Monthly Archives: సెప్టెంబర్ 2011

ఇదె పద్యమ్మిదె కవిత్వ మిదె భక్తియునౌ!

ఈ మధ్య ఇరుగు పొరుగులో – ఓ చిన్న పాప కనిపిస్తే.. నీ పేరేమిటి అని అడిగాను .. చెప్పింది కానీ నా మట్టిబుర్రకి అర్ధం కాలేదు. మళ్లా మళ్లా అడిగాను, పాపం నేను ఎన్ని సార్లు అడిగితే అన్ని సార్లు చెప్పిందికానీయాండి, ప్చ్ .. లాభం లేక పోయింది, పక్కనున్న వారెవరో చెప్పారు – స్నిగ్ధ అని. ఓ మిత్రుడు కొడుకుకి అక్షిత్ అని పేరు పెట్టాడు.. వచ్చీ రాని మాటల వయస్సులో – అందరూ మొదటడిగే ప్రశ్నే – “నీ పేరేమిటని”.. ఆ అక్షిత్ ఇబ్బంది మీరే ఊహించుకోమ్డి., వాడి ఇబ్బందిని చూపెట్టి ( తమ ఇబ్బందిని దాచిపెట్టి) కొంతమంది కలిసి – వాడికి -“అక్కి” అనే పేరు స్థిరపరచారు.సరే పేర్లసంగతిదేముందిలేండి, కానీ అసలు చెప్పదలుచుకున్నదేమంటే..

రాముడు ఏణ్ణర్ధం పిల్లాడుట…
కౌసల్యా దేవి : నీ పేరేంటి
శ్రీరాముడు : లాములు
కౌసల్యా దేవి: మరి మీ నాన్న?
శ్రీరాముడు : దచాతమాలాలు
కౌసల్యా దేవి:  నేను?
శ్రీరాముడు : అమ్మగాలు
కౌసల్యా దేవి: నా పేరు అమ్మ కాదు నాన్నా!… కౌసల్య..
శ్రీరాముడు :  ఓ అలాగా కౌస.. కౌస…
మొదటి దిత్వాక్షరం.. రాముడు బిక్కమొహం వేసేసాడు.. కళ్లలోకి నీళ్లొచ్చాయి.
వెంటనే

కౌసల్యా దేవి:  కాదు నాన్నా కాదు.. నేను కౌసల్యను కాదు .. అమ్మనే

అని రాముడిని అక్కునచేర్చుకొని ముద్దాడిందిట!.

ఎంతటి ఆర్ద్రమైన ఘట్టం.. దీన్ని పద్యం లో పెట్టాడు ఓ మహానుభావుడు.. పాషాణపాకప్రభూ అని సహృదయులచేత కీర్తింపబడటానికి.
ఇదీ ఆ పద్యం:

శా. తానో ‘లాములు’తండ్రిపేరెవరయా? ‘దాచాతమాలాలు’ ‘నౌ
      లే! నాపే’రన ‘నమ్మగాల’నఁగనోలిందల్లి’కౌసల్య తం
      డ్రీ!నాఁగాననఁబోయిరాక కనులన్ నీర్వెట్టఁ ‘కౌసల్యనౌఁ
      గానే కానులె యమ్మనే’ యని ప్రభున్ గౌసల్య ముద్దాడెడిన్.

ఈయన ఆ మహానుభావుడు:

శ్రీ విశ్వనాధ సత్యనారయణ

శ్రీ విశ్వనాధ సత్యనారయణ

ఆ తల్లికి వందనం.
ఆ ఏడాదిన్నర పిల్లాడికి వందనం.
వీళ్లిద్దరినీ కళ్లముందు నిలబెట్టిన కవికీ వందనం.

బాదరాయణ లంకెలు:

తెలుగుభారతి ముద్దు బిడ్డ విశ్వనాథ

మరల నిదేల “అగ్నిప్రవేశం”బన్న… 🙂

కవిసామ్రాట్ విశ్వనాథసత్యనారాయణగార్కి జయంతినివాళులు 

“కవి సమ్రాట్ ” శ్రీ విశ్వనాథ కు నీరాజనము