Tag Archives: ఉగాది

ఎదురుగ నీవై విరోధి ఇంతనె గతమై

సదమదమౌచుంటినినే
వదలనిచీకాకుతోడ వ్యాపారములన్
కదిలెను కాలము వడిగొని
ఎదురుగ నీవై విరోధి ఇంతనె గతమై.

గతజలసేతుభంధనము కాదిది, దెల్పగనీకు జెప్పెదన్
జితజనమానసుండు విధి జిక్కెయె, జేరెను దూరలోకముల్
ఋతువులు కర్షకాలికి ఎప్పటి లాగునె గూర్చెశోకముల్
చెదిరెను ఐకమత్యము రచింపగ గోరియె కొత్తహద్దులన్

ఐకాసలుబుట్టెనటునిటు
ఏకతవిభజనలగోరి, ఎటులను గానీ
మాకయ్యెనిత్యకృత్యము
శ్రీకృష్ణునినామజపము జెప్పగ నిపుడున్.

ముక్కయొ, ముక్కలు జేతువొ,
ఒక్కటి గానుండమనియె ఓర్మినిడెదవో
రెక్కాడకడొక్కాడని
బక్కబతుకులను మటుకిక బాధింపకుమా.

గాలిని బీల్చభీతిలిరి; కైనిడి యూపక మొక్కిరందరున్
కూలెన్ ధైర్యముల్, నరులు గోళిని బొందగ సూదిమందునో
జాలిగ వీధులంబడిరి జల్లదనంబది శాత్రువైబడన్
చాలువిరోధికృత్యములు, చల్లగ జూడుము నెల్లవారలన్

వాకల్సాగును తేనెలేతెనుగునెవ్వారేలవంచించిరో
మాకూనల్ పలుకంగబోవరుబడిన్, మ్లానమ్ము, శిక్షార్హమై,
ఏకైవచ్చియె జేరిమేకగుటనే ఏలాగు మాసీమ “పో
నీకానీ” యనిజూడకేవిడుదురోనీవైన ప్రశ్నింపుమా.

వైద్యులు ఒజ్జలు తమతమ
భాధ్యతలనెరిగియెజూడ బాలల, మహిళల్
విద్యాధికసౌరునందన్
ఉద్యమస్పూర్తిన్ యడుగిడుమోయీ వికృతీ.

ఎచ్చోట పిల్లలే ఎగిరుచు గెంతుచు
బడికిబోవగలరో భయము లేక

ఎచ్చోట మహిళలు ఎదిరించి క్రౌర్యమున్
గెలిచి నడిచెదరో గేలి లేక

ఎచ్చోటనుప్రకృతి నెంచిరక్షింతురో
రాబోవు తరములా రక్ష గోరి

అచ్చోటు నెలకొల్ప ఆంధ్రదేశమునందు
ఆనబూనియెరమ్ము ఆశ నిమ్ము.

పద్యములివె అర్ఘ్యపాద్యములని
స్వాగతింతు నేను సంప్రదాయ
రీతి, సంతసించి లెమ్ము,రమ్మువికృతీ,
ఎదురుకోల ఇద్దె ఎత్తుగీతి.

ప్రకటనలు

విరోధికేస్వాగతమను వింతను గనుడీ!

కం.  ముచ్చెమటలుబట్టెనయా
రచ్చల గనిద్రవ్యమాంద్య రక్కసి రూపున్
విచ్చేయగనీవునిపుడె
హెచ్చరికయుసేయలేను హేలాగతులన్!

కం.    పేరే విరోధి యంటివె
మారేమిపలుకుదునయ్య, మౌనము ముద్రై
దారేమోమున్ముందిక
రారో, వచ్చెదరొ హితులు,రక్షింపన్,నన్.

శా.  పేరున్నెంచరొ మానసంబునసుమీ! భీతిల్లరో వీరులై,
క్షీరాంభోధిసుతామనోహరుడనేసేవించుధైర్యమ్మొ,తీ
రారానున్నదిరాకమానదనువైరాగ్యమ్మె సిద్ధాంతమో
నీరాకంగనిసంబరమ్ముజరుపన్ నెమ్మౌననేనమ్మికో-

కం.   ( అరువది యేండ్లకు యొకపరి)
నరులిండ్లనుగట్టితోరణములే, దీర్చీ
అరుగుల గడపల ముగ్గులు
విరోధికేస్వాగతమను వింత యిదిగనన్.

ఉ.     ఓయి!వసంతకాలమను ఉద్దిరి వెంబడి రాగమచ్చికౌ
తీయని పాటలన్ వినగ దెచ్చిన జెల్లునుకోకిలమ్మలన్
దోయిది చాలదన్నటుల తోడుగ నెన్నిక దెచ్చినాడవే
హాయిని గూర్చుమాసమున హవ్వ!విరోధివిగాకయుందువే.

ఉ.  నామము వ్యక్తిలక్షణగుణమ్ముల కద్దముబట్టుపాతదౌ
నేమము యంతరించెగద, నేస్తమ! పేరది గుర్తుకోసమే
లేమియు కల్మిజంటలిట లెక్కగు నన్యము లెల్లశూన్యమే
నీమదినెంచి ఈ నిజము నిత్యవిరోధముబూనబోకుమా!

సీ.     మున్నొక్కడిటువచ్చి ముంచెలే నిలువునా
క్రయవిక్రయములందు కపట పుటల

తొల్లియొక్కడువచ్చి చెల్లుచీటినివ్రాసె
సోదరులకు కోట్ల సొమ్ము కొఱకు

ఏడాది ముందఱ ఇటులొచ్చి నొక్కడు
వేలకోట్లను జేసె వెఱ్ఱిమాట

వచ్చుచు నొక్కడు దెచ్చెనులెసునామి
కూలెరానొకడుదలాలు వీధి
ఆ.వె.     పేరు మంచి దౌట వారుచేసినదేమి
చెప్పరాదుగాని చేదునిజము;
మంచి చేయ నీవు మరువబోరుజనులు
కాలచక్రమెంత కదిలెనేని.

ఉ.    నేతల వైరివై నిలుము నీతిని జంపిరి లోకమందునన్
వాతలు బెట్టుమా బిలచి వర్తక శ్రేణుల సత్యదూరులన్
పూతపవిత్రభారతిని పోరియె ద్రుంచుము యుగ్రవాదమున్
యాతన బెట్టిపేదలను అద్దెబలమ్మని విఱ్ఱవీగకే.

కం.   బీదల, పిల్లల, మహిళల
మేదిని శుభములనుగూర్చ మీలో ఒక్కం
డే దయ దలంచును త్వరన్-
సాదుగ నిల్వంగనీవు చాలదె మేలౌ.