Tag Archives: పొత్తు

ఊ అంటె తంటా – ఊహించమంటా

కొన్ని వార్తావాహినులు – విలీనం వైపే అందరూ మొగ్గు చూపుతున్నారని – విలీనం ఖాయమని చెబుతున్నారు.
నిజం గా అదే జరిగితే – చిరంజీవి చేజేతులా తన రాజకీయ ప్రస్థానాన్ని , తనను నమ్మి వచ్చిన వారి రాజకీయ జీవనాన్ని (political career) కొరి కోరి పక్క దోవ పట్టించినట్టే. ఈవేళ రామచంద్రయ్య గారు, సామాజిక న్యాయ సాధన కొసమే – కాంగ్రెస్సుతో కలిసి వెళ్లటం అని చెప్పారు (చూ : http://www.eenadu.net/breakhtml.asp?qry=break24). వారితో వెళ్ల దలుచుకుంటే ప్రత్యేకంగా పార్తీ పెట్టకుండా వెళ్ళి ఉండాల్సింది. పోనీ అప్పుడు కాంగ్రెస్ పై నమ్మకం లేదు, ఇప్పుడు కుదిరింది అనుకుంటే, ఇప్పుడు ఆ నమ్మకం కుదరటానికి గల కారణాలు ఎవో స్పష్టం గా కాన రావు. కాంగ్రెసు కన్నా తమని ఉత్తమం గా బేరీజు వేసిన 14 శాతం ఆంధ్రప్రదేశ్ వోటర్లుకు ఈ నిర్ణయానికి గల కారణాలు వివరించటం కనీస బాధ్యత. సామాజిక న్యాయం మాట ఒక నిముషం అటు ఉంచితే , అసలు 2009 ఎన్నికల తరువాత – అటు కేంద్రం లోను – రాష్ట్రం లో నూ చేసిన ఒక్క మంచి పనీ కనబడటం లేదు – ఆ పార్టీ తో ప్రజారాజ్యం కానీ – మరే పార్టీ కానీ అంటకాగటానికి.

రాష్ట్రం లోనీ కొన్ని కీలక సమస్యలపై, అంశాలపై ఆ పార్టికి కచ్చితమైన ఏకాభిప్రాయం లేదు, ఒక ప్రాంతం వారు ఒకటి అంటే మరొకొప్రాంతం వారు మరొకటి అంటారు. పైగా కావల్సినన్ని వర్గాలు, గ్రూపులు, అసంతృప్తులు. ఇప్పటి వరకు – శాసనసభ స్పీకరు పదవిని, ఉంటుందని చెప్పిన ఉపముఖ్యమంత్రి పదవిని భర్తీ చేయలేని స్థితి. పి.సి.సి అధ్యక్షుడిని కొనసాగించాలో , మార్చాలో తెలియని డోలాయమానం. ఒక్క మాటలో చెప్పలంటే – నాయకత్వం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క లంటిది. ప్రణబ్ ముఖర్జీ గారే అఖిల పక్ష సమావేశం లో స్వయంగా – “నిర్ణయం తీసుకుంటే ఒక ఇబ్బంది, తీసుకోకపోతే ఇంకో ఇబ్బంది” అని చెప్పుకున్న స్థితి. ఈ స్థితిలో విలీనం కాదు కదా పొత్తు బెట్టుకున్నా కాస్తొ కూస్తో లాభపడేది ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీనే. పదవులు నాలుగు వచ్చినప్పటికీ – ప్రజారాజ్యానికి, దాని మీద విశ్వాసం ఉంచిన ప్రజలకీ, వెనువెంటనే గానీ, దీర్ఘకాలం లో గానీ ఒరిగేదేమి లేదు.

విలీనం ఐతే పోని కాంగ్రెస్కు ఒరిగేదేమైనా ఉందా అంటే – అదీ అంతంత మాత్రమే. నిజం గా – తెలంగాణా అంశం వల్లో జగన్ వర్గం వల్లో చీలికే వస్తే – ప్రజా రాజ్యం మద్దతు ఇచ్చినప్పటికీ – తగిన సంఖ్యా బలం ఉంటుదన్న నమ్మకం లేదు. పోనీ ఉన్నా – అలాంటి బలం ఎప్పుడు మైనార్టిగా మారుతుందో తెలీదు. మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు.
పోనీ కేంద్రం లో ప్రభుత్వం సుస్థిరమనుకుందామా అంటే అదీ తెలియని పరిస్థితి. పైకి అంతా సవ్యమే అని చెబుతున్నా – D.M.k – కాంగ్రెస్సు సంబంధాలు ఎప్పుడు ఏ మలుపు తిరిగుతాయో తెలియదు. ఐనా, టెలికాం కుంభకోణం , సి.వి.సి నియామకం, కల్మాడి హస్తలాఘవం ఇత్యాదులు లతో కళంకితమైన ప్రభుత్వంలో పాలుపంచుకొని – ప్రజలకు ఇచ్చే సందేశమేమిటి. చిరు వ్యక్తిగత ప్రతిష్టకు కానీ, పార్టీకి కానీ ఒరిగేదేమిటి? సర్ఫ్ ప్రకటన సంగతి ఏమో కానీ, ప్రజాజీవితం లో మరక మంచిది కాదు కదా. మరి అలాంటప్పుడు
పోతే పోవాలిరా కలిసే పోవాలి
ఐతే అవ్వాలిరా ఐక్యమవ్వళి
పార్టీ ఏదైనా స.న్యా కావాలి – అని కొత్తగా ఇప్పుడు పాడటమెందుకు.

స్వప్రయోజనాలు/ప్రస్తుత ప్రయోజనాలకోసం అధిష్టానం ఆహ్వానించినా – రాష్ట్రం లో కాంగ్రెసు నేతలు మరియు కార్యకర్త లతో క్షేత్రస్థాయి లో వచ్చే సమస్యలు తక్కువకాదు. మరీ ముఖ్యంగా -అటు కోస్తాంధ్రలోను ఇటు తెలంగానాలోను – కాంగ్రెస్ శ్రేణులతో కల్సి నడవటం తేలికైన విషయం కాదు. గంజీ బెంజీ రెండూ తెలిసినవాడికి, ఎవరు నడుపుతున్నారో ఎటు పోతుందో తెలియని బస్సుయాత్ర ఎందుకు?

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో సీట్లు దక్కకపోవచ్చు, అధికారంలోకీ రాకపోవచ్చు – ఈ లోపు ఓ నిర్ణయమైతే – సీమాంధ్రకే పరిమతం కావలసి రావచ్చు అనే అనుమానం అనుకుందామనుకుంటే- ఐతే అవ్వచ్చుగాక – అప్పుడు ఎన్నికలముందు కూడా పొత్తులు పెట్టుకోవచ్చు – అవసరమైతే వీలీనమూ గావచ్చు.
ఈ లోపు పొత్తుబెట్టుకుంటే – వారి బురద బూసుకోవటం తప్ప ప్రజారాజ్యం వారికి మరే మంచి ఫలితమూ కనబడటం లేదు.

కలిసాడుకుందాం రా!

చిరూ! మా ఇల్లు ఎంత శుభ్రమో! నీకు భలే నచ్చుతుంది, కలిసాడుకుందాం రా!!

పైగా, సముద్రం లో కలిసిన తరువాత ఇవి గోదావరి నీళ్లు అని గుర్తుబట్టేవాళ్లు ,గుర్తుపెట్టుకొనే వాళ్లు ఎవరూ ఉండరు కదా.

[ పై బొమ్మ ఈ పుటకు చెందినది : http://amars-world.com/wp-content/uploads/2010/11/mud-pit-boys-2.jpg ]

ప్రకటనలు