Tag Archives: రామసేతు

రామం మిధ్య – నామం మిధ్య

రోడ్దుమీద నడుచుకుంటూ వెళ్తుంటే, హాఠాత్తుగా భుజంమీద ఓ చెయ్యి మీద పడటం తో ఆగి, ఎవరా అని వెనక్కితిరిగాను. తిరగ్గానే ఆ మనిషి అందుకున్నాడు:

ఏంటండీ, ఇందాకటి నుంచీ పిలుస్తుంటే పలక్కుండా వెళ్ళిపోతారు?

పిలిచారా ఏమని?

ఏమని ఏమిటండి, మీ పేరు పెట్టే.

నా పేరు పెట్టా? నేను పేరు మార్చుకున్నాను తెలుసా?

పేరు మార్చుకున్నారా? ఎందుకు?

అది పెద్దకధలెండి, ఇంతకూ మీరెవరు?

నేనెవరేంటాండి, క్రితమ్ నెలవరకూ మీరు పనిచేసిన ‘ఆంధ్రదీప్తి’ ప్రత్రికలోనే కద నేనూ జేస్తా?

ఓ, ఆ పత్రిక ఇంకా నడుస్తోందా? ఎట్టాగొట్టా మూయించేస్తారని, నేను రాజీనామా చేసి వచ్చేశానే.

చూస్తుంటే అట్టాగే ఉంది, రాజు తలుచుకుంటే దెబ్బలకికొదవా? దినదిన గండం గా ఉందనుకోండి.

ఇంతకీ మీ పేరు చెప్పారు కాదు?

పక్క పక్క సీట్లలో కూర్చునే వాళ్లం, అప్పుడే పేరు మర్చిపోయారా? నా పేరు శేషతల్పశాయి.

చూడు శేషం..

అందరూ శాయి అని పిలుస్తారండీ. తిరుపతి వెళ్ళి వచ్చాను, అందుకని మీరు గుర్తు పట్టలేదనుకుంటా…

ఓ తిరుపతి వెళ్ళావా? ఎందుకు?

తిరుపరి ఎందుకేమిటండీ? ఏడుకొండల వాడి దర్శనానికి.

ఎవరునాయనా ఏడుకొండల వాడు?

ఏడుకొండలవాడు ఎవడేమిటండీ? దేవుడు. ఐనా మీరేంటి వింతగా మాట్లాడుతున్నారు?.

నేను వింతగా కాదు నాయనా, నీవు వితండం గా మాట్లాడుతున్నావు. ఇక్కడ అవతరామూర్తులకే దేవుడిగా గుర్తింపు లేకపోతే, నువ్వు ఏ అవతారమూ కానాయానని పట్టుకొని దేవుడంటున్నావు.

ఏమిటి నాయానా నీపేరు? ఇంత అమానవికం గా ఉంది? పాముల మీద పడుకుంటావా?

సార్..
రెండు పాములు తెప్పించి బోర్లా వేస్తాను, పడుకొని చూపించు చూస్తాను..

పడుకొనేదేమో చిరుగుబొంతల మీదాన్నూ, పేరేమో శేషతల్పశాయి నా?

సార్, మీరు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నారు…

టూ మచ్ లేదూ, ట్వంటీటూ మచ్ లేదూ .. నీ పేరు చాల మిధ్య అంతే.

అది దేవుడి పేరు తెలుసా?.

అహాఁ. ఏ దేవుడు?

విష్ణుమూర్తి…

విష్ణుమూర్తే? బాగా చెప్పావు? రాముడున్న కాలమే మాకింకా లెక్కలు తేలలేదు.. ఆ కాలంలోనో, ఇంకో కాలం లోనో రాముడు ఉన్నా ఆయన బ్రిడ్జీలూ, ఫ్లైఓవర్ల దగ్గర శిలాఫలకాలేమీ పాతించలేదు..నేను పరిపాలిస్తున్న దేవుడి రాజ్యంలో కట్టారు అని…మరి మాకు ఆ రాముడున్నాడు అంటానికే ఆధారాలే లేవు.ఎలా నమ్మకం కుదరటం? నీవు ఆ రాముడి మూల స్వరూపాన్ని నమ్మమంటే తేరగా ఎట్టా నమ్ముతామయ్యా?

మీరు ఇవాళ అదో రకంగా మాట్లాడుతున్నారు, పత్రి కొనుక్కోవటానికి వెళ్తున్నాను, మరెప్పుడన్నా కలుస్తాలెండి.

ఆగాగు, పత్రి కొనుక్కోవాటానికి వెళ్తున్నావా? ఎంత పిచ్చి పని చేస్తున్నావ్?

కాస్త బుర్ర పెట్టి ఆలోచించవయ్యా.. పసుపు ముద్ద, ఎక్కడైనా జీవం పోసుకుంటుందా? పోసుకుంది పో, దానికి ఏనుగు తల పెడితే బతుకుతుందా?నీకు ఏనుగు తల పెడితే నువ్వు బతుకుతావా?లివరూ, హార్టూ చేశారు గాని, Head Transplantation చేసినట్టు గా ఇంతవరకు సైన్స్ లో ఆధారాలు లేవు. ఇదంతా కట్టు కధ, గజాననుడు లేడు.. విఘ్నాలు లేవు..అన్నీ కల్పితాలు. నీకు తెలియకపోతే, సైన్స్ తెలిసిన వాళ్లనడుగు, లేక పోతే పురావస్తు వారినడుగు. అంతే కాని అనవసరంగా టైం వేష్ట్ చేసుకోక. అన్నీ మరిచిపో, రాత్రికి మీ అవిడని తీసుకొని, ఏ బార్ అండ్ రెస్టారెంట్ కో మూన్ లైట్ డిన్నర్ కెళ్ళు, అన్నట్టు, మీ ఆవిడ కూడ తాగుతుందిగా? తాగక పోతే తాగు నేర్పు.. లేకపోతే ప్రెస్టేజ్ ఇష్యూ.

రామ రామ, వినాయకుడు లేడంటారా?

అరె మళ్ళీ, ఆ రాముడే లేడంటే , రామ రామ అంటావేమయ్యా?

హర హరా, దేవుళ్లే లేరంటారా, పైగా మా అవిడకి మద్యపానం నేర్పమంటారా?

అదుగో.. మీ లెక్కల ప్రకారం ఆ హరిహరులు ఇంకా ముసలి వాళ్లు. మేం నమ్మేది లేదని ముందే చెప్పానా. మద్యపానం లాంటి పెద్దమాటలు ఎందుకు చెప్పు ‘Just Drinks’ అంటే నీకూ, తాగటానికి అవిడకి కూడా యే మనః క్షోభా ఉండదు.

మా దేవుళ్ళ గురుంచి ఇంత అన్యాయంగా మాట్లాడతారా? అసలు మిమ్మల్నీ..

ఎంటీ, కోర్టు లో కేస్ వేస్తావా? వేసుకో! నేనూ అక్కడికొచ్చే అఫిడవిట్ ఇస్తా.. వీళ్లెవరూ లేరని..

అన్నట్టు.. నీవు ఈ పేరు తో .. వెళ్తే ఒప్పుకుంటరో ఒప్పుకోరో?

నా పేరు ఒప్పుకోటానికి వాళ్లేవరో ఎవరండీ??

మరదే బాబూ .. నీవున్న కాలం, నీపేరు నీ దేవుడు నీకు నచ్చితే చాలదు .. మాకూ నచ్చాలి..

అందువల్ల.. ఎందుకైనా మంచిది ముందు పేరు మార్చుకో..ఓ వారం రోజులు శెలవు పెట్టి తిరుపతి వెళ్ళి నట్టున్నావ్.. దేశం లొ ఏం జరుగుతోందో నీకు బొత్తిగా తెలిసినట్టు లేదు..

అసలీ పేరు మార్చుకోవటమేంటండి?మీరెందు మార్చుకున్నారు? ఏమని మార్చుకున్నారు?

చూడు నాయన.. రాముడు, దేవూళ్లూ మిధ్య అనే గడ్ద మీద, దేవుళ్ల పేరు గలవాళ్లందరూ, మిధ్య కాకూడని ఏముంది చెప్పు? నేను, నా పేరు మిధ్య అని, నా రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇట్టాంటివన్నీ కాన్సిల్ చేశారనుకో, నా గతేంగాను చెప్పు? అందుకని పేరు మార్చుకొని ఊకదంపుడు అని పెట్టుకున్నా. వోటర్ లిస్ట్ లోనే మార్చకుండ వదిలేస్తాను. ఏ పేరైనా నా వోటు వేసుకునేది వాళ్లేగా అని. మా ఇంటి పక్కనాయన “సైకిల్ తొక్కుడు” అని పెట్టుకున్నాడు, ఇంకో ఆయన “కాలినడక” అని పెట్టుకున్నాడు. చూడు ఎంత హాయి గా ఉన్నాయో.. పైగా ఉన్నాయా లేవా అని ఎవరికీ అనుమానం రాదు.. మన పేరు గురుంచి మనమే అఫిడవిట్ సమర్పించుకోవాల్సిన పని రాదు. నా మాట విని.. నువ్వు కూడ ఓ మంచి పేరు చూసి పెట్టుకో..

గిన్నెలు తోముడు, పప్పు రుబ్బుడు అన్నీ ఇట్టాంటి పేర్లేనా?

ఇవికాక ఇంకో రెండు పేర్లున్నాయి కాని అవి దేవరవారు వారికి నచ్చిన భవనాలకి, రహదారులకి, విమానాశ్రయాలకి పెడతారు .. మీఅంతట మీరు పెట్టుకోవటానికి లేదు..

నీవు ఆపనిలో ఉండు, నేను పాస్‍పోర్ట్ లో పేరు మార్పించు కోవటానికి వెళ్తున్నా, పైగా ఇప్పుడు, పాస్‍పోర్ట్ ఆఫీస్ లో ఇప్పుడు పేరు మార్పిడి క్యూనే అన్నిటికన్నా పెద్ద క్యూట.

శేష తల్పశాయి దారి బట్టాడు,
శ్రీ రాముడు మిధ్య
మా మారుతి మిధ్యా
ఆ వారధి మిధ్య
నా పేరది మిధ్యా..
అని పాడుకుంటూ.
ఒకడిని ఉద్ధరించాను అన్న ఆనందంలో, నేనూ అడుగులేశాను, పాస్‍పోర్ట్ ఆఫీస్ వైపు.