కరంటు (లేక) కష్టాలు

మీకు తెలిసే ఉంటుంది గానీ నన్ను కూడా చెప్పనివ్వండి,
పై శీర్షికకి రెండర్ధాలు

అ) కరంటు లేక పోవటం వల్ల కష్టాలు
ఆ) కరంటు అంటేనే కష్టాలు …

ఈ టపాకి ఇంత కష్టమైన శీర్షిక ఎందుకుపెట్టల్సివచ్చిందో తెలుసుకోవాలంటే మీరు చరిత్ర తెలుసుకోవాలి…

మొదటి సారిగా కరంటు రాక్షసుడు ఎప్పుడు పగ బట్టాడో తెలీదు కానీ..
పట్టాడు అని తెలిసింది మటుకు .. ఎంసెట్ ఇంకో పదో పదిహేనురోజు లో ఉండగా తుఫాను పుణ్యామా అని మా జిల్లామొత్తం కరంటు పోయినప్పుడు…

పరీక్ష (ఐ)పోయిన చానాళ్లకి గానీ మా జిల్లా కి కరంటు రాలేదు..
మా జిల్లాకి కరంటు వచ్చిన చానాళ్లకి గానీ మా ఊరికి కరంటు రాలేదు..
మా ఊరికి కరంటు వచ్చిన చానాళ్లకి గానీ మా వీధికి కరంటు రాలేదు..
అప్పటికి కరంటు పోయి దాదాపు 3 నెలెలయ్యి ఉంటుంది..
అప్పుడు కరంటు  వస్తే, స్వతంత్రం పూర్వం ఊళ్లో కి గాంధి గారు వచ్చినంత ఇదిగా ఇదై జనాలు కరంటోళ్ల కు చందాలు పోగు చేసి మరీ లంచాలు ఇచ్చారు..
కానీ మా ఇంట్లో స్వత్రంత్రసమరయోధులు (భారతీయుడు గుర్తొచ్చాడా?) ఉండటంవల్ల మేము ఇవ్వలేదు..అందువల్ల..
మా వీధికి కరంటు వచ్చిన చానాళ్లకి గానీ మా ఇంటికి కరంటు రాలేదు..

అప్పుడు ఎదో కరంటు గ్రహం మూడ్నెలలు వక్రించినట్టున్నాడు అనుకున్నాను గాని, రాజకీయ నాయకులు దేశంలో బీదరికం పోగోడదని పట్టు బట్టి నట్టు పట్టుబట్టి మరీ పీడిస్తాడనుకోలా..

అప్పటి నుంచి …నేనంటే నిజంగానే పగో కాదంటే భయమో తెలియదు గాని .. నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడినుంచి కరంటుడు అదృశ్యమయ్యే వాడు ..
పైగా ఆరోజుల్లో కరంటుకోత గంటల్లో కాకుండా పూటల్లోనూ, రోజుల్లోనూ ఉండేది…

ఎదో చిన్న కాగితం నకలుప్రతి కావాలని .. ఓ కొట్టుకెల్లటం, ముందు వాడి అసలు ప్రతి తిరిగి ఇచ్చేసి మన దగ్గర అసలు ప్రతి తీసుకుంటుండగా నేపద్యం లో ఠప్పున చప్పుడు… కరంటు పుటుక్కు

కాలేజీ లోనే, ఓ మారు.. మిత్రులందరూ మాట్నీ సినిమాకెల్దాం రారా అన్నారు, వద్దురా నేవస్తే కరంటు పోతుంది అన్నాను…
కాదు కూడదు నువ్వు రాకపోతే మధుబాల ఇదౌతుంది అని తీసుకెళ్లారు…
ఓ అరగంట ఆట అయ్యిందోలేదో… కరంటు పుటుక్కు
జనరేటర్ ఆడించవలసిన వాడు.. కరంటు పోయేవేళ కాదులే అని భోజనానికి వెళ్లాడు..
వేసవి… ఎ.సి కాదు కదా, సురటీలూ కూడా తిరగపోతే, నిండు హాలులో ..
ఉక్కపోతలో, ఊపిరిఆడక గిల గిలా కొట్టుకుంటుంటే, పక్కనవాడు ఊరక ఉండి ఏంచేస్తాంలే అని
కాలాన్నీ,కాయాన్ని,ఆకున్ని ఒకే సారి కాల్చి పారేయటానికి బీడీ వెలిగిస్తే…
ఈ సినిమా హాలే ఇట్టాఉందంటే నరకం కచ్చితం ఉండేఉంటుందని, నరకం ఉంటే కచ్చితంగా స్వర్గం కూడా ఉండే ఉంటుందని…
ఈ రెండూ ఉంటే దేవుడు కూడా ఉంటే ఉంటాడని.. ఒంట్లో ఆస్తిక వాదానికి కొత్త ఊపిరులూది బయట పడ్డాను…
ఇలాంటి ఇంకో ఒకటి రెండు సంఘటనలు జరిగిన తరువాత మిత్రులు కరంటు కోతలరాయుడు అని పిలుస్తామని బెదిరిస్తే అప్పుచేసి మరీ ఓ జెనరేటర్ కొనిపెట్టాను, వాళ్లన్నా చదువుకొని బాగుపడతారేమో అని..

కొన్నేళ్ల క్రితం , బెంగలూరు లో , ఆస్తిక వాదులు మురుగేష్ పాల్యా అనీ అక్కడ మనుషల జనాభా కంటే శునకరాజాల జనభానే ఎక్కువని తెలిసిన వాస్తవవాదులు..
మొరుగేష్ పాల్యా అని పిలిచే ప్రాంతం లో…
ఓ రోజు పొద్దున్నే తూలుతూ కిందకు దిగుతుంటే ..

కింద నుండే ఓనరుడు ..
ఏంటి ఊదం రాత్రి నిద్ర పోలేదా?
అవును కరంటు లేదుగా.. నిద్ర పట్టలేదు…
కరంటు లేక పోవటమేమిటి
నిన్న రాత్రి పదకొండింటికి పోయింది గా…
అవును, కానీ పన్నెండిటికి వచ్చింది గా…
అవును వచ్చింది…అంటు తూలుతూ రెండొ అంతస్తులో ఆయనకూడ మెట్లు దిగాడు
( ఆయన తూలటనికి కారణం నాకు తెలీదు)…
కిందా ఓనరుడికి ఉండీ, పైనరుడికీ ఉండీ, మధ్యలో మొదటి అంతస్తులో ఉన్నా నా ఒక్కడికే లేదంటే ఏమీచెప్పమంటారు విధి లీల కాదు కాదు…విద్యుత్తు లీల.
ఫిర్యాదు చేస్తే విద్యుత్తు సంస్థ ఉద్యోగి వచ్చి, స్థంబమెక్కి ఓ నాలుగు వైర్లు కదిలింఛి, లూజు కనక్షను అంటూ  స్క్రూ లూజువాదిలా నవ్వి.. ఓ గాంధిగారి నోటు బట్టుకెల్లాడు..
రాత్రంతా అంధకారానికి తొడు పొద్దున్నే ఇదో ఆవదం.

ఇంకా చెదుమదురు సంఘటనలని పక్కన పెడితే..
ఓ రెండేళ్ల క్రితం, 2007 ఆగష్టు లో , ఆఫీసు పనిమీద ఓ రెండు వారాల కోసం చికాగో వెళ్తే ఓ రోజు సాయంత్రం ఉన్నట్టుండి అక్కడ ..కరంటు పుటుక్కు

అంత దాక ఎందుకు .. ఓ నాలుగు వారల క్రితం ఓ శనివారం, ఖైరతాబాదు తపాలా కార్యాలయానికి జా.పొ.ప. పక్వ నగదు తీసుకుందామని వెళ్తే..
ఇప్పుడు కరంటు లేదండి, కరంటు లేకుండా మీ చేవ్రాలు సరిచూడలేము..ఇవాళ మూడింటి దాకా రాదు, మూడింటికే మా పనివేళలు ముగుస్తాయి.. పోయి సోమవారం రండి అన్నాడు…
కరంటూ, కంప్యూటర్లూ లేని రోజుల్లో తపాలాకార్యాలయాలేవీ పనిచేయలేదా నాయనా అని అడుగుదామని నోటి దాక వచ్చి…
అయన నిమిత్త మాత్రుడు, ఆయన చేత ఈ మాటలు పలికిస్తుంది సాక్షాత్తు కరంటాసురుడే అని తలపుకొచ్చి ఆగిపోయాను.

మీరు నమ్మకపోవచ్చుకానీ, ఓ రెండు వారాలక్రితం, కరంటు బిల్లులో తప్పు ఉంది సవరింపిద్దామని ఓ గురువారం కరంటు ఆపీసు కు వెళ్తే.. కరంటు లేదండి.. సాయంత్రం ఐదింటి దాకా రాదు, ఐదింటికి రండి అన్నాడు…
సరే కదా అని ఐదింటికి వెళ్తే, ఇవాళ అదేమిటో రెండింటికి వచ్చి , మళ్ల ఇప్పుడే ఐదునిముషాల ముందే పోయిందండీ అన్నాడు…
కరంటూ, కంప్యూటర్లూ లేని రోజుల్లో విద్యుత్తుకార్యాలయాలేవీ….
అని అడుగుదామనుకొని.. అసలు కరంటే  లేక పోతే దానికి మళ్లా కార్యమూ ఆలయమూ కూడానా  అని.. వదిలేసాను..

చెబితే మీరు నమ్మరుగాక నమ్మరు గానీ, కరంటు తో నాకున్న ఈ అనుబంధాన్ని పంచుకుందామని , ఈ టపా మొదలెడితే, వేసవి కాలం, ఏప్రిల్ 6వతారీకు అర్ధ రాత్రి 12 గంటలకి ఈదురుగాలులు, పడీ పడని వానజల్లు వల్లా ఓ గంట సేపు కు.హ.బో.కా లో కరంటు పోయింది…

అదీ కరంటాయన ప్రతాపం…

కరంటుకు నేనంటే ఎందుకు సరీపడదో ఆని దీర్ఘంగా అలోచిస్తే

కింది మూడింటిలో ఒకటి గా అవగతమైనది..

అ) వాన దేవుడు లాగా కరంటు లార్డు కూడా చెప్పాపెట్టకుండా రాజా వారి కాంగ్రెస్సులో చేరిఉండటం.
ఆ) విద్యుల్లత అని పేరున్న సార్ధకనామధేయురాలు, నా మీద నాకు తెలీకుండా మనసు పారేసుకోని..
తనకు తెలీయని, నిజాలు తెలుసుకోనే ప్రయత్నమేమీచేయకుండా, నా విశాల హృదయం లో పదహరువేల పైచిలుకు ఇరుకు గదులలో ( ఎవరు, వెనకాలనుంచి అది గుండెనా లేడిస్ హాస్టలా అని అరిచింది, ఆయ్) ఒక్క గదిలోనూ ఖాళీ లేదనుకొని తీవ్రంగా శపించటం
ఇ) అ మరియూ ఆ.

ఏది ఏమైనా, త్వరలో.. బాగా పరిశ్రమించి, నగదు బదిలీ లాంటి ప్రణాళికో, స్విస్సుబాంకు కు నగదు బదిలీ లాంటి గురుప్రణాళికో (master plan) రచించి, కరంటు ఎటు నుంచీ పోతుందో చూసి..
అటు నుంచీ కానీ , మరెటు నుంచీ కానీ పోకూండా అష్టదిగ్భంధనం చే(యి)స్తాను…
అప్పటిదాకా విషయం క(ర)ంటకప్రాయమే

ఇక్కడదాకా ఎలాగూ చదివేరు కాబట్టి.. ఇంకో మంచి పని కూడా చేయండి::
బత్తీబందు అని అనుకొని ఇప్పటికి దాదాపు పదిమాసాలు. దీనివల్ల కాస్తో కూస్తో మేలు జరిగింది అనుకుంటే..
ఓ మాట తోటివారితో పంచుకోండి, సముఖంగాను, బ్లాగ్ముఖంగానూ..

4 responses to “కరంటు (లేక) కష్టాలు

  1. మిమ్మల్ని విద్యుత్ శాఖా మంత్రి గా చెయ్యాలి.

  2. చాలా బాగా రాసారు.. సూపర్….

    bonagiri గారు చెప్పినట్టు మిమ్మల్ని విద్యుత్ శాఖా మంత్రి ని చేస్తే రాష్ట్రమంతా కరెంటు పోయి ఇక రాదేమో..

  3. హన్నా 2007 లో చికాగో ఎఫెక్ట్ తమరి పాద మహిమే అనమాట 🙂 అన్నీ కాదు కాని xerox విషయం లో మాత్రం నాకు మీలాంటి అనుభవాలు కోకొల్లలు. ఇప్పుడు లెక్కా పత్రం లేకుండా ప్రింట్ లు xerox లు కొట్టేస్తూ ఒకప్పుడు ఎన్ని తిప్పలు పడే వాడ్ని అని అప్పుడప్పుడూ గుర్తు తెచ్చుకుంటా…

  4. హ హ హ. సెబాష్!
    బోనగిరి కామెంటు కూడా సెబాష్!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s