Tag Archives: ప్లవ

స్వాగతమయ్య! శ్రీప్లవా!

ముచ్చెమటలు పట్టెనయా
రచ్చలఁ గనఁగా కరోన రక్కసి రూపున్
విచ్చేయగ నీపునిపుడె
హెచ్చరికయు సేయలేను హేలాగతులన్

సకలప్రపంచమిత్తరి
వికలంబైయుండెఁ జెలగ విషపుకరోనా
త్రికరణ శుద్ధిగ ప్లవ! మే
లొకింత యడుగిడెడువేళ నొనగూర్చుమయా!

గాలిని బీల్చభీతిలిరి, కట్టిరి మూతికి గుడ్డముక్కలన్,
కూలెను ధైర్యముల్, గృహపు గోడల మధ్యను నిల్చిరెల్లరున్,
జాలిగ చూచుచుండిరి విషాదము మాపు వినూత్నశక్తికై,
చాలు కరోన-కాండమిక సైపక చంపుము దాని వేగమే

ఆదాయవ్యయములు కం
దాయములందెన్నబోరు తరగులు హెచ్చుల్
సాదరముగ స్వాగతమీ
మేదిని నిడెదరు దయగొని మేల్ జేతువనన్

దాటింపుము విపరీతముఁ
బాటింపుము పేదలనిన బాంధవ్యమునున్
నాటింపుము మంచితనముఁ
జాటింపుము ప్రకృతి రక్ష సలుపమని ప్లవా!

దినము పనిలేక ఒకపూట తిండి కైన
లేని బడుగుజీవుల రక్షఁ బూనమందు
దిగువ మధ్యతరగతికిఁ దేఁకువనిడి
కావ వలయును నీవె యిక్కాలమందు

మంచిని సమాజమందున బ్రతుక నిమ్ము,
పంచుము సుఖసంతోషముల్ ప్రజలకెపుడు,
పెంచుమాయురారోగ్యముల్, త్రుంచు మింక
చీని దౌష్ట్యము, శ్రీప్లవా! ఆనఁ గొనుము

మామిడి తోరణమ్ములిడి మాగృహమంతయు, రంగవల్లులన్
గోమల పుష్పముల్ పసుపు కుంకుమ లద్దితి నీదు మార్గమున్
గోముగ పాడుచుండెనొగి కోకిలలన్నియు నీదు కీర్తనల్
రా మరి జాగుసేయక పరాత్పర! స్వాగతమయ్య! శ్రీప్లవా!