మూడు పాటలు

ఆయన పేరుకు ముందు ఎవరూ శ్రీ పెట్టరు,సామాన్యంగా పేరు తరువాత ఎవరూ గారూ పెట్టరు, ఆయన పుట్టిన వంశం అట్లాంటిది, ఆయనకు పెట్టిన పేరు అట్లాంటిదే. ఎవరు ఎన్ని పిలిచినా ఆయన మాత్రం నేను “శ్రీశ్రీ” అన్నాడు. ఆయన శ్రీయుగం, శ్రీయుతం, శ్రీకరం, కొత్త యుగానికి శ్రీకారం.
శ్రీ కి నానార్ధాలున్నాయిట, సంపద నుంచీ విషం దాకా, అన్ని అర్ధాలను, తనలోనూ, తన కవిత్వం లోనూ ఇమిడ్చుకున్న యుగకవి శ్రీశ్రీ.
బహుశః నేను మొదటి సారి గా శ్రీ శ్రీ పేరు విన్నది , వాగ్దానం లోని ఈ హరి కధ రేడియో లో వచ్చినపుడనుకుంటా:
అప్పటికే శ్రీశ్రీ అస్తమించి ఉండవచ్చు.

ఎంతసొగసు కాడే ,
నా మనసింతలోనెదోచినాడే
మోము కలువరేడే
నా నోముఫలము వీడే…

ఆ పదబంధాల కూర్పు (అందులోని చమత్కారాలు ( చిత్తం సిద్ధం, ఇది నా ఆరాధ్యదైవమైన పరమేశ్వరుని చాపము దీనిని …) నాచిన్ని మనసుకు ఎదో గమ్మత్తుగా.. ఎదో ఆశ్చర్యంగా అనిపించి ఈ పాటని నా చేత చిన్నపుడే బట్టీపట్టించింది ( తరువాత అన్నీంట్ లానే దీన్ని మరిచి పోయాను లెండి).
దరిమిలా ఆయనో విప్లవకవి అని తెలుసుకున్నాను కాని, శ్రీశ్రీ రచనలు పెద్దగా చదివినది లేదనే చెప్పాలి.
మహాప్రస్థానం చదివేటప్పుడు, ఆయనలోని బహుముఖీనత కాస్త అవగతమైనది…
పాపం, పుణ్యం, ప్రపంచమార్గం–
కష్టం, సౌఖ్యం, శ్లేషార్ధాలు
ఏమీ ఎరుగని పువ్వుల్లారా
ఐదారేడుల పాపల్లారా!

మెరుపు మెరిస్తే వాన కురిస్తే
ఆకసమున హరివిల్లు విరిస్తే
అది మీకే అని ఆనందించే
కూనల్లారా!

బాల్యాన్ని ఇంత అందంగా వర్ణించింది ఈ విప్లవకవే…

ఏమీటి ఎదో ఆలోచిస్తున్నారు, మీలో మీరే మధనపడుతున్నారని శ్రీమతి అడిగిన ప్రతిసారీ:
ఎగిరించకు లోహవిహంగాలను!
కదిలించకు సుప్తభుజంగాలను!
ఉండనీ,
మస్తిష్కకులాయంలో!
మనోవల్మీకంలో!

అని అనాలపిస్తుంది..
శ్రీశ్రీ డబ్బు విషయం లో తెలీదు గాని, మాటల పొదుపరి అనుకుంటా…
ఏకాక్షర శీర్షికతో, ప్రపంచపోకడిని ఆరు పంక్తుల్లో ఎండబెట్టినవిధం చూడండి:

నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు

నెత్తురు కక్కుకుంటూ
నేలకు నేరాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే…

అటు బాలల నుంచీ ఇటు వృద్ధాప్యం వరకూ ( భిక్షూ వర్షీయసి), అటు చంధోబద్ధ పద్యకావ్యం నుంచీ ఇటు వచనకవిత్వం వరకూ, అన్నీంటీనీ తను సుసంపన్నం చేశారు, శ్రీమయం చేశారు. శ్రీశ్రీ రాసిన మిగతా రచనల్లనీ వస్తు పరంగా ఎంత విస్తృతమో, సిరిసిరిమువ్వ శతకమూ అంతే విస్తృతం.
ఇన్నిచేసినా ఇన్నిరాసినా ఈ నూతిలో కప్పకి శ్రీశ్రీ సినీ కవిలానే కనిపిస్తాడు, వినిపిస్తాడు..
చలం “ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధా, క్రిష్ణశాస్రి బాధ ప్రపంచం బాధా” అంటాడు..,
చిత్రంగా నేను అమితంగా ఇష్టపడే శ్రీశ్రీ పాటలలో ఒకటి ప్రపంచం బాధ, ఒక క్రిష్ణశాస్త్రి బాధ…

ఈ పాటలు, ఎన్ని సార్లు ఎన్ని సందర్భాలలో, విచారంలో, విస్మృతిలో, నైరాశ్యంలో, నిర్వేదంలో నా పెదాలపై నాట్యం చేశాయో…

“పయనించే ఓ చిలుకా ఎగిరిపో … పాడైపోయను గూడూ…
….
పుల్లాపుడకా ముక్క కరచీ గూడును కట్టితివోయీ…

నా అనుకున్నావాడు ఆఖరి నిముషంలో జారుకున్నపుడు, అంతా ఐపోయింది ఇక ఫలితం అందుకోవటమే అనుకున్న ప్రాజెక్టులు నేలమట్టమైనప్పుడు, తండ్రికి అన్నం పెట్టని కొడుకుల కధ విన్నపుడు.. ఎన్ని సార్లో.. ఎన్ని సందర్భాలో…


రాదోయీ సిరి నీ వెనువెంటా.. త్యాగమే నీచేదోడూ …”

ఇక రెండవ పాట,

ఆశలు తీరని ఆవేశములో,
ఆశయాలలో, ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతంలో
తోడకరుండిన ….
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు..
నీకోసమె కన్నీరు నించుటకు…
నేనున్నాని నిండుగ పలికే తోడకరుండిన ….

ఒక మగవాడికి తోడు అవసరం మీద ఇంతకు మించిన పాట లేదంటే అతిశయోక్తి కాదేమో…

తెలుగు పాటకు మొదటి సారిగా జాతీయస్థాయి అవార్డు తెచ్చింది శ్రీశ్రీ రాసిన “తెలుగు వీర లేవరా”.. అనుకుంటా…
అందులో వ్యాకరణదోషం ఉంది అని ( రికార్డింగ్ ఐన తరువాత) పట్టుకొని, “సింహాలై గర్జించాలి బదులు సింహంలా గర్జించాలీ” అని ఉండాలనిచెప్పింది వ్యాకరణ శృంఖలాలు తెంపుతానన్న ఈ విప్లవకవే.

ఒకానొక సమయం లో శ్రీశ్రీ విశాఖపట్టణం నుంచీ లోకసభకు పోటీ చేద్దామనుకున్నారుట. రాజాకీయాల మీద కొన్ని పార్టీల మీద వారికి స్థిరాభిప్రాయాలు ఉండే వనుకుంటా, ఈ పద్యాలు చూడండి:

చీకటి బజారులో (వే
ళాకోళం కాదు) లక్షలకొలందిగమ
స్కాకొట్టినవాళ్లంతా
శ్రీకాంగ్రెస్ వాదులౌర! సిరిసిరి మువ్వా!

కోట్లకొలది ప్రజలను, చీ
కట్లోపలవదిలి నేటి కాంగ్రెసు రాజ్యం
కాట్లాటల పోట్లాటల
చీట్లాటగ మారిపోయె సిరిసిరి మువ్వా!

ఇన్ని రసాలు పండించిన శ్రీశ్రీ దగ్గర సమయస్పూర్తి, సద్యస్పూర్తి పుష్కలం..

ఓ మారు ఓ విలేకరి ఆరుద్ర మీ శిష్యరత్నమేగా అంటే .. శిష్యుడంటే ఆయనూరుకోడు, రత్నమంటే నేనొప్పుకోను అన్నారుట.
మరో మారు, పిచ్చిరెడ్డి అనే విలేకరి అందరూ మహాప్రస్థానానికి మీ కవిత్వం కన్నా, చలం ముందుమాట వల్ల “ఖ్యాతి లభించిందంటున్నారు, మరి మీరే మంటారు” అని అడిగితే, శ్రీ శ్రీ జవాబు:
“మీరు సార్ధకనామధేయులంటాను”

ఇదంతా సరే, నీవు కొత్తగా చెప్పవచ్చేది ఏమిటయ్యా అంటారా.. ఏమీ లేదు…
శ్రీ శ్రీ మాటల్లోన్నే….

ఇదివరకెవడో అనే వుంటాడు
బహుశా ఆ అన్నదేదో నాకన్నా
బాగానే అని వుండొచ్చు.
అలాంటప్పుడు మళ్ళీ
కలం కాగితం మీద పెట్టి
కళంకంలేని తెల్లదనాన్ని

ఖరాబు చెయ్యడ మెందుకంటే …
ఆయన పుట్టిన రోజున స్మరించుకోవటమంతే.
వీలైతే ఈ లంకెలు కూడా నొక్కండి మరి.
1) పయనించే… పూర్తి సాహిత్యం.
2)వికీపిడియా లో శ్రీ శ్రీ రచనలు ,
3) వికీపిడియా లో శ్రీ శ్రీ (చదువరి గారి సౌజన్యం).

—————————————————–
ఉపసంహారం:
కళలంటే అభిమానం ఉన్నాయిన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు శ్రీశ్రీ విగ్రహం ట్యాంకుబండ మీద స్థాపింపజేశారు.. తరువాత ఏ ప్రభుత్వాలు ఆంధ్రవైభవం గురించి పెద్దగా చేసింది లేదు. వచ్చే ఏడు ( లేక ఈ ఏడదేనా?)శ్రీ శ్రీ శత జయంతి. ఏమిచేస్తారో.

20 responses to “మూడు పాటలు

  1. చక్కని విషయాలతో శ్రీశ్రీని బహు బాగా గుర్తుచేసారు. వినసొంపైన, అనుభవించతగ్గ మంచి కవిత్వాన్ని అందించిన ఆధునిక కవుల్లో బెస్ట్ అనుకుంటా శ్రీశ్రీ… ధన్యవాదాలు.

  2. సంతోషం.
    పాటల్ని, గేయాల్ని ఉటంకించడంలో కొన్ని కీలకమైన చోట్ల అచ్చుతప్పులు దొర్లినాయి. సవరించ గలరు.
    “సుప్త” భుజంగాలను, ఇత్యాది.

  3. చక్కటి వ్యాసం! మన మహామహుల గురించి ఇలాంటి వ్యాసాలు అప్పుడప్పుడూ వస్తూండాలి. లేకపోతే శ్రీశ్రీ అంటే రవిశంకరని తెలుగువాళ్ళూ అనుకునే ప్రమాదం ఉంది.

  4. ధన్యవాదాలు.. ఇంత చక్కగా శ్రీశ్రీ ని గుర్తుచేసినందుకు…..

  5. I read mahaprasthaanam just yesterday for some reference.What a coincidence.
    Thank you for the great essay.

  6. చాలా మంచి వ్యాసం ఊకదంపుడు గారూ.. లోకంపోకడ గురించి రాసిన వాక్యాలు నేను తరచూ స్మరించుకుంటూ ఉంటాను. మనసున మనసై పాట శ్రీశ్రీ గారు రాసారని మొదటి సారి తెలుసుకున్న వాళ్ళ లో ఆశ్చర్య పోని వారు ఉండరేమో..

  7. శ్రీ శ్రీ కి మంచి నివాళి. శ్రీ నగజా తనయం శ్రీ శ్రీ రాశారని తెలిసి తెల్లబోయిన వాళ్లలో నేనొకరిని!

  8. భలే ఊకదంపుడువరేణ్యా…
    ఓసారి ఇక్కడ కూడా లుక్కండి
    http://vaagvilaasamu.blogspot.com/2009/01/blog-post.html

  9. అనంతంలో శ్రీశ్రీ ఉటంకింపులు చూసినప్పుడు, ఈయన ఇన్ని పుస్తకాలు చదివాడా అని ఆశ్చర్యం కలుగుతుంది.
    మహాప్రస్థానం తరువాత ఆస్థాయి రచన చేయకపోవటం దురదృష్టకరం

  10. సినీకవిగా కూడా శ్రీశ్రీ అంటే నాకు చాలా యిష్టం. “ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కాఱు మెఱుపువలె నిల్చి” – ఎంత అద్భుతమైన ఊహ!
    మరోసారి శ్రీశ్రీని గుర్తుచేసినందుకు నెనరులు.

  11. శ్రీశ్రీ ఏం వ్రాసినా బాగానే ఉంటుంది. ఎవరో అన్నారు – ” నా హృదయంలో నిదురించే చెలీ” అన్న పాట శ్రీ శ్రీ వ్రాయడం, ” కారులో షికారుకెళ్ళే…” అనే పాట ఆత్రేయ వ్రాయడం ఒక పారడాక్స్ అని.

  12. కొత్తపాళి గారు,
    కొంత సమయమివ్వండి, సవరిస్తాను.
    చదువరీ గారు.. రవిశంకర్ .. హ హ హ
    అందరికీ నెనరులు .

  13. స్పందించిన అందరలకూ నెనరులు.
    కొత్తపాళీ గారు, చాలామటుకు సవరించాను, మాష్టారి కళ్లకు ఇంకా కనిపిస్తే నిస్సంకోచంగా చెప్పండి.
    (నే నెక్కడ తప్పులు రాస్తానో అని వికీపిడియా ని ఆశ్రయిస్తే సప్తభుజంగాలొచ్చాయి)
    భవదీయుడు

  14. మొన్న బెజవాడ బస్సుస్టాండులో మహా ప్రస్థానం కనిపించింది. ఇప్పటికీ మామూలు జనం ఇంకా కొంటూనే వున్నారా ఈ పుస్తకం అని సంతోష పడ్డాను.

    శ్రీశ్రీ రచనలు చాలా వరకూ ఎఱ్ఱ రంగు పూసుకున్నవి.
    కానీ తెల్లటి శైశవ గీతం మాత్రం ఎంత బావుంటుంది.

    అందులోని,
    ఋతువుల రాణి వసంతం కాలం మంత్రకావటం తెరచుకొని..
    అని మొదలుకొని ఋతువులను వర్ణించడం వాటిని పిల్లలకు అర్పించడం అపురూపం.

  15. మహప్రస్తానం అంతా నాకు కంఠతా వచ్చు. నా అభిమాన మహాకవిని మీమూలంగా మరోసారి తలుచుకోవటం నాకు చాలా అనందం గా ఉంది.

    ధన్యవాదాలు
    కాముధ

  16. కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ రాజ్యం మీద శ్రీశ్రీ పద్యాలు ఇంక ఎప్పటికైనా అన్వయిస్తాయేమో! 🙂

వ్యాఖ్యానించండి