సమస్యాపూరణము

ఇవాళ పొద్దున్నే శ్రీమతిగారు నిద్రలేపటానికి  ..  లేవండి కోకిలగారూ .. సూర్యోదయమౌతోంది అన్నది….
ఈ కొత్తపిలుపుకు హాశ్చర్యపోతూ … లేచి – ఆమె చేతి లో శాలువాజూసి ..

ఏమిటి మళ్లీ కాఫీపొడి గాని ఐపోయిందా … ఇంత పొద్దున్నే లేపావ్ .. ఐనా చలి తగ్గిపోయిందిగా శాలువా ఎందుకు వెళ్లి తెస్తాలే అన్నాను…

ఈ సుప్రభాతం కాఫీ కోసం కాదు ప్రభూ అంది… ..
మరి? నే పాడుతుంటే నీకు గుండెల్లో దడగా ఉంటోందన్నావని సంగీత సాధన కూడ మానేసా గదా… ఇంత పొద్దున్నే ఎందుకు లేపినట్టు …
అయ్యో- మీకు రాను రాను కాలస్పృహ లేకుండా పోతుందండీ.. మొన్ననే అమవాస్య వెళ్లిందా..
ఐతే…
ఐతే ఏమిటండీ.. ఉగాది నెలలోపు బడిందన్న మాట…
ఐతే …
ఇంకా ఐతే ఏమిటి అండీ .. కోయిలలూ , మల్లెలూ మావిళ్లూ అంటూ ఎలుగెత్తద్దూ .. మీ   ఋతువొచ్చేస్తోందండి.. ఇక కూయడాలూ ..మేయడాలు… శాలువాలూ.. వడియాలు…
కూయడాలూ ..మేయడాలు నా.. ఈ వాడుక మాట ఎక్కడో విన్నట్టుంది కానీ మాబోంట్లకు కాదనుకుంటానే చెప్మా…

అదేనండీ … కవితాపఠనాలు … ఆనక బఫేలు.. ఓహోహో …..
ఎదో మీ మంచి గోరి కాస్త సాధన  చేసేకుంటారని పొద్దున్నే లేపితే… అర్ధం చేసుకోరు…

తనులేచి పనిచేస్తుంటే .. నేను ఇంకా పడుకున్నానని  ఈ వంక తో నిద్రాభంగం చేసిందని అర్ధమై….
చేసేదేమీ లేక

సనత్ కుమార్ గారు వారి బ్లాగులో కాసిని సమస్యలిస్తే వాటిలో కొన్నిటిని పరిష్కరించటానికి ప్రయత్నించాను ..   కొన్ని కొఱుకుడు బడలా .. మీకేమైనా కుదురుతాయేమో చూడండి

*******************

(1)జానేదో సినిమాకు లాలు బహుపూజ్యంబౌ మునీశాళికిన్

నానోటం పలుకంగనేరనెపుడున్ నాధా!అసత్యంబునే
నానారీతులవేడి బల్కిప్రతినల్ నన్ పత్నిగాబొందియే
ఈనాడేలనిరాకరింతువొసభన్ ఈ బేలనే,  కాదు రా
జా, నేదోసిని, మా కులాలు బహుపూజ్యంబౌ మునీశాళికిన్

(2)కలరారోగములున్న రాఘవుడేలంకంజేరశతృఘ్నుతో

[విభీషణ ఉవాచ]

జలముల్ జేరగ నావలో ఎటులబో జావేలదప్పుంగనన్
కళికాజ్వాలలుచుట్టుముట్టతమలోకంబంతనేమౌనహుల్?
కలుగే -యుద్ధము? రాముడీప్రజకు రుగ్మమ్మౌను, ధాత్రిం మనం
కలరా రోగములున్న? రాఘవుడు లంకంజేరె శతృఘ్నుతో

(3)మానములేనిస్త్రీని గని మాతగ మ్రొక్కిరి పండితోత్తముల్

ఈనరలోకులన్ గనియె ఈర్ష్యయు ద్వేషము నిండువారలన్
ఆనక జ్ఞానియౌ పరమ హంసను జేరియె  చక్కనొత్తగన్
హీనపు సంపదాదులకు హేయపు భౌతిక సౌరుకున్నుస
మ్మానములేనిస్త్రీని గని మాతగ మ్రొక్కిరి పండితోత్తముల్

(4)మనభార్య ఈమె, మనకమ్మయొ, అక్కయొ గావలెన్ జుమీ

కన్మణు లౌ గదా, వెలుగు కాంతుల జిమ్ముచు  నెల్లవేళలన్

తాన్మణి యైగనంపడుత తధ్యము కాంతల మధ్యజేరినన్

చిన్మయమూర్తిపుత్రుడును, శ్రీధర మూర్తిసు పౌత్రుడైవరల్

హన్మనభార్య ఈమె, మనకమ్మయొ, అక్కయొ గావలెన్ జుమీ

(5)బూతుకు బూతు బూతునకు బూతుకు బూతుకు బూతు బూతుకున్

ఖాతరు చేయరెవ్వరిల కాస్తయు యాంగ్లము రానిచో, తగున్
నీతరహానుమార్చుకొని నేర్వగ” యంచును జెప్పమిత్రుడే –
యాతనలోర్చిబోయి గన యద్దమరేయిన ఆంగ్లచిత్రమున్
బూతుకు బూతు బూతునకు బూతుకు బూతుకు బూతు బూతుకున్

(6)సీతా! రామునికిట్లొనర్తువటవే సీ! ద్రోహమిల్లాలివై

ఒకటి కాదు రెండు పూరణలు. ఇక్కడ చూడండి

(7)పతి జూచిన పడతి గుండె భగ్గున మండెన్

స్తుతమారసమానుండును
అతులిత భక్తిపరుడుపతి, యాత్రలకేగన్
హితవె? పొరుగింటి జాయా
పతి జూచిన పడతి గుండె భగ్గున మండెన్.

(8)దున్నని గని కన్ను గీటె తొయ్యలి యహహా

(9) రాష్ట్రమునేలగా నొక విరాధుడు రావలె రక్తపాయియై

2 responses to “సమస్యాపూరణము

  1. ఊకదంపుడు గారూ.. భేష్.. చాలా బాగున్నాయి.

    (1) నా బ్లాగులో మీకామెంతుకీ సమాధానం వెతకటానికి బధ్ధకించేసా… సమస్య లకి పూరణలు వేరే పుస్తకం లో దొరికాయి….. అప్పుడే వెతికి రాయనందుకు క్షమించెయ్యండి… మీ సందేహం ముమ్మూర్తులా కరక్టే… అది దున్నని కాదు దున్నను నే.”దున్ననుగని కన్నుగీటె తొయ్యలి యహహా… ”

    వాటన్నిటికీ పూరణలు పద్యం.నెట్ లో పెడ్తా శని ఆదివారాల్లో…

    (2) మీ విరుపులు బహు ముచ్చటగా ఉన్నాయి… ఒక్క “పతి జూచిన పడతి గుండె భగ్గున మండెన్” పూరణ మాత్రం సరిగ్గా అర్ధం కాలే..

    సనత్ కుమార్

  2. సనత్ కుమార్ గారూ, ధన్య వాదములు.
    ఓపికగా పుస్తకం వెతికి పట్టుకొని సమస్య మరలా చెప్పినందుకు నెనరులు.
    padyam.net లో మీ వ్యాసం కై చూస్తూంటాను.

వ్యాఖ్యానించండి