ఇన్నాళ్ళకి

ఇన్నాళ్ళకి

గలగలా మాట్లాడావు

నిన్న నా

కలలోకి వచ్చినువ్వు!

***

మెలకువ వచ్చి నీ

గొంతు గుర్తు తెచ్చుకోబోతే

తెలవారు ఝామున

గొంతు విప్పిన కోకిలలు!

నిరీక్షణ – ౨

ఇంతకాలం పెరిగిన
దూరం, అనురాగం చాలని
ఇకనైనా నను దయ తలచేవా?

ఎంతకాలం దూరమైతే
అంతకంత ప్రేమ పెరిగేనని
నాతోనే నిరూపించ దలచావా?

మునుపొకమారు:

నిరీక్షణ

స్వాగతమయ్య! శ్రీప్లవా!

ముచ్చెమటలు పట్టెనయా
రచ్చలఁ గనఁగా కరోన రక్కసి రూపున్
విచ్చేయగ నీపునిపుడె
హెచ్చరికయు సేయలేను హేలాగతులన్

సకలప్రపంచమిత్తరి
వికలంబైయుండెఁ జెలగ విషపుకరోనా
త్రికరణ శుద్ధిగ ప్లవ! మే
లొకింత యడుగిడెడువేళ నొనగూర్చుమయా!

గాలిని బీల్చభీతిలిరి, కట్టిరి మూతికి గుడ్డముక్కలన్,
కూలెను ధైర్యముల్, గృహపు గోడల మధ్యను నిల్చిరెల్లరున్,
జాలిగ చూచుచుండిరి విషాదము మాపు వినూత్నశక్తికై,
చాలు కరోన-కాండమిక సైపక చంపుము దాని వేగమే

ఆదాయవ్యయములు కం
దాయములందెన్నబోరు తరగులు హెచ్చుల్
సాదరముగ స్వాగతమీ
మేదిని నిడెదరు దయగొని మేల్ జేతువనన్

దాటింపుము విపరీతముఁ
బాటింపుము పేదలనిన బాంధవ్యమునున్
నాటింపుము మంచితనముఁ
జాటింపుము ప్రకృతి రక్ష సలుపమని ప్లవా!

దినము పనిలేక ఒకపూట తిండి కైన
లేని బడుగుజీవుల రక్షఁ బూనమందు
దిగువ మధ్యతరగతికిఁ దేఁకువనిడి
కావ వలయును నీవె యిక్కాలమందు

మంచిని సమాజమందున బ్రతుక నిమ్ము,
పంచుము సుఖసంతోషముల్ ప్రజలకెపుడు,
పెంచుమాయురారోగ్యముల్, త్రుంచు మింక
చీని దౌష్ట్యము, శ్రీప్లవా! ఆనఁ గొనుము

మామిడి తోరణమ్ములిడి మాగృహమంతయు, రంగవల్లులన్
గోమల పుష్పముల్ పసుపు కుంకుమ లద్దితి నీదు మార్గమున్
గోముగ పాడుచుండెనొగి కోకిలలన్నియు నీదు కీర్తనల్
రా మరి జాగుసేయక పరాత్పర! స్వాగతమయ్య! శ్రీప్లవా!

నేర్పవయ్య నాకు సర్పభూష! – ౮

సంధివిసంధుల సముచితత్వము బుధవరులు చర్చ సలుపవచ్చు గాక
దుష్టసమాసముల్ దొరల శిష్టుడొకరుఁడెచ్చరించియె యుండవచ్చు గాక
శయ్యలేదనుచును నయ్యవారొక్కరు వంకఁబెట్టినఁ బెట్టవచ్చు గాక
ధారలేదని కవిదంతి యొకఁడు భువి వాదు లేపిన లేపవచ్చు గాక
ఇట్టె చూచి కృతిని హితముఁగనక “కాదు
యిది కవిత్వ” మన నరేంద్ర సభను
వాని నిగ్రహించి వాదు నెగ్గుటెటులో
నేర్పవయ్య నాకు నిటలనేత్ర!

శార్వరీ! ఘనమౌ స్వాగత మందున్ నీకున్!

ఉర్వి విస్తరమౌ నోగునుఁ బాపన్ రమ్మా
సర్వమానవులన్ జల్లగఁ గావన్ రమ్మా!
నిర్వివాదముగా నీవు చరింపన్ రమ్మా !
శార్వరీ! ఘనమౌ స్వాగత మందున్ నీకున్!

నేర్పవయ్య నాకు సర్పభూష! – ౭

ప్రభలీనుచుండెడి పట్టుపీతాంబరములు ధరియించగఁ బోర కుండ
మీరు దాల్చెడి నగ లేరికి లేవని గొప్ప బోదు ననుచు దెప్ప కుండ
పక్షిగూటికి సరి పరగు మీజుట్టని వ్యంగపు మాటల నాడకుండ
నల్లనిమచ్చయె వెల్లబారుటకును మందుగొన వనుచు నిందనిడక
మగని లోఁగలట్టి మంచిని జూచుచు
సంతసమ్ముగాను సతము గడుప
నిజసతికిని ధరణి నేర్పుటెటులగునో
నేర్పవయ్య నాకు నీలకంఠ!