తాంబూలం

“దళము” అంటే పార్టీ అనే అర్ధం కూడా ఉండటం చేత, కలికాలం లో, “నాగవల్లీ పార్టీ” అని పెట్టి శ్రీకృష్ణుడు మా పార్టీనే అంటారని భయపడ్డాడు కాని, లేకపొతే

మోకాళ్ల మీద నిలుచున్న అర్జనుడితో పార్ధసారధి, “దళములలో నాగవల్లీ దళమునునేనే” అనే వాడని నా ఘాఠ్ఠి అభిప్రాయం.
అసలు ఏమిటి ఈ నాగవల్లీ దళం, ఏమిటి దీని మహిమ.. ఇదిలేని గ్రామముందా? ఇదిలేని కార్యముందా, నిర్విఘ్నంగా ఏమి జరగాలనుకున్నా, ముందు ఓ వినాయకుడిని చేసి

పూజ చేస్తామే, ఆ వినాయకుడిని ప్రతిష్టించటానికి కూడా మనకు కావలసినది ఈ నాగవల్లీ దళం కదా..అంటే ముందు ఇంట్లో ఆకులు లేక పోతే, విఘ్నాధిపతి పూజించటానికేఅవాంతరం వచ్చేప్రమాదముందన్న మాట.

ఈ పత్రాలతో నా అనుబంధం నా ఊహ తెలియని నాటిది, “నీకు పళ్ళు రాక ముందే మీ నాయనమ్మ ఆకులు వక్కా సున్నం బాగా నూరి నీకు ఇచ్చేదిరా నువ్వు చప్పరించి మింగేవాడివి” అని మా అమ్మ అంటువుంటారు కాని, అది తప్పని, నేను నోట్లో తమలపాకులుతో పుట్టానని నా ఘాఠ్ఠి అభిప్రాయం.
ఆయ్యో, పొట్టకోసం బొంబాయ్ లోనూ, ఆనక ఆరకొర ట్రిప్పుల మీద అమెరికాలోను ఉన్నపుడు అంగలకుదురు ఆకులు దొరకక నోరు, ఆపైన ఆత్మారాముడు ఎంత అల్లాడారు, ఆకులు మేయలేక?
పెళ్లిలో “అయ్యో నీకు ఆకుల ఈనలుతీయటం రాదా” అని ఎవరో అడిగినందుకు పెళ్లికూతురు అవమానం గా ‘ఫీల్’ ఐతే, రాకపోవటం ఇంకా పెద్ద అవమానమని నేనెంత ‘ఫీల్’ అయ్యాను. ఐనా తమలపాకుల గురించి ఒకరు చెప్పాలిటండి. కాన్వెంటు చదువులొచ్చి చెడగొట్టాయి కాని, సుమతీ శతకం లో మేము చిన్నప్పుడే చదువుకున్నాం.

తమలము వేయని నోరును
విమతులతో జెలిమిజేని వెతఁబడు తెలివిన్
గమలములు లేని కొలకును
హిమధాముడులేని రాత్రి హీనము సుమతీ

అని. అందుకే నేను చాలా పుష్కరాలుగా తమలము వేస్తున్నాను. ఇంత సౌమ్యంగా చెబితే వింటారో వినరో అని ఆయనే కొంచం గొంతు మార్చి మరలా,

వీడెము సేయని నోరును
జేడెల యధరామృతంబు జేయని నోరున్
బాడంగరాని నోరును
బూడిదకిరువైన పాడుబొందర సుమతీ

ఇక్కడ మొదటి మూడు పాదాలలో చెప్పిన క్రియ ఏది చేసినా , ఆ నోరు నోరేగాని, నాలుగో పాదంలో చెప్పినది కాదు అని నా అభిప్రాయం. అందువల్ల వీడెము సేసిన నోటి వాడను కనుక మిగతా పాదాలలొ ఏముందొ పెద్దగా పట్టించుకోలేదు.. పట్టించుకుంటే వ్యక్తిగతంగానూ సామాజికంగాను కొన్ని సమస్యలొచ్చే ప్రమాదంలేకపోలేదు.

ఈ రెండిటినీ పక్కన పెడితే, తాంబూలం మీద అసలు సిసలు పద్యం పెద్దనగారు చెప్పాడు:

నిరుపహతి స్థలంబు, రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడె, మాత్మ కింపయిన భోజన, మూయల మంచ, మొప్పు త
ప్పరయు రసజ్ఞు, లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్,
దొరకిన కాక, యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే!

పద్య కవిత్వం కావాలంటే ఇవాన్నీ కావాల్సిందే అని చదువరి గారు అంటారు కాని, ఇవ్వన్నీ అవసరం లేదని ఒక్క తాంబూలం చాలని నేను తాంబులాం వేసుకున్నపుడు అసత్యం పలకని నా నోట నొక్కి వక్కాణించ దలుచుకున్నాను..

పద్యాన్నే చూడండి , మొదటి పాదంలో ఏకాంతం అంటూన్నాడు, మూడో పాదం లో తప్పొప్పులు చెప్పే రసజ్ఞులు, వ్రాయసగాడు, పాఠకులు కావలంటున్నాడు, మరి వారుంటే ఏకంతమెక్కడనుంచి వస్తుంది?
సరే వారిని కాసేపు పక్కన కూచోమందాం, ఇష్టమైన వంటకాలతో భోజనమన్నాడు, సరే అది పెడితే ఊయలమంచం కావాలంటున్నాడు, కడుపు నిండా తిని ఊయలమంచం ఎక్కితే ఎక్కడన్నా కవిత్వం వస్తుందా? చాలామందికి నిద్ర వస్తుంది, నాలాగా సుఖపడే రాత లేని వాళ్లకి వమనమొస్తుంది. కాబట్టి ఈ రెంటీనీ కూడా పక్కకు పెట్టాల్సిందే. ఐనా ఈ రోజుల్లో ఇరుకు ఫ్లాట్లలో మంచానికే చోటుండటంలేదు, ఇక ఊయలమంచాలెక్కడ తెస్తాం చెప్పండి.
ఇక మిగిలింది, “రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు కప్పుర విడెము”, పద్యం లో పట్టంతా ఇక్కడే ఉంది, ఇందులో చాల సూక్ష్మం కూడా ఉంది. ఇక్కడ ‘రమణీ ప్రియ దూతిక’, ‘కప్పురపు విడెము’ రెండు ముఖ్యమే, పక్కన అర్ధాంగి ఉంటే, పద్యకవిత్వం రాయటం కాదు కదా, ధారణ కూడ కష్టమే అని ఆచార్యులు బేతవోలు రామబ్రహ్మం గారు సభా ముఖం గా ప్రకటించారు. కాబట్టి ఆ విషయంలో , ఎటువంటి సందేహాలకి తావు లేదనే అనుకుంటున్నాను. అంటే, సతీమణి భోజనం పెట్టచ్చు కాని, ఊయల మంచం మీద ఉన్నమనకి కప్పురపు విడెమివ్వటానికి మటుకు ( పద్య కవిత్వం రావాలంటే) రమణీ ప్రియదూతిక కావల్సిందే నన్నమాట. ఇక్కడే ఉంది చిక్కంతా, మనం కాస్త మేను వాల్చి ఊయలమంచం మీద ఊగుతున్నామనుకోండి, ఈ దూతిక వచ్చిందని ఆ ఊపు ఆపాలా? ఆపితే మరి పద్యం ఊయలటూగు తూగుతో వస్తుందా?, లేక అందులో కూడ విరామచిహ్నాలు కనిపిస్తాయా? కన్పించవచ్చు.. నిజానికి మనం కవిత్వం మీద మోజుతోనే ఈ రమణీ ప్రియ దూతిక ని ఏర్పాటుచేసుకుంటే ( సాఫ్ట్ ‘వేరు’ పెరిగి పెద్ద వృక్షమైన తరువాత భాగ్యనగరం లో చాల మంది, ‘పని మనిషి’ని పెట్టుకొనే శక్తి లేక తమ అర్ధాంగుల చేత గొడ్డు చాకరీ చేయిస్తున్నారు, అది వేరే విషయమనుకొండి) మరి మనం ఊయల నడకంత అందమైన పద్యం చెప్పేటప్పుడు మధ్యలో తాంబూలం తెచ్చినది, దూతికా కాదా అని చుస్తామా? దూతికైతే, అయ్యో వామహస్తంతో తీసుకుంటే నొచ్చుకూంటుందేమో అని, ఘంటం పక్కన బెట్టి, కుడిచేత్తో తీసుకుంటామా, నే తీసుకుంటే నా గోరు గుచ్చుకుంటే ఆ పూబోడికి గాయమౌతుందేమో అని అనుకుంటామా, ఒక వేళ దూతికే వుంటే ఇవ్వన్నీ అలోచించాలి, ఇవన్నీ అలోచిస్తుంటే కచ్చితంగా సగటు కవికి కవిత్వం రాదు, ( ఆశువుగా పద్యాలు కట్టే అల్లసానికి వారిని పక్కన పెడదాం). పైగా అల్లసాని వారు ఆస్థాన కవి, రాజు గారు భత్యమిస్తారు కాబట్టి కప్పుర విడెమిచ్చే రమణీ ప్రియదూతిక చిక్కుతుంది, కాబట్టి ఆవిడ ఇస్తే బాగుంటుంది అన్నాడు, ఈ ఆకులు చీల్చటం ఇత్యాది శ్రమ ఆయనకు లేకుండ. అంటే ఏమిటి తేలింది, కవిత్వం పుట్టటానికి కావల్సింది కప్పురపు విడెమనేగా.
ఇక్కడ అల్లసాని పెద్దనగారు తన గడుసు దనాన్ని చూపించారు, కవిత్వానికి కావాల్సిన కప్పురవు విడియాన్ని ఒక రెండు ముక్కల్లో పెట్టి మిగతా అంతా వాతావరణాం గురించి చెప్పారు ఆ విడెపు ముచ్చట తప్పించి. ఎందుచేత అని అడిగితే, సూక్ష్మంగా రాకేశ్వరగారు చెప్పినట్టు చెప్పాలంటే , ‘ వ్యాపార రహస్యం’.
ఒక వేళ ఆ తాంబూలం కట్టే పద్ధతే చెబితే ఎంత పాలు సున్నమెయ్యాలి, ఎంత పోక వెయ్యాలి, ఎంత జాపత్రి వేయాలి, ఎంత యాలాలవంగాలు వేయాలి, ఎంత కస్తూరి వెయ్యాలీ,ఇన్నీ వేసినా కూడ , దానిని ‘కప్పురవు విడెము’ అనే పిలవాలంటే అసలు ఎంత కర్పూరం వెయ్యాలి.. ఇవన్నీ దాచిపెట్టటానికి, మిగతా వస్తువులను వాటి అవసరం లేకున్నా ప్రవేశపెట్టాడు అని నా ఘాఠ్ఠి అభిప్రాయం.

ఇందువల్ల ఏమిటి ప్రయోజనం,
౧. ఒక వేళ నేనూ నికార్సు పద్యకవిత్వం రాస్తాను అని బయలు దేరిన వాడికికెవ్వడికి, ఈ సరంజామా అంతా ఒక చోట దొరకదు, కాబట్టి పద్యకవిత్వం మొదలు పెట్టే సూచనే లేదు. ఒక వేళ ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకూంటు వెళ్తే, రసజ్ఞు లకు మధ్య వాదనలు రావచ్చు, రసజ్ఞులకి ఈయనికి మాటామాటా రావచ్చు, నీ ఇత్యర్ధం పులుసు, ఇతి భావం కూరాకి మళ్ళీ ప్రియ దూతిక కూడనా అని అనుకూలవతి ఐన భార్య అభ్యంతరం పెట్టచ్చు (మేఘసందేశం సినిమా లో జయసుధంత విశాల హృదయమున్న మహిళైతే తప్ప), ఆ మహ తల్లి అడ్డు చెప్పకపోయినా, ఔరా ఈ కవిత్వం అంతా నావల్ల పుడుతుంటే నాది కేవలం ‘దూతిక’ హోదానా అని ఆ దూతికకే దుర్బుద్ధి పుట్టచ్చు, లేదు, ఈ ఋషి ( నానృషిః కురుతే కావ్యం అన్నారు కదా) కళ్ళకి ఆవిడ విశ్వామిత్రుడి కళ్ళకి మేనక లాగ కనపడచ్చు. ఇన్ని ఆటంకాలు దాటుకొని పద్యకవిత్వం ఎవరు రాస్తారు? అందుకే పెద్దన గారు అన్నిటినీ ఈ పద్యం లో పెట్టి మాయ చేశారు.

౨. ఒక వేళ ఆయన ఆ తాంబూలం కట్టే సూత్రమే చెప్పి ఉంటే , ఇప్పుడు కిళ్ళీ కొట్ల దగ్గరక మనికి “వృత్త పద్య కిళ్ళీ”, “జాతి పద్య కిళ్ళీ”, “మాత్ర చందస్సు కిళ్ళీ”, ఇత్యాదులు దొరికేవి, అదే కిళ్ళీకోట్లో సాహిత్యం కూడ బొత్తాలు బొత్తాలు గా దొరికేది, మనిషి కిళ్ళీ కొనుక్కొని, కిళ్ళీ నీ రోడ్డు మీద, కవిత్వాన్ని కాగితం మీద పరివ్యాప్తి జేస్తే ,ఆ కాగితాన్ని కొట్టు వాడు తర్వాత కిళ్ళికి వాడితే, .. ఇలా ఈ చక్రం నిరంతరం సాగి కిళ్ళీ కొట్టు వాళ్ళు, కాగితాల కొట్టు వాళ్లు బాగు పడేవారు కాని సృష్టికి అంతరాయం కలిగేది ,అందువల్ల పెద్దనగారు ముందుచూపుతో ఆ కిటుకు చెప్పలేదని నా ఉద్దేశ్యం.

ఆయన చెప్పకపోతే మేము కనుక్కోలేమా, అయన కన్నా గొప్పగా పద్య కవిత్వం రాయలేమా అని కొంత మంది సిద్ధమౌతారని ఆయని కూడ తెలుసు అందుకని .. మనుచరిత్ర లో ..
మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసారసాంద్ర వీటీగంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలపు దెలుపునొక్క మారుత మొలసెన్

ఆన్నారు. అంటే ఏమిటి నా ప్రవరుడు తాంబూలం లో వేసిన కస్తూరిని బట్టి అక్కడ ఉన్నది స్త్రీ నో పురుషుడో తెలుసుకున్నాడర్రా అన్నాడు, అంటే ఏమిటి, తాంబులాం లో వేసే కస్తూరీ , కర్పూరం పాళ్లు ఆడవాళ్లకి, మగ వాళ్లకి వేరు వేరు రా నాయనలారా అని చెప్పాడు. నేను చెప్పాల్సింది చెప్పాను, మీరు ఇంకా ప్రయోగాలు చేస్తామంటే చేసుకోండి అన్నాడు.

అదృష్టం ఏంటంటే అప్పటినుంచి జనులు (పద్య కవిత్వం కోసం) తాంబూలం మీద ప్రయోగాలు చేయటం మానేశారు. దురదృష్టం ఏంటంటే అప్పటినుంచి జనులు పద్య కవిత్వం మీద ప్రయోగాలు చేసి తాము కవులమని నిరూపించుకునే ప్రయత్నాలు ఉధృతం చేశారు.

అది అలా ఉంచితే, ఇప్పటి వరకు మనం చూసిన ‘తాంబూలప్పద్యాల్లో’ మిగతావాటి లాగానే కవిత్వం పాలు ఎక్కువా నిజం పాళ్లు తక్కువా అనిపిస్తోంది కదా. అందుకే ఈ పద్యాలన్నిటి కన్నా కూడా నాకు తమలపాకుల మీద క్రింది శ్లోకం ఇష్టం. ఇందులో కవిత్వం ( లేదా కవిసమయం )లేదని కాదు, కాకపోతే మూడు పాళ్లు ‘నిజం’.

కూపోదకం వటచ్ఛాయ,
తాంబూలం
వనితాతరుణీకుచం
శీతాకాలె భవే త్యుష్ణం,
ఉష్ణకాలే న శీతలం

కదా?

మిగతా టపాల లానే, ఇది కూడా తోచక రాసిన టపాయే కాని, ఎవరనీ నిందించటానికి, కించపరచటానికి కాదని, ఏ కవిని చూసినా ( నాకు రాయటం రాదని అసూయ ఉన్నా) గౌరవమే కాని మరి ఏ ఇతర భావమూ లేదని సవినయంగా మనవి చేసుకుంటూ శెలవు తీసుకుంటున్నాను.

స్వస్తి.

18 responses to “తాంబూలం

 1. తాంబూలానికి నేను పెద్దగా దాసుణ్ణి కాదు. బహుశా చిన్నప్పటి నుంచి హైదరాబాదు రోడ్లమీద, బస్సుల్లోను ఆ తాంబూలం తాలూకు బీభత్స దృశ్యాల్ని చూసి పెరిగిన భీతి వల్ల కాబోలు, ఇష్టం కంటే అయిష్టం పెంచుకున్నాను:-)

 2. ఈ టపా చదివాక తాంబూలంపై మనసుపోయి Mint Icecream తోటి సరిపెట్టులోవాల్సొచ్చింది. 😦

 3. ఆశ్చర్యం. ఈరోజునే నేను ఇదే పద్యం నా బ్లాగులో వేశాను. మీరూ ఇదే పద్యం ఇరగదీశారు. చాలా బాగుంది మీ టపా.

 4. అద్భుతం! శృంగారహాస్యరసకర్పూరాలతో మేళవించిన ఇలాంటి సాహిత్య తాంబూలాలు ఊకదంపుడులో మాత్రమే దొరుకుతాయి.

  నాకు చిన్నప్పుడు చదువుకున్న కాళిదాసు, భవభూతిల కధ గుర్తొచ్చింది. “పర్ణాని స్వర్ణవర్ణాని, కర్ణాంతాకీర్ణలోచనే” అని కాబోసు కాళిదాసు అంటే, ఈయన ఎక్కువ అణాలిస్తాడని చమత్కరిస్తుందా పిల్ల.

  అన్నట్టు మహానుభావా! శ్రీనాధుడి తమలపాకుల బేరాలగురించి రాయలేదేం? 🙂

 5. రవి గాంచనిచో కవి గాంచునుగా అని అన్నారు. తాంబూలంలో ఇంత విశేషముందని తెలిసింది.

 6. చాలా బావుంది మాష్టారూ..
  రమణీ ప్రియ దూతికంటే – కవి తన కల్పనా ప్రపంచం నుండి సృష్టించి మనకి కానుకగా ఇచ్చే పద్యమే కదండీ? కాకపోతే, పైళ్ళైన పెద్దెనగారి మదిలో మెదలిన ఓ మధురోహ కాకమరెవ్వరు చెప్పండి? ఆ దృష్టితో చూస్తే, తాంబూలం, ఆ ఊహకి నప్పిన చంధస్సు అవ్వాలిగదూ? కాబట్టి, చంధోప్రియులైన మీకు తాంబూలం మీద అంత ప్రేముండటంలో ఆశ్చర్యమేముందీ?
  ఇక నిరూపహతి స్థలమంటారా – ఇంకేముందీ – అంతర్మధనం, భావనా ప్రపంచం, ఆత్మకింపైన భోజనమంటే – నచ్చిన కథావస్తువు. ఏఁవంటారు?

  నాగరాజు

 7. కొత్త పాళీ గారు, teresa గారు, నాగమురళి గారు, శ్రీరాం గారు , రాఘవ గారు ,చదువరి గారు, నాగరాజు గారు
  ధన్యోస్మి.

  శ్రీరాం గారు,
  పెద్దనగారిపద్యం పైపు మళ్లించటానికి ‘తాంబూలాలు తీసుకున్నాను …’ , ‘గయోపాఖ్యానం’, శ్రీనాధులవారి చాటువులు, నాగమురళీ గారు ప్రచురించిన సంవాదం పక్కకు పోయాయి. మీరందుకోండి.

  నాగరాజు గారు,
  స్వాగతం. మీ వివరణ, “హా తెలిసెన్” పద్యానికి రావూరి వారి వివరణ వలే ఒప్పుకునేటట్టు చేశేది(Convincing) గా ఉంది. ఐతే ఊయలమంచమంటే భావాన్ని సరిన మాటలు ఎన్నుకొనే డోలాయమాన స్థితేమో.

  మురళి గారు, మీరు పద్యాన్ని విరిచే కాదు, యధాతధం గా కూడా ప్రచురించాలి. ఇక్కడ పద్య ప్రియులు చాల మందే వున్నారు మరి.

  వికటకవి గారు
  ఆలసించిన ఆశాభంగం 🙂

 8. తూగుటుయ్యాలంటే – కథావస్తువు గురుంచిన ఊగిసలాడే ఆలోచనలు, తప్పొపులు తెలిసిన రసజ్నులంటే – వ్యాకరణ, అలంకార శాస్త్రంలోని నియమాలు, లేఖకులులంటే – పదచిత్రాలూనూ. ఇప్పుడు, మొత్తం ఆ పద్యంలోని ఆర్డర్‌ చూడండి – పెద్దన సామాన్యుడు కాడు. 🙂 కవిత్వానికి కావల్సిన మెటాఫోరికల్ సరంజామా అంతా అందులో ఉంది..

 9. నాగరాజు గారూ,

  నాకెందుకో పెద్దన గారి పై పద్యానికి మీరు చెబుతున్న గూడార్ధం కన్నా సాక్షాత్కరించే అసలు అర్ధమే అద్భుతంగా ఉంది. అయితే ఓ చిన్న అనుమానం. ఇది కూడా కవి హృదయమే అని భావించడానికి, కేవలం చదివేవాడి అభిరుచి మరియు విశ్లేషణా శక్తే కొలమానమా? సాహితీమధువును గ్రోలేవాడికి గ్రోలినంత అనుకోవటమేనా? తెలుసుకొనేదెలా? కవి హృదయంలో ఆ విధమయిన అర్ధాన్ని ఊహించక పోవచ్చునేమో (క్షమించాలి, పెద్దన గారిని ప్రశ్నించలేను, ఆ మాటకొస్తే మిమ్మల్నీనూ, మరో పద్యమనుకోండి). సహజంగానే లబ్దప్రతిష్టుడయిన కవికి ఆ తరువాతికాలాల్లో ఆయన రచనలపై వచ్చే ఈ తరహా గూడార్ధ వ్యాఖ్యానాలన్నీ, ఆయన పడిన కష్టానికి తగ్గ “బోనస్ “అనుకోవచ్చా?

  ఎందుకంటున్నానంటే, మొన్నీమధ్య ఈటీవీలో ఉపన్యాసాలలో ఒకాయన, రామాయణం చెబుతూ “రామ” అన్న పదానిక్కూడా గూడార్ధముంది అంటూ ఏదో చెప్పుకొచ్చారు, కానీ నాకది ఎందుకో రుచించలా, కాల్పనికం అనిపించింది. ముఖ్యంగా ఈ తరహా వివరణలు ఉపన్యాసకుల్లో ఎక్కువగా ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. ఉపన్యాసకులు, వ్యాఖ్యాతలకి ఇది నిజంగా గొప్ప చిక్కే. కవి హృదయం అర్ధంచేసుకోటమే కాకుండా, ఆయన గొప్పదనానికి లోటు రాని రీతిలో వ్యాఖ్యానాలు చెయ్యాలి కదా. బాగుంటే బంగారానికి తావి అబ్బినట్లే, బాగోలేకపోతే చిక్కే….

 10. అయ్యా వికటికవిగారూ – ఏది నచ్చింది, ఏది నచ్చలేదు అనేది మన అభిరుచులబట్టి, అంతరంగాన్ని బట్టి, అంతర్లీనమైన మన మన సంస్కారాలని బట్టీ ఉంటుంది – కాబట్టి, అది పూర్తిగా వ్యక్తిగతం. అయితే, వ్యక్తిగతం కానిదొకటుంది – అదేమిటంటే, కవిత్వం – అందులోనూ గొప్పదైన కవిత్వం – ఎప్పుడూ, ఎక్కడైనా, ఏ భాషలోనైనా, ఏ ప్రకియలోనైనా – మల్టి డైమన్షల్ ప్రక్రియ. అందుకని దానిని ఏన్నో రకాలుగా ఆస్వాదించవచ్చును. మన పరిధి పెరుగుతున్న కొద్దీ, ఒక కావ్యం కూడా మనతో పాటూ పెరుగుతూ ఉంటుంది.

  ఇక, కుడికంటితో చూసిన దృశ్యం గొప్పదా, ఎడంకటింకి కనిపించిందే సిసలైనదా అంటే ఏం చెప్పమంటారు? రెండూ కలిస్తేనే కదా చూపులూ, తూపులూనూ? ఈ చర్చలు ఎలాగూ తేలేవి కావు కాబట్టి, ఆ సంగతికేం గాని, మళ్ళా ఈ పద్యానికే వద్దాం:

  ఈ టపాలో – ఏకాంత స్థలం అనంటాడు, మరి దూతికలు, విమర్శకులు, లేఖకులు చే్రితే మరి ఏకాంతం ఎక్కడిదీ అని ఓ ప్రశ్న లేవనెత్తి, చమత్కారంగా మనకి ఊకదంపుడుగారు – సమాధానం చెప్పకుండా, తాంబూలం ఇచ్చి పంపించేసారు. మరి ప్రశ్న అలాగే ఉండిపోయింది కదా? పోనీ, పద్యం చెప్పినవాడు సామాన్యుడా – కాదే, సాక్షాత్తూ ఆంధ్రకవితా పితామహుడే – మరి మజాకానా?
  ఊకదంపుడు గారు అడగని ప్రశ్నలు కూడ కొన్ని ఉన్నాయండోయ్ – దూతిక అంటే మెంసెంజర్‌ కదా? మరి ఆమె తెచ్చిన సందేశం ఏమిటో, ఎవరి దగ్గరనుంచి పట్టుకొచ్చిందో మరా ప్రియ సందేశం? అందులోనూ రమణీ ప్రియ దూతిక అంటాడు పెద్దాయన? రమణీయమైనది ప్రియం కాకపోతుందటండీ? పదాలని ఆచి తూచి ప్రయోగించే పెద్దనగారు, కేవలం ఛందస్సుకోసమే ఆ ప్రయోగం చేసారంటారా? అదీ గాకుండా – భోజనం ముందా, తాంబూలం ముందా? ఇన్ని వందల సంవత్సరాలనుంచీ, మరి ఈ అవకతవకల పద్యం రసజ్న హృదయాలని ఎందుకలా మరి రంజింప చేస్తోంది?

  ఇక నామాటకి ప్రమాణం ఏమిటంటారా?
  మూసిన ముత్యాని కేలే మొరగులు,
  వొద్దిక మాటల కేలే వూర్పులు అన్నాడు కదా పద కవితా పితామహుడు?
  దీన్నే, మరికొంత గుంభనంగా, దానం దాత వశం అన్నాడు ఆదికవి వాల్మీకి.

  కాబట్టి, మీరు ఈ జలపాతంలో చెంచా పెడితే – చెంచానిండుకూ, చెంబుతోనైతే – చెంబునిండుకూ, టాంకరు తీసుకెళ్ళితే – టాంకరు నిండుకూ తెచ్చుకోవచ్చు. అందినంతవరకూ అస్వాదించడమే.

  సంసారే ఖిల్వస్మిన్‌ కవిత్వమి త్యసముద్ర సముత్థ మమృతం అంటారు పెద్దలు (అంటే కవిత్వం క్షీరసాగరంలో పుట్టని అమృతం). మీరెలా గ్రోలినా అది అమృతమే. ఇంతకంటే ఏం చెప్పమంటారు?

  ఊకదంపుడుగారూ – మీ అనుమతి లేకుండా, మీ బ్లాగులో –

 11. నాగరాజు గారు,

  చర్చలతో కొన్ని మరింత విశదంగా బోధపడతాయి, మొట్టికాయలు పడ్డా సరే. మీ వివరణకి నెనర్లు.

  @ఊదం గారూ,
  మొత్తం చర్చ ఒకే చోట ఉంటే భవిష్యత్తులో అందరికీ ఉపయోగమని ఇక్కడే చెప్పుకున్నా.

 12. నాగ రాజు గారు, వికటకవి గారు,
  మీ అనుమతి లేకుండా, రెండు “క్షమించాలి” లు నేను తీసేశాను :). మంచి విషయాలు అందరితో పంచుకుంటుంటే, హుందాగా చర్చ జరుగుతుంటే ఆనందమేకదండీ, పైగా మొదలుపెట్టిన క్రెడిటొకటి. 🙂

 13. గురువుగారూ

  కూపోదకం వటచ్చాయా
  తాంబూలం (వనితా కుచం)
  కాదేమో…
  అది తరుణీ కుచం అని గుర్తు. బహుశా నేనే తప్పంటారా?

 14. బాలు గారు, మీరు అన్న తరువాత “తరుణీ” ఐతే ప్రాసకూడా సరిపోతుంది అదే ఒప్పేమో అనిపిస్తోంది. నాగ మురళి గారిని అడిగిచూస్తాను.

 15. నేను విన్న వెర్షన్ లో ఇటిక ఇండ్ల గురించే గాని మీరు చెప్పిన ఇండ్ల ఊసే లేదు……
  కూపోదకం వటచ్ఛాయ శ్యామా స్త్రీ చేష్టకాలయం /
  శీతకాలే భవేదుష్ణం ఉష్ణకాలే చ శీతలం //
  ఇందులో తాంబూలం ప్రసక్తి కూడా లేదు…..

 16. హేమచంద్ర గారు,
  ఇక్కడ చూడండి:.
  నా దగ్గర ప్రస్తుతం పుస్తకాలేవీ లేవు, పరిశీలించి చెప్పటానికి.
  http://nagamurali.wordpress.com/2008/08/13/%e0%b0%b9%e0%b1%87%e0%b0%a4%e0%b1%81%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%ad%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d%e0%b0%af%e0%b0%a4%e0%b0%bf/

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s