Monthly Archives: మే 2009

రెండు ప్రకటనలు

గతం లో జరిగిన ఐ.పి.యల్ చూడలేదు. ఈ సారి అన్యమనస్కంగా నే చూడటం మొదలుపెట్టాను. మెల్ల మెల్లగా నాకు తెలీకుండానే చూడటానికి అలవాటు పడ్డాను. ఐతే పేరుకు క్రికెట్ చూస్తున్నా ధ్యాసంతా ఓవరు ఎప్పుడు ఐపోతుందా లేకపోతే వికెట్టు ఎప్పుడు పడుతుందా అనే.
ఓవరు ఐపోవటనికో, వికెట్టు పడటానికో చూడటం ఎందుకో మీరు తేలికగానే ఊహించగలరు.

అవును, మీరు ఊహించినట్టే, ఆ కేరింతగత్తెల అర్ధనగ్న నృత్యాలకోసం కాదు.
ఓ రెండు వ్యాపార ప్రకటనలకోసం.
పి.వి నరసింహారావు గారి శకం మొదలినప్పటి నుండి, వ్యాపార విధానాలలోనూ, వ్యాపార స్పర్ధలోనూ గణనీయమైన మార్పు వచ్చి, అవి వ్యాపార ప్రకటనలను కూడ ” కన్నా-మిన్నా”. “ఉండగ-దండగ” స్థాయి నుంచి గణనీయంగా పెంచినప్పటికీ , నాకు నచ్చే ప్రకటనలకన్నా , నచ్చనిప్రకటనలే ఎక్కువ.

కొన్నేళ్ల క్రితం ఓ చిన్న కుక్కపిల్లా, ఓ చిన్న అబ్బాయి తో హచ్ వారు మంచి ప్రకటనలు చిత్రీకరిస్తే అబ్బురపడ్డాను.

ఐతే ఈ సారి నాకు ఆనందాన్నిచ్చింది ఎయిర్టెల్ వారి ఈ ప్రకటన. ఐతే, ఎందుకనో కొన్ని రోజుల క్రితం నుండి ఈ ప్రకటన కన్నా ఎయిర్టెల్ వారి సినిమావాళ్ల గుడారపు ప్రకటన ఎక్కువగా చూపిస్తున్నారు.
ఇంతగాను ప్రభావితం చేసిందీ, ఆడదాని మనసే కాదురా, చిన్నపిల్లవాడిని మనసును అర్ధం చేసుకోవటం కూడ అంతే కష్టం అని చెప్పిన, నన్ను కుదిపేసిన రెండవ ప్రకటన Havells Cables and Wires వారి తల్లీకొడుకుల ప్రకటన.
జాగ్రత్తగా చూడండి, ఓ పక్క ఉయ్యాల ఊపుతూ మరో పక్క వంట చేయటం, ఆ పిల్లాడు రొట్టె నోట్లో పెట్టుకొని వేళ్లతో లోపలికి కొంచంగా నెట్టుకోవటం, చివరిలో తల్లి ముఖకవళికలు … ఒక లిప్తలో ఎన్ని భావాలు, ఎన్ని ప్రభావాలు.

ఓవర్ల మధ్యలో ఈ ప్రకటన ఎందుకొచ్చిందిరా బాబు అనుకున్న ప్రకటనలు కూడ ఉన్నాయి.
ఎయిర్టెల్ వారి “Best of Kids’ entertainment” అనే డిష్ టివీ ప్రకటన ఒకటి,యల్జీ వారి ఎయిర్కండిషన్ ప్రకటన మరొకటి.

అన్నట్టు, క్రికెట్ ఆటగాళ్లకు, తెర వెనుక సూత్రధారులకు మూఢనమ్మకాలు ఎక్కువట, సెమీఫైనల్ మ్యాచ్ లో బెంగలూరు కోచిగారు, ఓ బంతి ని ఆ చేతిలోంచి ఈ చేతిలోకి, ఈ చేతిలోంచి ఆ చేతిలోకీ విసిరేసుకుంటూ చూసారు.
ఓ ఆట లో ఔట్ ఐన తర్వాత కూడా, సచిన్, ఆట అయ్యేంతవరకూ శిరస్త్రాణం తీయలేదు.
నాకు ఇలాంటి వాటి మీద పెద్దగా నమ్మకం లేదు. ఐనా ఎందుకైనా మంచిదని, దక్కనువారు సెమీఫైనల్ గెలిచిన రోజు ఏ దుస్తులువేసుకున్నానో అవే వేసుకొని, సెమీఫైనల్ గెలిచిన రోజు ఏ కుర్చీ లో, ఏ ముద్రలో కూర్చున్నానో , అదే కుర్చీ లో అదే ముద్రలో కూర్చొని ఫైనల్ చూశాను. 🙂

సరే ఎలానూ ప్రకటనలు అన్నాను కాబట్టి, ఈ బ్లాగు సంబంధమైన ప్రకటనలు కూడా ఓ రెండుచేయనివ్వండి:
1. ఎంత ఈ బ్లాగు నాదైనప్పటీకీ, నావి మాత్రమే కానివి చాలా ఉన్నాయి. అక్కడక్కడా ఉటంకించే ఇతరుల రచనలు, అప్పుడప్పుడు కుదిర్చాను అనుకునే ఛందస్సూ, తెలుగు పదాలూ, అక్షరాలూ,జగమెరిగిన సత్యాలూ, ఇత్యాదులు.
తెలియకచేసే తప్పులని అటుంచితే, ఆంగ్లంలో టైపు చేయటం వల్ల దొర్లే అచ్చుతప్పులూ కాసీనీ కూసినీ కాదు. అలా అని ఆ తప్పులను పడిఉండనీయటం లో అర్ధమూ లేదు. పైగా ఓ ఇరవై ఏండ్లతరువాతో,పాతికేండ్ల తరువాతో (జాల ప్రపంచం కదా అన్నేళ్లు అలానే పడి ఉంటుందని నా అనుకోలు) రాకేశుడి లాంటి మంచి మాతృభాషాభిమాని ఎవరైనా పట్టుబట్టి తెలుగు నేర్చుకుంటూ “దోశము” అని చదివి, అది “దోషము” లో అచ్చుతప్పని తెలియక ఆరోజుల్లో దోశె ని దోశము అనేవాళ్లు కాబోలు, అదే సరైనది కాబోలు అనుకొని దగ్గరలో దర్శనికి వెళ్ళినపుడు “ఒక పెసర దోశము, ఒక ఉల్లిదోశము ఇవ్వుడీ” అనకూడదుకదా, అందువల్ల నా బ్లాగులో మీకు కనిపించిన అక్షర/వ్యాకరణ దోషాలన్నీ నిరభ్యంతరంగా చెప్పండి. నేను ప్రస్తుతం నా పాత టపాలు చదివి తప్పులు దిద్దే ప్రయత్నంలో ఉన్నాను.
2. ఈ టపా లో ప్రకటన అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో చెప్పిన వారికి ప్రత్యేకంగా బహుమతులేవీ ఇవ్వబడవు. 😦

నీళ్లొదులుతారు

మంత్రాంగం మొత్తం
మినరల్ వాటర్
మాత్రమె తాగుతారు
మంది కోసం పంపుల్లో
కాలకూటం పంచుతారు

నీటి కోసం డబ్బుకడితె
నీళ్లతోటె చంపుతారు
లక్షా, రెండూ ఐదంటూ
ప్రాణానికో రేటు కడతారు

ఐనా ఆయుర్దాయం లేకుంటే
అయ్యవారు ఏంచేస్తాడు
ఐనవాళ్లకు లాగానే
ఆత్మశాంతికి ప్రార్ధిస్తాడు

దేవుడి పాలనలో
రోజూనీళ్లొదులుతారు
నీతికి
న్యాయానికి మల్లే
ప్రజల ప్రాణాలకీ
కాసిని నువ్వులు కలిపి
నీళ్లొదులుతారు

వెతుక్కుంటున్నాను

Umbrella” లు అడ్డుచెబుతుంటే
“Perfection” లు పంటి కింద రాళ్లైతే,
తెలుగు సాహిత్యం లో తెలుగు వెతుక్కుంటున్నాను

కలగాపులగపు రేడియో ఛానళ్లలో
తారలు దుస్తులొదిలినంత తేలిగ్గా
వ్యాఖ్యాతలు వత్తులువదిలేస్తుంటే
అక్కడక్కడా తగిలే సరళ పదాల్లో
తెలుగు వెతుక్కుంటున్నాను

కన్నడపు “సుద్దుల” టీవీ ఛానల్ పెట్టి
కలిసే పదాలలో తెలుగు వెతుక్కుంటున్నాను

అవును, ఆంధ్రప్రదేశ్ రాజధానిలో
అచ్చతెలుగు కోసం వెతుక్కుంటున్నాను

జాలపు కూడలికి రోజూవచ్చి
కొత్తగా చేరిన వ్రాతల్లో
పాత తెలుగును వెతుక్కుంటున్నాను

నింపాదిగా కూచుంటే నిఘంటువు తెరిచి
పసిడి పడికట్టు మాటలు
అక్కడైనా భద్రంగా ఉన్నాయో
లేవో యని వెతుక్కుంటున్నాను