Category Archives: తోటి బ్లాక్కర్తలు

ఇదె పద్యమ్మిదె కవిత్వ మిదె భక్తియునౌ! -౨

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

చాలాఏండ్ల క్రితం (నే బ్లాగులలో అడుగుబెట్టక ముందు)కొత్తపాళీ గారు మీకిష్టమైన సీస పద్యం చెప్పమని బ్లాగరులందరినీ ఆహ్వానించారు.
ఆ టపా చదివినప్పటినుంచి, తీరిగ్గా కూర్చొని ఈ పద్యం విని వ్రాసి ప్రకటించాలని అనుకోవటమే గానీయండి, కార్యరూపం దాల్చింది లేదు.
మహానుభావులు బాపూరమణల సంపూర్ణరామాయణం నుండి, ఇవేళ సంగ్రహించగలిగాను. అవధరించండి.
ఎందుకిష్టం అని అడగకండి, నాకే తెలియదు ఎందుకిష్టమో

సర్వమంగళగుణసంపూర్ణుడగు నిన్ను
నరుడు దేవునిగా గనరయు గాత!

రామనామము భవస్తోమభంజనదివ్య
తారకనామమై తనరు గాత!

పదికొంపలునులేని పల్లెనైనను రామ
భజనమందిరముండు వరలు గాత!

కవులెల్ల నీదివ్యకధ నెల్లరీతుల
గొనియాడి ముక్తిగైకొంద్రు గాత!

ఎట్టివ్రాతయు శ్రీరామ చుట్ట వడక
వ్రాయబడకుండు గావుత! రామ వాక్య
మనిన తిరుగనిదని అర్ధమగునుగాత!
రమ్యగుణధామ! రఘురామ! రామ! రామ!

 

స్వస్తి.

ప్రకటనలు

గగనమును నాకముగ మార్చు ఘనుడవు నీవే

శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ది మహోత్సవాల సందర్భంగా రాయలవారిని గూర్చి పద్యం వ్రాయాలని ఆశ గలింగింది, శ్రీ కొడిహళ్ళి మురళీ మోహన్ గారి ప్రోత్సాహం మీద.

ఏమి రాయాలా అని ………… తరువాత
తెనాలి రామకృష్ణుని పద్యం లో రాయలు వారు  చిన్న మార్పు చేసి విశేషార్ధం కల్పించిన విషయం గూర్చి చెబుదామని ఆలోచన వచ్చింది.  

తెనాలి రామకృషుల వారు నంది తిమ్మన గూర్చి ప్రశంసగా చెప్పిన పద్యం ఇది:  

మా కొలది జానపదులకు

నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట
ద్భేకములకు గగనధునీ
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !

రాయల మార్పు చేసిన పద్యం ఇది:

మా కొలది జానపదులకు

నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట
ద్భేకములకు నాక ధునీ
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !

దీని గూర్చి మరింత వివరణ ఇక్కడ చూడండి.
సరే  ఎలాగో నాలుగో పాదం కూర్చాను :”గనమును నాకముగ మార్చు ఘనుడవు నీవే”
అని.
పై మూడు పాదములకు గణములు కూర్చిన తరువాత పద్యం ఇదీ:

 

 

 

ఎందుకైనా మంచిదని  పద్యాన్ని  తీసుకువెళ్లి  కామేశ్వర రావు గారికి చూపించాను, వారు చిన్న మార్పు చేసి విశేషార్ధం కల్పించిన పద్యం ఇది:

జనజీవనసుఖమయ పా

లనమునను సుకవులకైతలను రాజకవీ!

 గనుగొన సులువుగనిలను,గ

గనమును నాకముగ మార్చు ఘనుడవు నీవే!

ఏమిటీ, కామేశ్వర రావు గారూ మార్పు చేయక ముందు పద్యం గనబడతం లేదు అంటారా? అదే గగనం అంటే.

సరే మొత్తానికి పద్యములైతే కట్టాను, చాలా రోజుల తరువాత, అనుకున్న పని, అందులోనూ శక్తికి మించినది, పూర్తిజేయగలిగాను,చేతనైనంతలో. గురుకృప, మిత్రలాభం తోడై. ఆ పద్యాలు ఇక్కడ చూడవచ్చు.

భైరవభట్ల వారి మార్పు చూసి చూడగానే – నా నోట వచ్చిన మాట ” మా కొలది జానపదులకు..”

పద్యాన్ని పూర్తి చేస్తే: 

మా కొలది జానపదులకు

నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట
ద్భేకములకు నాకధునీ
శీకరముల చెమ్మ! గనగ, శ్రీకామేశా!

దత్తపది – ౧

రాబోయే సీతాకళ్యాణానికి, ఎలాగు మీరు పద్యాలు వ్రాస్తారు కాబట్టి, ఈ లోపు

మిల్క్( milk),
బటర్ ( butter),
జాం ( jam),
శాండ్ విచ్( Sandwich)

పదాలతో –
బాలకాండ – శివధనుర్భంగం ముందువరకు, ఏదైనా అంశంపైన – మీకు తోచిన వృత్తం లో
పద్యం కావాలి.