ఇంగ్లీషూ యు లివ్ లాంగా-౪

శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళీవెళ్ళగానే,
రారా నీకోసం ఇందాకటినుంచి చూస్తున్నాను, మీ అబ్బాయి నా మాటవినట్లేదు అంది మా అమ్మమ్మ.
ఏమైందీ అన్నాను..
ఇందాకటి నుంచి వద్దన్నా వినకుండా “అప్పేబోవ” “అప్పేబోవ” అని పాడుతున్నాడురా.. అసలే మా అక్కయ్య తొంభై ఏళ్లది మంచంలో ఉంది అని చూడాటనికి వచ్చానా.. వీడు ఇట్టా అంటూంటే నాకు ఎట్టా ఉంటుంది చెప్పు.. మెల్లగా చెబితే వినడాయె,, గట్టిగా కసిరితే మీ ఆవిడ మొహం ముడుచుకుంటది.. ఏం చేయాలో తెలియక నీవెప్పుడు వస్తావొ అని కాచుక్కూచున్నాను.. నేను ఊరెళ్లేదాక వాడిని ఆ పాట మానమని చెప్పరా…

అసలు నీకు అక్క ఉందని, అక్కని అప్ప ని అంటారని వాడికి తెలీయదమ్మమ్మా..
ఏమో బాబూ ఎవరునేర్పారో ఏమో.. నాకు మటుకు వింటూంటే ఒహటే చీకుగా ఉంది..

సరే నేను చెబుతాలే అని చెప్పి.. మా అబ్బాయి దగ్గరకు వెళ్లి ఏంచేస్తున్నావురా అని అడిగా..

రైమ్స్ చెప్పుకుంటున్నా నాన్నా..
ఏ రైమ్స్…

“ట్వింకిల్ ట్వింకిల్” , నీకు చెప్పనా?

చెప్పు..

ట్వింకిల్ ట్వింకిల్ లిటిలిస్టార్
హవ్వై వండర్ వాట్యూ‍ఆర్ర్ర్
అప్పెబోవ ద వర్ల్డ్ సో హై
లైకె డైమండింద స్కై.

అప్పటికి గాని గమనించలేదు.. నాలుగు రోజుల ‘ప్లే‍స్కూల్’ విద్య లో మావాడికి వాళ్ల “మిస్సు” నేర్పిన ఇంగ్లీషు..

‘ద వర్ల్డ్ సో హై’ అంటే మా అమ్మమ్మకి అర్ధం కాకపోవటం మంచిదైంది, వాళ్ల అప్పని అక్కడికి పొమ్మంటే ఇంకేమైన ఉందా?

ఇవాళ వాడి ‘ప్లే‍స్కూల్’ కి వెళ్ళాను, కొంచం ఇంగ్లీషు ఇంగ్లీషు లా నేర్పిస్తారేమో కనుక్కుందామని.
వాళ్ల Waiting room లో( వైట్ చేశేది రూముగాదండీ, మనుషులే) కనిపించిన నోటీసు:

“Please smile, It doesn’t costs’ you anything.”

( ఈ[‘] చిహ్నాలు వాళ్లు పెట్టినచోటే నేనూ పెట్టాను. ఫోటో తీశేవీలు చిక్కలేదు.)

మరోసారి మా రామలింగం చెప్పింది నిఝమని తేలగా, గ్రామరు నడ్డి విర్గగొట్టిన ఆ కాప్షనోనరికి మనసులోనే నివాళులర్పించి, ఈ విషయాన్ని ‘ఎమర్జంటు’ గా బ్లాగుదామని సైబర్ కఫే కి వస్తే అక్కడ కనిపించిన సూచన::
Please remove U R footwear here.

‘U’ కి ‘R’ మధ్యలో చెప్పులజత పట్టేంత ‘గ్యాపు’ కావాలనే పెట్టాడా?
అది మక్కీమక్కీ తెలుగులో రాస్తే, ఒక్కడైనా వాడి షాపుకు వచ్చేవాళ్లా? ఈ నోటిసు ఉన్నా కూడా, ఆ కెఫె ముందు చెప్పులు విడవటానికి జనం బారులు తీరుతున్నారంటే అది, ఇంగ్లీషు గొప్పతనం కాదా? చెప్పండి.

—————————————————————————————–
కొసవిడుపు ::

శనివారం పొద్దున్నేమా ఆవిడ నిద్ర లేపి ” మీకు ఊళ్ళో చెడ్డపేరు కూడా ఉందా, నాకు తెలీదే” అంది.
నేను నాకూ తెలీదు మరి అన్నట్టు మొహం పెడితే,
వాడెవడొ,ఫోన్లో “What is Sir’s good name?”అంటున్నాడు, పోయి చూడండి
అంది.తేలికగానే బయట పడ్డందుకు ఊపిరి పీల్చుకున్నాను.

ఇంతకీ ఈ విషయం ఇప్పుడు ఎందుకంటే, లోపలికి ప్రవేశించటానికి వర్డ్‍ప్రెస్సు వాడు, కొత్తగా “సభ్యనామం” అడుగుతున్నాడు, మా ఆవిడే పక్కనే ఉండి ఉంటే, మీకు అసభ్యనామం కూడా ఉందా అని అడిగేది కదా అని భయమేసింది.

15 responses to “ఇంగ్లీషూ యు లివ్ లాంగా-౪

  1. చితక కొట్టాశారు పొండి !

    ‘ద వర్ల్డ్ సో హై’ అంటే మా అమ్మమ్మకి అర్ధం కాకపోవటం మంచిదైంది — ఇది అదిరింది..
    నేను విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు చదవలేదు కానీ.. అదేదో ఇలానే వుంటుందేమోనని పిస్తుంది.

    కానీ సీరియస్లీ చెప్పాలంటే,
    మన వాళ్లకి ఆంగ్లం వచ్చి చావదు, దాని నుడికారం ఒంటి కాలి మీద తపస్సు చేసినా చిక్కదు మనకి. కానీ దాన్నే ప్రట్టుకుని వ్రేలాడి, ఖూనీ చేసి, సాగ దీసి.. తెలుగుకీ ఆంగ్లానికీ మధ్యలోని ఒక కొజ్జా భాష మాట్లాడేస్తున్నారు…
    అలాంటి దుఃఖదాయక అంశాన్ని మీరు బలే హాస్యాస్పదంగా వ్యక్తపరుస్తున్నారు .. .
    దీన్నే కాబోలు ట్రాకీజామెడీ అంటారు ఆంగ్లంలో…

  2. భాష జీవనది లాంటిది. ఎన్నెన్నో మార్పులకి లోనైనా నిరంతరం ప్రవహిస్తూ వుంటుంది. మాయాబజారులో పింగళి వారనిపించినట్టు, మనమే పుట్టించకపోతే, కొత్త పదాలు, ప్రయోగాలూ ఎక్కడివి? చాలా కాలం క్రితం, గిండీ (చెన్నై) రైలు స్టేషనులో బరువు తూచే యంత్రం లొ ఇలా రాసి వుంది “Do’nt put the coin UNDIL the wheel stops”. భావ వ్యక్తీకరణతో బాటు, ఓ పిసరు నొప్పించని హాస్యం ఉచితంగా వస్తే కాదనడం ఎందుకు? అభినందనలతో.

  3. 🙂 🙂 🙂 ఆగి ఆగి మాంచి తూణీరమే ఎక్కుపెట్టారు.

  4. మిత్ర కేసరులు అసలు కీలకాన్ని మరిచిపోతున్నారు. ఆంగ్లేయులు వందల ఏళ్ళపాటు పెట్టిన బాధలకి భరతమాతవాళ్ళని శపించింది – నా సంతానం చేతిలో ఆ చంద్ర తారార్కం మీ మ్లేఛ్ఛభాష ఖూనీ ఐపోతూ ఉంటుందని! 🙂

  5. unfair, did you delete my comment ? or is it a wordpress bug ?

  6. భాష జీవనది లాంటిది. ఎన్నెన్నో మార్పులకి లోనైనా నిరంతరం ప్రవహిస్తూ వుంటుంది. మాయాబజారులో పింగళి వారనిపించినట్టు, మనమే పుట్టించకపోతే, కొత్త పదాలు, ప్రయోగాలూ ఎక్కడివి? చాలా కాలం క్రితం, గిండీ (చెన్నై) రైలు స్టేషనులో బరువు తూచే యంత్రం లొ ఇలా రాసి వుంది “Do’nt put the coin UNDIL the wheel stops”. భావ వ్యక్తీకరణతో బాటు, ఓ పిసరు నొప్పించని హాస్యం ఉచితంగా వస్తే కాదనడం ఎందుకు? అభినందనలతో,
    శ్రీనివాస్

  7. రాకెశ్వర గారూ పొద్దన్న పొద్దన్నే మాచేత మందహాసాలు చేయించారు.కొత్తపాళీ గారూ lol

  8. బాగుంది. మా అమ్మమ్మ ఒక పేపరు కాగితం ఇటివ్వు అంటుంది ఇప్పటికీ :-).

  9. రైన్ రైన్ గోవే – కమ్మకాయ్ నందడే!
    ఇదీ నాలుగోతరగతిలో మా కాన్వెంట్లో మేం రోజూ పలికిన రైమ్స్‌లో ఒకటి.

    రెయిన్ రెయిన్ గోవే (=పోవే) వరకూ ఫరవాలేదు.
    కమ్మకాయ్ నందడే అంటే తెలీదు మొన్నమొన్నటిదాకా.
    నిమ్మకాయ్ తెలుసుగానీ కమ్మకాయేమిటో అనుకునేవాణ్ణి. ఎవర్నీ అడగాలనిపించలేదు. ‘నందడే’ లో ‘నంద’ అనేది తెలుగుపదం. డే అంటే తెలుసు. అలా సరిపెట్టేశాను మొన్నటిదాక. మీ టపా చూసి గుర్తొచ్చింది.
    Rain rain go away – Come again another day! 🙂 ఆ తరువాతేమిటో ఇప్పుడే గూగులమ్మనడిగి తెలుసుకున్నా. 🙂

  10. సారీ ఇది రాసింది రాకేశ్వరుడు గారనుకుని పైన అలా రాసాను.ఊకదంపుడు గారూ తెగ నవ్వించారు.

  11. కొత్తపాళీ గారు,
    అసలు కిటుకు ఇప్పుడు తెలిసింది.
    రాధిక గారు,
    పర్లేదు. మీ వ్యాఖ్య రాకేశ్వరుడికీ వర్తిస్తుంది.

  12. నిత్యజీవితంలో ఇలాంటి వి చాలానే చూస్తుంటాము.
    పిండిరుబ్బె షాపువద్ద, ఇక్కడ పిండి ” రుబ్బింగ్ ” చేయబడును.

    మాపెళ్లి కి వ్రాసిన నేమ్ డిస్ల్ప్లేలో made for each other బదులుగా made far each other అని ఉంది. ఆ వ్రాసినవాడిమీద నాకిప్పటికీ అనుమానమే.

    బొల్లోజు బాబా

వ్యాఖ్యానించండి