Monthly Archives: మార్చి 2008

ఇంకో ఇరవై ఉగాదుల తరువాత

రానారె గారి గీత:
http://mynoice.blogspot.com/2008/03/blog-post.html
నే పెట్టుకున్న వాత:

ఇంకో ఇరవై ఉగాదుల తరువాత

ఇంగ్లీషూ యు లివ్ లాంగా-౬

మొన్న మా రామలింగంతో కలిసి ఓ పెళ్లికి వెళ్ళవలసివచ్చింది. నాకు వధూవరులు తెలియదు, ఊరిబయట ఓ ఉద్యానవనం లో పెళ్ళి, అర్ధరాత్రి తిరిగివచ్చేటప్పుడు నాకుతోడుగా ఉంటావ్ రారా అంటే మొహమాటానికి బయలుదేరాను, ఈ సారి ఎప్పూడైనా ఇంగ్లీషు నేర్పేటప్పుడు దెప్పుతాడని.

ఈ పెళ్లిలోకూడ అన్ని పెళ్ళిళ్లలో లాగేనే ఆడవాళ్లు అందరూ చాల సంతోషంగానూ, కొందరు మగవాండ్రు నిర్వికారంగాను, కొందరు నిర్ల్పితం గాను, కొందరు నిస్సహాయం గాను, కొందరు విచారవదనం తోనూ కనిపించారు. అయ్యో ఇంకోమగవాడు ‘పెళ్ళి పీఠం’ ఎక్కినాడే అన్న దిగులు మనసులో మొదలై, గుండెలకి జేరి, పొట్టను కూడా ఆక్రమించబోతుంటే, కాసేపగితే అన్నానికి చోటుండదని, రామలింగడిని భోజనానికి లేవదీశాను. భోజన శాల వెతుక్కోవటనికి వెళ్తుంటె హలో అంటూ ఓ యువకుడు మా రామలింగం చేయి బట్టుకున్నాడు.. రామలింగం హలో అంటూ, ఇతను పెళ్లికొడుకు తమ్ముడురా, ఆంధ్రా యూనివర్శిటి లో అలంకారశాస్త్రం లో “Ph. D” చేస్తున్నాడు అన్నాడు.
నేను ఛటుక్కున చేయి ముందుకు జాపి “Nice to meet you, Doctor of Decoration Science” అన్నాను, నా అనువాద వేగానికి నేనే మురిసి పోతూ.
అతను రామలింగం వంక కొంచం ఇబ్బందిగా, రామలింగం నా వంక కొంచం కోపం గా చూసారు, పట్టా రాకుండానే డాక్టరన్నందుకనుకుంటా. 😦

—————————————————————————–
కొసవిడుపు::
” Way 2 BAFE” అని చూసి నేను నేరుగా వెళ్లగలిగాను కాని, ఆ పెళ్లికొడుకి తమ్ముడితో మాట్లాడి వెనకొచ్చిన మా రామలింగానీకి బఫే ఎక్కడో కనుక్కోవటం కొంచం కష్టమైందిట.వాడికి బఫే వర్ణక్రమమూ, ఎలా పలకాలో తెలియటమూ తప్పైందని ఏకగ్రీవంగా తీర్మానించాం.

నానాటికితీసికట్టు నాగంభొట్లూ!

టపా శీర్షిక చూసి అది ఏదైనా పద్యపాదంలా కనిపిస్తే పద్యం రాసే మిత్రులకు ప్రత్యేకం గా చెప్పేది ఏమీ లేదు కానీయండి, ఔత్సాహికులకోసం ఒక మాట చెబుతాను..

పై శీర్షిక కందపద్య పాదం అవుతుంది. సమస్యా పూరణం అంటానికి లేదుకానీయండి, మిగిలిన ౩ పాదాలూ రాస్తే పద్యపూరణమౌతుంది.
మీ చేత ఈ మధ్యకాలంలో ‘నానాటికితీసికట్టు’అనిపించిన విషయాలు చాలా ఉండి ఉంటాయి ( ఏంటి, నా బ్లాగ్ కూడా అంటారా, సరే ఆ విషయం తరువాత మాట్లాడుకుందాం).
అలాంటి ఒక విషయం తీసుకొని పద్యం చెప్పండి.

కంద పద్యం గురించి ఇక్కడ చూడండి, అర్ధం కాకపోతే ఇక్కడ.

ఇది కధ కాదు, తెల్లకాగితం

నాకు కధలు రాయటం/చెప్పటం రాదని నాకు తెలుసు, నా అర్ధాంగికి తెలుసు,”బాబు మేమడిగింది సరసమైన కధ” అని తిప్పిపంపిన ఓ పత్రిక వారికి తెలుసు, కాని మీకు తెలియదు కదా.. అందుకే ఇది.
**********

ఎప్పుడూ జన సంచారం ఉండని మా ఇంటిముందు ఆ రొజేదెందుకో నలుగురైదుగురు మనుషులున్నారు.మా ఇల్లు ఒక చిన్న సందులో, దాదాపు సందు చివర ఉండటంతో ఆటు గా వెళ్లే వాళ్లు తక్కువ. ఇవాళ ఆ చిన్ని సందులో, మా ఇంటి ఎదురు గానే నిలబడి వాళ్లు మాట్లాడుకుంటున్నారు. వాళ్లెవరొ నాకు తెలీదు, ఒక్క మా సత్యం బాబాయి ఇంకా గోపీ వాళ్ల నాన్న సుదర్శనం గారు తప్పితే. అందులో ఒకాయన తెల్ల పంచ కట్టుకొని, నల్ల కోటు వేసుకొని ఉన్నాడు, చేతిలో ఒక ఫైలు. అందరిలోకి అయనే నాకు ‘నచ్చాడు ‘. వీల్లంతా ఎప్పుడు వచ్చారో మరి, నేను ఆటలాడుకోవటానికి వెళ్ళేటప్పుడు లేరు. నేను పెరట్లో కి వెళ్లి కాళ్లు చేతులు కడుక్కొని తిరిగి వచ్చేసరికి అందరూ పెద్దరోడ్దు వైపు నడుస్తున్నారు ఎదో మాట్లాడుకుంటూ. అలా నడుస్తున్నప్పుడు ఆ కోటు వేసుకున్నాయన ఫైలు లోంచి ఓ కాయితం పడింది, మెల్లగా ఆ కాయితం దగ్గరికి వెళ్లి జాగ్రత్తగా చేతిలోకి తీసుకున్నాను, గడ్డిమీద పడటం వల్ల మట్టి అంటలేదు, ఆ కోటు ఆయనను ఏమని పిలవాలో తెలిదు, నాన్నను పిలిచే ధైర్యం లేదు, సత్యం బాబాయిని పిలిచి కాగితం గురించి చెపుడమనుకుంటు, రెండో వైపు తిప్పితే, అది తెల్ల కాగితం. దాని మీద ఓ అక్షరం కూడా లేదు. లెక్కల పరీక్షలో మాత్రమే ఇప్పటి వరకు నేను చూసిన తెల్లకాగితం. లెక్కల పరీక్షలో తెల్లకాయితం తీసుకోగానే వణికి నట్టు చేయి వణికింది. పరీక్షప్పుడు మాష్టారి దగ్గర తెల్లకాగితం తీసుకొని, వాసన పీలుస్తూ నా సీటు దగ్గరకి వచ్చినట్టే, ఈ కాయితం వాసన పీలుస్తూ ఇంట్లోకి నడిచాను..ఎదురు గా కనిపించిన అమ్మకి, తెల్లకాగితం దొరికిందని చెప్పాను, ఎందుకో అమ్మ ఏమీ మాట్లాడలేదు.. దాన్ని భద్రం గా తీసుకెళ్లి నా పుస్తకాల పెట్టె లో దాచుకున్నాను.

మర్రోజు సత్యం బాబాయి కనిపిస్తే, “బాబాయి నిన్న కోటేసుకొని మాఇంటికి వచ్చినాయన ఎవరు” అని ఆడిగాను,

“ఆయన దస్తావేజుల సుబ్రమణ్యం” రా అన్నాడు… దస్తావేజుల ఇంటి పేరు నాకు బాగా నచ్చింది.
మర్రోజు సోమవారం, నేను లేచేసరికే అమ్మ శివాలయానికి వెళ్లి తిరిగివస్తోంది, వేసవి
సెలవలు ఇచ్చేముందు బడికి అదే ఆఖరు రోజు, బడికివెళ్లి, మధ్యాన్నం తిరిగి వచ్చాను, నేను వచ్చేసరికి మా ఇంట్లో సామానులన్నీ ఎడ్లబండి మీద ఎక్కించి వున్నాయి.
“అమ్మా ఎందుకే సామానులన్ని బండిలో వేశారు” అని అడిగాను,

ముందు నువ్వు అన్నం తినరా అని లోపలికి తీసుకువెళ్లింది, నాన్న ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఉన్నాడు, ఎటో చూస్తూ.
అన్నం తింటు మళ్లా అడిగాను, “సామానులు ఎందుకు బండిలో వేశారు” అని.
“మనం ఒంగోలు వెళ్తున్నాం” అని చెప్పింది..
“ఎందుకు” అన్నాను
“అక్కడ నిన్ను మంచి బళ్ళో వేస్తాం” అంది..
“నాకు మన బడే బావుంది”..అన్నాను
“ఏడో తరగతి పెద్ద పరీక్షలు ఉంటాయిరా ఒంగోలులో ఐతే ఇంకా మంచి బడి లో చదవచ్చు” అంది.

అమ్మా నాన్న నేను ఎడ్ల బండి ఎక్కిన తర్వాత,
“అమ్మా ఇంటికి తాళమెయ్యలేదే” అన్నాను..
నాన్న – “ఇంట్లో ఏముందనిరా తాళమెయ్యటానికి” అన్నాడు…
నేను మటుకు నా పుస్తకాల పెట్టెకి తాళం వేసుకున్నాను, అందులో ఇంకా రాయని పేజీలున్న నోటు పుస్తకాలు, ఒక నోటు పుస్తకం లో నేను మొన్న పెట్టిన తెల్ల కాగితం ఉన్నాయి అంతే.

ఒంగోలు లో మా ఇల్లు మొత్తం ఒక చిన్న గది. ఊళ్లో ఇల్లేమీ పెద్దది కాదు, కాని, ముందు వెనకా ఖాళీ  స్థలం  ఉండెది, ఇక్కడ ఖాళీ స్థలం లేదు. ఆ రోజు రాత్రి అమ్మ అన్నం పెడుతుంటే,
“అమ్మా నాకు ఈ ఇల్లు నచ్చలేదే, మన ఊరు వెళ్లిపోదాం” అన్నాను..
“ఇక మీద మన ఊరు ఇదేరా, కొన్నాళ్లు ఉంటె అదే నచ్చుతుంది” అంది.
ఆ రోజు రాత్రి, నేను నిద్రపోబోతుంటే అమ్మ నాన్న అన్నం తింటూ మాట్లాడుకుంటున్నారు..
“ఎందుకయ్యా, కాని ఊళ్లో మానకీ భాదలు, అక్కడే ఉన్నదేదో తిని బతుకు ఎల్లదీశే కాడికి” అని అమ్మ అంటే
“నువ్వూరుకోవే, పిల్లాడిని బాగ చదివించాల, ఆ ఊళ్లో ఉంటే నాకు మల్లే అవుతాడు” అన్నాడు నాన్న.

ఇంకొన్ని రోజులకి నాన్న దర్జీ గా ఉద్యోగం చూసుకున్నాడు, ఎండాకాలం సెలవలైనా నన్ను ట్యూషన్ లో చేర్పించాడు.

ఓ రోజు నేను ఏడింటఫ్ఫుడు ట్యూషన్ నుంచీ వచ్చేసరికి, సత్యం బాబాయి వచ్చి ఉన్నాడు.
‘ఈ డబ్బు పిల్లాడి పేర దాచి, చదివిస్తాడులే’ అంటున్నాడు అమ్మతో.
‘నాతో అదే అన్నడు మరీ’ అంది అమ్మ.

కాసేపు ఊరి వాళ్ల సంగతులు మాట్లాడి, నేను అన్నయ్య షాపు దగ్గరకి వెళ్లి అటునుంచి మనూరెళ్తా అని లెచాడు. బాబాయి వెనక నడుచు కుంటు వెళ్లి,
“బాబాయ్ ఆ రోజు దస్తావేజుల సుబ్రమణ్యం మా ఇంటికి ఎందుకు వచ్చాడు” అన్నాను.. “దస్తావేజు రాయటానికి రా” అన్నాడు…
“దస్తావేజు అంటే ఏంటి” అడిగాను..
“ఆస్తి అమ్మినప్పుడు రాసుకునే కాయితాల్లేరా, పెద్దైనతర్వాత తెలుస్తాయి లే” అన్నాడు…

వెనక్కొచ్చి, “అమ్మా మనం ఊళ్లో ఇల్లు అమ్మేశామా” అన్నాను..
“ఇల్లూ పొలం కూడా రా” అంది…
“ఎందుకు” అన్నాను..
“నువ్వు బాగా చదువుకొని ఉద్యోగం చెయ్యాలని నాన్న ఆశ, అందుకే ఇల్లూ, అరెకరం పొలము అమ్మేసి ఇక్కడకొచ్చాం నీకు కాన్వెంటు చదువు చెప్పించటానికి” అంది…

ఇంట్లో కి వెళ్లి, నా పుస్తకాలపెట్టెలో నోటు పుస్తకం మధ్య ఉన్న తెల్ల కాయితం తీశాను.దొరికినప్పుడులా అది వాసన రావటం లేదు.. కాని, అప్పటి లానే ఇప్పుడు కూడా నా చెయ్యి వణికింది…

నేను ఉద్యోగం చేసి మా ఊళ్లో ఇల్లూ పొలం కొనుక్కొని దస్తావేజుల సుబ్రమణ్యం చేత ఈ కాయితం మీ దస్తావేజు రాయించాలి. నాకు ఉద్యోగం వచ్చేదాకా , నేను ఇల్లూ పొలం కొనే దాక ఈ కాయితాన్ని ఇట్టాగే దాచి పెట్టాలి అని అనుకొని , జాగ్రత్తగా మడత పెట్టి తిరిగి నా పుస్తకాల పెట్టలో పెట్టాను.

చంద్రమౌళి

శిరమెటనొంచని వెన్నుడె
శిరమొంచునునీకడయని శితికంధరుడా!
శిరమొంచె బావయన నీ
శిరమున జేరెను మఱింది శీతకరుండే.