Category Archives: పరిచయం

ఊరికే

ఊరక ఉండకుండా
పనికొచ్చేదేమీ చెయ్యకుండా
ఇక్కడ ఇలా…. ఊకదంపుడు!

*****

వీడా?
నన్ను పట్టేదని
పెన్నేడిస్తే
కన్నీరు
కాగితం మీద పడి .. ఊకదంపుడు!

******
ఊర్లో మాటచెల్లకుంటే
దార్లో కారుమళ్ళకుంటే
బ్లాగ్లోకాన ఇలా… ఊకదంపుడు!

దంచెద ఊక..

దంచెద ఊకనిటనహో
దంచెద కుడియెడమల మరి దంచుట సరదా
దంచిన కాలహరణమట
దంచెద వేరొండు పనినె దలుపగ నేలా?

[అఖిలాంధ్రకోటి కి క్షమాపణలతో]

ఎందుకు..

ఎందుకు..

ఎందుకేమిటండీ ..ఎందుకు ఊరికే ఉండాలి? పైగా ప్లాజరిజం తప్పు గాని బ్లాగరిజం తప్పుకాదుకదా! యెక్కడెక్కడి బ్లాగుల్లోంచి ఎత్తుకొచ్చి మనదే అని చెప్పుకోవచ్చు.పంచతంత్రం కధలనుంచి అక్బర్ బీర్బల్ కధలదాక అన్ని మనపేరు మీద ప్రకటించుకోవచ్చు. చిన్నప్పటి నుంచి విన్న జోకులని, కాలేజీ రోజుల్లో విన్న ప్రచురణానర్హ కవితలని మనపేరు మీద చెలామణీ చేయచ్చు. కావలిసినంతె వక్రించచ్చు. ఇంకా, సముఖం లో నైతే ఏమి చెబుతున్నామో తెలియకుండా చెబుతూపోతే .. వినేవాళ్ళు ఎవరూ ఉండరు. అదే ఇక్కడ అనుకోండి.. ఎవడోఒకడు చదవకపోతాడాఅన్న గొప్ప గుడ్డి నమ్మకంతో. రాసేయచ్చు. చదివేవాడు చదివేటప్పుడు ఏమి తిట్టుకుంటున్నాడో – మనకి ఎలాగు వినపడదు.తిట్టినా ఆంధ్రా అసెంబ్లీ స్థాయిలో తిట్టరు. అలా తిట్టేవాళ్ళందరికి – తిట్టటానికే ఓపిక చాలదు కాబట్టి – అవన్నీ ఇక్కడ రాయరు. పైగా, సముఖం లో నైతే , ఎదురుగా నిలబడి వినేవాడు మన బాధపడలేక – పారిపోవచ్చు పారిపోతే పర్వాలేదు కానీ, తిరగబడి – కొట్టటమో .. చేతికిదొరికినిదానిని విసరటమో చేస్తే మనకే ప్రమాదం. అందువల్ల..చెప్పదలుచుకున్న దానిని చెప్పకుండా బ్లాగులో రాయటం చాల సురక్షితం అన్నమాట.
ఇంతచెప్పినతర్వాత – ఇక మీకు అర్ధమయ్యే ఉంటుంది – నా బ్లాగ్ ఎందుకు .. నా బ్లాగ్‍కి ఈ పేరు ఎందుకు పెట్టానూ అని;.అసలు ఎన్నాళ్ళనుంచి అనుకుంటున్నాను ఒక బ్లాగ్ ఓపెన్ చేయాలని .. అందులో యెడాపెడా ‘పెన్’ చేయాలని..అరె.. నిలబెట్టి కడిగేద్దాం/దులిపేద్దాం ( అయ్య బాబోయ్ శాసనసభా సమావేశాలు ఫాలో అవ్వటం ఇంక మానేయలి) అంటే ఆంధ్రదేశంలొ ఒక్కడూ దొరకడే..ఇట్టాగైతే గిరీశాలందరూ.. వెబీశాలు అవ్వకయేమౌతారు చెప్పండి.. అన్నట్టు ఏదొ చెప్పటం మొదలెట్టి ఎటో వచ్చి నట్టున్నాను.. సరే విషయం లోకే వెళ్దాం – ఇంతకీ యేమి చెబుతున్నాను.. ఆ ఏదైతే యేమిలెండి… ఒక్కముక్క లో చెప్పాలంటే …విషయం ఏమి లేకుండా ఇంతసేపు మాట్లాడటానికి .. ఇంత కన్నా మంచి పేరు లేదు – ఒక్క తెలుగు లోనే కాదు – మిగతా భాషల్లో కూడ… అసెంబ్లీ అనో పార్లమెంట్ అనో పెట్టచ్చు కానియండి అలా పెడితే .. బ్లాగ్ చదవటానికి కాదు కదా చూడటానికి కూడ ఎవరూ రారని ఇలా ఊకదంపుడు అని పేరు  పెట్టానన్న మాట.