నాకు అనిపిస్తుంది
నా నీడ నా ముందు ఉన్నప్పుడు
అస్తిపంజరంలానూ
నా వెనుక పడ్డపుడు
ఆంధ్రబోజుడి వలెను
అట్లతద్దెను మరిచి
ఆవకాయ – బిర్యాని లను సంకరించి
ఆంగ్లపు మాటలు గుప్పించీ
నా నీడ నా ముందు పడ్డప్పుడు
అస్తిపంజరంలా అనిపిస్తుంది,
అగుపిస్తుంది
అతిధి దేవోభవ అని అరిచి
అన్ని పండుగలు ఆచరించి
ఆంధ్ర సాహిత్యాన్ని రాసులుబోసి –
నానీడ నా వెనుకున్నపుడు
ఆంధ్రబోజుడి లా అనిపిస్తుంది
అక్షరాలను కుదించి
అంకెలను నిర్మూలించి
అల్పప్రాణులనే ఉచ్చరించీ –
నా నీడ నా ముందు పడ్డప్పుడు
అస్తిపంజరం లా అనిపిస్తుంది,
కనిపిస్తుంది
అన్ని భాషలు నేర్చి
ఆంధ్రాన్ని తూరుపు ఇటాలియన్ చేసి
అణాపై తెనుగు ముద్రేసి-
నా నీడ నా వెనుకున్నపుడు
ఆంధ్రబోజుడి లా అనిపిస్తుంది
సాహితీ
పీఠమెక్కే జ్ఞాని లేడని
విదేశి
పీచమణిచే కేసరి రాడని
పిల్లల
పిలుపు నందూ తెలుగు లేదని
తెలిసి వగచే నాకు-
నా నీడ నా ముందు పడ్డప్పుడు
అస్తిపంజరం లా కనిపిస్తుంది,
అక్షరం, విఙానం
పండగా , పబ్బం
మంచి, చెడూ
అన్ని వదిలేసి
అందరినీ విస్మరించీ
ఆర్జనా ఆదాయమే సర్వస్వంగా బతికే నాకు
నా నీడ నా ముందు పడ్డప్పుడు
ఒంటరిగా అనిపిస్తుంది
అస్తిపంజరం లా కనిపిస్తుంది.
మీకు ఇంతేనా?