Monthly Archives: ఏప్రిల్ 2010

ఎంతగొప్పది అయ్యా ఈ లిరిక్

ఒక చలన చిత్రం లో ఏడుకొండల స్వామి పాటలో కబురు అన్న అన్యదేశ్యం వేశి, ప్రాయశ్చిత్తం చెప్పమని మల్లాది రామకృష్ణశాస్త్రి గారిని ప్రాధేయపడ్డ, ఔచిత్యం అంటే ఏమిటో తెలిసిన కవులు పుట్టిన గడ్డ ఇది. 
ఈ మధ్య ఓ పాట చెవిన బడింది…

ఇలా మొదలౌతుంది:

ఏడుకొండల బాలాజీ డియర్

ఎంతగొప్పది స్వామీ నీ పవర్

నవవిధ భక్తి మార్గములలో సఖ్యత ఒకటీ అనీ, “డియర్” అనేది అటువంటి సంబోధన యనీ .. వినేనంత వరకు…నాకు ఎరుక పడలేదు ఈ పాట గొప్పతనం.

ఆ సఖ్యతను వ్యక్త పరచటానికి – ఆ భక్తుడికి – కాదు ఆ భక్తుడి వెనక నున్న రచయిత కి – ఇంతకన్నా మంచి మాటలు – కాసిని తెలుగు మాటలు అందుబాటులోలేకపోవటం..ఆలోచించాల్సిన విషయమే..

తిరుపతి లో ఒకరు గోవిందా అనగానే వెనక వంద మంది అందుకుంటారు అయాచితం గా… ఇక్కడ ,, ఎందుకో గానీ గాయకుడు “kamAn(5) everybody say it” అని అభ్యర్ధిస్తాడు.. అంత వేంకటేశుడి పై సఖ్యత కలవాడికి మిగతావాళ్లతో పని ఏమీ? వాళ్లు అంటేనేమి? అనకపోతేనేమీ?

 ఇంతా జూస్తే ఈ సఖ్యత తన పెళ్లి కుదర్చటం వల్ల … love matter చెప్పుకున్నాడట, answer దొరికిందట కాబట్టి Thank You my dear.

 సఖ్యత ఎక్కువకదా .. పెళ్లికి పిలుస్తూ “వచ్చిపోరా” అని కూడ అన్నారు భక్తులు.

ఇక్కడ పోవటం ప్రధానం ఎందుకంటె భక్తుడు ఇప్పటికే తిరుపతి వెళ్ళటానికని honeymoon postpone చేసుకొని మరీ Ticket కొనుక్కున్నాడు.

ఐతే, ఇంత సఖ్యతగల భక్తుడికీ, తను కోరిన మీదట పెళ్ళి కుదిర్చిన వెంకటేశుని సన్నిధి లో వివాహం చేసుకోవాలనిపించలేదు, కనీసం వెళ్లి ఆయనను పిలవాలని పించలేదు.. అందుకే First Card ఆయనకు post చేశాడుట. మరి post చేస్తే దేవుడు వస్తాడా అని మీ కనుమానమా? అందుకే ముందు జాగ్రత గా అన్నమయ పాటల orchestra కూడ పెట్టాడుట. ఈ సఖుడికి వేరే భక్తుడిపాటలతో నిమిత్తమేమిటో మరి.

అన్నట్టు ఈ భక్తుడితో పాటు మరో భక్తురాలు, ఆవిడ కాస్త ధనవంతురాలు గా దోచును. ఏకంగా తిరుపతి లడ్డు వంద K.G Book చెసిందిట విందు కోసం.

ప్రసాదానికి , ఫలహారానికి తేడా తెలియని పరమ భక్తురాలనుకుంటా…

 తి.తి.దే వారెవరైనా ఈ పాట విన్నారో లేదో, విన్నా వారికి అభ్యంతర కరమైనవేవీ కనబడలేదో తెలియదు. లడ్డు book చేయాలెగానీ సంతోషంగా పంపిస్తామంటారేమో తెలియదు. నేను సినిమా చూడకపోవటం వల్ల ఈ జంట తెరపై ప్రదర్శించిన భక్తి ఎట్టిదో కూడ తెలియదు.

 నమో వేంకటేశాయ

పురుషాయ మహాత్మనే

ప్రణతః క్లేశనాశాయ

 గోవిందాయ నమోనమః

స్వస్తి.

ప్రకటనలు

నవ(యుగ) వధువు

13/4/2010: మలి ప్రతి:

నవ వధువు

దేశాంతర నగరప్రవాసోపలబ్ధ విభవలాలసాచేలాచ్ఛాదితనేత్ర- గాంధారి

గగనమార్గకృత నిస్తంత్రీసల్లాపమయ వివాహశృంఖలాబద్ధ – శాకుంతల

ఖండాంతర స్థిత మహాసౌధభరిత లంకాపురాతిరిక్త నగరంభర జనారణ్య సంచారభీత- సీత

తలిదండ్రులు –
మునుపు
పిల్ల్ల నచ్చలేదంటారేమోనని
భయపడేవారు

ఇపుడూ భయపడుతున్నారు

సంబంధం వద్దన్నపుడు కాదు  ..
పెళ్ళికి సిద్ధమన్నపుడు.

 

 

తెల్లారింది

ఆఫ్రికా అరణ్యాలలో
అర్కోదయమవుతూనే
అతివేగంగా పరిగెత్తే
సింహానికైనా దొరకరాదని దుప్పులూ
కుంటి దుప్పినైనా
పట్టాలని సింగాలు
లేచి పరిగెత్తేనని…

పరుగెత్తటమే పరమధర్మమని
వేటాడటమే వృత్తిధర్మమని

మంద యానలు
అమంద జ్ఞానలు

కార్పోరేట్ మానేజిమెంట్
పేరుతో కాచివడపోస్తుంటే

వేటాడుతున్నానో
వేటాడబడుతున్నానో
తెలియని విచిత్ర స్థితిలో..
ఏవేళకో ఇలుచేరి ..
బూట్లైనా విడువక
నడుమువాల్చబోతుంటే…
మళ్లీ తెల్లారింది!!!