Monthly Archives: జనవరి 2008

రైతు-సంక్రాంతి పురుషుడు -రాజకీయ నాయకుడు

ప్రతి సంక్రాంతి రైతుకి ఆశలు తెస్తుంది. సంక్రాంతి పురుషుడు కూడా రాజకీయ నాయకుడి లాంటి వాడె, సరిగ్గా పంట చేతికొచ్చే టైంకి వస్తాడు, పంట చేతికి రాకపోతే, నేనిప్పుడె వచ్చాను, తప్పంతా పాత పురుషుడిదే అంటాడు. పంట చేతికి వస్తే నేను దయామయుడిని కాబట్టి మీకు పంట చేతికొచ్చిందని పోజిస్తాడు. అహా ఇక నుంచి దమ్మప్రభువుల పాలన అని రైతు మళ్ళా మోసపోవటనికి పునరంకితమౌతాడు. చెబితే రైతు జీవితం కూడా ‘అరయంగా కర్ణుడీల్గె ఆర్గురిచేతన్’అన్నట్టే ఉంటుంది. సంక్రాంతి పురస్కరించుకొని , రైతులోకానికి మేలు జరగాలని కోరుకుంటూ::
భూమినిప్రభుతయే నామమాత్రమ్మిచ్చి
లాగికొందు ననెడి రాపు లేక
పెద్దలు బలవంత బెట్టగా పొలమును
చౌక గానమ్మెడి చావు లేక
రాత్రికి రాత్రియే రాజకీయముతోడ
రింగు రోడ్డు జనెడు బెంగ లేక
చీదరించి విదుల్చు చిల్లర డబ్బుకై
కోరి సంతు కడను క్షోభ పడక
మ్మన రాకయే, రావలదనవచ్చు
వాన గాలి జతల వ్యధలు లేక
నాయక,బ్రోకర,కిలీల వ్యాపార
ణ సర్ప కోటికి కంట పడక
వ్యయసాయమనకయు వ్యధ సాయమనకయు
వ్యవసాయమనియె వ్యవహరింప

త్మ తృప్తి కోరి, త్మవిశ్వాసము
తోడ, రైతు బ్రతుక దుక్కి దున్ని
సాధు భావ రార! సంక్రాంతి పురుషుడా
తేజ రిల్ల నవని తెలుగు రైతు!!!.

మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

తాంబూలం

“దళము” అంటే పార్టీ అనే అర్ధం కూడా ఉండటం చేత, కలికాలం లో, “నాగవల్లీ పార్టీ” అని పెట్టి శ్రీకృష్ణుడు మా పార్టీనే అంటారని భయపడ్డాడు కాని, లేకపొతే

మోకాళ్ల మీద నిలుచున్న అర్జనుడితో పార్ధసారధి, “దళములలో నాగవల్లీ దళమునునేనే” అనే వాడని నా ఘాఠ్ఠి అభిప్రాయం.
అసలు ఏమిటి ఈ నాగవల్లీ దళం, ఏమిటి దీని మహిమ.. ఇదిలేని గ్రామముందా? ఇదిలేని కార్యముందా, నిర్విఘ్నంగా ఏమి జరగాలనుకున్నా, ముందు ఓ వినాయకుడిని చేసి

పూజ చేస్తామే, ఆ వినాయకుడిని ప్రతిష్టించటానికి కూడా మనకు కావలసినది ఈ నాగవల్లీ దళం కదా..అంటే ముందు ఇంట్లో ఆకులు లేక పోతే, విఘ్నాధిపతి పూజించటానికేఅవాంతరం వచ్చేప్రమాదముందన్న మాట.

ఈ పత్రాలతో నా అనుబంధం నా ఊహ తెలియని నాటిది, “నీకు పళ్ళు రాక ముందే మీ నాయనమ్మ ఆకులు వక్కా సున్నం బాగా నూరి నీకు ఇచ్చేదిరా నువ్వు చప్పరించి మింగేవాడివి” అని మా అమ్మ అంటువుంటారు కాని, అది తప్పని, నేను నోట్లో తమలపాకులుతో పుట్టానని నా ఘాఠ్ఠి అభిప్రాయం.
ఆయ్యో, పొట్టకోసం బొంబాయ్ లోనూ, ఆనక ఆరకొర ట్రిప్పుల మీద అమెరికాలోను ఉన్నపుడు అంగలకుదురు ఆకులు దొరకక నోరు, ఆపైన ఆత్మారాముడు ఎంత అల్లాడారు, ఆకులు మేయలేక?
పెళ్లిలో “అయ్యో నీకు ఆకుల ఈనలుతీయటం రాదా” అని ఎవరో అడిగినందుకు పెళ్లికూతురు అవమానం గా ‘ఫీల్’ ఐతే, రాకపోవటం ఇంకా పెద్ద అవమానమని నేనెంత ‘ఫీల్’ అయ్యాను. ఐనా తమలపాకుల గురించి ఒకరు చెప్పాలిటండి. కాన్వెంటు చదువులొచ్చి చెడగొట్టాయి కాని, సుమతీ శతకం లో మేము చిన్నప్పుడే చదువుకున్నాం.

తమలము వేయని నోరును
విమతులతో జెలిమిజేని వెతఁబడు తెలివిన్
గమలములు లేని కొలకును
హిమధాముడులేని రాత్రి హీనము సుమతీ

అని. అందుకే నేను చాలా పుష్కరాలుగా తమలము వేస్తున్నాను. ఇంత సౌమ్యంగా చెబితే వింటారో వినరో అని ఆయనే కొంచం గొంతు మార్చి మరలా,

వీడెము సేయని నోరును
జేడెల యధరామృతంబు జేయని నోరున్
బాడంగరాని నోరును
బూడిదకిరువైన పాడుబొందర సుమతీ

ఇక్కడ మొదటి మూడు పాదాలలో చెప్పిన క్రియ ఏది చేసినా , ఆ నోరు నోరేగాని, నాలుగో పాదంలో చెప్పినది కాదు అని నా అభిప్రాయం. అందువల్ల వీడెము సేసిన నోటి వాడను కనుక మిగతా పాదాలలొ ఏముందొ పెద్దగా పట్టించుకోలేదు.. పట్టించుకుంటే వ్యక్తిగతంగానూ సామాజికంగాను కొన్ని సమస్యలొచ్చే ప్రమాదంలేకపోలేదు.

ఈ రెండిటినీ పక్కన పెడితే, తాంబూలం మీద అసలు సిసలు పద్యం పెద్దనగారు చెప్పాడు:

నిరుపహతి స్థలంబు, రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడె, మాత్మ కింపయిన భోజన, మూయల మంచ, మొప్పు త
ప్పరయు రసజ్ఞు, లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్,
దొరకిన కాక, యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే!

పద్య కవిత్వం కావాలంటే ఇవాన్నీ కావాల్సిందే అని చదువరి గారు అంటారు కాని, ఇవ్వన్నీ అవసరం లేదని ఒక్క తాంబూలం చాలని నేను తాంబులాం వేసుకున్నపుడు అసత్యం పలకని నా నోట నొక్కి వక్కాణించ దలుచుకున్నాను..

పద్యాన్నే చూడండి , మొదటి పాదంలో ఏకాంతం అంటూన్నాడు, మూడో పాదం లో తప్పొప్పులు చెప్పే రసజ్ఞులు, వ్రాయసగాడు, పాఠకులు కావలంటున్నాడు, మరి వారుంటే ఏకంతమెక్కడనుంచి వస్తుంది?
సరే వారిని కాసేపు పక్కన కూచోమందాం, ఇష్టమైన వంటకాలతో భోజనమన్నాడు, సరే అది పెడితే ఊయలమంచం కావాలంటున్నాడు, కడుపు నిండా తిని ఊయలమంచం ఎక్కితే ఎక్కడన్నా కవిత్వం వస్తుందా? చాలామందికి నిద్ర వస్తుంది, నాలాగా సుఖపడే రాత లేని వాళ్లకి వమనమొస్తుంది. కాబట్టి ఈ రెంటీనీ కూడా పక్కకు పెట్టాల్సిందే. ఐనా ఈ రోజుల్లో ఇరుకు ఫ్లాట్లలో మంచానికే చోటుండటంలేదు, ఇక ఊయలమంచాలెక్కడ తెస్తాం చెప్పండి.
ఇక మిగిలింది, “రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు కప్పుర విడెము”, పద్యం లో పట్టంతా ఇక్కడే ఉంది, ఇందులో చాల సూక్ష్మం కూడా ఉంది. ఇక్కడ ‘రమణీ ప్రియ దూతిక’, ‘కప్పురపు విడెము’ రెండు ముఖ్యమే, పక్కన అర్ధాంగి ఉంటే, పద్యకవిత్వం రాయటం కాదు కదా, ధారణ కూడ కష్టమే అని ఆచార్యులు బేతవోలు రామబ్రహ్మం గారు సభా ముఖం గా ప్రకటించారు. కాబట్టి ఆ విషయంలో , ఎటువంటి సందేహాలకి తావు లేదనే అనుకుంటున్నాను. అంటే, సతీమణి భోజనం పెట్టచ్చు కాని, ఊయల మంచం మీద ఉన్నమనకి కప్పురపు విడెమివ్వటానికి మటుకు ( పద్య కవిత్వం రావాలంటే) రమణీ ప్రియదూతిక కావల్సిందే నన్నమాట. ఇక్కడే ఉంది చిక్కంతా, మనం కాస్త మేను వాల్చి ఊయలమంచం మీద ఊగుతున్నామనుకోండి, ఈ దూతిక వచ్చిందని ఆ ఊపు ఆపాలా? ఆపితే మరి పద్యం ఊయలటూగు తూగుతో వస్తుందా?, లేక అందులో కూడ విరామచిహ్నాలు కనిపిస్తాయా? కన్పించవచ్చు.. నిజానికి మనం కవిత్వం మీద మోజుతోనే ఈ రమణీ ప్రియ దూతిక ని ఏర్పాటుచేసుకుంటే ( సాఫ్ట్ ‘వేరు’ పెరిగి పెద్ద వృక్షమైన తరువాత భాగ్యనగరం లో చాల మంది, ‘పని మనిషి’ని పెట్టుకొనే శక్తి లేక తమ అర్ధాంగుల చేత గొడ్డు చాకరీ చేయిస్తున్నారు, అది వేరే విషయమనుకొండి) మరి మనం ఊయల నడకంత అందమైన పద్యం చెప్పేటప్పుడు మధ్యలో తాంబూలం తెచ్చినది, దూతికా కాదా అని చుస్తామా? దూతికైతే, అయ్యో వామహస్తంతో తీసుకుంటే నొచ్చుకూంటుందేమో అని, ఘంటం పక్కన బెట్టి, కుడిచేత్తో తీసుకుంటామా, నే తీసుకుంటే నా గోరు గుచ్చుకుంటే ఆ పూబోడికి గాయమౌతుందేమో అని అనుకుంటామా, ఒక వేళ దూతికే వుంటే ఇవ్వన్నీ అలోచించాలి, ఇవన్నీ అలోచిస్తుంటే కచ్చితంగా సగటు కవికి కవిత్వం రాదు, ( ఆశువుగా పద్యాలు కట్టే అల్లసానికి వారిని పక్కన పెడదాం). పైగా అల్లసాని వారు ఆస్థాన కవి, రాజు గారు భత్యమిస్తారు కాబట్టి కప్పుర విడెమిచ్చే రమణీ ప్రియదూతిక చిక్కుతుంది, కాబట్టి ఆవిడ ఇస్తే బాగుంటుంది అన్నాడు, ఈ ఆకులు చీల్చటం ఇత్యాది శ్రమ ఆయనకు లేకుండ. అంటే ఏమిటి తేలింది, కవిత్వం పుట్టటానికి కావల్సింది కప్పురపు విడెమనేగా.
ఇక్కడ అల్లసాని పెద్దనగారు తన గడుసు దనాన్ని చూపించారు, కవిత్వానికి కావాల్సిన కప్పురవు విడియాన్ని ఒక రెండు ముక్కల్లో పెట్టి మిగతా అంతా వాతావరణాం గురించి చెప్పారు ఆ విడెపు ముచ్చట తప్పించి. ఎందుచేత అని అడిగితే, సూక్ష్మంగా రాకేశ్వరగారు చెప్పినట్టు చెప్పాలంటే , ‘ వ్యాపార రహస్యం’.
ఒక వేళ ఆ తాంబూలం కట్టే పద్ధతే చెబితే ఎంత పాలు సున్నమెయ్యాలి, ఎంత పోక వెయ్యాలి, ఎంత జాపత్రి వేయాలి, ఎంత యాలాలవంగాలు వేయాలి, ఎంత కస్తూరి వెయ్యాలీ,ఇన్నీ వేసినా కూడ , దానిని ‘కప్పురవు విడెము’ అనే పిలవాలంటే అసలు ఎంత కర్పూరం వెయ్యాలి.. ఇవన్నీ దాచిపెట్టటానికి, మిగతా వస్తువులను వాటి అవసరం లేకున్నా ప్రవేశపెట్టాడు అని నా ఘాఠ్ఠి అభిప్రాయం.

ఇందువల్ల ఏమిటి ప్రయోజనం,
౧. ఒక వేళ నేనూ నికార్సు పద్యకవిత్వం రాస్తాను అని బయలు దేరిన వాడికికెవ్వడికి, ఈ సరంజామా అంతా ఒక చోట దొరకదు, కాబట్టి పద్యకవిత్వం మొదలు పెట్టే సూచనే లేదు. ఒక వేళ ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకూంటు వెళ్తే, రసజ్ఞు లకు మధ్య వాదనలు రావచ్చు, రసజ్ఞులకి ఈయనికి మాటామాటా రావచ్చు, నీ ఇత్యర్ధం పులుసు, ఇతి భావం కూరాకి మళ్ళీ ప్రియ దూతిక కూడనా అని అనుకూలవతి ఐన భార్య అభ్యంతరం పెట్టచ్చు (మేఘసందేశం సినిమా లో జయసుధంత విశాల హృదయమున్న మహిళైతే తప్ప), ఆ మహ తల్లి అడ్డు చెప్పకపోయినా, ఔరా ఈ కవిత్వం అంతా నావల్ల పుడుతుంటే నాది కేవలం ‘దూతిక’ హోదానా అని ఆ దూతికకే దుర్బుద్ధి పుట్టచ్చు, లేదు, ఈ ఋషి ( నానృషిః కురుతే కావ్యం అన్నారు కదా) కళ్ళకి ఆవిడ విశ్వామిత్రుడి కళ్ళకి మేనక లాగ కనపడచ్చు. ఇన్ని ఆటంకాలు దాటుకొని పద్యకవిత్వం ఎవరు రాస్తారు? అందుకే పెద్దన గారు అన్నిటినీ ఈ పద్యం లో పెట్టి మాయ చేశారు.

౨. ఒక వేళ ఆయన ఆ తాంబూలం కట్టే సూత్రమే చెప్పి ఉంటే , ఇప్పుడు కిళ్ళీ కొట్ల దగ్గరక మనికి “వృత్త పద్య కిళ్ళీ”, “జాతి పద్య కిళ్ళీ”, “మాత్ర చందస్సు కిళ్ళీ”, ఇత్యాదులు దొరికేవి, అదే కిళ్ళీకోట్లో సాహిత్యం కూడ బొత్తాలు బొత్తాలు గా దొరికేది, మనిషి కిళ్ళీ కొనుక్కొని, కిళ్ళీ నీ రోడ్డు మీద, కవిత్వాన్ని కాగితం మీద పరివ్యాప్తి జేస్తే ,ఆ కాగితాన్ని కొట్టు వాడు తర్వాత కిళ్ళికి వాడితే, .. ఇలా ఈ చక్రం నిరంతరం సాగి కిళ్ళీ కొట్టు వాళ్ళు, కాగితాల కొట్టు వాళ్లు బాగు పడేవారు కాని సృష్టికి అంతరాయం కలిగేది ,అందువల్ల పెద్దనగారు ముందుచూపుతో ఆ కిటుకు చెప్పలేదని నా ఉద్దేశ్యం.

ఆయన చెప్పకపోతే మేము కనుక్కోలేమా, అయన కన్నా గొప్పగా పద్య కవిత్వం రాయలేమా అని కొంత మంది సిద్ధమౌతారని ఆయని కూడ తెలుసు అందుకని .. మనుచరిత్ర లో ..
మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసారసాంద్ర వీటీగంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలపు దెలుపునొక్క మారుత మొలసెన్

ఆన్నారు. అంటే ఏమిటి నా ప్రవరుడు తాంబూలం లో వేసిన కస్తూరిని బట్టి అక్కడ ఉన్నది స్త్రీ నో పురుషుడో తెలుసుకున్నాడర్రా అన్నాడు, అంటే ఏమిటి, తాంబులాం లో వేసే కస్తూరీ , కర్పూరం పాళ్లు ఆడవాళ్లకి, మగ వాళ్లకి వేరు వేరు రా నాయనలారా అని చెప్పాడు. నేను చెప్పాల్సింది చెప్పాను, మీరు ఇంకా ప్రయోగాలు చేస్తామంటే చేసుకోండి అన్నాడు.

అదృష్టం ఏంటంటే అప్పటినుంచి జనులు (పద్య కవిత్వం కోసం) తాంబూలం మీద ప్రయోగాలు చేయటం మానేశారు. దురదృష్టం ఏంటంటే అప్పటినుంచి జనులు పద్య కవిత్వం మీద ప్రయోగాలు చేసి తాము కవులమని నిరూపించుకునే ప్రయత్నాలు ఉధృతం చేశారు.

అది అలా ఉంచితే, ఇప్పటి వరకు మనం చూసిన ‘తాంబూలప్పద్యాల్లో’ మిగతావాటి లాగానే కవిత్వం పాలు ఎక్కువా నిజం పాళ్లు తక్కువా అనిపిస్తోంది కదా. అందుకే ఈ పద్యాలన్నిటి కన్నా కూడా నాకు తమలపాకుల మీద క్రింది శ్లోకం ఇష్టం. ఇందులో కవిత్వం ( లేదా కవిసమయం )లేదని కాదు, కాకపోతే మూడు పాళ్లు ‘నిజం’.

కూపోదకం వటచ్ఛాయ,
తాంబూలం
వనితాతరుణీకుచం
శీతాకాలె భవే త్యుష్ణం,
ఉష్ణకాలే న శీతలం

కదా?

మిగతా టపాల లానే, ఇది కూడా తోచక రాసిన టపాయే కాని, ఎవరనీ నిందించటానికి, కించపరచటానికి కాదని, ఏ కవిని చూసినా ( నాకు రాయటం రాదని అసూయ ఉన్నా) గౌరవమే కాని మరి ఏ ఇతర భావమూ లేదని సవినయంగా మనవి చేసుకుంటూ శెలవు తీసుకుంటున్నాను.

స్వస్తి.

పేర్లూ పిలుపులూ…

క్రియేటివిటి పుంతలు తొక్కి జనులు వాళ్ల పిల్లలకి పెడుతున్న కొత్తపేర్లని గూర్చి మాట్లాడను గానీయండి..మనకు చాలా పరిచయమైన పేర్లు, వాటిని మనం ఓ పిలుపుతో మార్చివేశే విధానం చెబుతాను..

అత్యంత వక్రతకు గురి అయ్యేపేరుగా మధుసూదన (రావు/రెడ్డి/శర్మ మొ||) చెప్పుకోవాలి..
మధుసూదనుడు అంటే మధు అనే రాక్షసుడిని చంపినవాడు. అనగా ఎవడు.. ఎవడైతే మనకేమిటిలెండి.. మనమేంచేస్తాం.. మధూ అని కాస్త బద్దకంగా కాస్త ముద్దుగా పిలుస్తాం.. అంటే దేవుడిని రాక్షసుడిని చేశేశాం గా ఒక పిలుపులో..
అసలు దేవుడి పేరు పెట్టుకొనేదే, పిలిచినప్పుడన్నా దైవనామస్మరణ చేసుకోవచ్చు లే అని..పూర్వకాలం లో .. జనులు దేవుల పేర్లు లేదా గౌరవ సూచకం గా తల్లి తండ్రుల పేర్లు పేట్టుకునేవాళ్లు..కొంత కాలానికి .. అగౌరవసూచకంగా పెట్టుకోవటం మొదలు పెట్టారు. ఇంకొంత కాలానికి, అసలు పిల్లాడు ఎప్పుడు పుడతాడా, ఎప్పుడు నాన్నపేరు పెట్టి, వాడి వంకతో నాన్నని తిడదామా అన్నట్టు తయారయ్యారు..
ఇంకొంత కాలాని ఆంధ్రనాట కొడుకులు కోడళ్లు ఈ డొంకతిరిగుడేమిటని అమ్మానాన్నలనీ, అత్తామామాలని నేరుగానే తిట్టటం మొదలు పెట్టారు.. అప్పటినుంచి, తెలుగు నేల మీద భాషావ్యాకరణ శృంఖలాలను తెంచుకొని “సురేష్” “సతీష్” “ప్రకాష్” లు పుట్టటం మొదలు పెట్టారు.

సరే, ఈ మధుసూదనాఖ్యుల తరువాత, పిలుపుల బాధితులుగా చెప్పుకోవాల్సింది పార్ధ సారధుల గురించి, పార్ధ సారధి అంటే, పార్ధుడి ( రధము)ని నడిపినవాడు, కృష్ణుడు.. మనమేంచేస్తాం, బావమరిది తో పోయే దానికి, ఆ బావగారెందుకని “పార్ధా” అంటాం.. ప్రపంచాన్కి దారిచూపించేవాడిని పట్టుకొని, సోదరులు,బంధువులు కనపడగానే బిక్కమొహం వేసేవాడిని చేశేశాం గదా ఒక పిలుపులో.
ఇక మధుసూదనులు, పార్ధసారధుల తరువాతి బాధితులు చంద్రశేఖరులు, చంద్రశేఖరుడంటే శివుడుట, మనకేమో చంద్రా అంటానికి కుడా నోరురాదాయే, చందూ అని అంటాం.. అంటే చంద్రుడు అని అనుకోమని.. నిర్వికారుడిని పట్టుకొని ఓ పక్షం ఉబ్బిపోయేవాడ్ని , ఓ పక్షం చిక్కిపోయేవాడ్ని చేశేశాం గదా ఒక పిలుపులో.

మళ్లీ శివుడి విషయం లొనే, గౌరీనాధులను, ఉమాకంతులని “గౌరీ”, “ఉమా”అని పిలుస్తాం.. అర్ధనారీశ్వరుడి లో మనకు కావాల్సిన అర్ధాన్ని తీసుకొని…

ఇక్కడ ఆలుమొగల భేదాన్ని మర్చిపోతే – తండ్రీ కొడుకుల వ్యత్యాసాన్ని మర్చిపోయేది, అందరు “కుమార్”ల విషయం లోను.. “కుమార్”, కేవలం అలంకారప్రాయెమే అని .. రవి కుమార్‍ లని రవి అని, శశి కుమార్‍ లని శశి అని, కిరణ్ కుమార్‍ లని కిరణ్ అని పిలుస్తాం.

మన బద్దకానికి పరాకాష్ట బాలసుబ్రహ్మణ్యాలని శ్రీనివాసులని ఇరుకున పెట్టటం, వాళ్ల ఇష్టాయిష్టాలతో పని లేకుండా ‘బాలూ’అంటాం, సీనూ అంటాం, లేదా వాసూ అంటాం .. అంటే ఏమిటీ అని అడక్కండేం.
ఇప్పటి వరకు ‘చిన్నబుచ్చిన’ పిలుపులనే చూశాం కదా.. అలానే పెద్దరికం ఆపాదించే పిలుపులు కూడా కొన్నున్నాయి . రవి కిరణ్, శశి కిరణ్ లని రవి శశి అని పిలవటం ఒకటి. అలాగే భగవాన్ దాసులని రామదాసులని , భగవాన్, రామూ, అనిపిలవడం ఇంకోటి.

ఇలా చెప్పుకూంటూంటే ఇది ఎడతెగదు.
నేను బ్లాగులో పెట్టుకున్నట్టు అభావప్పేర్లు పెట్టుకుంటె పర్లేదు కాని, లేదంటే మనం కచ్చితం గా శివుణ్ణి పాము లాగా చూస్తున్నామనే (ఫణి భూషణ్ )నా అభిప్రాయం..

ఇది వ్యక్తిగతము కాదూ సాంఘికమనిన్నూ, ఎవరినీ నొప్పించటానికో, కించ పరచటానికో రాసింది కాదని సవినయంగా మనవి చేసుకుంటూ, ఇలా ఓ పిలుపుతో మీరెంతమందిని ఎన్నెన్ని రకాలుగా మార్చేస్తున్నారో గమనించమని అభ్యరిస్తూ..

శెలవు తీసుకుంటున్నాను.