దోషాకరుడు

గురుపత్ని సొగసెంచి మరులొంది వశమంది
సరసమాడినయట్టి జార బుద్ధి

దినమందు గృహమందు; దిరుగాడు రేయందు
చోద్యమేమందువా -చోరబుద్ధి

పార్వతి పసికూన పరువెత్తి పడినంత
అవహేళనమునాడె అల్పబుద్ధి

పెరజూసి నడయాడి పరమేశు జటజిక్కి
కోరిజేరితినన్న కొలదిబుద్ధి

కుదురు,కునుకు లేక కులుకాడ దోగాడు;
మార్చు మోములెన్నొ మాయగాడు.
తోచు నొక్క పేరు- దోషాకరుడనుచు
వేయి మాటలేల వీని గొరకు.

10 responses to “దోషాకరుడు

 1. పద్యం చాలా బాగుంది. సీసంలో మంచి ’తూగు’ నింపారు!

 2. అదేమిటో గానీ ఎన్ని దోషాలున్నా అందరూ ఇష్టడే మామ- చందమామ.

 3. 🙂

  అందుకేనేమో జ్యోతిష్యంలో చంద్రుడ్ని మనస్సుకి (బుద్ధి) కారకుడన్నారు 😉

 4. చంద్రుడి గురువెవరండీ?

 5. మా రాకేశ్వరుణ్ణి ఇలా ఆడిపోసుకుంటే వూరుకునేది లేదు!

 6. ఊదంగారు,

  చంద్రుడి మీద మీకు ఇంత కోపమెందుకండీ! సాధారణంగా మన కావ్యాలలో విరహంతో వేగే నాయికా నాయకులు, తమకి విరహాన్ని మరింత ఎక్కువ చేస్తున్నారన్న కోపంతో చంద్రుడూ, మన్మథుడూ మొదలైనవాళ్ళని దూషిస్తూ ఉంటారు. దాన్ని ఉపాలంభము అంటారు. చంద్రోపాలంభము, మన్మథోపాలంభము ఇలా. అలా ఉంది మీ పద్యం. మరి మీరూ అలాంటి అవస్థలోనే ఉన్నారేమో తెలియదు 😉

  చంద్రమోహన్ గారన్నట్టు పద్యం మంచి తూగుతో నడిచింది! బాగుంది.

 7. చంద్రమోహన్ గారూ, “తూగు” కోసం మందు కూడ నింపాను దినమందు గృహమందు,చోద్యమేమందు
  .. గమనించారా..

  మందాకిని గారూ, అవునండీ, అదే నా బాధ.

  సూర్యుడు గారు, అవునండీ, ఎవరన్నా వచ్చి ఏమయ్యా ఇంత బుద్ధిలేకుండా రాశావు అని అడిగితే ఈ ముక్కే చెబుదామనుకున్నాను. మీరు నా తరఫున ముందే చెప్పేశారు.

  రవి చంద్ర గారు,
  గూగిలించకుండా గుర్తు తెచ్చుకోవడనికి ప్రయత్నించండి … దేవతల గురువు.

  రాకేశ్వర రావు గారు,
  భూటాను రాకేశ్వరుణ్ణి అనుకొని ఈ ఒక్కసారికి ఊరుకోండి. ఇంతకీ ఏ దేశం లో ఉన్నారు…

 8. కామేశ్వర రావు గారు,
  మీరంటే అదృష్టవంతులు గానీ ..అగ్గిపెట్టె అపార్ట్మెంట్ లలోనూ, అంతకన్నా ఇరుకు ఆఫీసుల్లోనూ …పగలైనా రాత్రైనా విద్యుత్తు దీపాలే గానీ ..రవి చంద్రులతో నిమిత్తం లేదండీ..
  టి.వి లో తెలుగు వార్తా వాహిని లో “గుడ్మాణింగ్ విత్ వేడి కాఫీ” వస్తే ఉదయమనిన్నూ “మిడ్నైట్ మిర్చీస్” వస్తే రాత్రియనిన్నూ..
  ఆ చంద్రుడి చిన్ని కిరణం కూడా దరిదాపుల్లోకి వచ్చే అవకాశమే లేదు .. ఇహ విరహమేమి పుట్టిస్తాడు చెప్పండి…

  మీ పొగడ్త చూసి వచ్చేది అమావాస్య అని కూడా చూడకుండా చంద్రుడు ఉబ్బిపోతే తిధులు తారుమారయి తెలుగుదేశం అయోమయం లో పడుతుందేమో అని భయపడి విరుగుడికి రాశాను అంతే..
  మన్మధుడి సంగతి ఏమిటి అంటారా… అది వేరే కధ ….

 9. >>గూగిలించకుండా గుర్తు తెచ్చుకోవడనికి ప్రయత్నించండి … దేవతల గురువు.
  దీనికి గూగిలించాల్సిన పనిలేదు లెండి. వెంటనే గుర్తుకొచ్చింది బృహస్పతి అని. అన్నట్టు ఈ కథ కూడా నేనెక్కడా వినలేదు. అందుకనే అడిగాను.

 10. ఊదం గారూ మీ పద్యం చాలా బాగుంది. రాత్రి నడిచొస్తుంటే తక్కువ లైటిచ్చడనా యేంటి అంత కోపం ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s