Tag Archives: వికృతి

ఎదురుగ నీవై విరోధి ఇంతనె గతమై

సదమదమౌచుంటినినే
వదలనిచీకాకుతోడ వ్యాపారములన్
కదిలెను కాలము వడిగొని
ఎదురుగ నీవై విరోధి ఇంతనె గతమై.

గతజలసేతుభంధనము కాదిది, దెల్పగనీకు జెప్పెదన్
జితజనమానసుండు విధి జిక్కెయె, జేరెను దూరలోకముల్
ఋతువులు కర్షకాలికి ఎప్పటి లాగునె గూర్చెశోకముల్
చెదిరెను ఐకమత్యము రచింపగ గోరియె కొత్తహద్దులన్

ఐకాసలుబుట్టెనటునిటు
ఏకతవిభజనలగోరి, ఎటులను గానీ
మాకయ్యెనిత్యకృత్యము
శ్రీకృష్ణునినామజపము జెప్పగ నిపుడున్.

ముక్కయొ, ముక్కలు జేతువొ,
ఒక్కటి గానుండమనియె ఓర్మినిడెదవో
రెక్కాడకడొక్కాడని
బక్కబతుకులను మటుకిక బాధింపకుమా.

గాలిని బీల్చభీతిలిరి; కైనిడి యూపక మొక్కిరందరున్
కూలెన్ ధైర్యముల్, నరులు గోళిని బొందగ సూదిమందునో
జాలిగ వీధులంబడిరి జల్లదనంబది శాత్రువైబడన్
చాలువిరోధికృత్యములు, చల్లగ జూడుము నెల్లవారలన్

వాకల్సాగును తేనెలేతెనుగునెవ్వారేలవంచించిరో
మాకూనల్ పలుకంగబోవరుబడిన్, మ్లానమ్ము, శిక్షార్హమై,
ఏకైవచ్చియె జేరిమేకగుటనే ఏలాగు మాసీమ “పో
నీకానీ” యనిజూడకేవిడుదురోనీవైన ప్రశ్నింపుమా.

వైద్యులు ఒజ్జలు తమతమ
భాధ్యతలనెరిగియెజూడ బాలల, మహిళల్
విద్యాధికసౌరునందన్
ఉద్యమస్పూర్తిన్ యడుగిడుమోయీ వికృతీ.

ఎచ్చోట పిల్లలే ఎగిరుచు గెంతుచు
బడికిబోవగలరో భయము లేక

ఎచ్చోట మహిళలు ఎదిరించి క్రౌర్యమున్
గెలిచి నడిచెదరో గేలి లేక

ఎచ్చోటనుప్రకృతి నెంచిరక్షింతురో
రాబోవు తరములా రక్ష గోరి

అచ్చోటు నెలకొల్ప ఆంధ్రదేశమునందు
ఆనబూనియెరమ్ము ఆశ నిమ్ము.

పద్యములివె అర్ఘ్యపాద్యములని
స్వాగతింతు నేను సంప్రదాయ
రీతి, సంతసించి లెమ్ము,రమ్మువికృతీ,
ఎదురుకోల ఇద్దె ఎత్తుగీతి.