Monthly Archives: అక్టోబర్ 2007

తూగులయ్య పదాలు -౨

ఇది రెండో వాత, అదే.. విడత.

పాత గాయపు మాన్పు
కొత్త కైతల కాన్పు
నిండు బాటిలు తేన్పు
ఓ తూగులయ్య!

పాత గాయము మాన్పు
కొత్త కోర్కెల కాన్పు
నిండు బాటిలు తేన్పు
ఓ తూగులయ్య!

శుక్రవారపు రాత్రి
చుక్క చుక్కకు ఆర్తి
చుక్క లెంచును నేత్రి
ఓ తూగులయ్య!

తెలుగు మాటలు నాంచు
తాగి యాంగ్లము దంచు
గొంతు వేమన కంచు
ఓ తూగులయ్య!

నేలనిలచి “నో”యను
ఫ్లైటున వడి దెమ్మను
రోమునతడు రోమను
ఓ తూగులయ్య!

రద్దు కోరుచు నరచు
నెగ్గి నంతనె మరచు
బెల్టు షాపుల దెరచు
ఓ తూగులయ్య!

సీత జాడను దెలిసి
కోతు లన్నియు దనిసి
ద్రావె దండుగ గలిసి
ఓ తూగులయ్య!

సుధలు పుట్టిన దెంత
దివిన జాలుట వింత
కలిపిరే”ఇది” కొంత
ఓ తూగులయ్య!

పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్!

నా దృష్టి లో రానారె మాటల పిసినారె. అందుకు తొలి నిదర్శనం వారి గూగులమ్మ పదాలే. మీ పదాలు మీ ఇష్టం గాని, మాకో మంచి సమస్య ఇవ్వండి బాబూ అంటే, ఆయనిచ్చినది మూడే పదాలు:
“తాటక తనయుడు కర్ణుడు.”
నా వల్ల అయ్యే పని కాదులే అని వదిలి వేరే విషయాల వైపు మళ్ళితే బ్లాగేశ్వరుడు తన పురాణసంపత్తి తో మంచి పూరణ ఇచ్చారు, నాకు కాస్త ధైర్యాన్ని కూడా.
వారు దురితులతో స్నేహం చేయటం మృత్యువును చేరదీయటమే అన్న అర్ధం లో పూరిస్తే, నేను కుంతి తో సూర్యుని సంభాషణకి కిట్టించటానికి ప్రయత్నించాను.
ఇది పద్యాల ఋతువుట, కాబట్టి రానారె గారు, గురువు గారు, మా శ్రీరాముడు పాస్మార్కులు ( దీనికి తెలుగేమిటబ్బా!) వేస్తారనే అనుకుంటున్నా.

అనుమానింపగ ధర్మమె
ఘనమౌ తపమాచరింప కల్గెడి శక్తిన్?
మునిమంత్రములుత్తాటక?
తనయుడు కర్ణుడు
కలుగుట తధ్యము కుంతీ!

రానారె గారి సమస్యను చూసి బ్లాగేశ్వరులు ‘తాటక’ యా ‘తాటకి’ యా అన్నారు, తాటకి ఐతే పూరణ పరిశీలించండి:

మునివరమునుశంకింతువె
పనిగట్టుకొనిటులకుంతి? బలివైతివిగా
క్షణమున విధివింతాటకి!
తనయుడు కర్ణుడు
కలడన ధరకన్నియకున్!

వందన శతముల్

    వాగ్దేవికి వినయముగను
    వాగ్దేవీవల్లభునకు వాని సములకున్
    వాగ్దేవీసమనేత్రుల,
    వాగ్దేవీవరసుతులకు వందన శతముల్!

నెనర్లు

         రంపపు కోతల ఆంగ్లమె?
         ఇంపగు మాటలు తెలుగున ఇన్నుండనుచున్
         సొంపుగ నెనరిడె; నెనరులు
         గంపెడనంగ కలగూరగంప గురువుకున్!

మీ టపా టపాకట్టిందా?

మీ టపా ‘టపా’కట్టిందో లేక బతికి బట్టకట్టిందో తెలుసుకోవాలంటే:

ఇచ్చట, ఇచ్చటన్ మరియు నిచ్చట చూడుడి వేగిరమ్ముగా
ముచ్చట గొల్పుబ్లాగులును ముచ్చెమటల్‍కలిగించు వ్యాఖ్యలున్
రచ్చని పించుబ్లాగులును రక్తిని గూర్చు టపాలువ్రాయనే
ర్వచ్చురొ! ఖ్యాతినొంద సులభమ్ముగ,అంతర జాలవేదిపై!

తూగులయ్య పదాలు

[హెచ్చరిక: ఇది పేరడీ]

శ్రీరాముడి ఈ టపా చూసిన తరువాత బ్లాగేశ్వరునికి ఎలా కలిగిందో, రానారే గారి ఈ టపా చూసిన తరువాత నాకు అలానే దురద పుట్టింది. ఏమి చెయ్యాలో తోచని స్థితిలో రోడ్డు మీద బాగా తాగి తూలుతున్న మందు బాబు దారిచూపించాడు:

అన్న మాట వినుట
తిన్న బాట జనుట
తగవు గొప్పవాడవగుట
ఓ తూగులయ్య!

మాట తూలుట కన్న
తాగి తూలుట మిన్న
బతుకు బండి సున్న
ఓ తూగులయ్య!

సత్యశోధన కూన
మూడు బీర్ల మీన
నిజమె నాల్క పయిన
ఓ తూగులయ్య!

వోట్లనాడు ఉచితము
వద్దనుటనుచితము
ఘనమీ ప్రజాతంత్రము
ఓ తూగులయ్య!

దుఃఖము మరువ తాగు
సంతోషమపుడును తాగు
నీకేల ఆలుబిడ్డల ఓగు
ఓ తూగులయ్య!

తాగి బండి నడుపబోకు
నడిపి జనుల చంపబోకు
అదియె పదివేలు మాకు
ఓ తూగులయ్య!

ఇట రానారె స్పూర్తి
నాది వికటపు ఆర్తి
ఆరుద్ర గురు మూర్తి
ఓ తూగులయ్య!