Category Archives: ఇంగ్లీషూ …..

ఇంగ్లీషూ యు లివ్ లాంగా

ఇంగ్లీషూ యు లివ్ లాంగా- ౯

ఇవాళ అనుకోకుండా అమీరుపేట వెళ్లవలసివచ్చింది.
సరే ఎలాగువెళ్లా కదా అని అక్కడ ఒక ప్రసిద్ధమైన హోటల్ లో మంచి కాఫీ తాగుదామని మెట్లు ఎక్కబోతుంటే పరిచయమైన గొంతు వినిపించింది.
తల తిప్పి చూస్తే మా రామలింగడు కాలిబాటపై పోస్టర్లు అమ్మేవాడితో బేరమాడుతున్నాడు.
వాడికో నాకో ఇవాళ ఉచిత కాఫీ రాసి పెట్టి ఉన్నదని అర్ధమై.. వాడి దగ్గరకి వెళ్లి …
కాలేజి రోజుల్లో వీడి గది లో ఓవైపు మధుబాల, ఓవైపు సబాటిని, ఇద్దరి మధ్య లో కాసిని ధనాత్మక సందేశాలు, కాసిని ప్రేరణ సందేశాలు ఉండటం గుర్తొచ్చి,
“ఏరా ఈ పోస్టర్ల పిచ్చి ఇంకా పోలేదా” అన్నాను.
“నువ్వా, అంత తేలిగ్గా ఎలా పోతుంది” చెప్పు అన్నాడు తల తిప్పి.

అవుననుకో ఇంత దూరం వచ్చి మరీ కొనాలంటవా?
షాపింగ్ కని వచ్చాం. మా అవిడా,మరదలూ పక్క చీరెల కొట్లో ఉన్నారు, కాలాన్ని సద్వినియోగం చేసుకుందామని నేనిలా…
అయిందా? ఇంక తీసుకోవలిసినవి ఉన్నాయా?
అవుతోంది, ఎన్ని పోస్టర్లు కొన్నా, తన కోసం ఒక్కటి కూడా ఇంత వరకు తీసుకోలేదని మా ఆవిడ ఈ మధ్య మెత్తగా గుర్తు చేసింది, అందుకని…
ఇది చూడు – అప్పటికే తీసుకోవటానికి నిర్ణయం చేసుకున్న ఒక పోస్టరు నా చేతిలో పెట్టి మళ్లీ వెతికే పని లో పడ్డాడు.
దాని మీద ఇలా వ్రాసి ఉంది:
The female of the species is more deadlier … ”

ఆడాళ్లతో చచ్చేచావని ఎంత చక్కగా చెప్పాడు, నాక్కూడా ఒకటి తీసుకో ఇది. అవసరానికి పనికొస్తుంది.

ఇంగ్లీషూ యు లివ్ లాంగా -౮

 

మొన్న సాయంత్రం ఓ బ్లాగ్మిత్రుడితో మాట్లాడి, పనిలో పనిగా చాలా రోజులైందని మా రామలింగం ఇంటికి వెళ్ళాను, చెప్పాపెట్ట కుండా.

“ఏమిట్రా ఊడి పడ్డావ్” అన్నాడు

“ఉద్యోగం ఊడి పడ్డాను రా “అన్నాను

“పోన్లే పోతే పోయిందిలే” అన్నాడు రానారె అంత దిలాసా గా.

” పోయింది నాది కాకపోతే నేనూ అదే అనేవాడిని”

“ఇప్పుడేమిటంటావ్” 

“ఏదైనా ఉద్యోగం చూపించు”

” నేను ఏదో ఇంగ్లీషు పాఠాలు చెప్పుకుంటున్నవాడిని మీ ఉద్యోగాలసంగతి నాకేంతెలుసు” అన్నాడు “తెలీవని నాకుతెలుసులే కానీ పొరపాటున తెలిస్తే చెప్పు”అని.. ఈ మంతెన సత్యనారయణ గారి మాహా శిష్యుడి దగ్గర ఆ టైం లో కాఫీ నీళ్లు కూడా గిట్టుబాటుకావని లేచి వచ్చేశాను.

రాత్రి పెందరాడె పదకొండు గంటలకి ఇంటికి చేరి, స్నానపానాదులు ముగించి నిద్రపోవాలి కాబట్టి, టి.వి చూడకపోతే నిద్ర పట్టదేమో అని భయం తో టి.వి పెట్టి రిమోట్ కి పనిచెప్పాను అలా పాయలను తిప్పుతూ తిప్పుతూ, ఉవిదా టివి వద్ద ఆగాను – సులభాంగ్లమ్ అనే కార్యక్రమం మీద. ఓ ఐదు నిముషాలు చూసి ఉద్విగ్నత తట్టుకోలేక – మా రామలింగానికి పోన్ చేశాను

రా.లిం: ఓరె నీ ఉద్యోగం పోయిందని గుర్తు ఉంది,  వీలైతే ఉద్యోగం చూపించాలని గుర్తుంది, ఈ టైమ్ లో పెళ్లినవాడిని బాధించటం న్యాయం కాదురా, స్వాతిముత్యం లో కమల్ హాసన్ లాగా.

 నేను: ఆగాగు, నే ఫోన్ చేసింది నా ఉద్యోగం గురించి కాదు, నీ ఉద్యోగం పోవచ్చు అని చెప్పటానికి రా.లిం:ఎందుకుట

నేను: టి.వి లో సులభాంగ్లం అని ఓ కార్యక్రమం వస్తోంది

 రా.లిం:సులభాంగ్లమా సులభ్ కాంప్లెక్స్ ఆంగ్లమా?

నేను:ముందు శులభ్ నేర్పి తర్వాత కాంప్లెక్స్ నేర్పుతారేమో

రా.లిం:ఐతే ఏమిటిటా?

నేను: ఓరి అమాయకుడా, ఆకలిరాజ్యం లో కమల్ హసన్ అంత అందగాడు ముగ్గురు యాంకరమ్మలని కూర్చోబెట్టుకొని, టి.విలో ఉచితం గా ఆంగ్లం నేర్పుతుంటే ఇంక నీదగ్గరకొచ్చి డబ్బులు కట్టి ఎవడు నేర్చుకుంటాడు చెప్పు?

రా.లిం:ఇంగ్లీషా, ఏమి నేర్పుతున్నాడు ఏమిటి

నేను:చేంజ్ థ వాయిస్

రా.లిం: ఇందాకటి నుంచి “a object” “a object” అంటున్నాడ?

నేను:అవును

రా.లిం: సరే మరి, ఆయన యాంకరమ్మలు మాట్లాడే విషయాన్ని బట్టి గొంతు ఎట్టా మార్చుకోవాలో నేర్పూతూ ఉండి ఉంటాడు, ఇంగ్లిషు గ్రామర్ కాదులే .. నువ్వేమీ భయపడక

నేను:అంతే నంటావా?

రా.లిం: అంతే, స్పోకెన్ ఇంగ్లీషు నేర్పేవాడికి ఆంధ్రదేశం లో ఢోకా లేదు.

నేను:అంతే నంటావా?

రా.లిం: అంతే, కాదు కూడదు భయపడాల్సిందే అంటే, పగటి వేళ భయపడరా బాబు, ఇలా రిపీట్ టెలికాష్ట్ చూస్తూ భయపడమాక.ఇంక నువ్వు కూడా టివీ కట్టేసి పడుకో.

 వాడి మాట ప్రకారం టి.వి కట్టేసి, రిమోట్ ని టి.వి మీద పెడుతూంటే అక్కడ మా ఆవిడ వ్రాసి పెట్టిన చీటీ కనిపించింది. VCD పైన అబ్బాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టాను, టి.వి చూడడం ఐపోయిన తరువాత, ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి సంతకం చేయండి. ఇంగ్లీషు మార్కులు ఒక్కసారి చూడండి.

వాడి ఇంగ్లీషు మార్కుల మీద నాకు ఎటువంటి ఆశలు లేవు. ఎందుకంటే, వాడి ఇంగ్లీషు పరీక్ష రోజు, బడి దగ్గర దింపుతుంటే, ప్రిన్సుపాలిని ( అనగా నమ్రత కాదు) అరుపులు వినిపించాయి:

 What did I said?

 What did I said?

 I told you that you should woke up early morning at least in exam days naa…

సరే మాఆవిడ చెప్పింది కదా చూద్దమని ఫైల్ తీసుకున్న నాకు, ఆ బడి వారు ప్రత్యేకంగా ముద్రించిన ఫైలే చెప్పింది

fname

 అనవసరంగా ఇంగ్లీషు మార్కులు చూడకు అని.

ఇంగ్లీషూ యు లివ్ లాంగా -౭

ఈ మధ్య మా ప్రాజెక్టు లో ఒకతను రాజీనామా చేసి బాలెన్స్‍షీట్ కాస్త బాగా కన్పిస్తున్న కంపెనీ వైపు పరిగెత్తితే, మా ప్రాజక్టు లో ఓ ఇంజినీర్ కి కొరతొచ్చింది. మానేజరు నన్ను బిలిచి, ఇప్పుడు నియామకాలు లేవు, పక్క ప్రాజెక్టు లో నుంచి ఒకడిని తెచ్చుకోవాలి, ఈ ఇద్దరితో మాట్లాడి, ఎవరినో ఒకరిని ఎంచుకో అని ఓ రెండు పేర్లు చూపించారు.
మొదట చందన్ మిశ్రా తో మాట్లాడాను

నువ్వు ఎందుకు ప్రాజెక్టు మారదామనుకుంటున్నావు?
Actually I want to change project ఇసిలియే కీ …..
నీకు c++ వచ్చా?
I know C++ మతలబ్ I gave a paper in 3rd sem మగర్ సంఝో కీ I did not work on C++…
ప్రాజెక్టు లో నీ పని ఏమిటి?
Beginning, I was given a feature, it so happened కీ ..
…వీడు ఇట్టా మాటిమాటికీ, “కీ”లిస్తుంటే మనవల్లకాదని రెండో వాడిని (పొన్నూరు మధుబాబు) పిలిచాను మాట్లాడటానికి..
ఇంటిపేరేనా, ఊరిపేరు కూడా పొన్నూరేనా..
పొన్నూరు కాదు గానీ, పక్కనే…
సరే, రేపటినుంచి ఈ ప్రాజెక్ట్ కి వచ్చెయ్..
***

రెండు రోజుల తరువాత .. అతడు నా దగ్గరికి వచ్చి:

“UdaM I am empty. “ అన్నాడు
వ్వాట్
That documents read completed. Now I am empty. Give me something.
I am empty అంటే , ఖాళీ గా ఉన్నాను అని అర్ధం నేర్చేసుకొని, మా రామలింగానికి మనసులో ‘థాంక్స్’ చెప్పుకొని
“గో,చెక్ సర్వర్ ” అని సర్వర్ ఉన్న వైపు చేయి చూపించాను..
అతను అక్కడికి వెళ్లి, నాకు వినిపడటానికి గట్టిగా
“You are locked” అని అరిచాడు
వ్వాట్
“You are locked server,I can’t check logs, please open.” అని అరిచాడు
తేరుకొని, సిష్టం అన్‍లాక్ చేయటానికి వెళ్తుంటే, అనుమానమొచ్చింది, పొరబాటున, సర్వర్ కిల్ అయ్యుంటే వీడేమి అరిచేవాడా అని..

ఇంగ్లీషూ యు లివ్ లాంగా-౬

మొన్న మా రామలింగంతో కలిసి ఓ పెళ్లికి వెళ్ళవలసివచ్చింది. నాకు వధూవరులు తెలియదు, ఊరిబయట ఓ ఉద్యానవనం లో పెళ్ళి, అర్ధరాత్రి తిరిగివచ్చేటప్పుడు నాకుతోడుగా ఉంటావ్ రారా అంటే మొహమాటానికి బయలుదేరాను, ఈ సారి ఎప్పూడైనా ఇంగ్లీషు నేర్పేటప్పుడు దెప్పుతాడని.

ఈ పెళ్లిలోకూడ అన్ని పెళ్ళిళ్లలో లాగేనే ఆడవాళ్లు అందరూ చాల సంతోషంగానూ, కొందరు మగవాండ్రు నిర్వికారంగాను, కొందరు నిర్ల్పితం గాను, కొందరు నిస్సహాయం గాను, కొందరు విచారవదనం తోనూ కనిపించారు. అయ్యో ఇంకోమగవాడు ‘పెళ్ళి పీఠం’ ఎక్కినాడే అన్న దిగులు మనసులో మొదలై, గుండెలకి జేరి, పొట్టను కూడా ఆక్రమించబోతుంటే, కాసేపగితే అన్నానికి చోటుండదని, రామలింగడిని భోజనానికి లేవదీశాను. భోజన శాల వెతుక్కోవటనికి వెళ్తుంటె హలో అంటూ ఓ యువకుడు మా రామలింగం చేయి బట్టుకున్నాడు.. రామలింగం హలో అంటూ, ఇతను పెళ్లికొడుకు తమ్ముడురా, ఆంధ్రా యూనివర్శిటి లో అలంకారశాస్త్రం లో “Ph. D” చేస్తున్నాడు అన్నాడు.
నేను ఛటుక్కున చేయి ముందుకు జాపి “Nice to meet you, Doctor of Decoration Science” అన్నాను, నా అనువాద వేగానికి నేనే మురిసి పోతూ.
అతను రామలింగం వంక కొంచం ఇబ్బందిగా, రామలింగం నా వంక కొంచం కోపం గా చూసారు, పట్టా రాకుండానే డాక్టరన్నందుకనుకుంటా. 😦

—————————————————————————–
కొసవిడుపు::
” Way 2 BAFE” అని చూసి నేను నేరుగా వెళ్లగలిగాను కాని, ఆ పెళ్లికొడుకి తమ్ముడితో మాట్లాడి వెనకొచ్చిన మా రామలింగానీకి బఫే ఎక్కడో కనుక్కోవటం కొంచం కష్టమైందిట.వాడికి బఫే వర్ణక్రమమూ, ఎలా పలకాలో తెలియటమూ తప్పైందని ఏకగ్రీవంగా తీర్మానించాం.

ఇంగ్లీషూ యు లివ్ లాంగా-౪

శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళీవెళ్ళగానే,
రారా నీకోసం ఇందాకటినుంచి చూస్తున్నాను, మీ అబ్బాయి నా మాటవినట్లేదు అంది మా అమ్మమ్మ.
ఏమైందీ అన్నాను..
ఇందాకటి నుంచి వద్దన్నా వినకుండా “అప్పేబోవ” “అప్పేబోవ” అని పాడుతున్నాడురా.. అసలే మా అక్కయ్య తొంభై ఏళ్లది మంచంలో ఉంది అని చూడాటనికి వచ్చానా.. వీడు ఇట్టా అంటూంటే నాకు ఎట్టా ఉంటుంది చెప్పు.. మెల్లగా చెబితే వినడాయె,, గట్టిగా కసిరితే మీ ఆవిడ మొహం ముడుచుకుంటది.. ఏం చేయాలో తెలియక నీవెప్పుడు వస్తావొ అని కాచుక్కూచున్నాను.. నేను ఊరెళ్లేదాక వాడిని ఆ పాట మానమని చెప్పరా…

అసలు నీకు అక్క ఉందని, అక్కని అప్ప ని అంటారని వాడికి తెలీయదమ్మమ్మా..
ఏమో బాబూ ఎవరునేర్పారో ఏమో.. నాకు మటుకు వింటూంటే ఒహటే చీకుగా ఉంది..

సరే నేను చెబుతాలే అని చెప్పి.. మా అబ్బాయి దగ్గరకు వెళ్లి ఏంచేస్తున్నావురా అని అడిగా..

రైమ్స్ చెప్పుకుంటున్నా నాన్నా..
ఏ రైమ్స్…

“ట్వింకిల్ ట్వింకిల్” , నీకు చెప్పనా?

చెప్పు..

ట్వింకిల్ ట్వింకిల్ లిటిలిస్టార్
హవ్వై వండర్ వాట్యూ‍ఆర్ర్ర్
అప్పెబోవ ద వర్ల్డ్ సో హై
లైకె డైమండింద స్కై.

అప్పటికి గాని గమనించలేదు.. నాలుగు రోజుల ‘ప్లే‍స్కూల్’ విద్య లో మావాడికి వాళ్ల “మిస్సు” నేర్పిన ఇంగ్లీషు..

‘ద వర్ల్డ్ సో హై’ అంటే మా అమ్మమ్మకి అర్ధం కాకపోవటం మంచిదైంది, వాళ్ల అప్పని అక్కడికి పొమ్మంటే ఇంకేమైన ఉందా?

ఇవాళ వాడి ‘ప్లే‍స్కూల్’ కి వెళ్ళాను, కొంచం ఇంగ్లీషు ఇంగ్లీషు లా నేర్పిస్తారేమో కనుక్కుందామని.
వాళ్ల Waiting room లో( వైట్ చేశేది రూముగాదండీ, మనుషులే) కనిపించిన నోటీసు:

“Please smile, It doesn’t costs’ you anything.”

( ఈ[‘] చిహ్నాలు వాళ్లు పెట్టినచోటే నేనూ పెట్టాను. ఫోటో తీశేవీలు చిక్కలేదు.)

మరోసారి మా రామలింగం చెప్పింది నిఝమని తేలగా, గ్రామరు నడ్డి విర్గగొట్టిన ఆ కాప్షనోనరికి మనసులోనే నివాళులర్పించి, ఈ విషయాన్ని ‘ఎమర్జంటు’ గా బ్లాగుదామని సైబర్ కఫే కి వస్తే అక్కడ కనిపించిన సూచన::
Please remove U R footwear here.

‘U’ కి ‘R’ మధ్యలో చెప్పులజత పట్టేంత ‘గ్యాపు’ కావాలనే పెట్టాడా?
అది మక్కీమక్కీ తెలుగులో రాస్తే, ఒక్కడైనా వాడి షాపుకు వచ్చేవాళ్లా? ఈ నోటిసు ఉన్నా కూడా, ఆ కెఫె ముందు చెప్పులు విడవటానికి జనం బారులు తీరుతున్నారంటే అది, ఇంగ్లీషు గొప్పతనం కాదా? చెప్పండి.

—————————————————————————————–
కొసవిడుపు ::

శనివారం పొద్దున్నేమా ఆవిడ నిద్ర లేపి ” మీకు ఊళ్ళో చెడ్డపేరు కూడా ఉందా, నాకు తెలీదే” అంది.
నేను నాకూ తెలీదు మరి అన్నట్టు మొహం పెడితే,
వాడెవడొ,ఫోన్లో “What is Sir’s good name?”అంటున్నాడు, పోయి చూడండి
అంది.తేలికగానే బయట పడ్డందుకు ఊపిరి పీల్చుకున్నాను.

ఇంతకీ ఈ విషయం ఇప్పుడు ఎందుకంటే, లోపలికి ప్రవేశించటానికి వర్డ్‍ప్రెస్సు వాడు, కొత్తగా “సభ్యనామం” అడుగుతున్నాడు, మా ఆవిడే పక్కనే ఉండి ఉంటే, మీకు అసభ్యనామం కూడా ఉందా అని అడిగేది కదా అని భయమేసింది.

ఇంగ్లీషూ యు లివ్ లాంగా -3

నా మిత్రుడి సలహా మీద ఈ విధంగా ఇంగ్లీషు మాట్లాడటం, అది అందరికి అర్ధమైపోవటం లాంటివి జరగుతూ ఉండటం తో, వాడికి ఈ విషయం చెబుదామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్లేటప్పటికి వాళ్ల అన్నయ్య కొడుకు ఈ ఇంగ్లీషు ముక్కలు బట్టీయం వేస్తున్నాడు:
“But I have promises to keep,
And miles to go before I sleep”


మా రామలింగాన్ని తీసుకొని బయటకు వచ్చి కాఫీ హోటల్లో కూర్చున్నాక నేను అడిగాను :
ఆ బుడ్డోడికి అంత ‘పెద్ద’ పద్యాలు అవసరమంటావా?
రామ: పెద్ద చిన్న ఏముంది అన్నీ నేర్చుకోవాలీ, మన సీసమూ కందమూ లాగే.
నేను: నేనన్నది ఆ పెద్దగాదు,
“పెద్దలకి మాత్రమే” పెద్ద.
రామ : అందులో పెద్దలకు మాత్రమే ఏముందిరా
నేను : నువ్వు ఆ పద్యం వినలేదా, దాని అర్ధం పట్టించుకోలేదా?
రామ : ఎంట్రా దానర్ధం, అడిగాడు టీ తాగబోతూ..
నేను : ” కానీ, నా దగ్గర ఉంచుకున్నదానికి చేసిన ప్రమాణాలు ఉన్నాయి ,
            మరియు (అందువల్ల) చాలా మైళ్లదూరం వెళ్ళి నిద్రపోవాలి”నేను ఇది చెప్పిన తరువాత మా రామలింగడు ఏదో చెబుదామనుకున్నాడు కాని, వేడి టీ తో నోరు కాలటం వల్ల మాట్లాడలేకపోయాడు..