Tag Archives: శివరాత్రి

నేర్పవయ్య నాకు సర్ప భూష! ౧౦

ఘస్రమందునకొంత ఘనదేవకోటి పాదార్చనల్ సేయగా హరణ మగును
వాసరమున కొంత ప్రమధగణంబుకు నెమ్మది కలిగించి నిలుపఁ జనును
దినమునందున కొంత దిక్పాలక సమితి దీరుఁగనుచు చక్కదిద్ద తఱుగు
మారేడు పత్రమో మంచినీరో నీకు నిడువారిఁ బ్రోవగా నింత గడచు

ఇన్ని పనుల మధ్య హేలగా నర్తింప
సమయమెట్లు దొఱకు సంధ్య వేళ?
నచ్చు పనికి ఘడియ వెచ్చింపగానెట్లొ
నేర్పవయ్య నాకు నృత్యతృప్త!

నేర్పవయ్య నాకు సర్ప భూష! ౫

హొయలగంగానదీ హోరు నిత్యము నీకు
దూరదర్శనమిడు హోరు నాకు

వామభాగమునంటి పార్వతీసతి నీకు
మాటిమాటికిఁ బిల్చు బోటి నాకు

పాదాశ్రితామరపరివారములు నీకు
క్షణము వీడని యధికారి నాకు

మెడలోన బుసలిడు తొడవరయఁగ నీకు
కొండెముల్ వినుటకు దండ నాకు

వేయి కలుగ నైన విఘ్నముల్ చెదరక
మొక్కవోని దీక్ష చక్క వెట్టు
టెటులొ విధిశతంబు నింటిచెంతనిలచి
నేర్పవయ్య నాకు నిశ్చలుండ!

నేర్పవయ్య నాకు సర్ప భూష! ౯

కాషాయమున్ గట్టి కర్తవ్యము మరచి
వ్యర్ధవాదమ్ములఁ బరగు వాని

ధార్మికేతరజనతాపరిష్వంగసు
ఖాసక్తుడైన సన్న్యాసి నొకని


దైవకైంకర్యముల్ దండిగానగుచోట
పాలకాధముఁగూర్చి పాడువాని


బాతృ,సమైక్యభావనలు భక్తతతికి
బోధించి వర్జించు పూజ్య గురుని

గాంచిన తరుణంబుఁ గలికాల మిద్దని
చూచి చూడనటుల సైచ వలెనొ
గళము విప్పవలెనొ, కలముఁ బట్టవలెనో
నేర్పవయ్య నాకు సర్ప భూష!

నేర్పవయ్య నాకు సర్పభూష! – ౮

సంధివిసంధుల సముచితత్వము బుధవరులు చర్చ సలుపవచ్చు గాక
దుష్టసమాసముల్ దొరల శిష్టుడొకరుఁడెచ్చరించియె యుండవచ్చు గాక
శయ్యలేదనుచును నయ్యవారొక్కరు వంకఁబెట్టినఁ బెట్టవచ్చు గాక
ధారలేదని కవిదంతి యొకఁడు భువి వాదు లేపిన లేపవచ్చు గాక
ఇట్టె చూచి కృతిని హితముఁగనక “కాదు
యిది కవిత్వ” మన నరేంద్ర సభను
వాని నిగ్రహించి వాదు నెగ్గుటెటులో
నేర్పవయ్య నాకు నిటలనేత్ర!

నేర్పవయ్య నాకు సర్పభూష! – ౭

ప్రభలీనుచుండెడి పట్టుపీతాంబరములు ధరియించగఁ బోర కుండ
మీరు దాల్చెడి నగ లేరికి లేవని గొప్ప బోదు ననుచు దెప్ప కుండ
పక్షిగూటికి సరి పరగు మీజుట్టని వ్యంగపు మాటల నాడకుండ
నల్లనిమచ్చయె వెల్లబారుటకును మందుగొన వనుచు నిందనిడక
మగని లోఁగలట్టి మంచిని జూచుచు
సంతసమ్ముగాను సతము గడుప
నిజసతికిని ధరణి నేర్పుటెటులగునో
నేర్పవయ్య నాకు నీలకంఠ!

నేర్పవయ్య నాకు సర్పభూష! – ౬

సీ||
సర్పభూషణుఁడీవె? స్వర్ణభూషణుఁడంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
గజచర్మ ధారివే? కనకవసనుఁడంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
వల్లకాడు నీయిల్లె? వైకుంఠమట యిల్లు శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
విషమేక్షణుండవీవె? సమేక్షణుండంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
గరళకంఠుడవీవె? కౌస్తుభధరుడంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
దాల్తువె బూదినె? దాల్చఁట గంధమే శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
గంగిరెద్దు రధమె? గరుడవాహనుఁడంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
శ్వశుర వైరివె? యుంట శ్వశురగృహమునంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి

ఆ||
సిరియు సంపదలును స్థితియు సకలభోగ
భాగ్యములును వస్తు వాహనాదు
లెన్నొ గల హితుఁ గన నీర్ష్య నొందకయుంట
నేర్పవయ్య నాకు నీలకంఠ!