మా కందాలు – మాకందాలు

ఇప్పటి వరకూ మాకందాలకే ఋతువుంటుండనుకునేవాడిని గానీ, కందాలకి కూడ ఋతువుంటుందని మాంఛి రాజీకయపునెలలో చదువరి గారు కందపద్యాల టపా వత్తితేనూ, అందులో కామేశ్వరరావు గారి వ్యాఖ్య చూస్తేనూ తెలిసింది. మా అయ్యవారిని అడిగితే అబ్బే, ఆ ఋతువు రావడానికి ఇంకా సమయం ఉందే అన్నారు గాని, తొందరపడి ఓ కవి కోయిల ముందే కూసింది అని బ్లాగులు చూసిన నాకు అర్ధమైపోయింది.
ఈ కోయిల కూతలు అంటు వ్యాధులు అవ్వటం చేత, అవి తొందరగా నలుబ్లాగులకి వ్యాపించాయి.
పైగా, ఇంతకుముందు కందం ముట్టని గిరి గారి చేత కూయిస్తే , అలానే మరి కొంత మంది కొత్త కోయిలలు కూడ గొంతు కలిపాయి..
సరే ఇదుగో నా వంతూ అందామని, గొంతు కలుపుదామని మా బాస్ చేత ఎంత తన్నించుకున్న ఓ కందమన్నా రాలితే నా? ( ఇప్పుడు తెలిపోయిందా నే ముద్దు కుర్రణ్ని కానని 🙂 )
పోనీ మెదలకుండా కూర్చుందామంటే,కందబలంగలవారే కవులోయ్ అని ప్రచారం చేస్తుంటిరి.. పంది కొట్టలేవని ముందే తెలుసు అంటుంటిరి.
మరి ఏమి చేయాలీ? ఏమి చేయాలేమిటండి అది కూడ తెలియదా? ఈ వేసవి లో మావిడి పళ్లు తినలేకపోతే, ఏంచేస్తాం, క్రితం వేసవిలో, ఆ సీనుగాడు చిత్తూరునుంచి బుట్టేసుకొచ్చాడురా, అప్పుడు తిన్నాం చూడు ,ఇంకో మూడేళ్లదాక మామిడి కాయ తినగూడదు అన్నంత మొహం మొత్తిందనుకో .. అంటామా? నేను అదే చేశాను ….
ఇంతకు ముందు కందాలన్నీ ఏరుకొచ్చి పేర్చాను చూడండి..
అవునయ్యా, ఎవరో కందాలు రాస్తుంటే, నీకెందుకయ్యా దురదా అంటారా?
ఆ పేరింటే నాకు తెలియకుండానే దురదొచ్చేస్తుంది. అసలు , నే బ్లాగులో అడుగెట్టింది, కంద సమస్యతోటే..

1. దంచెద ఊక… (ఆగష్టు 6, 2007 )

దంచెద ఊకనిటనహో
దంచెద కుడియెడమల మరి దంచుట సరదా
దంచిన కాలహరణమట
దంచెద వేరొండు పనినె దలుపగ నేలా?

చెబితే మీరు నమ్మక పోవచ్చుగాని, ఈ పద్యానికి మొదట మూడో పాదం పుట్టింది.

2. పేరు పెట్టెద…
రాజీ పడకయె పెట్టెద
రాజీవ్ నామము విరివిగ రాష్ట్రము నిండా
మాజీ ప్రభుత పధకముల
ఈజీగా పేరు మార్చి; ఇకమన కెదురే?

3. చిత్ర పుత్రోత్సాహము
ఇందులో ఏకంగా ఐదు పద్యాలున్నాయి. వ్యాఖ్యల్లో చదువరి గారి పద్యం చూడండి, చిన్న కందపద్యం లో ఓ శ్లేష, ఓ జాతీయం ఎలా వేయచ్చో తెలుస్తుంది.

4. నెనర్లు (అక్టోబర్ 17, 2007 )
రంపపు కోతల ఆంగ్లమె?
ఇంపగు మాటలు తెలుగున ఇన్నుండనుచున్
సొంపుగ నెనరిడె; నెనరులు
గంపెడనంగ కలగూరగంప గురువుకున్!

పై పద్యం చూసి కొత్తపాళీ గారు నాల్గొ పాదం బావుందోయ్ అన్నారు. పై మూడు పాదాలకి “రాజుగారి పెద్దభార్యాలంకారం” వర్తించదని మీకు నేను చెప్పనవసరం లేదనుకోండి. ఈ “రాజుగారి పెద్దభార్యాలంకార” నికి కూడ ఓ శాస్త్రీయ నామముంది, ఆలంకారికులెవరూ చెప్పకపోతే ఒ రెండ్రోజులాగి నేనే చెబుతా.

5. వందన శతముల్ (అక్టోబర్ 17, 2007)
వాగ్దేవికి వినయముగను
వాగ్దేవీవల్లభునకు వాని సములకున్
వాగ్దేవీసమనేత్రుల,
వాగ్దేవీవరసుతులకు వందన శతముల్!

6. పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్! ( అక్టోబర్ 19, 2007)
అనుమానింపగ ధర్మమె
ఘనమౌ తపమాచరింప కల్గెడి శక్తిన్?
మునిమంత్రములుత్తాటక?
తనయుడు కర్ణుడు కలుగుట తధ్యము కుంతీ!

మునివరమునుశంకింతువె
పనిగట్టుకొనిటులకుంతి? బలివైతివిగా
క్షణమున విధివింతాటకి!
తనయుడు కర్ణుడు కలడన ధరకన్నియకున్!
ఈ టపా ప్రత్యేకతేమిటంటే, శీర్షిక ఓ కందపద్యపాదం కావడం, దానినందుకొని మిత్రులు బ్లాగేశ్వరులు పద్యం చెప్పటం.
8. సిగ్గేల?నవంబరు 19, 2007

హగ్గే హాటౌ చిట్కా
రగ్గేలశిశిరపురాత్రి రమణియె బ్రోవన్
దగ్గేలదగ్గరౌమన
సిగ్గేలసిసలుమగనికి సిరిసిరి మువ్వా?

ఈ పద్యం ప్రత్యేకతేమిటంటే, అసలు పద్యం తెలీకుండా పేరడి రాసేశాననుకోవడం 😦 . తర్వాత దొరకబుచ్చుకున్న అసలు ఇదీ :
ఉగ్గేల తాగుబోతుకు
ముగ్గేలాతాజమహలు మునువాకిటనన్
విగ్గేల కృష్ణశాస్త్రికి
సిగ్గేలభావకవికి సిరిసిరిమువ్వా!

దీనితో కందల సీజనైపోయింది.
ఏంటి, పాత కందాలు చూపించి చేతులుదులిపేసుకుంటే ఎలా అంటారా?
ఎంత ఎలిగెన్సు త్యాగం జేసినా, కందానికీ కాస్త ఖర్చౌతుంది, అదంతా ఎవడు పెట్టుకుంటాడు చెప్పండి…
అందుకని
కలదే తాంబూలము, తే
వలెదే ప్రియదూతికయది వయ్యారముగన్,
కలరే పాఠక శ్రేష్టులు,
బలురుచులగలుగునెవిందు, పద్యమ్మడగన్?

3 responses to “మా కందాలు – మాకందాలు

  1. ముందే కూసిన నేమీ
    అందపు బ్లాగరి వడివడి పందెపు కోడై
    వందల కొలదీ విరిసెను
    కందపు పద్యాల పూలు కందువ తోడన్

  2. అబ్బ కందవర్షం కురిసిందే, ఇన్ని కందాలు ఒక్కసారే చూసేసరికి ఉక్కిరిబిక్కిరై నోటెంట ఒక్క కందం కూడా రాలేదు 🙂

  3. మొదటికదం మూడు,నాలుగు పాదాలను పలుకుతూవుంటే “(నే) పలికిన భవహరమగునట
    పలికెద, వేఱొండు గాథ పలుకగనేలా”
    గుర్తొచ్చింది. 🙂

వ్యాఖ్యానించండి