ఆదివారం అగచాట్లు

నాకు చీకాకు తెప్పించేపనులు చాల ఉన్నాయి గానీండి, అన్నిటినీ జల్లెడ బడితే, అత్యంత చీకాకు తెప్పించేదిగా క్షురకర్మ తేలుతుందేమో ( ఆ ప్రస్తావన తేగానే ఈ వాక్యం చూశారా ఎంత చీకాకుగా వచ్చిందో :() అసలు మన తలని ఒకడి చేతిలో పెట్టి, ఓ అరగంట పాటు వాడు, దాని మీద వాడికి సర్వం సహా హక్కులు సంప్రాప్తించినట్టు, తన సొత్తైనట్టు, దానిమీద వాడికొచ్చిన సకలశాస్త్రవిద్యలు ప్రదర్శించి వాడి హింసాయుతతృప్తి తీరినతరువాత పోరాపో .. ఎక్కడికి పోయి ఎవరికి చెప్పుకుంటావో అన్నట్టు ఓ చూపు చూస్తుంటే – బార్బరా బార్బేరియనా అనిపిస్తుంది. ఏదేమైనా ఇట్టాంటి చిత్రవధకి ఇప్పుడప్పుడే లోను కాకూడదు అని ఎనిమిది,పది వారాలూ గా, ఆఫీస్ లో పనిఉందని ( వచ్చి ఊకదంపుడే?), అట్లాంటా నుంచి మిత్రుడొస్తున్నాడని, నా మొహం వాడుండేది అడిక్‍మెట్ట) – రాహుకాలమని, యమగండమని వాయిదాలు వేస్తూవచ్చాను.
నిన్న ఆదివారం ఉదయమే ( అవును ఆదివారం ఉదయమయ్యేది పదకొండింటికే కదా?) లేచేసరికి, సహధర్మచారిణి, పళ్ళు తోముపుల్ల లేహ్యం ఇచ్చి బాత్రూంలోకి తోసింది. ఇవాళ ఇంతప్రేమేంటి రా బాబు అనుకుంటుండగా రాత్రి నిద్రమగతలో పట్టుచీరో, కాలిపట్టీలో ఆడిగినట్టుగుర్తొచ్చి, గుర్తురాంగానే, కాల్గేట్‍కూడా చేదుగాఅనిపించి, తుపుక్కున ఉమ్మేసి నోరుకడుక్కొని బయటకు వచ్చాను .. కాఫీ అంటూ. కాఫీ బదులు కాలిచెప్పులు ( రెండూ పట్టుకోవటం చేత, పట్టుకున్న తీరు వల్ల భయమెయ్యలేదు) పట్టుకొని ఎదురుగా ప్రత్యక్షమైన కాంతామణిని చూసి
“ఎంటీ కాఫీపొడిఐపోయిందా?నిన్నచెబితే తెచ్చేవాడినికదా” అన్నాను, కాస్త విసుగుగా.
“కాఫీపొడి, కషాయము కూడా కావలినంత ఉన్నాయి గానీ, ముందు వెళ్ళి క్రాఫు కొట్టించుకురండి ఇస్తాను కాఫీ” అంది.
కొట్టిచ్చుకోవచ్చుగాని ఇవాళ ఆదివారం, పైగా అమవాస్య కూడా వచ్చేసినట్టుంది అన్నాను
పొద్దున్నే లేచి, ఈ టీవీ ఆ టీవీ ,మా టీవీ మీ టీవీ అన్నింటిలోనూ పంచాంగం రాశిఫలాలు చూశాను … ఇవాళ “అదుర్స్”ట బయలుదేరండి అండి.
ఏదీ అవునోకాదో ఒకసారి పేపర్ లో చూస్తాను అని పక్కనున్న పేపర్ లాక్కున్నాను, దీన్లో తలపెట్టి ఒక గంట గడిపేస్తే గండం గట్టెక్కుతుందని.
“అది నిన్న సాయంత్రం షికారు ఎగ్గొట్టి ఒక గంటసేపు మీరు అరిగించుకున్నపేపరే ..ఇవాల్టి పేపర్ మీరు సలొన్ (salon) నుంచి రాగానే వస్తుంది” అంది.
ఈ పాచిక పారలేదని, బెంగ బడి, ఐనా పైకి కనపడనీయకుండా “ఇవాళ, అట్లాంటా నుంచి వచ్చిన మిత్రుడు ఏదో షాపింగ్ చేయటానికి రమ్మన్నాడు,” అన్నాను
“ఆ అడుసుదిన్నె శ్రీకాంత్(1)గాడేగా? వాడికి అడిక్‍మెట్ నుంచి నేరేడ్‍మెట్ వెళ్ళటం రాదు, అట్లాంటా వెళ్లి ఏమొస్తాడు చెప్పండి. ఐనా మీరు లేచే ముందే ఫోన్ చేశాడు.సాయంత్రం ఏడింటికి శివం దగ్గరకి వస్తారని చెప్పా .. అప్పటి దాక .. మీరు ఫ్రీ” అని సాగనంపబోయింది.
ఇంకో రెండు కుంటి సాకులు చెప్పినా కుదరకపోవటంతో ఇక ఇవాళ తప్పదని అర్ధమై, బతిమిలాడి, కాస్త కాఫీ కలిపించుకు తాగి సలొన్ (salon) దారి బట్టాను.

స్థాన బలిమి కాని తన బలిమి కాదయా అన్నాడు కాని శతక కారుడు, అట్టాగే వార బలిమి కూడా ఉంటుందని నా గట్టి నమ్మకం. ఆదివారం గాకుండా వేరే రోజు వెళ్తే, ఎదురొచ్చి లోపలికితీసుకెళ్ళి, కుర్చీ ని ఆపాదమస్తకం దులిపి కూర్చోబెట్టే సలొన్లొనే ఆదివారం వెళ్తే ఓ పావుగంట దాక పలకిరించేవాడుండడు. ఇంకా ఎంతసేపు పడుతుంది అంటే, మాట్లాడకుండా “ఎంతసేపైతే ఏంటి?, ఇంటో వున్నా చేశేదిదేగా” అన్నట్టు పేపరొకటి విసిరేసి సీరియస్ గా మొహం పెట్టి కత్తెరాడిస్తాడు. ఆ పేపర్ అప్పటికే షేవింగ్ క్రీం అనే సబ్బురాసుకొని, గడ్డానికిపెట్టిన నీళ్ళలో స్నానం చేసి, చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇంకా ఏమైనా మాట్లాడబోతే వినపడకుండా ఉండటానికి టీవీ సౌండ్ పెంచుతాడు. మోరెత్తుకొని ఆ టివీ చూశేవాళ్లను చూస్తే నాకు జాలేస్తుంది. నిజానికి ఈ రకం గా ఆకాశం లో టివీ పెట్టటం – వాళ్లమెడ తనుకు కావాల్సిన యాంగిల్ లో పట్టుకుపోవాటానికి, బార్బర్ల సంఘం వేసిన చిట్కా అయ్యిండచ్చు. అందుకే అరగంట టీవీ చూస్తే కాని కల్యాణపు కుర్చీ ఎక్కించరు. పొరపాటున ఆ ఆదివారం రోజు క్రికెట్ మ్యాచ్ ఉందంటే ఇక మీపని అయినట్టే, అక్కడ రన్నులు కొట్టే వాడినీ, అడ్డమొస్తే ఇక్కడ క్రాఫు కొట్టేవాడిని , కొట్టించుకొనేవాడిని తిడుతూ క్రిక్కిరిసి చూస్తూంటారు,’వెంట్రుక వాసి’ తో అన్నా ఇండియా గెలవకపోతుందా అని. ఆ క్రికెట్ పిచ్చి క్రాఫు కొట్టే వాడికి కూడా ఉంటే మీ పని రోటిలో తల పెట్టినట్టే, ఇంటికెళ్ళి తలచుట్టుపక్కల ప్రాంతాలో ఆ బార్బరు బాబు కత్తితో చేసిన గాట్లలో టెండుల్కరుదో ద్రావిడుదో ఆటోగ్రాఫు చూసుకోవచ్చు. చెవి మీద కుట్లు పడాల్సిరాకపోతే మీరు అదృష్టవంతులేనన్నమాట.
కల్యాణపు కుర్చీ ఎక్కగానే మీకు యక్షప్రశ్నలు మొదలౌతాయి, తగ్గించమంటారా అంటాడు. తగ్గించు అంటే, ‘షార్టా మీడియామా అంటాడు. షార్ట్ అంటే చుట్టూ షార్ట్ చేసి మధ్యలో మీడియం చేయనా అంటాడు..ఈ రకంగా సాగే ప్రశ్నల పరంపరతో విసిగిపోయి,నీరసించిపోయి ఉ, ఉహూ లోకి దిగితాను. ఇక వాడు చెలరేగిపోతాడు.ఒక వరస,విధానం లేకుండా ఇష్టమొచ్చినట్టు కత్తెరాడిస్తాడు. టివీలో సీరియల్ కు మల్లే వీడికి కూడా కటింగ్ మధ్యలో మూడు బ్రేక్‍లు. పక్కవాడికి చిల్లర ఇవ్వటానికి ఒకటి, చిట్‍కి డబ్బులు కట్టటానికి ఒకటి, నోట్లో గుట్కా ఉమ్మాటానికి ఒకటి. వాడు చెప్పిన షార్ట్‍మీడియం‍కో మీడియం‍షార్ట్ కో ఒప్పుకొని, తల వాడికి అప్పగించామా, ఇక చూడండి తమాషాలు చేస్తాడు – తల అటు దిప్పు సారూ, ఇటు దిప్పు సారూ, కొంచం ఆ దిక్కుకన్నా, మరీ అంతొంచితేయెట్ట? అంటూ. కుక్కతోకూపినట్టు, వాడు చెప్పినదానికల్లా తలాడిస్తుంటే .. ఇంకా అందుకుంటాడు: “తెల్లెంటికలు వచ్చినయ్యన్న డై‍యేద్దామ?, మంచి డై‍ఉంది మన కాడ? హైర్ మంచి షైనింగ్ వస్తది.”, “ఎంటికలుఊసిపోతన్నయ్ హెర్బల్ హేరాయిలుంది వాడతావాఅన్నా?”, “చుండ్రు చానా ఉంది అన్న నిమ్మకాయపెట్టాల్నా?” మనం ఇన్ని బాధలు పడుతుంటే, పక్క సీట్‍లో తల కొట్టేసిన ల ఆకరం లో బట్టతల ఉన్నాయన మనొంక చూసి ఓ రకంగా నవ్వుతుంటే , కత్తిగాటు మీద డెట్టాల్ పోసినట్టుంటుంది. ఎట్టాగొట్టా అయ్యిందనిపించుకొని వాడ్ని ఒదిలించుకొని ఇంటికి వస్తే తలంటు కష్టాలు మొదలు..

“పెరుగు గోరింటాకు మెంతులు(2) కలిపి (ఇక్కడ దాక వినం గానే నాకు కడుపులో దేవుతుంది)అక్కడ పెట్టాను -ముందు తలకి పట్టించి ఆనక స్నానం చేయండి. మీ అమ్మగారు చెప్పినచిట్కా, ఏం పనిచేస్తుందిలే అనుకున్నా గాని మొన్న చెవాక్కుచెబుతారా లో లతకి అంగలూరు నుంచి ఫోన్‍చేసిన అండాళ్లుగారు కూడా ఇదే చిట్కా చెప్పింది. అది మీకెందుకుగాని, పోయి రాసుకోండి,మీ చుండ్రు తగ్గలేదంటే మళ్ళీ నన్నంటారు.” అంది.
ఇది గుఱ్ఱపుటెత్తు, ఇంక ఎదురులేదు .. తలకి పట్టించుకుంటే హజ్బెండుగాడు (ఇది తిట్టు కాదు, పతిదేవుడికి నిఖార్సు ఆంగ్లానువాదమని మనవి.) పడే బాధలు చూసి ఆనందిచవచ్చు, లేదంటే ‘నే జెప్పినా మీ అబ్బాయి వినట్లేదూ’ అనచ్చు. ఈ లోపల ఓ బావమరిది ఫోను, “బావా సలొన్ (salon) పని అయ్యిందా? బండి నడుపుతుంటే ఇబ్బందిగా ఉందని గ్లాసెస్ కొంటానికి వెళ్దామనుకుంటున్నాను వస్తావా?” అని. మొలచుట్టూ గుడ్డలేదని ఒకడేడిస్తే తలకి పాగా కావాలని ఒకడేడ్చాడుట, అట్టాఉంది. వాడు క్షవరం చేయించుకోడు, భుజాలు దిగిన జుట్టుని చిన్న చిన్న జడలు గట్టి, జడ చివర పూసలు పెట్టి ఫిల్మ్ం‍నగర్ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు, తెలుగు సిన్మాలల్లో ఇంగ్లీషు పాటలకి డాన్స్ వేసే అవకాశం రాకపోతుందా అని. ఇవాళ నేను క్రాఫ్ చేయించుకున్నానని ఎగతాళి. ఈ ఫొన్ అయ్యిందనుకుంటే ఇంకోడినుంచి ఫోను, “నినుచూడక నేనుఉండలేను” అనే పాట ఖరహరప్రియ లో ఉందా అంటూ.బాబు, రాంగ్ నంబర్, ఇది ఊకదంపుడు, సంగతులూ సందర్భాలు కాదూ అని మొత్తుకోలు పెట్టి,ఫోన్ పెట్టేసి ప్రపంచం మొత్తం నన్ను సాధించాటానికి ఏకమైందా అనిపించే క్షణం లో – ఇక లాభంలేదని – బాత్రూం తలుపేసుకొని , ఆ సంక్లిష్టమిశ్రమాన్ని పారబోసి, ఆ వాసనను తట్టుకోలేక ఓ సిగిరెట్టు వెలిగించి, ఆ వాసన బయటకు పొక్కుతుందేమొనని అది ఆర్పి – బాత్రూమంతా పవనపవిత్ర (air freshner)ను కొట్టి షవరు తిప్పి తీరినయ్యిరా ఆదివారం కష్టాలు అనుకుంటూ ఏడు నిముషాలతర్వాత బయటకి వస్తే – సాధ్వీలలామ ఎదురుగా గరిటె పట్టుకొని నిలబడి ( ఈ సారి భయమేసింది, సిగరెట్టు వాసన బయటకు వచ్చిందేమో అని) అంది: “వంట అంతా ఐపోయింది, కుక్కర్ ఇంకో మూడు ఈలలెయ్యంగానే ఆపేసి, ప్రెజర్ పోయిన తర్వాత కూరలో పప్పులో ఉప్పూ కారాలేసి పోపు పెట్టండీ, అట్టాగే, రెండో పొయ్యిమీద సాంబారుంది దాని సంగతి కుడా చూడండి. మాఅమ్మ పొద్దునే ఫోన్ చేసి, తీరుబడి గా మధ్యాన్నం ఫోన్ చేయవే నీతో మాట్లాడాలంది,”

“ఇప్పటి దాకా నువ్వేమి చేసినట్టు” అని అందామని నోటి దాక వచ్చి, ఊరుకున్నంత ఉత్తమం లేదు… అనే సామెత గుర్తొచ్చి (ఇంతకీ సామెతలో రెండో సగం ఏఁవిటీ మర్చిపోయాను?) గరిటె పట్టుకొని గప్‍చిప్‍గా కిచెన్ లోకి వెళ్ళాను.
——————————–
1) మీరు అడుసుదిన్నె శ్రీకాంత్ ఐతే మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దు, నన్ను తిట్టద్దు, పరువు నష్టం దావా వేయటానికి లేవద్దు. ఆ శ్రీకాంత్ మీరు కాదు. అసలు శ్రీకాంత్‍కు ఫోన్ చేసి ఈ టపా చదవద్దని చెప్పాను.
2)ప్రపంచం లో ఇంత భయంకరమైన కాంబినేషన్ ఎక్కడైనా ఉంటుందా అని అలోచిస్తే నాకు ఏమీ తట్టలేదు. చాలా సేపు ఆలోచించిన తరువాత జయసుధ, విజయకాంత్ , కాథరీన్ జీటా జోన్స్ లతో 1:2 ఫార్ములా సినిమా వస్తే పెరుగు,గోరింటాకు, మెంతులు కాంబినేషన్‍కి దగ్గరగా ఉంటుంది అనిపించింది. మీకు ఏమైనా స్పురిస్తే చెప్పండి.

21 responses to “ఆదివారం అగచాట్లు

 1. తెగ నవ్వించేసారండి. ఆ సామెత లోని రెండో సగాన్ని మీరు పాటించి ఉంటే, మాకీ జాబు అందకపోను. మంగలి ప్రశ్నలతో మరో చిక్కుంది. చిరాకొచ్చినా, మరోటైనా ఖచ్చితంగా నోటితోటే చెప్పాలి సమాధానం.. తల ఊపే అవకాశం లేదు.

 2. అదేంటో మీ బ్లాగు నా కంటబడలేదు ఇంత వరకూ…
  అద్భుతంగా ఉన్నాయి మీ టపాలు.

  అన్నట్టు నేను మీ బావమరిది కాటగరీలోకే వస్తాను. క్రాఫు బాధలు లేకుండా భుజాలు దాటి జుట్టు పెంచుతున్నా. 🙂

 3. మీరు రాసిన దాంట్లో మొదటి పేరా చదివా.బాగుంది. మీలా letters type చేసే speed నా కూ ఇంకా రాలేదు. ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుదు మేరే నాకు ఆదర్షం.

 4. మీ ఊకదంపుడు అదిరింది.మీ కలానికి రెండు వైపులా పదునే ( క్లాస్/మాస్ 🙂 )
  -నేనుసైతం

 5. కుక్కర్ ఇంకో మూడు ఈలలెయ్యగానే ఆపేసి–
  తలకి తిరగమోత ధూపంతోటి మీ కేశ సౌందర్యపోషణకి మంచి ముక్తాయింపు పాడారు :-)))
  గోరింటాకు సువాసనల్తో పవనపవిత్రం కొట్టినంత భేషుగ్గా ఉంది ఈ టపా!

 6. తల భారం తగ్గించుకోవడం ఇంత భారమా?ఎలా అయితేనే మీ తల భారం తగ్గించుకుని మాకు అంటగట్టారు.నవ్వి నవ్వి తలపోటొస్తుంది.

 7. పింగుబ్యాకు: ఆదివారం అగచాట్లు | DesiPundit

 8. అయ్య బాబోయ్..బాగ పెరిగిన జుత్తుతో చిరాకుగా ఉండి అంటకత్తెర వేయించాక ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంది మీ టపా..చదువుతున్నంత సేపు నవ్వాగలేదు.

 9. నాకూ క్రాఫ్ పెరిగింది గానీ, మీ ఆడిక్ మెట్ట దోస్తును ఒక సారి ఇలా పంపండి. మా ఆవిడకు ఓ సాకు చూపించడానికి కుదురుతుంది.

 10. “హజ్బెండుగాడు (ఇది తిట్టు కాదు, పతిదేవుడికి నిఖార్సు ఆంగ్లానువాదమని మనవి.) ”

  హాస్యం అదిరింది బాసూ…

 11. ha 100.
  this is one of the coolest comedy pieces i have read on blogs. you have a style of ur own and ur wit is razor sharp. not a moment of dullness thru out. keep it up!

 12. ఈ సాయంత్రం మీ టపాని నెమరు వేసుకుని, ఒక్కొక్క లైనునీ తల్చుకుని తల్చుకుని మరీ నవ్వుకున్నాము.

 13. అద్భుతంగా రాసారు! మీ బ్లాగుని చాలా సార్లు చదివా.. గుర్తు తెచ్చుకుని మరీ నవ్వుకుంటున్నా.. కృతజ్ఞతలు!! 🙂

 14. మీ క్షవరపర్వం బావుంది, నవ్వించింది.
  ఒక గమనిక సలూన్ (saloon) అంటే ‘బార్ ‘ అని అర్ధం. సలొన్ (salon) అంటే క్షురకుల క్షేత్రం..

 15. భలే బాగుంది. “మొలచుట్టూ గుడ్డలేదని ఒకడేడిస్తే తలకి పాగా కావాలని ఒకడేడ్చాడుట …” ఇటువంటి సామెతలు చదివి చాలా కాలం అయ్యింది!

 16. కొత్తపాళీ గారు, శ్రీరాం గారు,
  వే వే నెనరులు.

  ఆదరించిన అందరికీ వందనాలు.

 17. నేను మీ టపాని యాదృచ్చికంగా ఇప్పుడే చదవడం తటస్థించింది. చాలా బావుంది. మీ హాస్యంతో తెగ నవ్విచ్చేసారు. మీరు సామెత అడిగారు కదా? అది,
  ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు.

 18. నేను అబ్రకదబ్ర గారి టపా నుండి ఈ లింక్ చూసి ఇప్పుడే చదివానండీ. టపా అదుర్స్. మీ పవనపవిత్ర, పతిదేవుడు అనువాదాలు భలే ఉన్నాయి.

 19. “హజ్బెండుగాడు (ఇది తిట్టు కాదు, పతిదేవుడికి నిఖార్సు ఆంగ్లానువాదమని మనవి.) చాలా బాగుందండి.

 20. ఊరుకోన్నత ఉత్తమము , బోడి గుండంతా సుఖము లేదు
  జుట్టున్నామే ఏ కొప్పైన కడుతుంది
  ఉన్న జుట్టుకు రంగు వేస్తె బోడిగుండు మెరిసింది
  మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె
  పని లేని మంగలి పిల్లి తల గోకే
  మంగలోనికి పెత్తనమిస్తే మీ ఊరే తిరుపతి
  లంచాల మొగుడొస్తే సవరానికి రంగేసినట్టు
  ఇవండీ కొన్ని జుట్టు సామెతలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s