Monthly Archives: జూన్ 2010

పొగ (చూరని) జ్ఞాపకం – కొనసాగింపు

అలా, విశాలమైన రోడ్డును చేరుకోగానే బండి వేగం పెంచాను, ఓ వంద గజాలు వెళ్లగానే- ఎదురుగా  పొగ కనిపించి, ఇది ఏ వాహనపు తాలూకు చమురు కమురో, లేక ఎక్కడ ప్లాస్టిక్ ను తగలబెడుతున్నారో అని, ముక్కుపుటాలకు సోకకుండా నా హెల్మెట్ అద్దం మూసివేసే లోపే, ఆ పొగ నన్ను  చేరింది. అంతే… ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యాను .. ఆ పొగకి కాదు .. ఆ పొగ తెచ్చిన మార్పుకి.. అప్పటిదాక ఆక్రమించిన నిస్సత్తువ,నిస్సహయత ఒక్కసారిగా ఎగిరి పోయాయి – ఎదో కొత్త ఉత్సాహం వచ్చింది.. ఒక లోగొంతుక ఇది నీకు బాగ తెలిసిన వాసన జ్ఞాపకముందా అని అడిగింది? బాగా తెలిసిన కాదు, బాగ ఇష్టమైన వాసన అని మరో లోగొంతుక పలికింది. ఈ పొగ వాసన నాకు ఇష్టమన్న నిజం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. బహుశః, .. ఓ పదినిముషల క్రితం మీరు ఒక కాగితం ఇచ్చి నీకు చాల ఇష్టమినవి ఏమిటో ఓ పది, కదు ఓ పదిహేను, కాదు ఓ పాతిక వ్రాయమన్నా ఇది వ్రాశేవాడిని కాదేమో. ఏమైంతేనేం, ఈపాటికి పొగ నన్ను పూర్తిగా జయించి, నా చేత బండి రోడ్డుపక్క ఆపుచేయించింది. అప్రయత్నంగా వెనక్కి అడుగులు వేసాను, మళ్లీ ఆ పొగ పీల్చుకోవటానికి.

ఆ పొగను నింపుకొని ఒక్క గాలి విసురు, ఒక గాలి పీల్పు , వెళ్ళి మా నాయనమ్మ గారి దొడ్లో పడ్డను, నాల్గో తరగతి పిల్లాడిగా.

https://i0.wp.com/bapubomma.com/images/budugu.jpg

[ ఈ ఫోటో నాది కాదులెండి, బుడుగుది, ఎప్పుడొ బయటకు వెళ్లెటప్పుడు తప్పితే నాకు ఒంటి మీద చొక్కా ఉండేది కాదు,  లాగూకు పట్టిలు కూడ ఉండేవి కాదు, గుండిలు ఉండేవి కానీ రకరకాల రంగులలో ఉండేవి, అప్పటికే చాలాసార్లు ఊడిపోతే కుట్టబడ్డాయి అని చెప్పటనికి]

మా నాయనమ్మగారిది పెద్ద ఇల్లు, పడమర, దక్షిణం గోడలు, ఇంచుమించు పొరుగువారి ఇంటిగోడలతో కలిసి పోయి ఉంటాయి, ఇంటికి ఉత్తరవైపు, తూరు వైపు చాలా ఖాళీస్థలముండేది. దాదపు పది కొబ్బరి చెట్లు, వేప చెట్టు, తెల్ల గన్నేరు, మల్లె, సన్నజాజిపాదులు, నిమ్మ దానిమ..మొక్కలు రెండు .. ఇంకా అవీ ఇవీ.. వేసవి సెలవలలో అక్కడికి చేరేవారం .. పిల్లలం, ఒక్క రోహిణీ కార్తె తప్పవిడచి, – పొద్దున పదకొండు వరకు అరుబయటే ఉండేవాళ్లం. రోహిణీ కార్తె అంటే ఏమిటో అప్పటికీ ఇప్పటికీ తెలీదు గానియండి, అది రాగేనే, ఒరే రోహిణీ కార్తెరా వడ గొడుతుంది లోపలికిరా అని కేకలేసేవారు. సాయంత్రం నాలుగు దాటగనే – మళ్ళి ఆరుబయటకి వచ్చేవాళ్ళం.. ఎవరన్నా వస్తే వాళ్లచేతో – లేదంటే బాబాయే – కొబ్బరి బోండాలు కొట్టించేవాడు  .. పెద్దవాళ్లు కాయనుండే తాగేవాళ్లు కాని, పిల్లలకి గ్లాసులలో పోశెవారు (  స్ట్రాలు ఇంకా విరివిగా లేని కాలం) తాగి మళ్ళీ ఆట లో పడితే – ముంజలకోసం పిలచేవారు .. ఒకటి నోటి లో కుక్కుకోవటం ఆడటనికి పరిగెత్తటం.. మళ్ళీ అటు నుంచి రావటం, ఇంకోటి కుక్కుకొని పరిగెత్తటం, చార్,పప్పుచార్ అని, ఐస్ బాయ్ అని ఇలా ఎవో ఆడేవాళ్ళం .. (మగ జనభా ఎక్కువ ఉంటే విడిగా ఏడుపెంకులాటా), ఓ గంట గడిఛాక ఒక పక్క మేము ఆడుకుంటుంటే మరో పక్కనుండి ఆడవాళ్లు చిమ్ముతూ, ఇంత దొడ్డి చిమ్మాల్సి వచ్చినందుకు కారాలు నూరుతూ, అవి మా మీద చూపిస్తూ ఉండెవారు.. కళ్లాపి దగ్గరకి వచ్చేసరికి ఇక పిల్లల్ని పిలిచే వాళ్లు – [ మేము పని చేస్తుంటే మీరు ఆడుకోవటమేమని అక్కసు కాబోలు) ఒకళ్లు పంపుగొట్టాలి, ఇద్దరు చిన్న చిన్న బిందెలతో తీసుకెళ్లి, కళ్లాపిచల్లే వాళ్లదగ్గర బొక్కెనలో పోయాలి…, కళ్లాపిజల్లటం అయ్యేసరికి ఆటలు ఆపేసేవాళ్లం. ఒకరిని సన్నజాజులు కోయటానికి ఒకరిని మల్లెలు కోయటనికి పురమాయించేవారు. వీటితో పాటు కొన్ని ఇతరత్రా పనులుండేవి .. ఆచారి కొట్టుకు వెళ్లి ముక్కుపొడుం తేవటం, మరెవరింటికో వెళ్లి కర్వేపాకు తేవటం, లేదు, ఫలాని అమ్మమ్మగారి ఇంట్లో వంగలో కాకరలో తెంపుకురావటం, బెట్నోసాలో, అనాసినో, దీపపుబుడ్డికి గ్లాసో తెచ్చిపెట్టంలాంటివి. ఇదిగో ఈ పనులు చేసుకొని, ఆరున్నరకో ఆరు ముప్పావుకో తూర్పు వైపు అరుగు మీదకి చేరేసరికి వచ్చేది, ఆ పొగ వాసన , ఆగ్నేయం మూల, పరివారపు స్నానాలకోసమి, నాన్నో, నాయనమ్మో కాగువేస్తే, ఆ పొయ్యిలో మండుతున్న యెండిన కొబ్బరి డెక్కల నుండి వస్తున్న పొగ వాసన.

ఎవరో కొబ్బరిబోండలు అమ్మేవాడు, ఎండిన కొబ్బరిడెక్కల్ని, రోడ్డు పక్కన వేసి నిప్పుబెట్టితే- మళ్లీ ఇప్పుడు అదే పొగవాసన. గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇంటికేసి బయలుదేరాను. ఇంటికి చేరంగానే, శ్రీమతి ఏంటడీ ఆలస్యం అనియడిగితే, “దారిలో పొగ పీల్చుకోవటానికి ఆగాను” అని చెబుదామనుకొని, అపార్ధం చేసుకుంటుందని, మాటలని మింగి, లోపల జ్ఞాపకంతోపాటు భద్రంగా దాచుకున్నాను.

మాతా శత్రుః పితా వైరి గురుర్ రిపుః – ౨

 

ఈ రోజు తిరిగి పాఠశాలలు మొదలయ్యాయి,ఆంధ్రదేశంలో 

కం) బుడిబుడి నడకల బుడతల
వడివడి బంపెదరు బడికి వదరగ యాంగ్లం
పడిపడి జదవగ పోరుచు
చెడిపెదరుగదపసివాండ్ర చేరియె పెద్దల్
కం) ఇన్సల్టౌపేరంటుకు
కాన్సెప్టుస్కూలునందు గాడన “ఎడ్మిట్”
కన్సెప్షన్ నాట్నుండే
టెన్సౌనులెసగటుతండ్రి, డీలా పడుచున్.

శా) ఆయాచేతులచిన్నిబాలునొదిలే ఆయమ్మ ఎట్లుండునో
ఆయాసంబనియెంచబోకబడిలోఆఙ్ఞాపనేలిత్తురో
న్యాయమ్మే?పసివాండ్రపోరితినుమన్నన్?ఇష్టమే లేదనన్
ఆయంబొమ్మికబాల్యమేచెరబడెన్,యాంగ్లంపుకాన్వెంటునన్.

శా) ఇష్టాయిష్టపుప్రశ్నలేదు;గదమాయింపేసమాధానమై;
శ్రేష్టమ్మౌనిదువిద్య,శాలనుచునే,జేర్చన్ యహంకారులై-
నిష్ఠంబూనియెపుస్తకమ్ముగనడౌ;నిర్లక్ష్యమేధోరణై;
నష్టంబెంతయెలెక్కలేయుదురయో!నష్టంబదెవ్వానికో.
[విద్య=గ్రూపు;శాల=స్కూలు]

తే) బాలుని పరువు పందెము బారనీరు
ఆడిన, పరువు పందెము నోడు తండ్రి;
తండ్రివృత్తి తల్లిసుశీలతలను మించి
తనయు ర్యాంకులే గొప్పలౌ ధాత్రి నేడు!
[ వీడు బడిలో పరుగు పందెమాడి, తక్కువ మార్కులు తెచ్చుకుంటే తండ్రికి తలకొట్టేసినంత]

తే) అరయ ఏకాకిగాదోచు అర్భకుండు
ఫష్టు తినగ అమ్మిచ్చులే ఫాష్టు ఫుడ్డు
తండ్రి దినదినమునుజొప్పు తనదు కాంక్ష
గురువు శిక్షింప ముందుండు; ఘోరమిద్ది.

ఇది గతంలో పొద్దువారి నిర్వహణ లో కొత్తపాళీ గారి అద్యక్షతన జరిగిన సమ్మేళనమునకు వ్రాసినది. అక్కడ ప్రకటించబడలేదు.

పొగ (చూరని) జ్ఞాపకం

రోజులాగా, ఎగిరెగిరి దంచినా అంతే కూలీ ఎగరకుండ దంచినే అంటే కూలీ అని మళ్లీ జ్ఞోనోదయమై, చిన్నముల్లు ఎనిమిది దాటిన తరువాత, ఇవాల్టి ఇంక చాల్లే అని దుకాణం కట్టి, ఇలు దారి బట్టాను, శిల్పా రామం మలుపు తిరిగుతూ, ఇవాళైనా గోతికి అడ్డం పెట్టారా అని అనుకుంటూ మెల్లగా బండి ని “నడి”పిస్తూ ముందుకువస్తే రోడ్డుకు ఎడమపక్క రోజూ కనబడే గోతులే కనబడ్డాయి. బహుశా కొన్ని వేల మంది ప్రయాణిస్తారనుకుంటా ఈ రోడ్దు మీద, రోజుకి. అభివృద్ధి పేరు మీద రోడ్డుకి ఇరువైపులా ఉండే కాలిబాటలు ఎత్తి వేశారు.. హైటెక్ సిటి పరిసర ప్రాంతాలలో జనులు కాలు కింద పెట్టకుండ కార్లలోనే తిరిగాలేమో? అది అలా ఉంచితే , హై.సిటీ నుంచి కు.పల్లి వెళ్లే దోవలో మధ్యలో కడుతున్న వంతెనకి పై భాగంలో వెల్డింగ్ పని చేస్తున్నారు.. కింద ఒక హెచ్చరిక బోర్డు కూడ పెట్టకుండా. ఆ వంతెన తోనే జనాలకి నానా ఇబ్బందిగా ఉంటే – చెప్పాపెట్టకుండ – వ్రాసీ పెట్టకుండ – రోడ్డుకు ఎడమ పక్క పెద్ద పొడుగాటి గొయ్యి తవ్వారు, తవ్విన వారు ఊరుకోరుగదా .. అందులో ఇనప చువ్వలు లేపారు… ఈ ఇనుప చువ్వలలో సిమెంటు పోస్తే – వాళ్లు తవ్వుతున కాలవో, మరో భూగర్భవాహినో కలకాలం ఉంటుంది అని వారి ఆశ. కానీ ఇంకా సగం ఇనుపచువ్వలు సిమెంటు చేత కప్పబడలేదు.(మీకు తేలికగా అర్ధం అవటానికి ఫోటో లు తీద్దామనుకున్నను గానీయండి, ఆ చీకటిలో నా కెమెరా సహకరించలేదు,బ్లాగ్మిత్రులు ఎవరైనా ఫోటోలు పెట్టి లంకె వేయగలిగితే సంతోషం) ఆ గోతి వైపు వాహన చోదకులు వెళ్ళకుండా “పని జరుగుతున్నది” పలకలు అడ్డమూ పెట్ట లేదు.. రాత్రి పూట.. తాగిన మత్తులోనో మరో మత్తులోనో – అక్కడ గొయ్యి ఉండే అవకాశం ఉంది అని ఊహ కూడ చేయలేని ఏ దురదృష్టవంతుడో, ఆ గోతిలో పడితే?

పడితే అప్పుడూ కధ మొదలవుతుంది… అప్పుడు .. ఛానళ్లవారికి మెరుగైన సమాజం .. సామాజిక బాధ్యత గుర్తుకువస్తాయి….. కొట్టుకోవటానికి వేరే విషయాలు ఏమీ లేకపోతే.. దీని మీద ఒకటి రెండు గంటలు చర్చ కూడా ఉంటుంది.., హక్కుల ఉద్యమ కారులకి హక్కులు గుర్తుకువస్తాయి.. ఏ టి.వి వాడో మైకు ముందు పెట్టగానే సగటు మనిషికి కోపం వస్తుంది…ప్రభుత్వ యంత్రాంగానికి చలనం వస్తుంది.. ర.భశాఖ వారికో, రవాణా శాఖ వారికో ఓ మౌఖికాదేశం వెల్తుంది.. వారు మఱ్ఱోజు పొద్దున వేరే గోతి ముందు నుంచి ఎత్తుకొచ్చి ” ఇక్కడ గొయ్యి తవ్వబడ్డది, ఎప్పటి కైనా పూడ్చబడును, లేదా అదే పూడిపోవును” అనే బోర్డు పెడతారు.. ( ఆ పాత గొయ్యి సంగతి ఏమిటంటరా? రామాయణం అంతా విని వెనకటి ఎవడో రాముడి సీత ఏమౌతుందో అర్ధం కాలా పానశాల(బ్లాగు)కి వెళ్లొస్తా అన్నాడుట.). ఒక  ప్రమాదం  జరిగితే ఇంతగా స్పందిచే వ్యవస్థ.. ప్రమాదం జరగక ముందే ఎందుకు స్పందించదు? ప్రమాదం ఏ క్షణమైనా జరవచ్చు అన్నట్టు ఉన్న స్థితిలో .. అంత నిస్తేజంగా ఎలా ఉండగలుగుతుంది? ఇది ఉదాసీనతా? స్తబ్దతా? నిర్లక్ష్యమా? అమెరికా లాంటి దేశం లో గచ్చు తుడుస్తుంటే – “జాగ్రత్త, పడతావ్” అని బోర్డు పెడతారే – పెద్ద ప్రమాదమేమీ కాకపోయినా… మరి ఇక్కడ .. ఇంత బారున రోడ్డు తవ్వి – కనీసం తెలిసేలా బోర్డు పెట్టకపోవటమేమిటి? మనిషి జీవితానికి మనం ఇస్తున్న విలువ ఏమిటి?…

ఇలా ఆలోచిస్తూ ఆ గొయ్యి తవ్విన వార రోడ్డు దాటాను. అక్కడి నుంచి సుమారు ఒక రెండువందల మీటర్లు ముందుకు వచ్చానేమో…. అంతే ఒక వీచిక నన్ను విసిరి ఎక్కడో పడవేసింది. ఆ సంగతి రాబోయే టపాలో వీలైతే ఈ వారాంతంలోనే …