Monthly Archives: డిసెంబర్ 2007

నే రాయని రెండు టపాలు – ౨

                         ఆంధ్రప్రదేశ్ ఉందని తెలియని తెలుంగులు

వార్తగురించి కూడా నేను టపాలు చూడలేదు. ఇది చదివితే నాకు గగుర్పాటు కలిగింది. ఎంతో దూరం లో, తమ భాష మాట్లాడేవాళ్లు కొన్ని కోట్ల మంది ఉన్నారని, తమ భాషకి లిపి ఉందని తెలియక జీవనం సాగిస్తున్న నాలుగు వందల పైచిలుకు కుటుంబాల కధ. అలాంటి వారికి ఒక్కరోజు అకస్మాత్తుగా తమ భాష మాట్లాడేవాళ్లు కనిపిస్తే? ఆ అనుభూతి మాటలకందుతుందా?
వందల ఏండ్లుగా తమ భాషని కాపాడుకుంటూ, ఇంకా తెలుగులోనే మాట్లాడుకుంటున్నందుకు వీళ్లకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

అనుభూతులకి కవిత్వమే అక్కరలేదు ‘”నీతో మాట్లాడుతున్న నిముషమే మాకు స్వర్గాన ఉన్నట్టుంది” అన్నాడుట, ఆ తెగలోని ఒక వ్యక్తి. వాక్యం రసాత్మకం కావ్యం అంటె ఇదేనేమో. మీదగ్గరకు మేం వచ్చేస్తాం రానిస్తారా? మమ్మల్ని మీలో కలుపుకుంటారా అన్నారుట. పాములు,కోతులు ఆడించి సంచారజీవనం గడుపుతున్న వీరు ఆంధ్రప్రదేశ్ రాగలిగితే మెరుగైన జీవితం గడపగలుగుతారని నాకనిపిస్తుంది. మరి ప్రభుత్వం సాయమందిస్తుందో, వీళ్లకి ఎప్పటికి వోట్లు రావాలి, ఎప్పటికి వోట్లేయటం రావాలి అంటుందో. సాంస్కృతిక శాఖైనా సానుకూలంగా స్పందిస్తే బావుండు.

నే రాయని రెండు టపాలు-౧

బాపు ౭౫వ పుట్టినరోజు

డిసెంబరు ౧౫న బాపు తన ౭౫వ పుట్టిన రోజు జరుపుకున్నారు. నాకు ఆ రోజు రాత్రి భక్తి టి.వి వారు ప్రసారం చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమం వల్ల తెలిసింది. ఆ రోజూ, మర్రోజూ ప్రయాణం లో ఉండటం వల్ల బ్లాగులో ప్రకటించలేకపోయాను.తోటి బ్లాగరులెవరైనా ఈ విషయం ప్రస్తావించారేమో తెలియదు. ఈ నిత్యయవ్వనుడు, ౬౦లు సమీపిస్తున్నపుడనుకుంటాను, కాస్త వయసుకనిపించాలనో,ఏమో పైపు పట్టారుట. ఆయన చేతితో ఆయన వేసుకున్న ఆయన పైపు పట్టిన బొమ్మ ఈనాడు ఆదివారంపై వచ్చింది, ౬౦వ జన్మదినం సందర్భంగా శ్రీ.ము||వెం||రమణ ఓ ప్రత్యేక వ్యాసం రాశారు. ౭౦వ పుట్టిన రోజుకి, మళ్ళీ ఆయన వేసుకున్న బొమ్మే, ఈ సారి రాములవారు సీతమ్మ పాదాలకి పారాణి దిద్దుతుంటే, పారాణీ అందిస్తున్నట్టు. ఇంతలో ఇప్పుడు ౭౫వ పుట్టిన రోజు. ఆ రోజు దినపత్రికలు బాపు పుట్టినరోజు ఎలాజరుపుకున్నాయో తెలీదు. ఈ భక్తి టివీవారి ప్రత్యేక కార్యక్రమానికి మటుకు యాంకరమ్మ సుమ. ఆరుద్ర వారి “కొంటె బొమ్మల బాపు” తప్పు జెప్పి, ఓ చప్పనైన స్క్రిప్టు పట్టుకొచ్చి ఫెయిలు మార్కులు సంపాదించింది.
కార్యక్రమాన్ని రెండు భాగాలుగా విడగొట్టారు. చిత్రకారుడు బాపు,చలనచిత్రకారుడు బాపు.
నాకు చిత్రకారుడి భాగం నచ్చింది, రామాయణ, భారత భాగవతాలపై బాపు వేసిన బొమ్మలు లిప్తకాలం పాటైనా, చూసి అహా అనుకున్నాను. ఆ చిత్రం తెరమీద కనబడిబడగానే పక్కనున్న మిత్రులు ఆ ఘట్టం చెబుతుంటె, ముందు మిత్రుడి గొప్పతనమనుకున్నాను కాని, ఆనక తెలిసింది ఆ గొప్పతనం బాపూదని.శ్రీయుతులు ముళ్లపూడి వేంకట రమణ,శ్రీ రమణ, తనికెళ్ళ భరణి, బాపు గురించి మాట్లాడారు.
చలచిత్రపు భాగం, రాబోయే బాపూసినిమా వ్యాపార ప్రకటనగా మారినట్టు అనిపించింది.

ఈ రామభక్తుడికి ఆ స్వామి, దీర్ఘాయురారోగ్యైశ్వర్యాలనివ్వాలని, బాపు గారు కలకాలం అంధ్రనాట హాస్య,భక్తి రసాలని పంచాలని కాంక్షిస్తున్నాను.
సరే మీరు ఇది చూసి ఆనందించండి.

మోకాలడ్డుటకునేమి? మోదీ గెల్చెన్

మోడీ మతఛాందసుడని
కాడే అపమృత్యుబేరగాడని పలికే,
మోడీ జపమ్ములో తా
మోడిరిలే ఘోరముగను, మొగమెటు చెల్లున్?

ఎన్నికలసంఘముండెనె
పన్నుగ ఉచితానుచితము పరిశీలింపన్?
వన్నే?దోషులనొదలగ?
కన్నున్ననుగ్రుడ్డిసంస్థ గాదె చదువరీ!

మొత్తమ్మీద ఓ సీసం

మరో సవరణ

సీ. లపైని కరముంచ లపోయ డీతడు
మోహినీరూపంపు ముద్ది మోజు లేదు
వానియుదరమందు సియింప మనబోడు
గంగిరెద్దులపాలి గాడు శౌరి
రళము నిల్పుమా కంఠమందనబోడు
మృతమ్ము ద్రావగ శ లేదు
మ్మజేరగబోవ డ్డుగా తారాడు
ర్ధనారీశుపై మిత భక్తి

ఆ. ఫాలనేత్ర!సాంబ!న్నగ భూషణ!
శంభు!సోమ! స్థాణు! శంకర! శివ!
క్తపాల!వరద !పరమేశ! మామిత్రు
కొసగుమా వడిగొని, కోరు వరము.

గిరి గారు,కాదు అంటే సత్యమో అసత్యమో ( TRUE/FALSE) చెబుతున్నట్టు, కాడు/గాడు అనటం వల్ల విష్ణువు నీ కోసం ఆ వేషం వెయ్యాల్సి రాదు అని చెబుతున్నట్టూ అనిపించింది అందువల్ల కాడు అన్నాను.

తూగులయ్య పదాలు-౩

ఇది మూడవ ( దేవుడు మేలుజేస్తే, మరియు చివరి) “రౌండు”, కాబట్టి, పఠయితలే సంయమనం పాటించాలని మనవి.
మొదటి, రెండవ వాత’లిక్కర’ ..అదే ..ఇక్కడ

పెళ్లి మంటపమందు
ప్రక్క మిత్రుల విందు
సిగ్గు చేటని యందు
ఓ తూగులయ్య
***
ఫీజు జీతము నాడు
చీర పండుగ నాడు
మందు మాత్రమె నేడు
ఓ తూగులయ్య
***

తడసినంతనె గొంతు
మాట మాటకు బూతు
జేయు ననుముకవాతు
ఓ తూగులయ్య
***

బారు బిల్లగు జాస్తి
ఇంట చేతురు శాస్తి
“రోడ్డు సైడె”ప్రశస్తి.
ఓ తూగులయ్య
***

చికెను వేపుడు తోడ
గ్యాసు షోడా తోడ
తెలియు స్వర్గపు జాడ
ఓ తూగులయ్య
***

పబ్బు లొచ్చెను నేడు
కుల్కు స్మితల తోడు
తోచి నట్టుల ఆడు
ఓ తూగులయ్య
***

డాన్సు బారుల యందు
నాట్య గత్తెల చిందు
నోట్లు గుబ్బల సందు
ఓ తూగులయ్య

నేనూ – నా టీవియస్-౫౦

చాలా ఏళ్ల క్రితం ఓ ఆదివారం ఉదయం మూసీనది ని పూడ్చి కట్టిన ఓ కాలనీ లోంచి నడిచివస్తుంటే, ముందు ఓ యువకుడు తన పల్సర్ బండిని దిల్‍సుఖ్‍నగర్ వేళ్లే ఎత్తురోడ్డుమీద అతి కష్టం మీద తోసుకుంటూ వెళ్తున్నాడు.

దీనిని బట్టి నీకేమర్ధమైంది అడిగాడు పక్కనున్న మిత్రుడు..

“పేకాటాడేటప్పుడు, పాడు పుస్తకాలు చదవకూడదని” అని చెప్పాను, రాత్రి మొదలెట్టి పదినిముషాల క్రితం కామా పెట్టిన పేకాటలో నా వరస ఫుల్‍కౌంట్ల గురించే అడుగుతున్నాడనుకొని.

అది కాదురా నేను అడిగేది .. ఆ బండి తోసుకొని వెల్తున్నవాడి గురించి అన్నాడు..

దాని గురించి అనేదేముంది .. ఒక పది నిముషాలక్రితం వరకు .. ఆ బండి వల్ల సుఖపడే ఉంటాడు..ఇంకో పది నిముషాలలో పంచర్ వేయించి మాళ్ళా హాయిగా నడుపుకూంటాడు.. మధ్యలో ఈ కాసేపేగా కష్టపడుతున్నాడు, పడనీ..అన్నాను

అదిగాదురా..
కష్టసుఖాలు పక్కపక్కనే ఉంటాయి అని పెద్దలు ఎప్పూడొ చెప్పారురా..

సుఖం పక్కన లేదు బాబు .. ఓ పది అడుగుల వెనక ఉంది చూడు..

అప్పుడు చూశాను ఆ బండి కి కాస్త వెనక మెల్ల మెల్లగా హొయలొలికించుకుంటూ నడుస్తున్న ఓ సుందరిని.

అంటే ఏమిటి, ఆ పిల్ల అతని తాలూకా అంటావా..
అవును..
ఎలా చెప్పగలవ్ .. అని అడిగానో లేదో .. ఆ బండి తోస్తున్నవాడు వెనక్కి తిరిగి ఈ అమ్మాయిని ఏదో అడిగాడు..

నా మిత్రుడు చూశావా అన్నట్టు నా వంక చూసి .. రెట్టించాడు -ఇప్పుడేమంటావ్ అని..

అంటానికి ఏముంది అన్నాను..
ఓ పది నిముషాల క్రితం వరకు .. వాడి వెనకాల సుఖం గా ప్రయాణం చేసిందిగా, మరి కష్టం ఇప్పుడు వాడొక్కడే పడుతున్నాడే? అన్నాడు


పొగలు కక్కుకుంటూ
పల్సర్‍పై నే పోతుంటే
పొట్టక్కర్చుకొని నీవు

చెమటలు కక్కుకుంటూ
చెడినది నే తోస్తుంటే
చేతులుకట్టుకొని నీవే”

అన్నాను, రాత్రి చదివిన పుస్తకం ప్రభావం తో

నీ పేరడిలతో నువ్వు నిన్నూ, పనిలో పని మమ్మల్నీ హింసించటం మానవు కాని .. నే చెప్పదలుచుకున్నది అది కాదు అన్నాడు..
మరి ఏమిటి అన్నాను – మొహం ప్రశ్నార్ధకం గా పెట్టి

బండి కొనుక్కుంటే, నీ రెండు చేతులతో నీవు నెట్టుకోగలిగింది కొనుక్కో, అంతే కానీ ఓ రెండు టన్నులబండి కొనుక్కొని ఎవడొచ్చి నెడతాడా అని మాటిమాటికి వెనక్కి తిరిగిచూసుకోవాల్సి వచ్చేది కాదు .. “Matter Of Fact” లాగా చెప్పాడు.

వాడిది అధివాస్తవికత, నాది అలౌకికత, మా ఇద్దరిని ఈ రెంటితో సంబంధంలేని ఇంకో ముగ్గిరితో కలిపి ఒకే ఇంట్లోనే అద్దెకి ఉంచేది, ఆర్ధిక అశక్తత.

వాడి మాట విని, కొన్నాళ్ళకి, చాలా తర్జనభర్జన తరువాత, ఓ TVS50 కొన్నాను, అప్పు నెలసరి వాయిదాలలో తీర్చే పద్దతి మీద.ఆ బండి మాకు కావాల్సిన సేవలన్ని చేసిపెడుతూ, అందరి మన్ననలూ పొందుతున్న వేళ, రూం లో ముగ్గురు మెయిన్‍ఫ్రేంకో శిక్షణకై అప్పటి మద్రాసు వెళ్ళారు.సలహా ఇచ్చిన మిత్రుడు కూడ ఉద్యోగం మారి, భాగ్యనగరం ఇంకో కొన వైపు మారాడు, నేను, పెట్రోలు, ఇంటద్దె కలిసిసొస్తుందని ఓ చిన్న రూం‍లోకి మారాను.

ఆనందంగా బండి నడుపుకుంటూ, పంచరు పడ్డపుడు, వెన్నక్కి తిరిగి చూసుకోకుండా నెట్టుకూంటున్నందుకు, నన్ను నేను అభినందించుకుంటూ, ఆ సలహా ఇచ్చిన మిత్రుడిని మనసులోనే మెచ్చుకుంటూ, గడిపేస్తున్నరోజులలో

ఓఉదయం పదకొండిటప్పుడు, ప్యూన్ వచ్చి మేనేజర్ గారు రమ్మంటున్నారండి అన్నాడు,
నలుగు కోటిలింగేశ్వరరావు ఆంధ్రదీప్తి లో రాసిన దినఫలాలలో ‘పై అధికారుల మందలింపు’ అని చదివినట్టు గుర్తొచ్చి, అయినా తప్పదుకదా అని అయన గదిలోకి వెళ్ళాను.

వెళ్ళేసరికి, ఒక సహొద్యోగిని , వస్త్రాపహరణం అయ్యీఅయిపోంగానే ద్రౌపదికి మల్లే, పైట నిండా కప్పుకొని వెక్కి వెక్కి వేడుస్తోంది, ఛీ, ఏడుస్తోంది.
బాసు, ప్రతినబూనటానికి సిద్ధంగా ఉన్న భీముడి లా ఎగసి ఎగసి రొప్పుతున్నాడు..

నా పాత్ర ఐపోయింది అన్నట్టు దుశ్శాసనుడిలా ఓ మూల నుంచున్నాడు, తోటి ఉద్యోగి, నా తరువాత చేరిన మానేజరు దూరపు చుట్టం.

బాసురుడు (పరుశురాం అని పేరు పెట్టాల్సింది, గణాలుకుదరకపోవటం వల్లో ఎమో, మా బాస్ కి పట్టాభిరాం అని పెట్టాడు వాళ్ల నాన్న) “ఏమిటీ పని”,అన్నాడు..

ఏమి అర్ధం గాక , ఏ పని సార్ అన్నాను, మళ్ల ఎప్పటి లా ఒకళ్ళకి పంపాల్సిన కొటేషన్ ఇంకొకళ్లకో, ఒక కష్టమర్కి పంప్వాల్సిన స్టాకు వేరొకరికో పంపిఉంటాను అనుకొని..

“నీ బండి మీద మేడం పేరు రాశావుటా” అన్నాడు…

నాకు రాళ్ల మీదా, ఇసక మీదా, చెట్ల మీద పుట్ల మీద పనికిరాని రాతలు రాసే వాళ్ళంటే చెడ్డచిరాకు ( అప్పుడు బ్లాగులు లేకపోవటం వల్ల జనాలు అలాచేశేవారనుకోండి, అది వేరే విషయం)

ముక్కుసూటి గా చెప్పటానికి నేను రానారేని కాదు కాబట్టి, నేనేమీ రాయలేదు సార్ అని నసిగాను.

“బండి చూస్తే తెలిసిపోతుంది సార్” అని గొణిగి టక్కున నొరుమూశేశాడు దుశ్శాసనుడు.

అందరం కిందకివెళ్ళాం బండి చూడటానికి,

నేను ఒక్కడిని ఉండటం మొదలు పెట్టిన తరువాత, వెనక ఎవడూ ఎక్కని కారణంగా, వెనకసీట్ మీద ఇంచుమించు అట్ట కట్టి నట్టు గా ఉన్న భాగ్యనగరపు రోడ్ల మట్టిలో ముత్యాల్లాగా రెండు తెలుగక్షరాలు, పక్కపక్క నిలబడతే, ఓ తెలుగుఅమ్మాయికి పేరౌతాయని కూడతెలియని అమాయకపు అక్షరాలు కనిపించాయి.ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఆవిడకి సంబంధించి ఆ టివియస్-౫౦ మీద పట్టే వస్తువేమైనా ఉండి అంటే అది ఆవిడ పేరే, వేరేవి ఏవి, ఒక్క వెనకసీటు కాదుకదా, డ్రైవరుసీటు తో పాటు కలిపిఇచ్చినా ఆ బండి మీద పట్టవు, ఆవిడ తెచ్చుకొనే, హాండ్బ్యాగు,లంచ్బాక్సు తో సహా.

ఇప్పుడేమంటావ్ అన్నాడు పరుశురాం.

విసవిసా పైకెళ్తున్న ద్రౌపదిని, ముసిముసి గా నవ్వుతున్న దుశ్శాసనుడిని, రుసరుసా చూస్తున్నా పరశురాముడి చూసి, లంచ్-అవర్ లో మీతో మాట్లాడతాను అన్నాను.

కాదు ఇప్పుడె ఆ అమ్మాయికి సారీ చెప్పు అంటే, లంచ్-అవర్ లోచెబుతాను అని బయట టీ బడ్డీ వైపు నడిచాను.

నా బండి మీద రాయటానికి ఇంకా ఎవరిపేరూ దొరకలేదా అని దుశ్శాసనుడిని, అ పేరు ఉన్నవాళ్లు, టివియస్-౫౦ వెనక సీట్ మీద పట్టేవాళ్లు వేరెవరూ గుర్తుకురానందుకు నన్నూ, ఈ బండి అమ్మినవాడిని, అప్పుఇచ్చినవాడిని, కొనమని సలహా ఇచ్చినవాడిని కాసేపు తిట్టుకొని, లంచ్-అవర్ లో ఓ కాయితం పట్టుకొని బాసురిడి రూంలోకి వెళ్ళాను.

ఓ! అపాలజీ రాసి తీసుకొచ్చావా అని ఒక నవ్వు నవ్వితే, కాదు రాజీనామా అని చెప్పి సమర్పించి బయటకు వచ్చాను..

నేరుగా ఓ మెకానిక్ దగ్గరకి వెళ్ళి, ఆ బండి జీవితం లో మొదటి సారిగా దాన్ని శుభ్రంగా కడిగించి రూం‍కి వెళ్ళాను.

ఓ రెండు మూడు గంటలు తీవ్రంగా అలోచించి, లేచి, కొత్త బండి లా కనిపిస్తున్న నా బండిని చూసి నేనే ఆశ్చర్యపోయి, దగ్గరలో గుడికి తీసుకువెళ్ళి పూజ చేయించి (కొన్నపుడు కూడా చేయించలేదు) అటు నుంచి చందానగర్ వెళ్ళాను, బండి కొనమని సలహా ఇచ్చిన మిత్రుడి దగ్గరికి.
అక్కడ మిత్రుడికి, జరిగిందంతా చెప్పి, బాధపడుతూ, ద్రౌపదిని, దుశ్శాసనుడుని, పరుశురాముడ్నీ నేనూ తిడుతూ, వద్దాన్నా ఆ ఉద్యోగం ఇన్నినాళ్లు వెలెగపెట్టినందుకూ వాడు నన్ను తిడుతూ .. ఓ రెండు గంటలు గడిపి.. ఈ బాధ అతిత్వరగా మర్చిపోవాలని తీర్మానించాం.

బాధ త్వరాగా మర్చిపోవటానికి కావలిసిన సరంజామా కొనుక్కోవటానికి, ఐపోయిన వాడి సిగెరెట్లె దిండు ( వాడు కవి అని వాడికొక గుడ్డి నమ్మకం ఉండటంచేతా, గ్రూప్స్‍కి ప్రీపేరవటమ్ అనే వంక చేత, వాడు సిగిరెట్లు పేకెట్లా లా కాకుండా, దిళ్ళాగా కొనే వాడు), డబ్బులు మిగిలితే ఓ ఫుల్మీల్స్ పార్శిల్ తెచ్చుకుందామనీ బయటికి వస్తే-

బయటపెట్టిన నా టివియస్-౫౦ కనిపించలేదు.

ఆటే అలోచించకుండా, ఇది కూడా మంచిదే, ఇప్పుడు ఆ ఉద్యోగం సంగతి ఇంకా తొందరగా మర్చిపోయి, మిగతా వాళ్ళలాగా మెయిన్‍ఫ్రేంకో నాలా గ్రూప్స్‍కో ప్రిపేరవ్వచ్చు అన్నాడు – నా మిత్రుడి లోని అధివాస్తవికుడు.