Monthly Archives: ఫిబ్రవరి 2008

వేటూరికో ఉత్పలమాల

నేపధ్యం:
http://vinnakanna.blogspot.com/2008/02/blog-post.html
నా పద్యం:
పాటలచేతనాయికల ప్రాయపు సౌరుకె దీర్ఘమిచ్చె, తా
పాటలచేతనాయకుల పౌరుష వాక్కుకె ఒత్తునిచ్చె, తా
పాటలచేతచిత్రముల ప్రాణము లూదెను మారుమారు, ఆ
పాటలరామమూర్తికిదె పద్యసుమాంజలి, నమ్రతావిధిన్.

ప్రకటనలు

ప్రశ్న

dam11.jpg

ఇంగ్లీషూ యు లివ్ లాంగా-౪

శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళీవెళ్ళగానే,
రారా నీకోసం ఇందాకటినుంచి చూస్తున్నాను, మీ అబ్బాయి నా మాటవినట్లేదు అంది మా అమ్మమ్మ.
ఏమైందీ అన్నాను..
ఇందాకటి నుంచి వద్దన్నా వినకుండా “అప్పేబోవ” “అప్పేబోవ” అని పాడుతున్నాడురా.. అసలే మా అక్కయ్య తొంభై ఏళ్లది మంచంలో ఉంది అని చూడాటనికి వచ్చానా.. వీడు ఇట్టా అంటూంటే నాకు ఎట్టా ఉంటుంది చెప్పు.. మెల్లగా చెబితే వినడాయె,, గట్టిగా కసిరితే మీ ఆవిడ మొహం ముడుచుకుంటది.. ఏం చేయాలో తెలియక నీవెప్పుడు వస్తావొ అని కాచుక్కూచున్నాను.. నేను ఊరెళ్లేదాక వాడిని ఆ పాట మానమని చెప్పరా…

అసలు నీకు అక్క ఉందని, అక్కని అప్ప ని అంటారని వాడికి తెలీయదమ్మమ్మా..
ఏమో బాబూ ఎవరునేర్పారో ఏమో.. నాకు మటుకు వింటూంటే ఒహటే చీకుగా ఉంది..

సరే నేను చెబుతాలే అని చెప్పి.. మా అబ్బాయి దగ్గరకు వెళ్లి ఏంచేస్తున్నావురా అని అడిగా..

రైమ్స్ చెప్పుకుంటున్నా నాన్నా..
ఏ రైమ్స్…

“ట్వింకిల్ ట్వింకిల్” , నీకు చెప్పనా?

చెప్పు..

ట్వింకిల్ ట్వింకిల్ లిటిలిస్టార్
హవ్వై వండర్ వాట్యూ‍ఆర్ర్ర్
అప్పెబోవ ద వర్ల్డ్ సో హై
లైకె డైమండింద స్కై.

అప్పటికి గాని గమనించలేదు.. నాలుగు రోజుల ‘ప్లే‍స్కూల్’ విద్య లో మావాడికి వాళ్ల “మిస్సు” నేర్పిన ఇంగ్లీషు..

‘ద వర్ల్డ్ సో హై’ అంటే మా అమ్మమ్మకి అర్ధం కాకపోవటం మంచిదైంది, వాళ్ల అప్పని అక్కడికి పొమ్మంటే ఇంకేమైన ఉందా?

ఇవాళ వాడి ‘ప్లే‍స్కూల్’ కి వెళ్ళాను, కొంచం ఇంగ్లీషు ఇంగ్లీషు లా నేర్పిస్తారేమో కనుక్కుందామని.
వాళ్ల Waiting room లో( వైట్ చేశేది రూముగాదండీ, మనుషులే) కనిపించిన నోటీసు:

“Please smile, It doesn’t costs’ you anything.”

( ఈ[‘] చిహ్నాలు వాళ్లు పెట్టినచోటే నేనూ పెట్టాను. ఫోటో తీశేవీలు చిక్కలేదు.)

మరోసారి మా రామలింగం చెప్పింది నిఝమని తేలగా, గ్రామరు నడ్డి విర్గగొట్టిన ఆ కాప్షనోనరికి మనసులోనే నివాళులర్పించి, ఈ విషయాన్ని ‘ఎమర్జంటు’ గా బ్లాగుదామని సైబర్ కఫే కి వస్తే అక్కడ కనిపించిన సూచన::
Please remove U R footwear here.

‘U’ కి ‘R’ మధ్యలో చెప్పులజత పట్టేంత ‘గ్యాపు’ కావాలనే పెట్టాడా?
అది మక్కీమక్కీ తెలుగులో రాస్తే, ఒక్కడైనా వాడి షాపుకు వచ్చేవాళ్లా? ఈ నోటిసు ఉన్నా కూడా, ఆ కెఫె ముందు చెప్పులు విడవటానికి జనం బారులు తీరుతున్నారంటే అది, ఇంగ్లీషు గొప్పతనం కాదా? చెప్పండి.

—————————————————————————————–
కొసవిడుపు ::

శనివారం పొద్దున్నేమా ఆవిడ నిద్ర లేపి ” మీకు ఊళ్ళో చెడ్డపేరు కూడా ఉందా, నాకు తెలీదే” అంది.
నేను నాకూ తెలీదు మరి అన్నట్టు మొహం పెడితే,
వాడెవడొ,ఫోన్లో “What is Sir’s good name?”అంటున్నాడు, పోయి చూడండి
అంది.తేలికగానే బయట పడ్డందుకు ఊపిరి పీల్చుకున్నాను.

ఇంతకీ ఈ విషయం ఇప్పుడు ఎందుకంటే, లోపలికి ప్రవేశించటానికి వర్డ్‍ప్రెస్సు వాడు, కొత్తగా “సభ్యనామం” అడుగుతున్నాడు, మా ఆవిడే పక్కనే ఉండి ఉంటే, మీకు అసభ్యనామం కూడా ఉందా అని అడిగేది కదా అని భయమేసింది.