Monthly Archives: ఫిబ్రవరి 2015

నేర్పవయ్య నాకు సర్పభూష! – ४

అన్నపూర్ణాదేవి యాత్మేశు వీవని
తృప్తిగా కీర్తించు తెలివి లేక

పొట్టకూటి కొఱకు పొరుగు రాష్ట్రమునందు
పలుకష్టముల్ నేను పడుచునుంటి

చిత్తశాంతినిగూర్చు జీవేశువీవని
తర్కించు కొనునట్టి తడవు లేక

చిన్నవిషయముల చేఁజింతనొందుచు
మాన్ప వైద్యులమధ్య మసలుచుంటి

నాపదల్ తొలగించి యవనిజనులఁగాచు
యాదిదేవుడ వన నదియు మరచి

ధన,బల, జ్ఞాన వృద్ధస్నేహసమితిలోన్
బ్రోచు వారి కొరకు జూచు చుంటి

దైత్యతతకినైన దయవరములనిచ్చు
దైవ మీవను నట్టి తలపులేక
కోర్కె వెనుక కోర్కె  కోరుచుండ సతియె
తీర్చు దారి గనక తిరుగు చుంటి

పరువు పెట్టు చుంటి ప్రస్థాన మెఱుఁగక
పదియు లిప్త లైన ప్రతి దినము
నిన్ను తలచి కొల్చి నెమ్మదింప మదిని
నేర్పవయ్య నాకు సర్ప భూష!