దేవుడా చలి , చలిదేవుడా

చలి కి దేవుడి స్థాయి ఇవ్వలేదేమిటని అని నాకు రెండురోజులనుంచీ వణుకు తో కూడిన ఆశ్చర్యంగా ఉంది – { ఏంచెయ్యను చెప్పండీ హై. లో ఉష్ణోగ్రత (మీరు వాగర్ధం తీసుకోకండి – కొలవడానికి అలా అన్నారు కానీ – ఉగ్రత ఏ మాత్రం లేదు ప్రస్తుతం) 8 డిగ్రీలు 9 డిగ్రీలు, ఎప్పుడూ ఎరుగనట్టి చలి.} పూర్తిస్థాయి/స్వతంత్ర దైవికత్వమ్ అప్పజెప్పకపోయినా ఈ చలి దేవుడికి దిక్పాలత్వమో మరేదో అంట గట్టే ఉంటారని నా నమ్మకం. ఆయన మనలను బాధ పెట్టకుండా శనిపీడానివారణ స్తోత్రాలలాగా చలిపీడోపశమన స్తోత్రాలు  [ఎవరండీ వెనకాలనుంచి దుష్టసమాసం అని అరుస్తున్నదీ ఆఁ ] కూడా ఎవో ఉండే ఉంటాయి – లేకపొటే ధనుర్మాసం లోనూ, ఆకామావై లలోనూ మన పూర్వీకులు అంత పొద్దున్నే లేచీ నదీతీరాలకు వెళ్ళి స్నాలాలు ఎలాచేయగలిగారంటారు చెప్పండి … అసలివన్నీ అపౌరుషేయాలవ్వటమ్ వల్ల వచ్చిందీతంటా. బొత్తిగా మనబుర్రలు ఇంత ఓటి బుర్రలౌతాయని మనం ఇంత చేతకాని వాళ్లమౌతావమని ఊహించినట్టు లేరు – లేదంటే ఆ పాఠాలేవో జాగ్రత్తగా మనకందించేవారు గదూ..
నా అనుమానం ఏమంటే అటువంటే స్తోత్రాలు అష్టకాలు మొన్న మొన్నటి వరకూ చలామాణీలోనే ఉండేవి – ఈ గ్రాంఫోన్లు వచ్చి నరులను చెడిపేశాయి – ఇదుగో ఆ ఘంటాశాల వచ్చి ముక్కోటి దేవతలు ఒక్కటైనారు అన్నాడు – ఇహ మనవాళ్లేమో కాంగ్రెస్సు పార్టీ లో చీలికల్లాగా ఎన్నని గుర్తు పెట్టుకుంటాం లే అని గంపగుత్త గా – అన్ని నీళ్లు సముద్రం లోనే కలుస్తాయని ఓ ముక్క అడ్డంజెప్పి అందర్నీ అనామకులని జేసిపెట్టారు.

ఐనా చలిదేవుడు నా లాంటి మొహమాటస్థుడు లౌక్యం తెలియని వాడు అయ్యుంటాడు.అసలు ఈయన ఏమిటి ఈయన మహత్వమేమిటి – సర్వంతర్యామి యే – ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడి తరువాత – అడక్కపోయినా కంటికి కనిపించేరూపమే – గట్టిగా స్థ్రోత్రం చేయకుండానే కరిగిపొతాడే – అలాంటి తత్వానికి భక్తవశంకర రూపానికీ- ఒక శ్లోకం లేకపోవటమేమిటి ఒక బీజాక్షరం లేకపోవడమేమిటి – ఒక యంత్రం లేకపోవడమేమిటి హెంత హన్యాయం హెంత హన్యాయం

నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను – మంచు తో చేసిన చాకుతో – హంతే ..

అసలు చలే లేకపోతే – హవ్వ! .. ఎంత మంది విధివిలాసాలు వీధి విలాసాలు మారిపొయేవి..

అసలు మనుచరిత్రే తీసుకోంది – – పిచ్చి మాలోకం ఆ ప్రవరుడు – అటజని ఏమి చూశాడు – మూడుపాదల ముప్పావు ఏమీ చూడలేదు శబ్దధాటి తప్ప – చూసిందతా నాలుగో పాదం చివరలో చూశాడు ఏమిటది – శీతశైలం – అదన్నమాట సంగతి – ఒట్టి శైలం కాదు శీతశైలం – అసలా శైత్యమే లేకపోతే – వరూధునీ ఈ విభూధిబొట్లు అలముకున్న మోమునుజూసి మోహించేదా మీరేజెప్పండి. మోహిమ్చినా – కాసేపటికి వచ్చిమ్ది ప్రవరుడు కాదు మాయా ప్రవరుడని తెలిసినా ఆ విధంగా ప్రవర్తించేదా మీరేజెప్పండి?

ఎండ నిచ్చేది సూర్యాభగవనుడా – వానలైచ్చేది వరుణ దేవుడా – మరి – ఈయన ఒక్కడేనా – అంత చులకనైంది? నా అనుమానం – మీ సామాజిక వర్గానికే చెందిన ఇద్దరికి ఇచ్చాము – పైగా పంచభూతాలుగా మీ అగ్ని,నీరు, వాయువు ఇప్పటికే కేటాయింపుపదవులలో ( నామినేటెడ్ పోష్ట్) ఉన్నారు, ఈ సారి విస్తరణ లో ఇస్తాం అని చలిని మభ్యపెట్టి ఉమ్టారు… లేకపోతే ఈ పాటికి అంధ్రదేశమంతా – ఆయన అష్టకాలతోనూ – మాస/మండల దీక్షలతోనూ మార్మోగుతూ ఉండీ ఉండేది.

నా అనుమానం ఏమంటే వాళ్లకి మంచి అనుచరుడని చూడకుండా , వాళ్లపనులు ముప్పాతికపాలు చక్కబెట్టేదీ ఈతడే అని చూడకుండా మరుడూ, చంద్రుడూ కలిసి ఈ చలిదేవుడికి అన్యాయం చేసి ఉంటారని. అసలు చలి శక్తి ముందు చంద్రుడి శక్తి ఎంత మీరే చెప్పండి? చంద్రుడు కనిపించే 12 గంటలలో సగ భాగం మబ్బులచాటుకే పోతుందనుకోండి – మిగతా సగభాఅగం లో సగభాగము మరియూ – ఆ మిగిలిన సగభాగం లో సగభాగమూ (అనగ ముప్పాతిక వంతు అర్ధం కాకపోతే నా తప్పు కాదు మీ ఇంగ్లీషు మీడియం చదువుల తప్పేగానీ) పిల్లల హోంవర్కు చేయించడనికీ/చేయడనికీ, మేధావులుగా పోజుబెట్టి, తమకు తాము అమ్ముడుబోయి వార్తలు పుట్టిమ్చి అమ్ముకొంటూ కూడా మొహం లో ఇంత అమాయకత్వాన్ని కనబరుస్తున్న మౌఖికవార్తాహరులని విస్తుబోయిచూస్తూ ఈ ఏడాది Filmfare Awards లో Best News Actor err.. Anchor అనే కొత్త విభాగం ఉంటుందా ఉండదా అని అలోచించటానికి, ఆ విష్యం గా మి ఆవిడతోనో బావమరిదితోనో గొడబడటానికి సరిపోతుందా? కాగా శేషం లోంచి మీరు గట్టిగా గురుకపట్టె సమయాన్ని మినహాయిస్తే – మిగిలిందేమ్టి మూడోజాములో మూడోవంతు ( అనగా అరువది నిముషములు , అర్ధం కాకపోతే నా తప్పు కాదు మీ ఇంగ్లీషు మీడియం చదువుల తప్పేగానీ) – ఈ అరవై నిముషములలో మికు మెలకువ ఎప్పుడు రావెల – వచ్చినదిబో చంద్రుడెపుడు గనపడవలె – గనపడెను బో – వికారములెపుడు గలుగవలె
అదే చలి దేవుడిని తీసుకోండి – అన్ని జాములూ ఈయనవే – ఏ మొయిలూ ఈయన మన మైనంటకుండ ఆపలేదు. అయనదే సంకల్పం అయనే ప్రతికారం – మీరు కేవలం నిమిత్త మాత్రులే – మాన్య సింగుగారి లాగా – రోబో సినిమాలో చిట్టి లాగా ….

సరే రాజకీయం గా అన్యాయం జరిగితే జరిగింది – కవులేమన్నా – ఆకాశానికి ఎత్తారా సంతోషబడదామంటే – అదీలేదు – శీతోపాలంభం గురిమ్ఛీ వర్ణీంచిన సంగతి మీరెపుడైనా విన్నారా? ఎమ్ట సేపటికీ ఝెండా మోసి పనిజేసే కార్యకర్తని మరచినట్టు ఈ చలిని మరిచి నేతల భజన చెసారెగానీ ఆ మరుడికీ ఈ చంద్రుడికీ వెన్నుముక ఐన చలి కి ఎవ్వరైనా అసలు గుర్తించారా ? చలి బడ్డ శ్రమంతా చంద్రుడుగాచిన వెన్నెలైపోయింది గదా. అసలు చంద్రుణ్ణి శీతకరుడు అంటమేమిటి? అప్పుతెచ్చుకున్న రెండు సుగుణాలలో ఒకటి ఇచ్చింది చలి -కాబట్టి చలిదేవుడినే చంద్రుడిపాలిట కర్ణుడనాలి.

ఎన్నాళ్లనుమ్ఛి జరుగుతున్న అన్యాయమిది…

అసలు, ఆదిలోనే ఆదిదంపతులను మంచు-చలి తో పోల్చవలసినది వాగర్ధాలతో పోల్చటమ్ దగ్గరమొదలిన అన్యాయం, ఎప్పుడు శివుడ్నీ , వెన్నుడినీ అంటి పెట్టుకొని ఉన్నా – ఒహో నువ్వూ ఇక్కడే ఉన్నావా అని కనీసం పలకరించని ఆతిధేయుల అవమానమ్ .. హన్న హెన్నెన్నో కదా..

తేత్రాయుగం చివరిలో చలిదేవుడు వినీలాకాశ వీధిలో దీక్షకు దిగితే – శివుడు బుజ్జగించి అమర్నాధగుహలో అవతరిస్తాననిన్నీ, ద్వాపరయుగమంతా నీదేపో అనిన్నీ చెప్పివిరమింపజేశాడుట – అప్పుడు యమునా తటి లో గోపకాంతలు – ఓ చలిదేవుడా – మాకు కాస్త ఎక్కువచలిపుట్టించవయ్యా – ఆ వంకతో నన్నా నల్లనయ్య దగ్గరకు వెళ్తాము అని ఒక్క శరత్తు లోనే కాక సంవత్సరం పొడుగూతా ప్రార్ధించేవారుట. యుగం మారింది, అవతారమ్ మారింది – మళ్ళీ మా చలి దేవుడి కధ మొదటికొచ్చింది.

చూశాడు ఛుశాడు – ఎవరో ఒకరు ప్రార్ధించకపోతారా అని – బొత్తిగా ప్రార్ధించటం మానివేశారు అని నిర్ణయానికి వచ్చినట్టున్నాడు – నిత్యగ్రీష్మం లా ఉమ్డే హై. లోనే ప్రతాపం చూపిస్తున్నాడు – నేను ఉన్నపట్టున ఓ సిద్ధాంతి గారినో ఓ గురుజీనో పట్టుకొని గతం లో స్తోత్రాలు కవచాలు ఉన్నాయేమో వెతికి పట్టుకోవాలి – లేవంటే ఒక శీతలాష్టాకం – దానికి ఫలశృతీ నేనే రాయాలీ – ( ఏమిటీ ఏ భాషలోనంటారా?..) కాదు కనీసం ఓ వచనం ఐనా రాసి పడేయాల్సిందే – ( ఇలా రాసి పడేయటం వల్ల మరో లాభం కూడా ఉంది – రాసేప్రక్రియలో పుట్టిన ముసాయిదా ప్రతులనన్నీటినీ తీసుకుపోయి చలిమంట వేసుకోవచ్చు) .. అందాకా చలితో తంతాలు పడుతున్న మీకు ఈ చిట్కాలు ఏమైనా ఉపయోగపడతాయేమో చూడండి

1) లాప్ టాప్ సార్ధకనామధేయురాలనుకొని – ఒడిలో పెట్టుకు కూర్చోవటం – దీని వల్ల తాత్కాలిక ప్రయోజనమున్నా దీర్ఘకాలిక ప్రమాదాలు కూడాఉండవచ్చు -పాటించేముందు మీ లాప్టాప్ తయారీదారుని, మీ కుటుంబ వైద్యుడ్నీ సంప్రదించండి.

2) నచికేత్ గారి పద్ధతి

3) ఈ టపా చివరిలో ఒకటి కాదు రెండు కాదు నాలుగు చిట్కాలున్నాయి చూడండి – కూపోదకం, వటఛ్ఛాయా బహుశః అందుబాటు లో ఉండటం నగరాలో కష్టమే అనుకోండి ఇంకో రెండు ఉన్నాయిగా.. ఐనా కష్టేఫలి అని ఊరికే అన్నారా …

4) “కుదిరితే ఓ కప్పు కాఫీ” – ఈ మాట ఇంటావిడతో అనకండి – డబల్ ద్యూటీ పడగలదు.

5) మంచి దోస్తుంటే ఇరానీచాయ్

6)116 రూపాయల రీఛార్గ్ కూపన్ వేయిస్తే చెప్పబడును

7)516 రూపాయల రీఛార్గ్ కూపన్ వేయిస్తే చెప్పబడును

8)1116 రూపాయల రీఛార్గ్ కూపన్ వేయిస్తే చెప్పబడును

ఇన్ని చిట్కాలు తెలిస్తే అవేపాటించకుండా ఇక్కడ ఊకదంపుడెందుకూ అనుకుంటున్నారా ?

“ఆలుమగలలడాయి
అంతమొందిన రేయి
అనుపమానపు హాయి
ఓ కూనలమ్మా”
అని ఆరుద్ర కచ్చితంగా చలికాలం లోనే వ్రాసిఉంటాడు అన్న నా మాట కి – మళ్లీ మాటామాటా పెరగటం వల్ల .

తాజాకలం : పొద్దునే లేచి అపాయింట్ మెంట్ కోసం గురుజీ కి పోన్జేస్తే – ఇంత చలిలో ఇంత పెందలకడనే ఆటంకం కలిగించినందుకు “అక్షింత”లేసి – ఈ మాత్రం దానికి మళ్లి సముఖంఎందుకులే అని- దక్షిణ – ఆయనపోన్లో రీచార్గి కూపన్ రూపం లో ఇక్కడినుంచే సమర్పించుకోనే భాగ్యానిచ్చి – ఇలా అనుగ్రహించారు:

‘శిష్యా – దేవుడా చలి దేవుడా చలి అని ఏడిస్తే చలి వేరు దేవుడు వేరూ అనీ – అలాకాకుండా చలిదేవుడా చలిదేవుడా అని ఏడిస్తే నీవు చలిని దేవుడిగా చూస్తున్నట్టే .

మాట కి మాటకి మధ్య నీ బ్లాగులోలా ఎక్కువగా గాపొదలకు, మిగతాదంతా నే చూసుకూంటా – నువ్వు రిచార్జ్ చేయించినతరువాత.”

ఆయన అనుగ్రహభాషణాసారాంశమే ఈ టపా శీర్షిక.

9 responses to “దేవుడా చలి , చలిదేవుడా

 1. హహ్హహ్హా.. భలే ఉందండీ చలిదేవుడి స్థుతి..:) అసలింతవరకూ ఇటువంటి ఆలోచనే రాలేదు, చలి కూడా దేవుడే అయ్యి ఉంటాడన్ని. మీ దయ వల్ల ఇప్పుడు తెలిసింది..:) టపా మాత్రం సూ…పర్.

 2. మీ చలిదేవుడి ప్రభావం హై.పుస్తకాల సంత పైనకూడా పడింది సార్! ఈ యేడాది సందర్శకుల తాకిడి గణనీయంగా పడిపోయింది అని సంతలోని దుకాణదారుల భోగట్టా!

 3. నేను గుర్గావ్ లో ఉన్నపుడే చలికి దేవుడి హోదా ఇచ్చేశాను. హమ్మో! ఏం చలీ…. ఏం చలీ!

 4. చాలా చాలా బాగా రాసారండీ 🙂

 5. హ హ చలిదేవుడూ… మీ చిట్కాలూ సూపర్ 🙂

 6. ఎప్పట్లాగానే బావుందండీ టపా.
  చలిదేవుడి లాంటి ఆలోచనలు మీకే వస్తాయి.
  ఔనౌను, మొదటి రెండూ మన రాజధానిలో కష్టమే. పర్లేదు, కడమా రెంటితోనూ ప్రస్తుతానికి కష్టం ఫలించి గండం గడుస్తోంది : )

 7. అపర్ణ గారు,మురళీమోహన్ గారూ, సుజాత గారూ, కృష్ణ గారు, వేణూ శ్రీకాంత్ గారు, బాలు గారు,
  నెనరులు.

  మురళీమోహన్ గారూ
  చలికి భయపడి నేను కూడా రాలేదండి ఈసారి.

 8. చిట్కాలు బాగున్నాయ్. 2,3 మరియు 5 లు పనికి రావు. చలిదేముడేం ఆడంగులపై శీతకన్నెయ్యడు స్వామీ. ఎల్లారూ సమానమే. రీచార్జి చేయించక తప్పదా ఏం, చిట్కా కోసం?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s