స్వాగతము శ్రీక్రోధీ!

పాపులఁ ద్రుంచగ, నవనిన్
దీపింపగఁ బేద లెదిగి, దేశప్రభువుల్
చాపంజుట్టిన ధర్మము
స్థాపించగ రమ్ము, స్వాగతము శ్రీక్రోధీ!

నేర్పవయ్య నాకు సర్ప భూష! ౧౦

ఘస్రమందునకొంత ఘనదేవకోటి పాదార్చనల్ సేయగా హరణ మగును
వాసరమున కొంత ప్రమధగణంబుకు నెమ్మది కలిగించి నిలుపఁ జనును
దినమునందున కొంత దిక్పాలక సమితి దీరుఁగనుచు చక్కదిద్ద తఱుగు
మారేడు పత్రమో మంచినీరో నీకు నిడువారిఁ బ్రోవగా నింత గడచు

ఇన్ని పనుల మధ్య హేలగా నర్తింప
సమయమెట్లు దొఱకు సంధ్య వేళ?
నచ్చు పనికి ఘడియ వెచ్చింపగానెట్లొ
నేర్పవయ్య నాకు నృత్యతృప్త!

శుభముహుర్త మిదియె కదలి రమ్ము!

ఎంత పెద్ద చదువు లేని ఛాత్రతతికి
నొత్తిడి లేకుండ యున్న శోభ
యెంత చిన్న కమత మేని కర్షకులకున్
బంట చేతికినంద పరమ శోభ
యెంత కల్గినదేశ మేని సామాన్య జ
నులకు స్వేచ్ఛ గలుగ నెలమి శోభ
యెంత నృపాలకుడేని లేక పరదాల్
వీధులన్ నీర్భీతి వెడల శోభ

ప్రకృతిని గన బచ్చదనము, పారు నదికి
నీరు, సకలజగతికి నేపారు శాంతి
శోభ యను నిజము నెఱిఁగి శుభముహుర్త
మిదియె శ్రీశోభకృత్ వరా! కదలి రమ్ము!

మడులకు శోభగూర్పవలె మాన్యత నొందగ కర్షకాళియున్
బడులకు శోభగూర్పవలె పల్లెల పిల్లలు విద్యనేర్వగాన్
గుడులకు శోభగూర్పవలె క్షోణిని ధర్మము బెంపునొంద నా
కలలకు శోభగూర్పవలె గాంచ సమున్నత భారతావనిన్!

నేర్పవయ్య నాకు సర్ప భూష! ౫

హొయలగంగానదీ హోరు నిత్యము నీకు
దూరదర్శనమిడు హోరు నాకు

వామభాగమునంటి పార్వతీసతి నీకు
మాటిమాటికిఁ బిల్చు బోటి నాకు

పాదాశ్రితామరపరివారములు నీకు
క్షణము వీడని యధికారి నాకు

మెడలోన బుసలిడు తొడవరయఁగ నీకు
కొండెముల్ వినుటకు దండ నాకు

వేయి కలుగ నైన విఘ్నముల్ చెదరక
మొక్కవోని దీక్ష చక్క వెట్టు
టెటులొ విధిశతంబు నింటిచెంతనిలచి
నేర్పవయ్య నాకు నిశ్చలుండ!

శాశ్వతకీర్తియె నీకుఁ బ్రాప్తమౌ

వ్యర్ధముగా జనెన్ గతము, వైరసు బాధలు వెట్టనెల్లరన్
స్వార్ధము హెచ్చ నేతలకు శాంతివిఘాతము నొందెనిప్పుడున్
స్పర్ధలఁ బాప రమ్ము ఘన భాగ్యద! శ్రీశుభకృత్‌వరా! ధరన్
సార్ధకనామధేయుడను శాశ్వతకీర్తియె నీకుఁ బ్రాప్తమౌ.

నేర్పవయ్య నాకు సర్ప భూష! ౯

కాషాయమున్ గట్టి కర్తవ్యము మరచి
వ్యర్ధవాదమ్ములఁ బరగు వాని

ధార్మికేతరజనతాపరిష్వంగసు
ఖాసక్తుడైన సన్న్యాసి నొకని


దైవకైంకర్యముల్ దండిగానగుచోట
పాలకాధముఁగూర్చి పాడువాని


బాతృ,సమైక్యభావనలు భక్తతతికి
బోధించి వర్జించు పూజ్య గురుని

గాంచిన తరుణంబుఁ గలికాల మిద్దని
చూచి చూడనటుల సైచ వలెనొ
గళము విప్పవలెనొ, కలముఁ బట్టవలెనో
నేర్పవయ్య నాకు సర్ప భూష!