Monthly Archives: ఫిబ్రవరి 2010

నగుమోము

చెలి ఎదలో పుట్టిన

ఆనందపుటల

ఎగసీ  ఉరికీ –

పెదవుల తీరాన్ని

చేరగానే

ఇరు ప్రక్కలా బుగ్గల్లో

నాకై రెండు చెలమలు!!

ఖండిస్తున్నాను

ఇవాళ యాహూలో ఒక విశ్వవిద్యాలయం గురించి ఒక స్వలింగ సంపర్క విషయం గురించి రాస్తూ కాన్వెంటు పిల్లల బొమ్మ వేశారు.
ఇంకో తెలివి చూడండి, ఆ ఫోటో లో మైనార్టీ తీరినవారు గా కనిపిస్తున్న ( బహుశః ఉపాధ్యాయులై ఉండవచ్చు) వారి ముఖాలు కనబడకుండ  జాగ్రత్త బడ్డారు.

చిన్నపిల్లలకి ఏ మాత్రం సంబంధం లేని విషయం గూర్చి వ్రాస్తూ వారీ ఫోటో ని వాడుకోవటాన్ని ఖండిస్తున్నాను.

సమస్యాపూరణము

ఇవాళ పొద్దున్నే శ్రీమతిగారు నిద్రలేపటానికి  ..  లేవండి కోకిలగారూ .. సూర్యోదయమౌతోంది అన్నది….
ఈ కొత్తపిలుపుకు హాశ్చర్యపోతూ … లేచి – ఆమె చేతి లో శాలువాజూసి ..

ఏమిటి మళ్లీ కాఫీపొడి గాని ఐపోయిందా … ఇంత పొద్దున్నే లేపావ్ .. ఐనా చలి తగ్గిపోయిందిగా శాలువా ఎందుకు వెళ్లి తెస్తాలే అన్నాను…

ఈ సుప్రభాతం కాఫీ కోసం కాదు ప్రభూ అంది… ..
మరి? నే పాడుతుంటే నీకు గుండెల్లో దడగా ఉంటోందన్నావని సంగీత సాధన కూడ మానేసా గదా… ఇంత పొద్దున్నే ఎందుకు లేపినట్టు …
అయ్యో- మీకు రాను రాను కాలస్పృహ లేకుండా పోతుందండీ.. మొన్ననే అమవాస్య వెళ్లిందా..
ఐతే…
ఐతే ఏమిటండీ.. ఉగాది నెలలోపు బడిందన్న మాట…
ఐతే …
ఇంకా ఐతే ఏమిటి అండీ .. కోయిలలూ , మల్లెలూ మావిళ్లూ అంటూ ఎలుగెత్తద్దూ .. మీ   ఋతువొచ్చేస్తోందండి.. ఇక కూయడాలూ ..మేయడాలు… శాలువాలూ.. వడియాలు…
కూయడాలూ ..మేయడాలు నా.. ఈ వాడుక మాట ఎక్కడో విన్నట్టుంది కానీ మాబోంట్లకు కాదనుకుంటానే చెప్మా…

అదేనండీ … కవితాపఠనాలు … ఆనక బఫేలు.. ఓహోహో …..
ఎదో మీ మంచి గోరి కాస్త సాధన  చేసేకుంటారని పొద్దున్నే లేపితే… అర్ధం చేసుకోరు…

తనులేచి పనిచేస్తుంటే .. నేను ఇంకా పడుకున్నానని  ఈ వంక తో నిద్రాభంగం చేసిందని అర్ధమై….
చేసేదేమీ లేక

సనత్ కుమార్ గారు వారి బ్లాగులో కాసిని సమస్యలిస్తే వాటిలో కొన్నిటిని పరిష్కరించటానికి ప్రయత్నించాను ..   కొన్ని కొఱుకుడు బడలా .. మీకేమైనా కుదురుతాయేమో చూడండి

*******************

(1)జానేదో సినిమాకు లాలు బహుపూజ్యంబౌ మునీశాళికిన్

నానోటం పలుకంగనేరనెపుడున్ నాధా!అసత్యంబునే
నానారీతులవేడి బల్కిప్రతినల్ నన్ పత్నిగాబొందియే
ఈనాడేలనిరాకరింతువొసభన్ ఈ బేలనే,  కాదు రా
జా, నేదోసిని, మా కులాలు బహుపూజ్యంబౌ మునీశాళికిన్

(2)కలరారోగములున్న రాఘవుడేలంకంజేరశతృఘ్నుతో

[విభీషణ ఉవాచ]

జలముల్ జేరగ నావలో ఎటులబో జావేలదప్పుంగనన్
కళికాజ్వాలలుచుట్టుముట్టతమలోకంబంతనేమౌనహుల్?
కలుగే -యుద్ధము? రాముడీప్రజకు రుగ్మమ్మౌను, ధాత్రిం మనం
కలరా రోగములున్న? రాఘవుడు లంకంజేరె శతృఘ్నుతో

(3)మానములేనిస్త్రీని గని మాతగ మ్రొక్కిరి పండితోత్తముల్

ఈనరలోకులన్ గనియె ఈర్ష్యయు ద్వేషము నిండువారలన్
ఆనక జ్ఞానియౌ పరమ హంసను జేరియె  చక్కనొత్తగన్
హీనపు సంపదాదులకు హేయపు భౌతిక సౌరుకున్నుస
మ్మానములేనిస్త్రీని గని మాతగ మ్రొక్కిరి పండితోత్తముల్

(4)మనభార్య ఈమె, మనకమ్మయొ, అక్కయొ గావలెన్ జుమీ

కన్మణు లౌ గదా, వెలుగు కాంతుల జిమ్ముచు  నెల్లవేళలన్

తాన్మణి యైగనంపడుత తధ్యము కాంతల మధ్యజేరినన్

చిన్మయమూర్తిపుత్రుడును, శ్రీధర మూర్తిసు పౌత్రుడైవరల్

హన్మనభార్య ఈమె, మనకమ్మయొ, అక్కయొ గావలెన్ జుమీ

(5)బూతుకు బూతు బూతునకు బూతుకు బూతుకు బూతు బూతుకున్

ఖాతరు చేయరెవ్వరిల కాస్తయు యాంగ్లము రానిచో, తగున్
నీతరహానుమార్చుకొని నేర్వగ” యంచును జెప్పమిత్రుడే –
యాతనలోర్చిబోయి గన యద్దమరేయిన ఆంగ్లచిత్రమున్
బూతుకు బూతు బూతునకు బూతుకు బూతుకు బూతు బూతుకున్

(6)సీతా! రామునికిట్లొనర్తువటవే సీ! ద్రోహమిల్లాలివై

ఒకటి కాదు రెండు పూరణలు. ఇక్కడ చూడండి

(7)పతి జూచిన పడతి గుండె భగ్గున మండెన్

స్తుతమారసమానుండును
అతులిత భక్తిపరుడుపతి, యాత్రలకేగన్
హితవె? పొరుగింటి జాయా
పతి జూచిన పడతి గుండె భగ్గున మండెన్.

(8)దున్నని గని కన్ను గీటె తొయ్యలి యహహా

(9) రాష్ట్రమునేలగా నొక విరాధుడు రావలె రక్తపాయియై

నేర్పవయ్య నాకు సర్పభూష! – ౨

        నిముషమ్ము జటలోన నిలుపంగ గంగనే
                       చినయింటి ఘనశంకఁ జిన్నబుచ్చె
        చెరకుమోపులవాన్కి చిరుసాయమిడినంత
                             పుట్టగా చెమరింత పూలగొట్టె
        తగదన్న వినకనే తనతండ్రి గృహమేగి
                         యజ్ఞశాలకునద్దె యమునినగవు
        అనసూయ ఘనతనే వినినంత నీసొంది
                          ఆద్యంత రహితుకే యమ్మనిచ్చె 

        కోరి జేరిన సతి గుణదోషము లనక
        వలయు ధర్మమెల్ల దెలియ జెప్పి
        గారవించి మెలగ, కలికాలమందునా
        నేర్పవయ్య నాకు సర్పభూష!

————————————————————————–

బాదరాయణ లంకెలు:
మునుపొకమారు
భైరవభట్ల వారి బ్లాగులో.
చంద్రిమ
చంద్రబింబాననా

దోషాకరుడు

గురుపత్ని సొగసెంచి మరులొంది వశమంది
సరసమాడినయట్టి జార బుద్ధి

దినమందు గృహమందు; దిరుగాడు రేయందు
చోద్యమేమందువా -చోరబుద్ధి

పార్వతి పసికూన పరువెత్తి పడినంత
అవహేళనమునాడె అల్పబుద్ధి

పెరజూసి నడయాడి పరమేశు జటజిక్కి
కోరిజేరితినన్న కొలదిబుద్ధి

కుదురు,కునుకు లేక కులుకాడ దోగాడు;
మార్చు మోములెన్నొ మాయగాడు.
తోచు నొక్క పేరు- దోషాకరుడనుచు
వేయి మాటలేల వీని గొరకు.

ఇంగ్లీషూ యు లివ్ లాంగా- ౯

ఇవాళ అనుకోకుండా అమీరుపేట వెళ్లవలసివచ్చింది.
సరే ఎలాగువెళ్లా కదా అని అక్కడ ఒక ప్రసిద్ధమైన హోటల్ లో మంచి కాఫీ తాగుదామని మెట్లు ఎక్కబోతుంటే పరిచయమైన గొంతు వినిపించింది.
తల తిప్పి చూస్తే మా రామలింగడు కాలిబాటపై పోస్టర్లు అమ్మేవాడితో బేరమాడుతున్నాడు.
వాడికో నాకో ఇవాళ ఉచిత కాఫీ రాసి పెట్టి ఉన్నదని అర్ధమై.. వాడి దగ్గరకి వెళ్లి …
కాలేజి రోజుల్లో వీడి గది లో ఓవైపు మధుబాల, ఓవైపు సబాటిని, ఇద్దరి మధ్య లో కాసిని ధనాత్మక సందేశాలు, కాసిని ప్రేరణ సందేశాలు ఉండటం గుర్తొచ్చి,
“ఏరా ఈ పోస్టర్ల పిచ్చి ఇంకా పోలేదా” అన్నాను.
“నువ్వా, అంత తేలిగ్గా ఎలా పోతుంది” చెప్పు అన్నాడు తల తిప్పి.

అవుననుకో ఇంత దూరం వచ్చి మరీ కొనాలంటవా?
షాపింగ్ కని వచ్చాం. మా అవిడా,మరదలూ పక్క చీరెల కొట్లో ఉన్నారు, కాలాన్ని సద్వినియోగం చేసుకుందామని నేనిలా…
అయిందా? ఇంక తీసుకోవలిసినవి ఉన్నాయా?
అవుతోంది, ఎన్ని పోస్టర్లు కొన్నా, తన కోసం ఒక్కటి కూడా ఇంత వరకు తీసుకోలేదని మా ఆవిడ ఈ మధ్య మెత్తగా గుర్తు చేసింది, అందుకని…
ఇది చూడు – అప్పటికే తీసుకోవటానికి నిర్ణయం చేసుకున్న ఒక పోస్టరు నా చేతిలో పెట్టి మళ్లీ వెతికే పని లో పడ్డాడు.
దాని మీద ఇలా వ్రాసి ఉంది:
The female of the species is more deadlier … ”

ఆడాళ్లతో చచ్చేచావని ఎంత చక్కగా చెప్పాడు, నాక్కూడా ఒకటి తీసుకో ఇది. అవసరానికి పనికొస్తుంది.