Monthly Archives: అక్టోబర్ 2008

చిరుతరువింక పూచివికసించి ఫలమ్ములనిచ్చి కాచుగా

గోపిక-1:
హారనులేనికారువలె, హస్తికి దంతము లేనిరీతినన్
చీరెకు అంచులేనటుల, జీరలు కల్గని వ్యాఘ్రమోయనన్
ధారుణి ఖ్యాతినొందనగు, దాపరికమ్మొకొ, ఏమియా  
దారములేని హారము, నితంబిని, నీకెటులొచ్చె జెప్పవే?
గోపిక-2:
మేరువు పండితోత్తముల, మేటికవీశులమధ్య, తా.ల.బా, 
పేరుకుతగ్గరీతిమన పెద్దన యల్లిక సౌరునిచ్చె,రా   
నారెయు,రామకృష్ణ,గిరి, నవ్యకవుల్  శుభలగ్నమందునే
తీరుగ జేరికట్టిరిదొ, దివ్యకదంబము పద్యమాలికన్,  
దారములేనిహారమని,తానిడె కాన్కగ కొత్తపాళియే!
గోపిక-1:
కరవదినవ్యయుగమునన్,
అరదుగగనగలుగువీధి యంగడి యందున్
వరమే? అణాకు తూగని
సరుకే దెచ్చికొని చెలియ, సంతస మేలా?

గోపిక-2:
కప్పుర గంధము ఓలెన్
అప్పసిడితొడవులమెరయు అందము లాగున్,
అప్పారిజాతమువలెను
ఇప్పద్యమునిత్యనూత్నమింతీ! మఱియున్ –    

సురపురనందనైకవరశోభితసుందరశ్వేత,గంధశ్రీ
విరితరుశాఖనే భువికివేడుకదెచ్చినరీతి; జాలమున్ 
అరయగకొత్తపాళివరుడంటునుద్రొక్కగ పద్యశైలికే
స్థిరముగబూనికొన్నదనశిష్యులె పాదునుజేసి నీరిడన్
చిరుతరువింక పూచివికసించి ఫలమ్ములనిచ్చి కాచుగా!

ప్రకటనలు

పన్ తరంగాలు -౩

  • ఈ రోజుల్లో ఇంటికో సాఫ్ట్ వేర్ ఉద్యోగ్రస్తుడు/గ్రస్తురాలు.
  • అందం క్షణభంగురం, అయినా  వీక్షణభంగురం.
  • ఇప్పుడు తరణోపాయం కన్నా తరుణోపాయం వెతుక్కునేవారే ఎక్కువ.
  • పెదవులు కదలకపోతే వెంట్రిలొక్విజం, జుట్టు కదలకపోతే వెంట్రుకలొక్విజం.

పన్ తరంగాలు -౧
పన్ తరంగాలు -౨

అమ్మ,నాన్న, మూడేళ్లబ్బాయి -౪

రెండు వారల క్రితం, అర్ధరాత్రి 12:00 గం

అమ్మ : ఏమండీ, పొద్దునపూట నాకు వీడ్ని స్కూల్లో దింపటం కష్టం గా ఉందండి , రేపటినుండి మీరు దింపండి..
నాన్న: బండి మీదేగా వెళ్లేది, పది నిముషాల భాగ్యానికి ఏమి కష్టంట.
అమ్మ: అదికాదండి,
నాన్న: కాస్తా,నిద్రపోనిస్తా, మళ్లి రేపొద్దునే లేచి ఆఫిసుకి పరిగెత్తాలి.

ఓ వారం క్రితం, అర్ధరాత్రి 12:00 గం
అమ్మ : ఏమండీ, పొద్దునపూట నాకు వీడ్ని స్కూల్లో దింపటం కష్టం గా ఉందండి,తిరిగి వచ్చి మొదలు పెట్టాలంటే వంట లేటవుతోంది రేపటీ నుండి మీరు దింపండి..
నాన్న: నాకున్న సమస్యలకి నాకు నిద్రపట్టేదే తెల్లరుఝామున, ఆ రెండుగంటలన్నా ప్రశాంతంగా పడుకోనీ
అమ్మ: అదికాదండి,
నాన్న: నువ్వు దింపితేనే వాడికి ఇష్టం ఇక పడుకో

మొన్న అర్ధరాత్రి 12:00 గం

అమ్మ : ఊరుకున్నకొద్దీ వీడి మిస్సు మరీ మితిమీరి పోతోందండీ
నాన్న: ఇప్పుడేమైంది
అమ్మ: ఈవాళ వీణ్ణి “ఎంత మీనాన్నలాగ అందగాడివైతే మాత్రం అంత మిడిసిపడక్కర్లా” అందిట.
నాన్న: అంత మాట అందా, వాళ్ల ప్రిన్సిపాల్ తో మాట్లాడతాలే, అన్నట్టు, నీకు కష్టం గా ఉందంటున్నావుగా రేపటినుంచి వాణ్ణి స్కూల్లో నేను దింపుతాలే..
అమ్మ: ( మా అక్కచెప్పిన చిట్కా నాక్కూడ పనిచేసిందోచ్)