విరోధికేస్వాగతమను వింతను గనుడీ!

కం.  ముచ్చెమటలుబట్టెనయా
రచ్చల గనిద్రవ్యమాంద్య రక్కసి రూపున్
విచ్చేయగనీవునిపుడె
హెచ్చరికయుసేయలేను హేలాగతులన్!

కం.    పేరే విరోధి యంటివె
మారేమిపలుకుదునయ్య, మౌనము ముద్రై
దారేమోమున్ముందిక
రారో, వచ్చెదరొ హితులు,రక్షింపన్,నన్.

శా.  పేరున్నెంచరొ మానసంబునసుమీ! భీతిల్లరో వీరులై,
క్షీరాంభోధిసుతామనోహరుడనేసేవించుధైర్యమ్మొ,తీ
రారానున్నదిరాకమానదనువైరాగ్యమ్మె సిద్ధాంతమో
నీరాకంగనిసంబరమ్ముజరుపన్ నెమ్మౌననేనమ్మికో-

కం.   ( అరువది యేండ్లకు యొకపరి)
నరులిండ్లనుగట్టితోరణములే, దీర్చీ
అరుగుల గడపల ముగ్గులు
విరోధికేస్వాగతమను వింత యిదిగనన్.

ఉ.     ఓయి!వసంతకాలమను ఉద్దిరి వెంబడి రాగమచ్చికౌ
తీయని పాటలన్ వినగ దెచ్చిన జెల్లునుకోకిలమ్మలన్
దోయిది చాలదన్నటుల తోడుగ నెన్నిక దెచ్చినాడవే
హాయిని గూర్చుమాసమున హవ్వ!విరోధివిగాకయుందువే.

ఉ.  నామము వ్యక్తిలక్షణగుణమ్ముల కద్దముబట్టుపాతదౌ
నేమము యంతరించెగద, నేస్తమ! పేరది గుర్తుకోసమే
లేమియు కల్మిజంటలిట లెక్కగు నన్యము లెల్లశూన్యమే
నీమదినెంచి ఈ నిజము నిత్యవిరోధముబూనబోకుమా!

సీ.     మున్నొక్కడిటువచ్చి ముంచెలే నిలువునా
క్రయవిక్రయములందు కపట పుటల

తొల్లియొక్కడువచ్చి చెల్లుచీటినివ్రాసె
సోదరులకు కోట్ల సొమ్ము కొఱకు

ఏడాది ముందఱ ఇటులొచ్చి నొక్కడు
వేలకోట్లను జేసె వెఱ్ఱిమాట

వచ్చుచు నొక్కడు దెచ్చెనులెసునామి
కూలెరానొకడుదలాలు వీధి
ఆ.వె.     పేరు మంచి దౌట వారుచేసినదేమి
చెప్పరాదుగాని చేదునిజము;
మంచి చేయ నీవు మరువబోరుజనులు
కాలచక్రమెంత కదిలెనేని.

ఉ.    నేతల వైరివై నిలుము నీతిని జంపిరి లోకమందునన్
వాతలు బెట్టుమా బిలచి వర్తక శ్రేణుల సత్యదూరులన్
పూతపవిత్రభారతిని పోరియె ద్రుంచుము యుగ్రవాదమున్
యాతన బెట్టిపేదలను అద్దెబలమ్మని విఱ్ఱవీగకే.

కం.   బీదల, పిల్లల, మహిళల
మేదిని శుభములనుగూర్చ మీలో ఒక్కం
డే దయ దలంచును త్వరన్-
సాదుగ నిల్వంగనీవు చాలదె మేలౌ.

6 responses to “విరోధికేస్వాగతమను వింతను గనుడీ!

  1. ఉత్త పేరు మీద ఇన్ని పద్యాలు మీరు శ్రమకోర్చి వ్రాస్తే ఒక్కరూ కమెంట లేదు. కానీ – మేనేజర్ నామ సంవత్సరానికి – అనగానే అందరూ భళీ భళీ అంటున్నారు.
    తెలుఁగు పద్యానికి విరోధాత్మక కాలమంటే నమ్మండి.

    విరోధికేస్వాగతమను వింత యిదిగనన్.
    కందంలో జ గణం ముందుగా వచ్చేసరికి, అఱే తప్పు వ్రాసారే అనుకున్నాను. కందంలో జ అంటేనే మధ్య గణంగా మనసులో పెట్టేసుకున్నాను. అదీ ఒక అడ్డంకి లాగా.
    ఒక సారి మాటలబాబుగారు ఐదు జగణాలతో కందం వ్రాసారు. నేనిప్పటికీ లఘువుతో మొదలయ్యే కందం వ్రాయలేదు 😦

    ————–
    మీరు చాలా బాగా సాధన చేస్తున్నట్టున్నారు. మేము చేయాలి లేకుంటే క్లాసులో వెనకఁబడిపోతాం.
    అన్నట్టు నేను చేసిన చిరు పద్య సాధన ఇక్కడ చూడుడి.

    విరోధి నామ సంవత్సరము నిజంగా మా సింహరాశి వారికి విరోధి అయికూర్చున్నట్టుంది. ఇక్కడ.

  2. వృత్తాలు చక్కని నడకతో సాగాయి. “తీరా రానున్నది” బాగా విరిగింది!
    చిన్న సూచనలు:

    పేరుంయెంచరొ – పేరున్నెంచరొ అంటే ఇంకా సరిగా ఉంటుంది.
    క్షీరాబ్దీస్థిత – క్షీరాబ్ధిస్థిత, “బ్ధి”కి దీర్ఘం ఉండదు.

    నూతనసంవత్సర శుభాకాంక్షలు.

  3. కామేశ్వర రావు గారూ, మీ వ్యాఖ్య కోసమే, ఈ వ్యాఖ్య కోసమే ఎదురు చూస్తున్నాను. నెనరులు.
    “క్షీరాంభోధిసుతామనోహరుడనే” అని మర్చాను, ఒప్పిందేమో చెప్పండి,
    ఇలానే తప్పులుంటే దయచేసి చెప్పండి, నాకు, నా లాగా నేర్చుకొనే వారలకు కూడా ఉపయోగం గా ఉంటుంది.

    రాకేశ్వర గారు,
    🙂

  4. ౧ నీవునిపుడే కాకుండా నీవిపుడే ఐతే గణాలు సరిపోతాయి, చూడండి.

    ౨ నేనింతవఱకూ మఱి మఱియు మఱియును మఱియున్ ప్రయోగాలనైతే చూచాను తప్పితే మఱిన్ చూడలేదు. ఒక్కసారి వేరెవరినైనా కనుక్కుందురూ.
    తర్వాత, క్షీరాంభోధిసుతామనోహరుని సంసేవించు ధైర్యమ్మొ అంటే ఇంకా బావుంటుందేమోనండీ. కదలినేని కంటె కదులునేని/కదిలెనేని అంటేనూ… అలాగే భారతిన కంటె భారతిని అంటేనూ బావుంటుందని అనిపించింది.

    ౩ రారో వచ్చెదరొ హితులు రక్షింపన్ నన్ భలే కుదిరిందండీ. చిన్న చిన్న పదాలతో. తిరుపతి వేంకట కవుల పద్యాలలాగ.
    రానున్నది రాకమానదను వైరాగ్యమ్మె సిద్ధాంతమో… భలే భలే.
    విరోధికేస్వాగతమను వింత యిదిగనన్ ఎలా వచ్చిందండీ ఈ ఆలోచన? భలే బావుంది.
    కోకిలమ్మలన్… తోడుగ నెన్నికఁ దెచ్చినాడవే… హవ్వ విరోధివి గాక యుందువే. వ్యాజనింద భలే కుదిరిందండీ.
    నామము వ్యక్తిలక్షణగుణమ్ముల కద్దముబట్టుపాతదౌ నేమము యంతరించెగద… ఆహా. శెభాష్.

    ౪ పాపం ఎందుకండీ అలా సీసం పోసుకున్నారు సత్యం రాజు ఇత్యాదులని?

  5. రాఘవ గారు,
    కందంలో గణాలు కుదిర్చాను, మరిన్ గురించి విచారిస్తాను.
    భవదీయుడు

వ్యాఖ్యానించండి