Monthly Archives: జూలై 2011

మూడు పాటలు -౨

“నిలువద్దమ్” వంటి ప్రయోగాలు చేయలేని వ్యాకరణ శృంఖలాబద్ధుడు.
విమర్శలనూ, విరిమాలలను సమదృష్టితో చూసే కవి బుద్ధుడు.
సంగీతంతో పరిచయం మాత్రమే కాకుండా, ప్రవేశమూ, అభినివేశమూ కల వెనకటితరం కవి. లయజ్ఞానం మెండు. కందంలో జగణముండదు బేసిన్ అని ఎందుకన్నారో లాక్షణికంగా తెలిపిన సంప్రదాయవాది.
తొలినాళ్లలో పద్యకావ్యము వ్రాసి మన్నలలొందిన భాషా పండితుడు.
చలచిత్ర రంగ స్పర్శ కలిగిన పండిత కవులలో అగ్రగణ్యుడు, ప్రధమ పూజ్యుడు.
అరవయ్యో దశకం తొలినాళ్లలోనే తెనుగు చిత్రాలకు మాహామహుల సరసన పాటలు వ్రాసిన మేటి.
మొదటి చిత్రం , మొదటి గేయం ఎవో నాకు తెలియదు. ఎన్ని వ్రాసారో కూడా తెలియదు…
ఐతే వీరి పాటలు మటుకు చిన్నప్పటి నుంచి కుడా ఇష్టంగా వింటూంటాను.
ప్రాధమిక పాటశాలలో (ప్చ్, పాఠశాల) ఉన్నపుడే – జనరంజని లో ఉదయం వింటే —-
నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై, నా ప్రాణమై – వంటి పాటలు – రోజంతా నోటనానుతూ ఉండేవి…
ఆ పదాల పేర్పూ, సమాసాల కూర్పు… మధ్యలో ‘భళారే ‘.., ‘గుమ్మాడీ’,’ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ’వంటి ప్రయోగాలు.. అనితర సాధ్యం…
ఇది సి.నా.రే వ్రాసిన పాట అని నేను మొదట నమోదు చేసుకున్నది… దాన వీర శూరకర్ణలోనీ “చిత్రం భళారే విచిత్రం”.  ఇప్పటికీ వింటుంటే చిత్రంగానే ఉంటుంది నాకు.
భాషమీద విశేషమైన సాధికారత. పాట మీద పల్లెజీవనం నుంచి వచ్చిన ఆప్యాయత. ఇక వేరే కావలసినది ఏముంది సందర్భం పేరు తో కాస్త ముడి సరుకు తప్ప?
ఒక ఫక్తు వ్యాపారత్మక చిత్రానికి, గ్రామీణ నేపధ్యపు కధానాయకుడితో ..“సురుచిర సుందర వేణి, మధు మయ మంజుల వాణి” అని చెలినుద్దేశించి పాడించగల, అలా పాడటానికి దర్శక నిర్మాతలని ఒప్పించగల, అలా పాడించి శ్రోతలను మెప్పించగల సినీ కవి ఒక్క సినారేనే అంటే అతిశయోక్తి కాదు.
వీరి పాటలు వింటుంటే – బహుశః  తొలిప్రతి వ్రాసిన  తరువాత పొల్లు కూడా సవరిరించ వలసిన అవసరం ఉండదేమో అని అనిపిస్తుంది – ఆ పదాల పొహళింపు చూస్తే.
 నాకు చాలా ఇష్టమైన మరో పాట బాలు గారు తొలినాళ్లలో పాడిన  “మెరిసే మేఘ మాలికా… ఉరుములు చాలు చాలిక”..
 దానవీరశూరకర్ణ లోనిదే – అజస్ర సహస్ర నిజప్రభలతో రాసిన – కర్ణుడి పెంపుడూ తల్లి పాడే పాట కూడా  నా ఇతవులలో ఒకటి.
ఎన్టీ రామారావు గారి స్వంతచిత్రాలలో వీరి పాట తప్పకూండా ఉండవలసినదే…”నన్ను దోచుకుందువటే..” మొదలు.. “ప్రియా చెలియా, పిలచే మౌనమా..” వరకు ఎన్ని మధుర గేయాలో.. ఎన్ని ఉదాత్తకల్పనలో..
 ఏకవీర చిత్రానికి సినారె మాటలు వ్రాశారు. ఆవిధంగా ఇద్దరు జ్ఞానపీఠగ్రహీతలతో సంబంధమున్న ఏకైక చిత్రం ఏకవీర.
తిరుపతమ్మకధలోని పువ్వైవిరిసిన పున్నమి వేళ…బిడియము నీకేల.. బేలా…
“ఈరేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది” పాట .. ఇటీవల ఎదో సినిమాలో మళ్ళీ వినిపించి .. శ్రోతల్ని మంత్ర ముగ్ఢుల్ని చేసింది.
బాపూ రమణల సినిమాలకు కూడ వీరు చాలా పాటలు వ్రాశారు.. “ ఎదో ఎదో అన్నది మసక మసక వెలుతురు, గూటి పడవలో ఉన్నది… “
గోరంత దీపం లో శీర్షికా గీతం, వంశవృక్షం లో వంశీకృష్ణ యదువంశీ కృష్ణ పాటలు ఎవరికి మాత్రం ఇష్టం కావు చెప్పండి?
లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను.. కూడా నాకు ఇష్టమైన పాటలలో ఒకటి.
సాలూరి వారు స్వరపరచిన మ్రోగింది కల్యాణ వీణ .. పాట గురించి చెప్పేదేముంది.
ప్రణయకావ్యమున ప్రధమపంక్తివో… ఎంత లక్షణమైన అభివ్యక్తి!
ఆధునిక ఆంధ్రసాహితీ హరివిల్లు లో ఘజలనే ఉదారంగుకు కారకుడూ, ప్రేరకుడూ, పూరకుడూ ఈయనే నంటే అందరూ ఒప్పుకునేమాటే
బాలలనూ, పండితులనూ, జానపదులనూ జ్ఞానపదులను … మెప్పించిన కలం వారిది…
ఎన్ని ప్రణయగీతాలు, ఎన్ని ప్రభోధాత్మకగీతాలు .., ఎన్ని చంటిపిల్ల పాటలు, ఎన్ని కొంటె పడతుల పాటలు.. చేపట్టని సందర్భమున్నదా.. కట్టని పాట ఉన్నదా?
అలానే నిత్యనూతనంగా విరాజిల్లుతున్న పగలే వెన్నెల జగమే ఊయల….
చరణకింకిణులు ఘల్లు ఘల్లుమన.. కరకంకణములు గల గలలాడగ.. వినీల కచభర..విలాస బంధుర.. తనూలతిక చంచలించిపోగా.. ఆడవే మయూరీ.. నటనమాడవే మయూరీ …..
 స్వాతిముత్యం లో “మనసు పలికే” కి మించిన సరసశృంగారగీతమేముంది చెప్పండి, ఈ మధ్య కాలం లో సినిమాలలో వినిపించింది
మూడు పాటలు అని మొదలు పెట్టి ఒక ముప్ఫైచెప్పినట్టున్నను… ఇంతకీ నాకు బాగా బాగా.. మిగతా సినారేపాటలు ఏవంటే..
3 ) నాకు చాలా చాలా..చాలా.. నచ్చేపాట .. వినినంతనే.. ఇది సినారే పాట అని తెలిసిపోయే ఏదంటే… ఊహు.. నేను చెప్పనులే .. మీరే వినండి..
వినినంతనే .. మళ్లా రండండోయ్…
2) సంగీత సాహిత్య సమలంకృతే..
1)ఇక అన్నింటికన్నా ఇష్టమైనది..,గత రెండున్నర దశాబ్దాలుగా తెలుగునాట పుట్టిన ప్రతి పసికూనా లాలిగా పాడించుకుంటున్నది… తెలుగు చిత్రాలలో లాలిపాటలకు మకుటాయమాయమైనది… తెనుగు తనాన్ని, పారేడే పాపడిలో చిన్నికృష్ణుడిని చూసే సంస్కృతీసంప్రదాయాన్ని నిండా వంటబట్టించుకున్నదీ .. ఒక సారి వింటే కరిరాజవదనుడూ, యదువంశవిభుడూ కూడా ఈ పాటే లాలిగా పాడాలి అని మంకుపట్టి పాడించుకునేటట్టు చేయగలిగినదీ ఐన ఈ పాట.

నేడు ఈయనపాట విశ్వంభర.

బాదరాయణ లంకెలు: