పొగ (చూరని) జ్ఞాపకం – కొనసాగింపు

అలా, విశాలమైన రోడ్డును చేరుకోగానే బండి వేగం పెంచాను, ఓ వంద గజాలు వెళ్లగానే- ఎదురుగా  పొగ కనిపించి, ఇది ఏ వాహనపు తాలూకు చమురు కమురో, లేక ఎక్కడ ప్లాస్టిక్ ను తగలబెడుతున్నారో అని, ముక్కుపుటాలకు సోకకుండా నా హెల్మెట్ అద్దం మూసివేసే లోపే, ఆ పొగ నన్ను  చేరింది. అంతే… ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యాను .. ఆ పొగకి కాదు .. ఆ పొగ తెచ్చిన మార్పుకి.. అప్పటిదాక ఆక్రమించిన నిస్సత్తువ,నిస్సహయత ఒక్కసారిగా ఎగిరి పోయాయి – ఎదో కొత్త ఉత్సాహం వచ్చింది.. ఒక లోగొంతుక ఇది నీకు బాగ తెలిసిన వాసన జ్ఞాపకముందా అని అడిగింది? బాగా తెలిసిన కాదు, బాగ ఇష్టమైన వాసన అని మరో లోగొంతుక పలికింది. ఈ పొగ వాసన నాకు ఇష్టమన్న నిజం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. బహుశః, .. ఓ పదినిముషల క్రితం మీరు ఒక కాగితం ఇచ్చి నీకు చాల ఇష్టమినవి ఏమిటో ఓ పది, కదు ఓ పదిహేను, కాదు ఓ పాతిక వ్రాయమన్నా ఇది వ్రాశేవాడిని కాదేమో. ఏమైంతేనేం, ఈపాటికి పొగ నన్ను పూర్తిగా జయించి, నా చేత బండి రోడ్డుపక్క ఆపుచేయించింది. అప్రయత్నంగా వెనక్కి అడుగులు వేసాను, మళ్లీ ఆ పొగ పీల్చుకోవటానికి.

ఆ పొగను నింపుకొని ఒక్క గాలి విసురు, ఒక గాలి పీల్పు , వెళ్ళి మా నాయనమ్మ గారి దొడ్లో పడ్డను, నాల్గో తరగతి పిల్లాడిగా.

https://i2.wp.com/bapubomma.com/images/budugu.jpg

[ ఈ ఫోటో నాది కాదులెండి, బుడుగుది, ఎప్పుడొ బయటకు వెళ్లెటప్పుడు తప్పితే నాకు ఒంటి మీద చొక్కా ఉండేది కాదు,  లాగూకు పట్టిలు కూడ ఉండేవి కాదు, గుండిలు ఉండేవి కానీ రకరకాల రంగులలో ఉండేవి, అప్పటికే చాలాసార్లు ఊడిపోతే కుట్టబడ్డాయి అని చెప్పటనికి]

మా నాయనమ్మగారిది పెద్ద ఇల్లు, పడమర, దక్షిణం గోడలు, ఇంచుమించు పొరుగువారి ఇంటిగోడలతో కలిసి పోయి ఉంటాయి, ఇంటికి ఉత్తరవైపు, తూరు వైపు చాలా ఖాళీస్థలముండేది. దాదపు పది కొబ్బరి చెట్లు, వేప చెట్టు, తెల్ల గన్నేరు, మల్లె, సన్నజాజిపాదులు, నిమ్మ దానిమ..మొక్కలు రెండు .. ఇంకా అవీ ఇవీ.. వేసవి సెలవలలో అక్కడికి చేరేవారం .. పిల్లలం, ఒక్క రోహిణీ కార్తె తప్పవిడచి, – పొద్దున పదకొండు వరకు అరుబయటే ఉండేవాళ్లం. రోహిణీ కార్తె అంటే ఏమిటో అప్పటికీ ఇప్పటికీ తెలీదు గానియండి, అది రాగేనే, ఒరే రోహిణీ కార్తెరా వడ గొడుతుంది లోపలికిరా అని కేకలేసేవారు. సాయంత్రం నాలుగు దాటగనే – మళ్ళి ఆరుబయటకి వచ్చేవాళ్ళం.. ఎవరన్నా వస్తే వాళ్లచేతో – లేదంటే బాబాయే – కొబ్బరి బోండాలు కొట్టించేవాడు  .. పెద్దవాళ్లు కాయనుండే తాగేవాళ్లు కాని, పిల్లలకి గ్లాసులలో పోశెవారు (  స్ట్రాలు ఇంకా విరివిగా లేని కాలం) తాగి మళ్ళీ ఆట లో పడితే – ముంజలకోసం పిలచేవారు .. ఒకటి నోటి లో కుక్కుకోవటం ఆడటనికి పరిగెత్తటం.. మళ్ళీ అటు నుంచి రావటం, ఇంకోటి కుక్కుకొని పరిగెత్తటం, చార్,పప్పుచార్ అని, ఐస్ బాయ్ అని ఇలా ఎవో ఆడేవాళ్ళం .. (మగ జనభా ఎక్కువ ఉంటే విడిగా ఏడుపెంకులాటా), ఓ గంట గడిఛాక ఒక పక్క మేము ఆడుకుంటుంటే మరో పక్కనుండి ఆడవాళ్లు చిమ్ముతూ, ఇంత దొడ్డి చిమ్మాల్సి వచ్చినందుకు కారాలు నూరుతూ, అవి మా మీద చూపిస్తూ ఉండెవారు.. కళ్లాపి దగ్గరకి వచ్చేసరికి ఇక పిల్లల్ని పిలిచే వాళ్లు – [ మేము పని చేస్తుంటే మీరు ఆడుకోవటమేమని అక్కసు కాబోలు) ఒకళ్లు పంపుగొట్టాలి, ఇద్దరు చిన్న చిన్న బిందెలతో తీసుకెళ్లి, కళ్లాపిచల్లే వాళ్లదగ్గర బొక్కెనలో పోయాలి…, కళ్లాపిజల్లటం అయ్యేసరికి ఆటలు ఆపేసేవాళ్లం. ఒకరిని సన్నజాజులు కోయటానికి ఒకరిని మల్లెలు కోయటనికి పురమాయించేవారు. వీటితో పాటు కొన్ని ఇతరత్రా పనులుండేవి .. ఆచారి కొట్టుకు వెళ్లి ముక్కుపొడుం తేవటం, మరెవరింటికో వెళ్లి కర్వేపాకు తేవటం, లేదు, ఫలాని అమ్మమ్మగారి ఇంట్లో వంగలో కాకరలో తెంపుకురావటం, బెట్నోసాలో, అనాసినో, దీపపుబుడ్డికి గ్లాసో తెచ్చిపెట్టంలాంటివి. ఇదిగో ఈ పనులు చేసుకొని, ఆరున్నరకో ఆరు ముప్పావుకో తూర్పు వైపు అరుగు మీదకి చేరేసరికి వచ్చేది, ఆ పొగ వాసన , ఆగ్నేయం మూల, పరివారపు స్నానాలకోసమి, నాన్నో, నాయనమ్మో కాగువేస్తే, ఆ పొయ్యిలో మండుతున్న యెండిన కొబ్బరి డెక్కల నుండి వస్తున్న పొగ వాసన.

ఎవరో కొబ్బరిబోండలు అమ్మేవాడు, ఎండిన కొబ్బరిడెక్కల్ని, రోడ్డు పక్కన వేసి నిప్పుబెట్టితే- మళ్లీ ఇప్పుడు అదే పొగవాసన. గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇంటికేసి బయలుదేరాను. ఇంటికి చేరంగానే, శ్రీమతి ఏంటడీ ఆలస్యం అనియడిగితే, “దారిలో పొగ పీల్చుకోవటానికి ఆగాను” అని చెబుదామనుకొని, అపార్ధం చేసుకుంటుందని, మాటలని మింగి, లోపల జ్ఞాపకంతోపాటు భద్రంగా దాచుకున్నాను.

4 responses to “పొగ (చూరని) జ్ఞాపకం – కొనసాగింపు

 1. మీ పొగ జ్ఞాపకాలు బాగున్నాయి. నా చిన్ననాటి జ్ఞాపకాలని కూడా గుప్పుమనిపించాయి.

 2. బాగున్నై మీ జ్ఞాపకాలు.

 3. బావున్నదండీ… ఇప్పటికీ మా అమ్మమ్మగారి ఊరు రాజోలు వెళ్తే.. కనిపించే దృశ్యాలు

  తెల్లారుతూండగా వీధి వాకిలిలో పేడనీళ్ళ కల్లాపి, కాలవ గట్లలో స్నానం చేయటాని జీతగాళ్ళతో పరుగులు తీసే ఆవులూ, దూడలూ, వాటితో రేగే గోధూళి, పెరట్లో పిడకలూ, కొబ్బరి మట్టలు, కొబ్బరి ఈనెలెతో సలసలకాగే వేన్నీళ్ళ డేగిశాల నుండి చూరుకంటే పొగా, కుంకుడుకాయల
  తలారా స్నానం చేసివచ్చాక సేదతీరుతూ పడుకోడానికి కొబ్బరిచెట్లకింద నులకమంచం, వళ్ళంతా పట్టేందుకు వీలుగా ఆ మంచాల కింద సాంభ్రాణి పొగ….

  వీతన్నింటికీ శిఖరాయమానం పక్కింట్లోనే చెట్టుకొమ్మకు వేళ్ళాడదీసి సాగదీసే జీళ్ళు, సాయంత్రం కాగానే తూరింగు టాకీసులో సినేమా… ఏడున్నరయ్యేసరికి బంతిభోజనాల్లో ఆవకాయ ముద్దలూ, ఆపై ఆరుబయట వరండాలో మడతమంచాలూ పరుపులూ, వాటిమీదదొర్లుతూ విన్న చందమామ కథలూ కబుర్లూ..

  వేసవి సెలవలు అంటేనే ఒక అందమైన అనుభూతి…ఇప్పటికీ….

  అప్పటి రోజుల్ని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.

 4. కామేశ్వర రావు గారు, చదువరి గారూ, సనత్ గారూ నెనరులండీ…

  సనత్ గారూ, మీరు చెప్పాల్సిన సంగతులు చాలనే ఉన్నాయి .. ఒక్కొక్కటి బ్లాగులో వ్రాయండి, మధ్య మధ్యలో పద్యాలతో.
  -భవదీయుడు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s