Tag Archives: పట్టుచీర

కోకాంజలి వారి పీకితే పట్టుచీర

మొన్న శనివారం పన్నెండింటికి, బయటకు వెళ్లబోతుంటే భార్యామణి ఆపింది, సెలవరోజన్నా కాశేపు ఇంట్లో ఉండవచ్చు గదా అని…

ఈ వింతపోకడ కి కాస్త ‘హా’చర్యపడి, మెల్లగా తేరుకొని, కాదు బయటకు వెళ్లాలి బాంక్ పని ఉంది అన్నాను.
తర్వాత ఆన్ లైన్ బాంకింగ్ చేసుకుందురులే ఉందురూ అంది..
కాదు వెళ్లాలి..
ఉంటే మీకు పాయసం పెడతాను..
వద్దులే పెళ్లైనకొత్తల్లో మొదటి పండగ అని పిలిచి మీ అమ్మచేసిపెట్టిన పాయసం రుచే ఇంకా మరిచి పోలేదు,మళ్లా ఇప్పుడు నువ్వు పాయసం చేస్తే …
అదే మరి .. పాయసం పెడతానన్నాను కాని , నేను వండి పెడతానన్నానా?,
హమ్మయ్య పాయసం వండటం రాదని ఒప్పుకున్నావ్, సంతోషం.
అంటరానితనం నేరం గాని, వంటరానితనం నేరం గాదు.
(అంటరానితనం అంటే సాంఘికమా, సాంసారికమా అని అనుమానం వచ్చింది కానీ, ఎక్కడినుంచో “నేలతో నింగి అన్నదీ” అన్నపాట వినబడటంతో అర్ధమైపోయింది)
ఇంతకీ పాయసం పక్కింటావిడ సౌజన్యమా?
పక్కింటావిడ ఇవ్వటానికి ఇదేమీ ఐతవోలు అగ్రహారం కాదు, ఆవిడ మీ పిన్నికూతురూ కాదు
మరి, ఇప్పుడు పాయసమెక్కడిది, మెక్కడానికి?
నిన్న ఆర్డర్ చేసాను వసతిగృహా స్వీట్ షాపులో, రెండు లీటర్ల పాలతో పాయసం చేయమని, ఇంకాసేపట్లో వచ్చేస్తుంది, వేడి వేడి గా…
రెండు లీటర్లు అని వినంగానే, నా ప్రయత్నం లేకుండానే, దభ్ మని కుర్చీ కూలబడ్డాను,
రెండు లీటర్లా…
ఊఁ అవును..
రెండు లీటర్లా…
అవును, ఎందుకంత ఇదైపోతారు..
ఇంట్లో ఉన్న రెండు శాల్తీలకి .. రెండు లీటర్లా?
మధ్యాన్నం మా తమ్ముడొస్తున్నాడు…
ఓహో.. అదా, ముందు చెప్పావు గాదు…
ఐతే, మీ తమ్ముడు వచ్చాక,తిన్నాక మిగిలితే అప్పుడు తింటాలే,,,
అలాకాదండి…ఇప్పుడు వేడి వేడి గా ఓ చెంచానో కొంచమో రుచి చూడండి, మళ్ళా వాడు మొత్తం తినేసిన తరువాత వాడినంటారు..
ఈ లోపు ఫోన్ మోగింది…
ఫోనెత్తి హలో అని, రిసీవర్ మీద చెయ్యెట్టి, పాయసం వాడే, ఇంటి అడ్రస్ అడుగుతున్నాడు, వచ్చేస్తాడు, కూచోండంది.

బయటకు వెళ్లటానికి బాంక్ కాక వేరే వంక దొరకనందుకు నన్ను నేను తిట్టుకుంటూ కుర్చీ లో సెటిలయ్యాను.

వేడి వేడి పాయసంబు, అని పాడుతూ టీ.వీ లో ఎదో చానల్ పెట్టి, రిమోట్ టీవి మీద పెట్టి వంటింట్లోకి వెళ్లింది…

చేశేది లేక టివి వైపు మొహం తిప్పితే, “నిమ్మ”టీవి వస్తోంది..
ఇదేమి టీవీ అడిగాను ..

కొత్తగా వచ్చింది లెండి..
ఐటే మటుకు ఇదేమి పేరంట..
అనంతపురం నాయుడు గారు పెట్టారు లెండి, ఆయన నిమ్మతోటల మీద పైకి వచ్చాదు, పైగా వ్యాపారాలన్ని .. కర్నాటకలోనే .. అందుకని .. ఆ పేరు పెట్టారు.. ఐనా ఏ పేరైతే ఏంటి, మీరు కామ్॑గా చూడండి.. ప్రోగ్రాం మొదలౌతొంది అంతూ వచ్చి సోఫాలో కూర్చుంది.
ఇయస్పీయన్ లో..
అది రీపీట్ టెలికాష్ట్ చూడచ్చులే.. ఇది చూడండి..
తల టివి వైపు తిప్పగానే . శోకాంజలి సగర్వం గా సమర్పించు పీకితే పట్టుచీర కు స్వాగతం, వెల్కం వాంగో అని గట్టిగా అరుస్తూ మెలికలు తిరిగి పోతూ పుష్ప ప్రత్యక్షమైంది.

థీ చానల్ మార్చు – శనివారం పొద్దున్నే ఈ శోకాంజలి ఏంటి..
శోకాంజలి కాదండి .. మీకెప్పుడైనా ఓ మంచి మాట ఐనా వినపడితే కదా .. కోకాంజలి .. కోకాంజలి …
కోకాంజలా?
అవును.. కొత్త చీరెల షాపు,కోక అంటె చీరె అదిగూడా తెలియదా?
కోకల అంజలి – కోకాంజలి…
ఒహో ఏమి క్రియేటివిటీ అండి.. అదిరింది పో…..
ఐతే రాత్రి మేము గోపాల్కిచ్చిన వీడ్కోలు పార్టీనీ. షోడాంజలి అనచ్చన్నమాట
షోడాల అంజలి – షోడాంజలి
మీరుఅక్కడ కేవలం సొడానే తాగిన భ్రాంతి ఇప్పుడుఎవరికీ కలిగించక్కరలేదు.. టి.వి చూడండి.
ఇప్పుడు మీ తమ్ముడికి మననిచ్చేది పాయసాంజలి
అదేదో ఆంగ్లచిత్రంలో శునకరాజానికైనట్లు, మా ఆవిడ రెమోట్ నావైపు తిప్పి మ్యూటు బటనొత్తంగానే నా మాటలు వినపడటం మానేశాయి.

సరిగ్గా అప్పుడే పుష్పగొంతు ఉన్నట్టుండి పెద్దదైంది…
హాయ్, హల్లో, నమస్తే, నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, వెల్‍కం, వాంగో…
కోకాంజలి వారి పీకితే పట్టుచీర కార్యక్రమానికి మీ అందరికీ మరొక్కసారి స్వాగతం, నాకు తెలుసు మీరందరూ వైట్చేస్తుంటారని.. అందుకే తొందర తొందరగా వచ్చేశాను…ఇప్పటికే చాలా మాట్లాడేసినట్టున్నాను, ఇంక మొదలెట్టేద్దాం…
ఇవాళ మన మొదటి అదృష్టవంతురాలు అనగా మొదటి లకీ పార్టిసిపెంట్ , అనగా మొదటి కాలర్ అనగా ఎవరో చుద్దాం అనగా
అంటూ .. ఓ నంబర్ పెద్దగా పైకిచెబుతూ నొక్కసాగింది…

హలో
హలో..
ఎవరండీ మాట్లాడేదీ..
సుగుణావతిని
సుగుణావతి గారా
ఆయ్
నన్ను గుర్తు పట్టారా
ఆయ్..మిమ్మల్నీ…
గుర్తు పట్టారా…
ఆయ్.. బుజ్జీ గారి కోడలివా..
సుగుణావతి గారూ, అయ్యో గుర్తు పట్టలేదా, నేనండీ, నిమ్మ టివీ నుంచి పుష్ప ని…
ఆయ్ ఆయ్.. పుష్పా.. నీవనుకోలేదనుకో…


ఇంకో ఐదు నిముషాలు వాళ్లిద్దరు వదినా మరదళ్లు లా మాట్లాడేసుకుంటుంటే, మా అవిడ వాళ్లని తదేకంగా చూస్తూ మధ్య మధ్య లో పుస్తకం మీద ఎవీవో రాసుకుంటూ మురిసిపోతుంటే, హిందీనే మాట్లాడే మూడోఫ్రంట్‍నేతల మధ్య చంద్రబాబులా బిత్తరచూపులేసుకొని కూర్చొన్నాను.
ఆయ్ .. ఇహ పీకితే పట్టుచీర మొదలెడదామా
ఆయ్ .. ఎట్టేయండి….
మీకు రూల్స్ తెలుసా అండీ చెప్పమంటారా..
ఆయ్ .. తెలుసండీ..
సరే ఐతే..
ఈ చీరా కనిపిస్తుందా అండి, .. ఈ చక్కగా ముద్దుస్తున్న వంకాయరంగు చీర తిమ్మనా బ్రదర్స్ వాళ్లదండీ, మీకు తెలిసే ఉంటుందీ, ఐనా చెబుతాను ..తిమ్మనా బ్రదర్స్ అమలాపురం లో సైకిలు మీద వీధి విధి తిరిగి పాతచీరెలకు స్టీలు గిన్నె లమ్మేవాళ్లు.. అక్కడినుంచి అమ్చెలంచెలుగా ఎదిగి ..
కీచ్ కీచ్ కీచ్
బర్ బర్ బర్ ( పేపర్ మీద పెన్సిల్)

కీచ్ కీచ్ కీచ్
బర్ బర్ బర్ ( పేపర్ మీద పెన్సిల్)
కీచ్ కీచ్ కీచ్
బర్ బర్ బర్ ( పేపర్ మీద పెన్సిల్)…

అలాంటి తిమ్మనా బ్రదర్స్ వారి ఈ వంకాయ రంగు, పసుపు బోర్డర్, బోర్డర్లో జరీ ఉన్నా చీర మీ సొంత చేసుకోవచ్చు…
సుగుణ మణి గారు..
ఆయ్ ..
ఉన్నారా…
సుగణమని కాదు సుగుణావతండీ..
అదే ఆదే .. సుగుణావతి గారు.. అర్ధమైంది గా
ఆయ్
ఈ చీర మీ సొంతం చేసుకోవటానికి దీని రేటెంతొ చెప్పాలీ
ఆయ్
నేను మీకు ఒక నంబర్ ఇస్తున్నాను.. అందులోచి ఒక అంకె పీకేసి మీరు దీని కరక్ట్ రేట్ చెప్పాలి .. అలా కరక్టుగా పీకితే కనక ఈ పట్టుచీర మీదవుతుంది అదే ఈ కోకాంజలి వారి పీకితే పట్టుచీర …
ఆయ్…
రెడినా..
ఆయ్…
సుగునమణి గారు, అదే సుగుణావతి గారు..
ఆయ్..
నేను నంబర్ చెప్పేముందు చిట్కా చెప్పండి…
ఆయ్.. చిట్కానా..
ఆయ్.. మీరు మొదటి కాలర్ కాబట్టి చిట్కా చెప్పాల్సిందే …
చిట్కా అంటే అండీ .. మీకు చారు చేసేటప్పుడు..
ఆఆ చారు చేసే టప్పుడు.. నాకు చారంటే భలే ఇష్టం చెప్పండి..
చారు చేశే టప్పుడు.. టమాటాలు కోయటానికి బద్దకం గా ఉంటే, టమాటాకి ఒక చిల్లుబెట్టి ఆపర్ని చారులో ఏశేయచ్చండి…
ఓహో.. చారు చేశేటప్పుడు . టమాటాకోయకుండ చిల్లిబెట్టు ఆపర్ని వేశేయచ్చు భలే చిట్కా చెప్పారండి
ఆయ్
ఇక ఆడదామా
ఆయ్…
మీ నంబర్ .. ౪౨౬౭౫…
ఇంకోసారి చెబుతున్నానండి.. ౪౨౬౭౫..
ఏది పీకమంటారు…
ఏడండి…
ఏడూ.. సెవెన్..
సుగుణవతి గారు .. ఇదేనా మీ ఫైనలాన్సర్…
ఆయ్…
అయ్యో సుగునవతి గారు ౭ తప్పండి.. ఇటీజ్ సో క్లోజ్ బట్ తప్పండీ…
సరే మీరు మొదటికాలర్ కాబట్టి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను…ఏ నంబర్ పీకాలో ఈ సారి భాగా ఆలోచించి చెప్పండి.
౪…
సుగునావతి గారు ౪…
ఆయ్ ౪…
అయ్యో సుగునా వతి గారు .. మల్లా తప్పుజెప్పారు.. సరే మీరు మంచి చిట్కా చెప్పారు కాబట్టి ఇంకో చాన్స్ ఇస్తున్నా చెప్పండి…
ఆయ్ .. చాలా తాంక్సండీ…
చెప్పండి ఏమీ పీకమంటారు…
౨…
సుగునావతి గారు .. కంగ్రాట్యులేషన్స్, కరక్ట్ గా చెప్పారు.. ఈ చీరె మీదే…
ఆయ్.. ఎప్పుడిస్తారండీ…
ఆయ్, ఆ విషయం చెప్పేముందు సుగుణవతి గారు ఒక్క విషయం ..మీరు ముందు ౭ అన్నారు, తరువాత నాలుగన్నారు, తరువాత టూ చెప్పారండి మొత్తం సెవెన్ ప్లస్ ఫోర్ ప్లస్ టు పదమూడూ ఎవరినైనా అంటే , మీ వారిని గాని, మీ అత్తగారిని గాని మీ కోడలిని గాని…
ఆయన లేడండి..
సుగునావతి గారూ .. లేడంటే…
షాపుకెల్లాడండీ,..
ఒకే ఒకే .. సుగుణ వతి గారు.. పీకకపోయినా నష్టం లేదు.. తర్వాత ఎటూ పీకుతారు కాబట్టి, కాని ఇప్పుడు మీరు మీ వారిని పీకితే .. మా మొగుళ్ళూ పెళ్ళాలూ పోగ్రామ్లోనూ , మీ కోడలిని గానీ అత్తని గానీ పీకితే అత్తల్స్ -కోడల్స్ పోగ్రాం లో నూ డైరక్ట్ సెకండ్ రౌండు లోకి వెళ్లచ్చండీ…
ఆయ్.. తెలుసండీ.. చెప్పాను.. ఈటయానికి వత్తానన్నాడు .. రాలా…
బాడ్లక్ సుగుణావతి గారు.. అఎనీవే కంగ్రాట్యులేషన్స్ ఫొర్ పట్టుచీరా.. బై….
..
మన తర్వాతి కాలరెవరో చూద్దాం…

ట్రింగ్ ట్రింగ్
ట్రింగ్ ట్రింగ్
అలొ
హలో..
అలొ
నేను నిమ్మ టివీ నుంచి పుష్పని మాట్లాడుతున్నానండి…
హహహ… హుహ..అ చెప్పండీ…
అయ్యో ఏమిటి అలా ఇదై పోతున్నారు…..
హహహ.. అంటే.. మీరు ఫోన్చేస్తారని చాలారోజులుగా చూస్తన్నమండి.. ఇవాళజేసరికి.. హహహిహిహిహహుహైహిహ… .మీరన్నా మీయాంకరింగన్నా హహ్హిహుహహిహు మా ఇంటో అందరికీ ఛానా ఇష్టమండీ, ఒరిసా అమ్మాయైనా హహుహ తెలుగు చక్కగా మాట్టాడిద్ది హిహిహి అనుకుంటాం…హహహహ
చాలా తాంస్కండీ.. మీ పేరేంటండీ…
నా పేరు సరోజండీ…
(మా అవిడ నోటు పుస్తకం మీద మళ్ళీ రాయటం మొదలు పెట్టింది)
సరోజ గారు…
మా ప్రోగ్రామ్ చూస్తుంటారా…

అయ్యో.. రోజూ చూస్తానండీ..
ఇవాల చుస్తున్నారా…
ఆ చూస్తున్నానండి…
ఐతే ఇంతకుముందు కాలరెవరో చెప్పమ్డీ…
సుగుణవతి గారండి…
సుగణవతి గారు..ఊ ఏ ఊరినుంచి…
..అనకాపల్లి నుంచి అండీ, ఆవిడకి ఒక మొగుడు, ఇద్దరు పిల్లలండీ, ఇద్దరు పిల్లలూ ఇశాపట్నం ఇకాస్లో ఇంటర్ చదుతున్నారంటండి.. ఇంకా సుగుణ వతి గారు చెప్పినా చిట్కా అండి…
సరోజ గారు.. సరే.. మీ ప్రోగ్రామ్ చుస్తున్నారని అర్ధమైంది …
మీ దేవూరండీ….
….
కీచ్ కీచ్ కీచ్
బర్ బర్ బర్ ( పేపర్ మీద పెన్సిల్)

కీచ్ కీచ్ కీచ్
బర్ బర్ బర్ ( పేపర్ మీద పెన్సిల్)
కీచ్ కీచ్ కీచ్
బర్ బర్ బర్ ( పేపర్ మీద పెన్సిల్)

సరోజ గారు .. మొదలు పెడదామా ..
తొందరగా అడగండండీ, మా కోడలు కూడా పక్కనే ఉంది…
సరే సరోజ గారు..
మీ కోసం తందనాబ్రదర్స్ వారి ఈ గచ్చకాయ రంగు పట్టుచీర రెడిగ ఉండండీ..మీకు తెలిసే ఉంటుంది తందనా బ్రదర్స్ వాళ్లు ముందు ఆత్రేయపురం లో పూతరేకులమ్ముకునేవాళ్లు.. ఒక సారి సరదాగ చూసొద్దామని బొంబాయి వెళ్లి కీచ్ కీచ్ కీచ్..
కీచ్ కీచ్ కీచ్
బర్ బర్ బర్ ( పేపర్ మీద పెన్సిల్)

కీచ్ కీచ్ కీచ్
బర్ బర్ బర్ ( పేపర్ మీద పెన్సిల్)
కీచ్ కీచ్ కీచ్
బర్ బర్ బర్ ( పేపర్ మీద పెన్సిల్)
దీని వెలె చెబుతున్నాను…
౧౩౯౫౦..
సరోజ గారు,
ఏది పీకమంటారండీ..

సరోజ గారు,కంగ్రాట్యులాషన్స్ .. అంత కరక్టుగా ఎట్టాచెప్పారండీ..
౧ నాకు లక్కీ అండీ,
ఓహో సరోజ గారూ…అలా చెప్పారా..
మరి ఇప్పుడు.. మీ కోడలు పక్కనే ఉందన్నారు కదా..
ఆ పీకుతున్నానండీ…
టఫ్…
ఇప్పుడు కోకాంజలి వారి పీకితే పట్టుచీర కార్యక్రమంలో ఓ చిన్నబ్రేక్..
హమ్మయ్య అనుకొని, చానల్ మారుద్దామని రిమోటందుకోబోతుంటే..
నేనివ్వను, మళ్లా కాల్ మిస్సయితే కష్టమ్ అంది.
అదేదో అపశకునం లా వినిపించి.. గుండెదిటవు చేశుకునే ప్రయత్నాలుచేస్తుంటే..
ఫోన్ మోగింది..
నేను టివి వైపు చూసి ప్రోగ్రామ్ మొదలు కాలేదని తెలుసుకొని ఊపిరిపీల్చుకున్నాను
మా ఆవిడ టివి వైపు చూసి ప్రోగ్రామ్ మొదలు కాలేదని తెలుసుకొని నిట్టూర్పువిడిచి

దేవుడిపాలనలో అకాలవర్షాల్లాగా, ఇప్పూడేంటి ఈ పోన్ అంది..
వెంటనే ఫోనందుకొనిమాట్లాడి..
వసతిగృహ వాడి ఫోన్, అప్పోలో దగ్గర ఉన్నాడుట, ఎట్టారావాలో తెలియటం లేదుట.. తీసుకువస్తా అనిచెప్పి..
ఏమంటోందో వినకుండా.. బయటకొచ్చేశాను…
****

గాయత్రీ భవన్లో భోజనంజేసి,బయట కిళ్ళీ కొట్టు వాడిదగ్గర నాలుగాకులుతీసుకొని నేనే తాంబూలం జుట్టుకొని సేవించి, ఓ గంట తర్వాత మెల్లగా ఇంటికెల్తే..
హాల్లో మా బావమరిది పంజాబీ డాన్స్ చేస్తూ ఉన్నాడు…
వాళ్లక్క మధ్య మధ్యలో పాయసమందిస్తోంది
ఏమైందిరా…
పట్టుచీర వచ్చిందండీ.. మా ఆవిడ చెప్పింది.
వచ్చిందా..నీకు పోనొచ్చిందా నిమ్మ టివి నుంచీ
నాక్కాదులే, మా అమ్మకొచ్చింది, ఐనా వాళ్లు మొగుళ్ళూ పెళ్ళాలూ కి వెళ్తారుగా, పట్టుచీర నాకిచ్చేస్తుంది.
ఇవాళ లేచిన వేళ బానే ఉంది అనుకుంటూ, మధ్యాన్నం నిద్రకుపక్రమిస్తుంటే ఓ మెసేజొచ్చినట్టు చిన్న శబ్దం చేసింది సెల్ఫోను.
చూద్దునుగదా, మా మామగారి సందేశం “AlluDu, Dnt wtch pIkitE pattuSAri” అని.

ప్రకటనలు

ఆదివారం అగచాట్లు

నాకు చీకాకు తెప్పించేపనులు చాల ఉన్నాయి గానీండి, అన్నిటినీ జల్లెడ బడితే, అత్యంత చీకాకు తెప్పించేదిగా క్షురకర్మ తేలుతుందేమో ( ఆ ప్రస్తావన తేగానే ఈ వాక్యం చూశారా ఎంత చీకాకుగా వచ్చిందో :() అసలు మన తలని ఒకడి చేతిలో పెట్టి, ఓ అరగంట పాటు వాడు, దాని మీద వాడికి సర్వం సహా హక్కులు సంప్రాప్తించినట్టు, తన సొత్తైనట్టు, దానిమీద వాడికొచ్చిన సకలశాస్త్రవిద్యలు ప్రదర్శించి వాడి హింసాయుతతృప్తి తీరినతరువాత పోరాపో .. ఎక్కడికి పోయి ఎవరికి చెప్పుకుంటావో అన్నట్టు ఓ చూపు చూస్తుంటే – బార్బరా బార్బేరియనా అనిపిస్తుంది. ఏదేమైనా ఇట్టాంటి చిత్రవధకి ఇప్పుడప్పుడే లోను కాకూడదు అని ఎనిమిది,పది వారాలూ గా, ఆఫీస్ లో పనిఉందని ( వచ్చి ఊకదంపుడే?), అట్లాంటా నుంచి మిత్రుడొస్తున్నాడని, నా మొహం వాడుండేది అడిక్‍మెట్ట) – రాహుకాలమని, యమగండమని వాయిదాలు వేస్తూవచ్చాను.
నిన్న ఆదివారం ఉదయమే ( అవును ఆదివారం ఉదయమయ్యేది పదకొండింటికే కదా?) లేచేసరికి, సహధర్మచారిణి, పళ్ళు తోముపుల్ల లేహ్యం ఇచ్చి బాత్రూంలోకి తోసింది. ఇవాళ ఇంతప్రేమేంటి రా బాబు అనుకుంటుండగా రాత్రి నిద్రమగతలో పట్టుచీరో, కాలిపట్టీలో ఆడిగినట్టుగుర్తొచ్చి, గుర్తురాంగానే, కాల్గేట్‍కూడా చేదుగాఅనిపించి, తుపుక్కున ఉమ్మేసి నోరుకడుక్కొని బయటకు వచ్చాను .. కాఫీ అంటూ. కాఫీ బదులు కాలిచెప్పులు ( రెండూ పట్టుకోవటం చేత, పట్టుకున్న తీరు వల్ల భయమెయ్యలేదు) పట్టుకొని ఎదురుగా ప్రత్యక్షమైన కాంతామణిని చూసి
“ఎంటీ కాఫీపొడిఐపోయిందా?నిన్నచెబితే తెచ్చేవాడినికదా” అన్నాను, కాస్త విసుగుగా.
“కాఫీపొడి, కషాయము కూడా కావలినంత ఉన్నాయి గానీ, ముందు వెళ్ళి క్రాఫు కొట్టించుకురండి ఇస్తాను కాఫీ” అంది.
కొట్టిచ్చుకోవచ్చుగాని ఇవాళ ఆదివారం, పైగా అమవాస్య కూడా వచ్చేసినట్టుంది అన్నాను
పొద్దున్నే లేచి, ఈ టీవీ ఆ టీవీ ,మా టీవీ మీ టీవీ అన్నింటిలోనూ పంచాంగం రాశిఫలాలు చూశాను … ఇవాళ “అదుర్స్”ట బయలుదేరండి అండి.
ఏదీ అవునోకాదో ఒకసారి పేపర్ లో చూస్తాను అని పక్కనున్న పేపర్ లాక్కున్నాను, దీన్లో తలపెట్టి ఒక గంట గడిపేస్తే గండం గట్టెక్కుతుందని.
“అది నిన్న సాయంత్రం షికారు ఎగ్గొట్టి ఒక గంటసేపు మీరు అరిగించుకున్నపేపరే ..ఇవాల్టి పేపర్ మీరు సలొన్ (salon) నుంచి రాగానే వస్తుంది” అంది.
ఈ పాచిక పారలేదని, బెంగ బడి, ఐనా పైకి కనపడనీయకుండా “ఇవాళ, అట్లాంటా నుంచి వచ్చిన మిత్రుడు ఏదో షాపింగ్ చేయటానికి రమ్మన్నాడు,” అన్నాను
“ఆ అడుసుదిన్నె శ్రీకాంత్(1)గాడేగా? వాడికి అడిక్‍మెట్ నుంచి నేరేడ్‍మెట్ వెళ్ళటం రాదు, అట్లాంటా వెళ్లి ఏమొస్తాడు చెప్పండి. ఐనా మీరు లేచే ముందే ఫోన్ చేశాడు.సాయంత్రం ఏడింటికి శివం దగ్గరకి వస్తారని చెప్పా .. అప్పటి దాక .. మీరు ఫ్రీ” అని సాగనంపబోయింది.
ఇంకో రెండు కుంటి సాకులు చెప్పినా కుదరకపోవటంతో ఇక ఇవాళ తప్పదని అర్ధమై, బతిమిలాడి, కాస్త కాఫీ కలిపించుకు తాగి సలొన్ (salon) దారి బట్టాను.

స్థాన బలిమి కాని తన బలిమి కాదయా అన్నాడు కాని శతక కారుడు, అట్టాగే వార బలిమి కూడా ఉంటుందని నా గట్టి నమ్మకం. ఆదివారం గాకుండా వేరే రోజు వెళ్తే, ఎదురొచ్చి లోపలికితీసుకెళ్ళి, కుర్చీ ని ఆపాదమస్తకం దులిపి కూర్చోబెట్టే సలొన్లొనే ఆదివారం వెళ్తే ఓ పావుగంట దాక పలకిరించేవాడుండడు. ఇంకా ఎంతసేపు పడుతుంది అంటే, మాట్లాడకుండా “ఎంతసేపైతే ఏంటి?, ఇంటో వున్నా చేశేదిదేగా” అన్నట్టు పేపరొకటి విసిరేసి సీరియస్ గా మొహం పెట్టి కత్తెరాడిస్తాడు. ఆ పేపర్ అప్పటికే షేవింగ్ క్రీం అనే సబ్బురాసుకొని, గడ్డానికిపెట్టిన నీళ్ళలో స్నానం చేసి, చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇంకా ఏమైనా మాట్లాడబోతే వినపడకుండా ఉండటానికి టీవీ సౌండ్ పెంచుతాడు. మోరెత్తుకొని ఆ టివీ చూశేవాళ్లను చూస్తే నాకు జాలేస్తుంది. నిజానికి ఈ రకం గా ఆకాశం లో టివీ పెట్టటం – వాళ్లమెడ తనుకు కావాల్సిన యాంగిల్ లో పట్టుకుపోవాటానికి, బార్బర్ల సంఘం వేసిన చిట్కా అయ్యిండచ్చు. అందుకే అరగంట టీవీ చూస్తే కాని కల్యాణపు కుర్చీ ఎక్కించరు. పొరపాటున ఆ ఆదివారం రోజు క్రికెట్ మ్యాచ్ ఉందంటే ఇక మీపని అయినట్టే, అక్కడ రన్నులు కొట్టే వాడినీ, అడ్డమొస్తే ఇక్కడ క్రాఫు కొట్టేవాడిని , కొట్టించుకొనేవాడిని తిడుతూ క్రిక్కిరిసి చూస్తూంటారు,’వెంట్రుక వాసి’ తో అన్నా ఇండియా గెలవకపోతుందా అని. ఆ క్రికెట్ పిచ్చి క్రాఫు కొట్టే వాడికి కూడా ఉంటే మీ పని రోటిలో తల పెట్టినట్టే, ఇంటికెళ్ళి తలచుట్టుపక్కల ప్రాంతాలో ఆ బార్బరు బాబు కత్తితో చేసిన గాట్లలో టెండుల్కరుదో ద్రావిడుదో ఆటోగ్రాఫు చూసుకోవచ్చు. చెవి మీద కుట్లు పడాల్సిరాకపోతే మీరు అదృష్టవంతులేనన్నమాట.
కల్యాణపు కుర్చీ ఎక్కగానే మీకు యక్షప్రశ్నలు మొదలౌతాయి, తగ్గించమంటారా అంటాడు. తగ్గించు అంటే, ‘షార్టా మీడియామా అంటాడు. షార్ట్ అంటే చుట్టూ షార్ట్ చేసి మధ్యలో మీడియం చేయనా అంటాడు..ఈ రకంగా సాగే ప్రశ్నల పరంపరతో విసిగిపోయి,నీరసించిపోయి ఉ, ఉహూ లోకి దిగితాను. ఇక వాడు చెలరేగిపోతాడు.ఒక వరస,విధానం లేకుండా ఇష్టమొచ్చినట్టు కత్తెరాడిస్తాడు. టివీలో సీరియల్ కు మల్లే వీడికి కూడా కటింగ్ మధ్యలో మూడు బ్రేక్‍లు. పక్కవాడికి చిల్లర ఇవ్వటానికి ఒకటి, చిట్‍కి డబ్బులు కట్టటానికి ఒకటి, నోట్లో గుట్కా ఉమ్మాటానికి ఒకటి. వాడు చెప్పిన షార్ట్‍మీడియం‍కో మీడియం‍షార్ట్ కో ఒప్పుకొని, తల వాడికి అప్పగించామా, ఇక చూడండి తమాషాలు చేస్తాడు – తల అటు దిప్పు సారూ, ఇటు దిప్పు సారూ, కొంచం ఆ దిక్కుకన్నా, మరీ అంతొంచితేయెట్ట? అంటూ. కుక్కతోకూపినట్టు, వాడు చెప్పినదానికల్లా తలాడిస్తుంటే .. ఇంకా అందుకుంటాడు: “తెల్లెంటికలు వచ్చినయ్యన్న డై‍యేద్దామ?, మంచి డై‍ఉంది మన కాడ? హైర్ మంచి షైనింగ్ వస్తది.”, “ఎంటికలుఊసిపోతన్నయ్ హెర్బల్ హేరాయిలుంది వాడతావాఅన్నా?”, “చుండ్రు చానా ఉంది అన్న నిమ్మకాయపెట్టాల్నా?” మనం ఇన్ని బాధలు పడుతుంటే, పక్క సీట్‍లో తల కొట్టేసిన ల ఆకరం లో బట్టతల ఉన్నాయన మనొంక చూసి ఓ రకంగా నవ్వుతుంటే , కత్తిగాటు మీద డెట్టాల్ పోసినట్టుంటుంది. ఎట్టాగొట్టా అయ్యిందనిపించుకొని వాడ్ని ఒదిలించుకొని ఇంటికి వస్తే తలంటు కష్టాలు మొదలు..

“పెరుగు గోరింటాకు మెంతులు(2) కలిపి (ఇక్కడ దాక వినం గానే నాకు కడుపులో దేవుతుంది)అక్కడ పెట్టాను -ముందు తలకి పట్టించి ఆనక స్నానం చేయండి. మీ అమ్మగారు చెప్పినచిట్కా, ఏం పనిచేస్తుందిలే అనుకున్నా గాని మొన్న చెవాక్కుచెబుతారా లో లతకి అంగలూరు నుంచి ఫోన్‍చేసిన అండాళ్లుగారు కూడా ఇదే చిట్కా చెప్పింది. అది మీకెందుకుగాని, పోయి రాసుకోండి,మీ చుండ్రు తగ్గలేదంటే మళ్ళీ నన్నంటారు.” అంది.
ఇది గుఱ్ఱపుటెత్తు, ఇంక ఎదురులేదు .. తలకి పట్టించుకుంటే హజ్బెండుగాడు (ఇది తిట్టు కాదు, పతిదేవుడికి నిఖార్సు ఆంగ్లానువాదమని మనవి.) పడే బాధలు చూసి ఆనందిచవచ్చు, లేదంటే ‘నే జెప్పినా మీ అబ్బాయి వినట్లేదూ’ అనచ్చు. ఈ లోపల ఓ బావమరిది ఫోను, “బావా సలొన్ (salon) పని అయ్యిందా? బండి నడుపుతుంటే ఇబ్బందిగా ఉందని గ్లాసెస్ కొంటానికి వెళ్దామనుకుంటున్నాను వస్తావా?” అని. మొలచుట్టూ గుడ్డలేదని ఒకడేడిస్తే తలకి పాగా కావాలని ఒకడేడ్చాడుట, అట్టాఉంది. వాడు క్షవరం చేయించుకోడు, భుజాలు దిగిన జుట్టుని చిన్న చిన్న జడలు గట్టి, జడ చివర పూసలు పెట్టి ఫిల్మ్ం‍నగర్ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు, తెలుగు సిన్మాలల్లో ఇంగ్లీషు పాటలకి డాన్స్ వేసే అవకాశం రాకపోతుందా అని. ఇవాళ నేను క్రాఫ్ చేయించుకున్నానని ఎగతాళి. ఈ ఫొన్ అయ్యిందనుకుంటే ఇంకోడినుంచి ఫోను, “నినుచూడక నేనుఉండలేను” అనే పాట ఖరహరప్రియ లో ఉందా అంటూ.బాబు, రాంగ్ నంబర్, ఇది ఊకదంపుడు, సంగతులూ సందర్భాలు కాదూ అని మొత్తుకోలు పెట్టి,ఫోన్ పెట్టేసి ప్రపంచం మొత్తం నన్ను సాధించాటానికి ఏకమైందా అనిపించే క్షణం లో – ఇక లాభంలేదని – బాత్రూం తలుపేసుకొని , ఆ సంక్లిష్టమిశ్రమాన్ని పారబోసి, ఆ వాసనను తట్టుకోలేక ఓ సిగిరెట్టు వెలిగించి, ఆ వాసన బయటకు పొక్కుతుందేమొనని అది ఆర్పి – బాత్రూమంతా పవనపవిత్ర (air freshner)ను కొట్టి షవరు తిప్పి తీరినయ్యిరా ఆదివారం కష్టాలు అనుకుంటూ ఏడు నిముషాలతర్వాత బయటకి వస్తే – సాధ్వీలలామ ఎదురుగా గరిటె పట్టుకొని నిలబడి ( ఈ సారి భయమేసింది, సిగరెట్టు వాసన బయటకు వచ్చిందేమో అని) అంది: “వంట అంతా ఐపోయింది, కుక్కర్ ఇంకో మూడు ఈలలెయ్యంగానే ఆపేసి, ప్రెజర్ పోయిన తర్వాత కూరలో పప్పులో ఉప్పూ కారాలేసి పోపు పెట్టండీ, అట్టాగే, రెండో పొయ్యిమీద సాంబారుంది దాని సంగతి కుడా చూడండి. మాఅమ్మ పొద్దునే ఫోన్ చేసి, తీరుబడి గా మధ్యాన్నం ఫోన్ చేయవే నీతో మాట్లాడాలంది,”

“ఇప్పటి దాకా నువ్వేమి చేసినట్టు” అని అందామని నోటి దాక వచ్చి, ఊరుకున్నంత ఉత్తమం లేదు… అనే సామెత గుర్తొచ్చి (ఇంతకీ సామెతలో రెండో సగం ఏఁవిటీ మర్చిపోయాను?) గరిటె పట్టుకొని గప్‍చిప్‍గా కిచెన్ లోకి వెళ్ళాను.
——————————–
1) మీరు అడుసుదిన్నె శ్రీకాంత్ ఐతే మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దు, నన్ను తిట్టద్దు, పరువు నష్టం దావా వేయటానికి లేవద్దు. ఆ శ్రీకాంత్ మీరు కాదు. అసలు శ్రీకాంత్‍కు ఫోన్ చేసి ఈ టపా చదవద్దని చెప్పాను.
2)ప్రపంచం లో ఇంత భయంకరమైన కాంబినేషన్ ఎక్కడైనా ఉంటుందా అని అలోచిస్తే నాకు ఏమీ తట్టలేదు. చాలా సేపు ఆలోచించిన తరువాత జయసుధ, విజయకాంత్ , కాథరీన్ జీటా జోన్స్ లతో 1:2 ఫార్ములా సినిమా వస్తే పెరుగు,గోరింటాకు, మెంతులు కాంబినేషన్‍కి దగ్గరగా ఉంటుంది అనిపించింది. మీకు ఏమైనా స్పురిస్తే చెప్పండి.