వెతుక్కుంటున్నాను

Umbrella” లు అడ్డుచెబుతుంటే
“Perfection” లు పంటి కింద రాళ్లైతే,
తెలుగు సాహిత్యం లో తెలుగు వెతుక్కుంటున్నాను

కలగాపులగపు రేడియో ఛానళ్లలో
తారలు దుస్తులొదిలినంత తేలిగ్గా
వ్యాఖ్యాతలు వత్తులువదిలేస్తుంటే
అక్కడక్కడా తగిలే సరళ పదాల్లో
తెలుగు వెతుక్కుంటున్నాను

కన్నడపు “సుద్దుల” టీవీ ఛానల్ పెట్టి
కలిసే పదాలలో తెలుగు వెతుక్కుంటున్నాను

అవును, ఆంధ్రప్రదేశ్ రాజధానిలో
అచ్చతెలుగు కోసం వెతుక్కుంటున్నాను

జాలపు కూడలికి రోజూవచ్చి
కొత్తగా చేరిన వ్రాతల్లో
పాత తెలుగును వెతుక్కుంటున్నాను

నింపాదిగా కూచుంటే నిఘంటువు తెరిచి
పసిడి పడికట్టు మాటలు
అక్కడైనా భద్రంగా ఉన్నాయో
లేవో యని వెతుక్కుంటున్నాను

5 responses to “వెతుక్కుంటున్నాను

  1. 🙂 మీరూ నేనూ కలిసి కనీసం ఇద్దరమేనా వున్నాం కదండీ. మనవెనకే మరో ఇద్దరు రాకపోతారా.

  2. బాగుంది. మీ శోధన పూర్తయ్యాక ఎక్కడ ఎక్కువగా దొరుకుతున్నాయో చెప్పండి 🙂

  3. మీరు ఇంతగా వెతుక్కుంటున్నారు కాబట్టి నేనొక మాంచి తెలుగు పదం చెబుతాను. ఇది చెప్పడానికి నాకు కొద్దిగా బాధగానే వుంది, చిన్నప్పుడ పైవ్‌స్టార్ పంచుకోవడానికి కూడా ఇంత బాధవేయలేదు.
    పొద్దు.
    ఇది మీరు ఎప్పుడూ వినేపదమే, కానీ పొద్దు అంటే ఉదయం కాదు, దినమూ కాదు, సూర్యుడు అనే అర్ధం ప్రధానం అని గుర్తుచేస్తున్నాను.
    ౧) పొడిసే పొద్దు
    మా బామ్మ “ఆ పిల్ల అందంగా వుండేది, పొడిసే పొద్దల్లే, కానీ వాళ్ళ నాన్నకు తిక్క, పిల్లలకు కూడా వస్తుందేమోనని ఆ సంబంధం మానుకున్నాం”

    ౨) క్రుంకే పొద్దు
    సాయంత్రం వేళ నేను అస్తమించబోయే సూర్యుని పోటో తీసుకుంటుంటే, వెనకనుండి ఒకడు, “ఉఱేయ్ పొద్దుని పొటో తీత్నాఱ్రా అయ్యగారు” అన్నాడు. బేసికన్ను మీద నుండి నా ధ్యాస వాడి నుడికారం మీదకు పోయింది.

    ఈ పొద్దు మీకు వేసిన దుఃఖం కొంత నా పొద్దు తీర్చగలిగితే అదే సంతోషం.

  4. toli sariga chustunnanu blagulu
    veeti gurinchi koddiga telisaka
    Avuthanu melo okadini…..

  5. ప్రవీణ్ గారు, సంతోషమండీ. బ్లాగు మొదలెట్టగానే ఓ మాట చెప్పండి.
    తెలుగును తెలుగు లిపి లో వ్రాయటానికి ఇక్కడ చూడండి :: http://lekhini.org

Leave a reply to malathi స్పందనను రద్దుచేయి