా కాల్ మిస్సయితే కష్టమ్ అంది.
అదేదో అపశకునం లా వినిపించి.. గుండెదిటవు చేశుకునే ప్రయత్నాలుచేస్తుంటే..
ఫోన్ మోగింది..
నేను టివి వైపు చూసి ప్రోగ్రామ్ మొదలు కాలేదని తెలుసుకొని ఊపిరిపీల్చుకున్నాను
మా ఆవిడ టివి వైపు చూసి ప్రోగ్రామ్ మొదలు కాలేదని తెలుసుకొని నిట్టూర్పువిడిచి

దేవుడిపాలనలో అకాలవర్షాల్లాగా, ఇప్పూడేంటి ఈ పోన్ అంది..
వెంటనే ఫోనందుకొనిమాట్లాడి..
వసతిగృహ వాడి ఫోన్, అప్పోలో దగ్గర ఉన్నాడుట, ఎట్టారావాలో తెలియటం లేదుట.. తీసుకువస్తా అనిచెప్పి..
ఏమంటోందో వినకుండా.. బయటకొచ్చేశాను…
****

గాయత్రీ భవన్లో భోజనంజేసి,బయట కిళ్ళీ కొట్టు వాడిదగ్గర నాలుగాకులుతీసుకొని నేనే తాంబూలం జుట్టుకొని సేవించి, ఓ గంట తర్వాత మెల్లగా ఇంటికెల్తే..
హాల్లో మా బావమరిది పంజాబీ డాన్స్ చేస్తూ ఉన్నాడు…
వాళ్లక్క మధ్య మధ్యలో పాయసమందిస్తోంది
ఏమైందిరా…
పట్టుచీర వచ్చిందండీ.. మా ఆవిడ చెప్పింది.
వచ్చిందా..నీకు పోనొచ్చిందా నిమ్మ టివి నుంచీ
నాక్కాదులే, మా అమ్మకొచ్చింది, ఐనా వాళ్లు మొగుళ్ళూ పెళ్ళాలూ కి వెళ్తారుగా, పట్టుచీర నాకిచ్చేస్తుంది.
ఇవాళ లేచిన వేళ బానే ఉంది అనుకుంటూ, మధ్యాన్నం నిద్రకుపక్రమిస్తుంటే ఓ మెసేజొచ్చినట్టు చిన్న శబ్దం చేసింది సెల్ఫోను.
చూద్దునుగదా, మా మామగారి సందేశం “AlluDu, Dnt wtch pIkitE pattuSAri” అని.

23 responses to “కోకాంజలి వారి పీకితే పట్టుచీర

 1. టైటిలు చూస్తే నవ్వించేదని తెలుస్తూనే ఉంది. పూర్తిగా చదివాక కామెంటుతాను.

 2. ఓహో! ఐతే మొదటిసారి ఆ ప్రోగ్రామ్ చూసారన్నమాట. అదేముంది. దాని తలదన్నే ప్రోగ్రాములు ఎన్నో. ముందే తయారయి ఉండండి.

 3. పన్నులు కేక… వంటరానితనం,నేలతో నింగి అనడం…
  మేష్టారూ, మీరు మళ్ళీ ఫాం లోకి వచ్చేశారన్నమాట, ఇదే ఊపులో ఇంకో రెండు టపాలు లాగించెయ్యండి… 🙂

 4. మీరు ఆయ్ ప్రయోగం కొంచెం ఎక్కువగా చేయడం వల్ల కించిత్తు ఖేదపడినా సంభాషణలకోసం అని సరిపెట్టుకున్నాను. కానీ సంభాషణలకోసమే అయినా మా ఊరు పేరు చెప్పి సంతోషపెట్టారు. ఒక్క మాట చెప్పమన్నారూ…

  ఓవరాల్‌గా శానా బా సెప్పారండీ, ఆయ్.

 5. భలే నవ్వించారు. హిందీ మాట్లాడే థర్డ్ ఫ్రంట్ నేతల మధ్య, బిత్తర చూపులు చూసే చంద్రబాబును ఊహించుకుంటే నవ్వాగట్లేదు.

 6. పీకితే పట్టు చీర టైటిలు చూసి పరుగెట్టుకు వచ్చేశాను. నిరాశ పరచలేదు మీరు. చంద్ర బాబు నాయుడు గురించి రాసినది హైలైట్. బోల్డ్ చేసి బోల్డు మంచి పని చేసేరు.

 7. నేను మా అమ్మ దగ్గరైనా పిన్ని దగ్గరైనా వున్నప్పుడు .. అంటే ఆ రోజుల్లో ఉద్యోగం ఉండేది కాదు లెండి.. వున్నప్పుడు వాళ్ళు మధ్యాహ్నం చాలా చలా ఎక్కువ భోజనం కుక్కేవారు, మా అబ్బాయి లావుగా మహేశ్ బాబులా ప్రభాస్ లా అవ్వాలని. కానీ వారి ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యేవి, ఎందుకంటే, ఆ తరువాతే వాళ్ళు ఎంత ఆపుకుందామనుకున్నా, మహిళలూ మహాబోరులు ఆనే సీరియల్ చూసేవారు. దానితో తిన్న అన్నం అరగక నాకు రోజూ అజీత్ చేసేది.

  అన్నట్టు ఊదం మాస్టారు మీరిలా అనామకులుగా ఎందుకు మిగిలిపోతారా అని ఇన్నాళ్ళు సందేహం వుండేది. ఇప్పుడర్థమయ్యింది. మీ టాపాలు మీ భార్యామణిగారు చదివితే, మీకింకా రోజూ గాయత్రాంబే దిక్కవుతుంది.

 8. లేచిన వేళ ఎందుకు బానే ఉందో రెండో సారి చదివాక గానీ అర్థం కాలా! పీకడం, బిత్తరచూపుల చంద్రబాబు -తల్చుకుంటూంటే నవ్వాగడం లేదు.
  మీ మామగారికి మీపై ఎంత ప్రేమో!

  అన్నట్టు, చంద్రమోహను గారి జేశ్వరాధములు గుర్తొచ్చింది.

 9. ఈ ప్రోగ్రామ్ మీదున్న నా కక్ష్యను మీరిలా తీర్చిపెట్టినందుకు ధన్యవాదాలండీ! కొన్ని ప్రయోగాలు భలేగా ఉన్నాయి.

 10. మీ టపా టైటిలు చూసి ఇదేదో (చాలా రోజులుగా పట్టుచీర పట్టుకోమంటున్న) మా ఆవిడకి వినిపించాల్సిందేనని పిల్చి కూర్చోబెట్టి మరీ వినిపించాను.
  తీరా అంతా అయ్యాక యీ “నిమ్మ” టీవీ మనకెందుకు రాదండీ అని అడిగింది!
  మీ పోస్టు ఏ టీవీ “క్రియేటివ్ డైరక్టర్లూ” చూడకోడదని ఆశిస్తున్నాను 🙂

 11. మీ మార్కు హాస్యం పండించారు. మహిళలు మహరాణులు అని మరో బీభత్స కార్యక్రమముంది. దానికి నాయనమ్మ లాంటి కార్యక్రమం మరోటి ఉందని ఈ వీకెండ్ “కిట్టీ పార్టీ” అని చూసాక తెలిసింది. ఇవి మహిళలని కించపరిచే కార్యక్రమాలని నా హోం మినిస్టర్ ఉవాచ.

 12. Good one !
  “హిందీనే మాట్లాడే మూడోఫ్రంట్‍నేతల మధ్య చంద్రబాబులా బిత్తరచూపులేసుకొని” you got my wicket here.

 13. @వంశీ గారు,
  నా బ్లాగులో మొదటి వ్యాఖ్య అనుకుంటా, నెనెరలు.
  @జ్యోతి గారు,
  వాటి దగ్గరకే వస్తున్నా, మా శ్రీమతి నిన్ననే ఆవిడకి అద్దాలుకుట్టిన నల్లచీరా, నాకు ఆకుపచ్చ ప్యాంట్ నీలం షర్టు కొనుక్కొచ్చింది “గంతులూ-గెంతులూ” కోసం …
  @name గారు, దైవానిక గారు
  నెనరులు
  @Falling Angel గారు,
  నా బ్లాగుసందర్శించేటప్పుడు, ఫాలింగ్ ఏంజల్ అని కాకుండా, లాఫింగ్ ఏంజల్ అని పేరు పెట్టుకోవటం సబబేమో,
  @రాఘవ గారు, అవును సంభాషణలకోసమే .
  @రాకేశ్వరా,
  మీతో ఇదే ఇబ్బంది.. ఆవలిస్తే…
  @చైతన్యకృష్ణ గారు, sujata గారు,
  నెనెరులు
  @చదువరి గారు,
  ప్రేమా? తోటి మగప్రాణి మీద జాలి అంతే.
  జేశ్వరాధములు గురించి వేగు లో మాట్లాదుకుందాం.
  @వికటకవి గారు,
  ఇంకా ఆ రెండిటి బారినా పడలేదు
  @ప్రవీణ్ గారు, అశ్విన్ గారు, Purnima గారు,
  నెనెరులు
  @JayaPrakash Telangana గారు,
  నెనెరులు
  కామేశ్వర రావు గారు, కొత్తపాళి గారు,
  నెనరులు, “కోకాంజలి”ని ఆక్షేపించకుండా వదిలేశారే…

 14. Vookadampudu గారు శలవుల్లొ నేను ఇండియా నుండి చదివిన అతి కొద్ది టపాల్లో మీది ఒకటండీ. శిర్షిక చూసి ఆగలేక చదివేసాను, భలే వ్రాసారు, పాయసాంజలి, చంద్రబాబు, కీచ్ కీచ్ కీచ్, బర్ బర్ బర్ ఇంకా కొన్ని పదప్రయోగాలు అద్భుతం. నేనూ ఒకప్పుడు ఇలాంటి ప్రోగ్రాం ల భారిన పడిన వాడ్నే…
  అన్నట్లు ప్రస్తుతం మా ఊర్లో మహిళా మణులంతా జాణవులే నెరజాణవులే అనే ప్రోగ్రాం వెనక పడ్డారు ఉదయభాను సారధ్యం లో నటీ నటుల ఫోటొ లో కన్ను ముక్కు చూపించి ఎవరో కనిపెట్టే ఈ ప్రోగ్రాం కి మా ఇంట్లో వాళ్ళు నా చేత కూడా SMS లు ఇప్పించారు 😦

 15. శ్రీకాంత్ గారు, నెనరులు, ఆలస్యం గా స్పందిస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు.
  స్వదేశానికి వచ్చిన వారు తిరిగి ప్రవాసం వెళ్లను, ఇక్కడే ఉంటాను అంటే కష్టమని, టీ.వీ వాళ్లు ఇలాంటి కార్యక్రమాలని కనిపెట్టి ఉంటారు 🙂

 16. 🙂 🙂 🙂 ఓ నా దేవుడా! (తెలుగులో) 🙂
  నిమ్మ – మీ
  పుష్ప – సుమ
  ఒరిస్సా – కేరళ
  చంద్రబాబు పోలిక పొలికేక!! 🙂 🙂

 17. @రానారె
  మీ సులోచనాల తయారీదారు మీద వాజ్యం వేయాల్సిందే, మీకు లేనివి ఉన్నట్టు కనబడుతున్నాయ్. 🙂
  ఇది కనబడలేదూ?

  అనంతపురం నాయుడు గారు = భట్టుపల్లె రెడ్డి గారు = రానారె

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s