imglishu u liv longaa

ఇంగ్లీషూ యు లివ్ లాంగా

మన నరసరావుపేట చదవులకి, ఉద్యోగంలో ఇబ్బంది గా ఉందని “spoken english course” లో చేరదామని నా మిత్రుడు పనిచేస్తున్న instituteకి వెళ్ళాను..
అక్కడ స్వాగత కన్య ..”కౌన్సిలింగా” అని అడిగింది.ఆమె నవ్వుకి గుండె ఐసైపోతే కరిగి పోకుండా వుండటానికి చొక్కాలోంచి అరచేయి లోపలికి పోనిచ్చి గుండెమీద గబగబా రుద్దుకొని, కాస్త తేరుకొని, తల అడ్డంగా ఊపుతూ “రామలింగా” అన్నాను మా ఫ్రెండు కోసం వచ్చాను అన్నట్టు..
అప్పుడు వాడు క్లాస్లో ఉంటం వల్ల వాడిని కలవటం కుదరలేదు.నేనూ అదే మంచిది అనుకున్నాను.. మళ్లా వాడి కోసం అక్కడికి వెళ్లవచ్చు, అనే దురుద్దేశ్యం తో.ఆ రోజు సాయంత్రం ఫోన్లో మాట్లాడుకొని మర్రోజు లంచ్ టైంలో కలవటానికి నిర్ణయించుకున్నాం. మర్రోజు ఆ సుందరిని తలుచుకుంటూ వాడి ఆఫీస్ మెట్లెక్కుతుంటే వాడే ఎదురొచ్చి హోటల్ లో కూర్చోని తింటూమాట్లాడుకుందామని లాక్కెళ్ళాడు.ఆడ్రిచ్చి నా బాధ వాడికిచెబితే, వాడు ఇలా అందుకున్నాడు:

ఆంగ్లమంత సులువైన భాష లేదు. నిఝంగా లేదు. ఒకప్పుడు గ్రామరు గట్రా ఉండేవి.అప్పుడు నా బోంట్లు ఇంగ్లీషు నేర్చుకోవాటనికి కొంచం సందేహించేవారు. ఆ రోజుల్లో విశ్వనాథ వారు you కోసం y o u ఎందుకయ్యా u ఒక్కటి చాలదా అని విష్ణుశర్మ ను కలలోకి తెప్పించుకొని మరీ ప్రశ్నిస్తే పెద్దగా పట్టించుకున్నవారు లేరు కాని ఈ రోజుల్లో అందరు అదే “FALO” అవుతున్నారు. తమ ఆంగ్లభాషాపాండిత్యాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. కాలం కలిసొచ్చి కంప్యూటర్లు ఈ-మెయిలులు SMSలు కూడాకనుక్కున్నారేమో You చిక్కి- u గామారితే Are రెండు వైపులనుంచి హరించుకుపోయి r అయింది. “పండిత్తులు” ఇంకాస్త ముందుకెళ్ళి చతుర్ధాంతాలు, అష్టావక్రాలు కూడ పుట్టించటంతో ..భాష మొత్తం ఒక్కసరి గా తేలికై కూర్చుంది.ఒక పదేళ్ళ క్రితం ఐతే ‘I will wait for you’ అని రాయల్సివచ్చెది,ఇప్పుడైతే ‘i wl w8 4u’ చాలు. అర్ధం కాని వాడు- ఆంగ్లభాషాపరిజ్ఞానశూన్యుడు.సంఖ్యాక్షరసంకరపదాలు ఒక ఎత్తు ఐతే, సంభాషణ లో వచ్చిన కొత్త విధానాలు పోకడలు ఇంగ్లీష్ ని ఇంకా తేలిక చేశాయి ఎంత తేలికంటే చెప్పలేనంత తేలిక.

నా ఐదవ తరగతి లో అనుకుంటాను మా మాస్టారు “నీవు నిన్న పట్టణమునకు వెళ్ళావా”అన్న దాన్ని ఇంగ్లీష్లో చెప్పమని అడిగితే అరలాగు తడుపుకున్నాను.ఆయనే ఇప్పుడు వచ్చి అడిగితే ఓ యస్ వెరీ సింపులూ అంటు చెప్పేస్తా “yesterday you went townaa” అని.ఈ పోకడలు ఒక పది సంవత్సరాల ముందు వచ్చి ఉంటె పది పాస్ కావటనికి మనం ( మన మాస్టారు) పడ్డ బాధలు తప్పేవి.
ఒరెయ్ నీవు నేను బడి లో వున్నపుడు.. వ్యాకరణం, క్రియలు నామవాచకాలు ఉండేవి, ఇప్పుడవన్ని ఎత్తేశారు.అప్పుడు నీ పేరేంటి అని అడగటానికి “What is your name” అని అడగాల్సివచ్చేది.ఇప్పుడు ‘your name” అని మొహం కొశ్శన్మార్క్ లా పెడితే చాలు చెల్లుబాటైపోతావ్.దానికి ప్రత్యేకమ్ మళ్ళా కోచింగ్ సెంటర్ల చుట్టొ తిరగక్కరలేదు.చెబితే చోద్యం లా ఉండవచ్చు కాని ఇది నిజం. ఇప్పుడు నేను నిన్ను “నిన్న మా institute కి వచ్చావా” అని అడగాలంటే ‘Did you come yesterday?’ అని అడగాలి. కాని నీవు అలా అడిగితే .. ప్రతివాడు “అంత సీన్ అవసరమా” అంటాడు”.”you came yesterdaynaa” అని అడిగావునుకో – వాడు కూడ ‘సింపుల్ గా “యా” అనేసి వెళ్ళిపోతాడు.
ఈ లోపు పక్క టేబుల్ నుంచి కొంచం పెద్దగా మాటలు వినిపించసాగాయి..

‘ఓహ్హ్ యు డోంట్ ఈట్ నాన్వెజ్జా
నో ఎగ్గ్ ఆల్సోనా..
ఐ ఆల్సో వోన్లి వెజ్ బట్ ఐ ఈట్ సంటైమ్స్ ఎగ్గ్”

మిత్రుడు నా వంకా విన్నావుగా అన్నట్టు చూసి.. తిరిగి అందుకున్నాడు. ముందు ఆ ప్రకారం గా ప్రశ్నలు వేయటం నేర్చుకో.ఒకసారి ఈ ప్రశ్నలు వేయటం వస్తే, సమాధానాల చెప్పటం దానంతట అదే వస్తుంది.ఒక వేళ సమాధానం యేమి చెప్పాలో తెలియలేదు అనుకో ‘ యా’ అనో ‘నో’ అనో అనేసి ఎలాగూ తప్పించుకోవచ్చు. అలానే ప్రశ్నలు వేయటం కూడా బ్రహ్మవిద్యేంకాదు. ఎదుటి వాడు చెప్పినదానికి “ఆ” చేర్చి మొహం “?” లాగ పెడితే సరిపోతుంది.దానికి నువ్వేమి పెద్ద కష్ట పడక్కరలేదు.ఉదాహరణకి నీ కొలీగ్ నీ దగ్గరకి వచ్చి

“yesterday I went to film” అన్నాడనుకో
నువ్వు వెంటనే
“you went to filmaa” అను
అప్పుడు వాడు
“yeah.. I saw DDKT” అంటాడు.
ఈ DDKT ఏంటా అని బుర్రగోక్కోకుండా..
‘ it is niceaaa” అను..
వాడు boring అంటాడు..
నువ్వు’very bOrimgaaa? averagaaa?” అను..
వాడు ఇంకా ఎదో అంటాడు..దానికి మళ్ళా ఆ.. కలుపు.. వాడి చావు వాడు చస్తాడు నీవు మటుకు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు
.ఈ రకంగా నీ ప్రశ్నల ప్రకరణం ఒక పది రోజులు సాగించి వాళ్ళు ఏమి సమాధానాలు చెబుతున్నారో,గమనించి గ్రహించు,నిన్ను ఎదుటి వాళ్ళు ఏమైన ప్రశ్నలడిగినప్పుడు వాటిని ప్రయోగించు. ఆ తర్వాత వారం రోజులు గడిచేసరికి నీకు పోటి గా ఇంగ్లిష్ మాట్లడే గురుడు నీకు హైదరాబాదు లో కనపడడు.”అదికాదు రా” అని ఏదొ చెప్పబోయి .. సర్వర్ “ఇంకా లేవరా” అన్నట్టు చూడటం తో లేచివచ్చేశాం.
వాడికి బై చెప్పి ఆఫీస్ కి వచ్చి పనిలో పడ్డాను. ఒక గంటకి పక్కతను వచ్చి”shall we goaa” అన్నాడు,వేడి మీద ఉన్నానేమో “Where shall we go” అన్నాను.
“team meeting” అన్నాడు,”ok ok” అని వాడి వెనకాల బయలుదేరాను.ఆ మీటింగ్ లొ చెత్తాంతా మీకెందుకుకాని, అందులో దొర్లిన కొన్ని డవిలాగులు చెబుతాను

sent mailaaa..
by friday it will be donnaa..
oh u r taking leevaa
..

మీటింగ్ నుంచి బయటకి వచ్చేసరికి నాకు మా రామలింగడు చెప్పింది అక్షరాల నిజం అనిపించి ఇక ఆ రూట్లో ఫాలో ఐపోవాలని డిసైడ్ ఐపోయాను.( అయ్య బాబోయ్ నా నోట్లొంచి ఒకేసారి ఇన్ని ఇంగ్లీష్ మాటలే? నిజం గానే నాకు త్వరలో ఇంగ్లిష్ వచ్చేస్తున్నట్టు వుంది.)
ఈ రూట్లో వెళ్తే నా ఇంగ్లిష్ తో నాకు ఎదురైన కొన్ని అనుభవాలు త్వరలో చెబుతాను..

24 responses to “imglishu u liv longaa

  1. బహు బాగా చెప్పారండీ
    ఈ sms బాషతో అటు తెలుగూ రాకా,ఇటు ఇంగిలీషూ రాకా అడకత్తెర బ్రతుకు అయ్యింది
    మొన్న నా పరీక్షలో నేను సైతం”bcz” అని రాసాను.
    నా మితృడు మొన్న “ttl” అని చెప్పాడు.
    నా చిన్న బుర్రని ఎంత గోకి,తలంటి పోసినా అర్ధం కాలేదు
    మరుసటి రోజు చెప్పాడు “tak 2 u latr”అని.
    ఏవిట్టో అని ఆమని లా అనుకోవడం నా వంతు అయ్యింది

  2. లలితా స్రవంతి గారు, ధన్యవాదములు. మీ బ్లాగ్ కి పెట్టుకున్న పేరు బావుంది.

  3. మీ దంపుడు అదిరింది 🙂
    మే యూ లివ్ లాంగా…

  4. ప్రవీణ్ గారు, ధన్యవాదములు.

  5. నిజంగా ఇదీ ఊక దంచి నూక తీయడమంటే. హ8/10.

  6. ఇదీ నిజంగా ఉక దంచి నూక తియ్యడమంటే! 🙂

  7. రానారె గారు
    మీ అభిమానానికి కృతజ్ఞతలు.

  8. మూడో దాన్నుండి ఇక్కడికి లింకిచ్చి మంచి పని చేసారు. లేకుంటే మిస్సయిపోయేవాణ్ణి!
    నా రేటింగులు: మూడోది #1, రెండోది #2, ఇది #3
    ఉండేకొద్దీ పదునెక్కుతున్నాయి.

  9. ఇది మరీ ఘోరమండి,మాలాంటి వాళ్ళకేమీ మిగలకుండా రాసేస్తున్నారు.చిన్నప్పుడు,ఇప్పుడు కూడాఏమో గుంటూరు లీలామహల్లో సినిమా చూసిన చూడకపోయినా ముందు అంటించే వాల్ పోస్టర్లు చూడ్డానికి వెళ్ళేవాడిని.లితోస్ అని వాటి మీద ప్రింట్ చేయించేవాళ్ళు.కొన్ని ఉదాహరణలు,ఎంటర్ ది ద్రాగన్–కండలు తిరిగిన కరాటే వీరుడు, క్రాస్ ప్లాట్-గూబ్బగలగొట్టే గూఢచారి ఇవి కొన్ని మచ్చు తునకలు మాత్రమే.సాక్షాత్తూ విశాఖపట్నం జగదాంబలో మెకన్నస్ గోల్డ్ సినిమాను ఒక అంగ్లోఇండియన్ తనభార్యకు వాళ్ళ ఇంగ్లీషులో చెప్పింది వింటే మీరందరూ ఏమయిపోతరా అని నా సందెహం?

  10. చదువరి గారు,
    ధన్యోస్మి.

    రాజేంద్ర గారు,
    హన్నా ఎంత మాట, మీరు కొత్తగా మొదలెట్టి ఎదో సామెత చెప్పినట్టు బ్లాగేస్తుంటే, నాకు ఏమి మిగల్చట్లేదని చాలా ఇదైపోతున్నాను నేను.. 🙂

    రాధిక గారు 🙂

  11. లీలామహల్లో స్వల్పవిరామంలో – స్కావెంజర్ – సినిమా లో హీరో అని అనటమ్ విన్న మా వంశోద్ధారకుడు బిక్క మొహం వేసిన సీను మరిచిపోలేను.
    జి.బి షా “ఫిష్” కి స్పెల్లింగు ” gheti ” అని చెప్పి దొరలందరు వెధవాయిలు, వాళ్ళ భాష ఇంకా వెధవాయిది అని అన్నాడు.
    బైబిల్‌ని కూడా వాళ్ళు ఎస్.ఎమ్.ఎస్ ద్వారా పంపుకుంటున్నారు. మార్పు సహజం అని అనుకున్నప్పుడు దాన్ని కూడ మనం అంగీకరించాలి కదా?
    u r rtklez kool & gr8

  12. హ హ!! మన ప్రస్తుత పరిస్థితికి హాస్యాన్ని, మీ రచనా చతురతను జోడించి రక్తికట్టించే రీతిలో సమర్పించడం నన్ను అమితంగా ఆకట్టుకుంది.

  13. పింగుబ్యాకు: పొద్దుపోని యవ్వారం « ఊక దంపుడు

  14. జోహారు ఊకేశ్వరా! ఊక దంచి నూక తీస్తూ, ఓ చేత భాషాద్రోహులను తొక్కి నార దీసిన వైనము బహు చక్కగా ఉన్నది.
    అపభ్రంశపు తెలుగుతో పాటు, అపస్వరాల ఇంగ్లీషు వింటూ పళ్ళు గిట్టకరిచి ఉంచాను. ఫక్కున నవ్వించి నా రక్తపోటుని దింపి పుణ్యం కట్టుకున్నారు. ^:)^

  15. ఆంగ్లభాషాపరిజ్ఞానశూన్యుడు… అబ్భ… ఇంత ఘనమైన తెలుగు మాట విని ఎన్ని రోజులైందో 🙂

  16. gtoosphere గారూ,,ఇందుమౌళిగారూ, నెనరులు.

  17. ఇన్నాళ్ళు మీ బ్లాగు దర్శించలేక పోయినందులకు ఎంతో విచారిస్తూ….ఇంత దంపుడుని బహుచక్కగా దంచినందుకు ధన్యవాదాలు…

వ్యాఖ్యానించండి