Tag Archives: కూనలమ్మ

తూగులయ్య పదాలు-౩

ఇది మూడవ ( దేవుడు మేలుజేస్తే, మరియు చివరి) “రౌండు”, కాబట్టి, పఠయితలే సంయమనం పాటించాలని మనవి.
మొదటి, రెండవ వాత’లిక్కర’ ..అదే ..ఇక్కడ

పెళ్లి మంటపమందు
ప్రక్క మిత్రుల విందు
సిగ్గు చేటని యందు
ఓ తూగులయ్య
***
ఫీజు జీతము నాడు
చీర పండుగ నాడు
మందు మాత్రమె నేడు
ఓ తూగులయ్య
***

తడసినంతనె గొంతు
మాట మాటకు బూతు
జేయు ననుముకవాతు
ఓ తూగులయ్య
***

బారు బిల్లగు జాస్తి
ఇంట చేతురు శాస్తి
“రోడ్డు సైడె”ప్రశస్తి.
ఓ తూగులయ్య
***

చికెను వేపుడు తోడ
గ్యాసు షోడా తోడ
తెలియు స్వర్గపు జాడ
ఓ తూగులయ్య
***

పబ్బు లొచ్చెను నేడు
కుల్కు స్మితల తోడు
తోచి నట్టుల ఆడు
ఓ తూగులయ్య
***

డాన్సు బారుల యందు
నాట్య గత్తెల చిందు
నోట్లు గుబ్బల సందు
ఓ తూగులయ్య

తూగులయ్య పదాలు -౨

ఇది రెండో వాత, అదే.. విడత.

పాత గాయపు మాన్పు
కొత్త కైతల కాన్పు
నిండు బాటిలు తేన్పు
ఓ తూగులయ్య!

పాత గాయము మాన్పు
కొత్త కోర్కెల కాన్పు
నిండు బాటిలు తేన్పు
ఓ తూగులయ్య!

శుక్రవారపు రాత్రి
చుక్క చుక్కకు ఆర్తి
చుక్క లెంచును నేత్రి
ఓ తూగులయ్య!

తెలుగు మాటలు నాంచు
తాగి యాంగ్లము దంచు
గొంతు వేమన కంచు
ఓ తూగులయ్య!

నేలనిలచి “నో”యను
ఫ్లైటున వడి దెమ్మను
రోమునతడు రోమను
ఓ తూగులయ్య!

రద్దు కోరుచు నరచు
నెగ్గి నంతనె మరచు
బెల్టు షాపుల దెరచు
ఓ తూగులయ్య!

సీత జాడను దెలిసి
కోతు లన్నియు దనిసి
ద్రావె దండుగ గలిసి
ఓ తూగులయ్య!

సుధలు పుట్టిన దెంత
దివిన జాలుట వింత
కలిపిరే”ఇది” కొంత
ఓ తూగులయ్య!

తూగులయ్య పదాలు

[హెచ్చరిక: ఇది పేరడీ]

శ్రీరాముడి ఈ టపా చూసిన తరువాత బ్లాగేశ్వరునికి ఎలా కలిగిందో, రానారే గారి ఈ టపా చూసిన తరువాత నాకు అలానే దురద పుట్టింది. ఏమి చెయ్యాలో తోచని స్థితిలో రోడ్డు మీద బాగా తాగి తూలుతున్న మందు బాబు దారిచూపించాడు:

అన్న మాట వినుట
తిన్న బాట జనుట
తగవు గొప్పవాడవగుట
ఓ తూగులయ్య!

మాట తూలుట కన్న
తాగి తూలుట మిన్న
బతుకు బండి సున్న
ఓ తూగులయ్య!

సత్యశోధన కూన
మూడు బీర్ల మీన
నిజమె నాల్క పయిన
ఓ తూగులయ్య!

వోట్లనాడు ఉచితము
వద్దనుటనుచితము
ఘనమీ ప్రజాతంత్రము
ఓ తూగులయ్య!

దుఃఖము మరువ తాగు
సంతోషమపుడును తాగు
నీకేల ఆలుబిడ్డల ఓగు
ఓ తూగులయ్య!

తాగి బండి నడుపబోకు
నడిపి జనుల చంపబోకు
అదియె పదివేలు మాకు
ఓ తూగులయ్య!

ఇట రానారె స్పూర్తి
నాది వికటపు ఆర్తి
ఆరుద్ర గురు మూర్తి
ఓ తూగులయ్య!